గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి పి.హెచ్ .డి .అందుకొని  ,హైదరాబాద్ పటేల్ కళాశాల ఉపన్యాసకులై ,సంస్కృత నలచరిత్ర,,ధర్మపురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ,మొదలైన సంస్కృతాంధ్ర గ్రంథరచన చేసిన ‘’సంస్కృత సాహిత్య రత్న ‘’విద్యాప్రవీణ ,ఒకప్పటి కరీం నగర్ ఇప్పటి జగిత్యాలజిల్లా ధర్మపురి వాస్తవ్యులు డా.కొరిడె రాజన్న శాస్త్రి ,శ్రీమతి సులోచనా దేవి గార్ల  పుత్రరత్నమే  డా . కొరిడెవిశ్వనాథశర్మ గారు .తండ్రికి దీటైన ,కొండొకచో తండ్రిని మించిన సంస్కృతాంధ్ర భాషా పండితులు. ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యాపకులుగా ప్రవేశించి, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన విద్వన్మూర్తి ,పరిపాలనా దక్షులు శర్మగారు ..

విశ్వనాధ శర్మగారు 4-6-1958 న కొరిడె వారి సంస్థానం  ,పవిత్రగోదావరీ తీరంలోని  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ధర్మపురిలో జన్మించారు .సంస్కృతం లో బి .వో.ఎల్ .,తెలుగులోఎం.ఏ .డిగ్రీలు పొందారు .’’లింగ పురాణం –విమర్శనాత్మక పరిశీలనం ‘’పై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్. డి.పరిశోధన కై రిజిస్త్రషణ్ చేసి యున్నారు వ్యక్తిగత కారాణాలవలన గ్రంథంపూర్తి చేయలేక పోయారు .

సంస్కృతం లో 1- శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా )  2-పెద్దాపురం లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణితోపాటుగా ) ౩-దోమకొండ చాము౦డేశ్వరీ సుప్రభాతం(స్తోత్రం ,ప్రతిపత్తి ,మంగళాశాసనాలనుతాత్పర్య టిప్పణి క్షమాపరధన స్తోత్రం తో పాటు )4-‘’ధర్మపురి వర్ణనము ‘’కావ్యం (అసంపూర్ణం )  రచించారు .తెలుగులో 1- భర్తృహరి సద్భావ లహరి(పరిశీలన వ్యాసాత్మక గ్రంథం) రాశారు. .శర్మగారు ప్రసిద్ధ అనువాదకులుకూడా  .1-లింగ పురాణం ను కీ.శే .డా .వి హన్మాన్ శర్మగారితో కలిసి అనువదించారు .2-బ్రహ్మ పురాణా౦తర్గతమైన 108 అధ్యాయాల బృహత్ సంస్కృత గ్రంథం ‘’గోదావరీ మహాత్మ్యం ‘’ను కూడా శ్రీ హనుమాన్ శర్మగారితో కలిసి అనువాదం చేశారు .మహా పౌరాణికులైన శర్మగారు తమ పితృపాదులు రచించిన ‘’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం ‘’కు తెలుగు వ్యాఖ్యానం రచించి సాహిత్య పిత్రూణ౦ తీర్చుకొన్నారు .తమ తండ్రిగారి జీవిత ,పాండిత్య సాహిత్య వైశిష్ట్యాన్ని ‘’బహుముఖ ప్రజ్ఞాశాలి ,,ఉభయకవిమిత్రుడు ,సంస్కృత సాహిత్య రత్న డా.కోరిడేరాజన్న శాస్త్రి గారు (మా నాన్నగారు )అనే వ్యాసం ద్వారా వెలువరించి పితృ భక్తిని ప్రకటించారు

.ప్రస్తుతం 1-కీ.శే .తు౦గూరి శివరామ శర్మగారి అసంపూర్తి పద్యకావ్యం ‘’కాదంబరీ సంగ్రహం ‘’కు 2-భర్తృహరి విజ్ఞాన శతకం కు 3-కీ.శే. శ్రీ తెలకపల్లి రామ చంద్ర మూర్తి (నల్గొండ )వారి ‘’హయగ్రీవ శతకం ‘’కు  తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నారు.తాను 38ఏళ్ళు పనిచేసిన కళాశాల విశిష్టతను తెలియ జేస్తూ ‘’సంస్కృతాంధ్ర విద్వజ్జన నిలయం ధర్మ పురీ సంస్కృతాంధ్ర విద్యాలయం ‘’పేరిట కళాశాల చరిత్ర రాశారు .

శర్మగారి సంపాదకత్వం లో 1-డా.వి.హన్మాన్ శర్మగారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక’’ 2-కవితా శ్రీ శిల శ్రీనివాస్ -3సంస్కృత ప్రొఫెసర్ ,ప్రసిద్ధ అవధాని డా. మాడ్గుల అనిల్ కుమార్ గారి ‘’కాదంబరీ చరిత్ర ‘’లోనూ ,4.శ్రీ సంగనభట్ల రామ కృష్ణయ్యగారి’’శ్రీ నృహరి శతకం ‘’5-శ్రీ గొల్లపల్లి రాం కిషన్ గారి ‘’లబ్ డబ్ ‘’ మొదలైన తదితర గ్రంథాలలోను భూమికలు రాశారు  .ముఖ పుస్తకములో పలు సంస్కృత గ్రూపు లలో వారి అభ్యర్ధన మేరకు ‘’సంస్కృత కృద్వృత్తులు  ‘’,సంస్కృత ఛందో వృత్తములు ‘’పేరిట అనేక పాఠములురచించారు .’’లఘు సిద్ధాంత కౌముదీ’’పాఠాలద్వారా వ్యాఖ్యానం అందిస్తున్నారు  .ఆకాశవాణి నుండి సుమారు 15సాహిత్య ప్రసంగాలు చేశారు .సప్తగిరి, ఆరాధనహనుమ ,మాలిక పత్రికలలో  వ్యాసాలు  రాశారు .మాంచి భావకవి ఐన శర్మగారు కొన్ని ముద్రిత ,అముద్రిత భావకవితలు రాశారు.సంస్కృత శ్లోకాలతోపాటు తెలుగులో శతాధిక సమస్యాపూరణాలుచేశారు .వీరి కవిత్వ ప్రశస్తికి జగిత్యాల తెలుగు భాషా సంరక్షణ సంఘం ,కౌసల్య తెలుగుపండిత శిక్షణశాఖ సంయుక్తంగా ‘’కవితా శశాంక ;;బిరుదప్రదానం చేసి సత్కరించాయి .

.ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లలో పరిశోధక పత్రాలు రాసి సమర్పించారు .  శర్మగారి విద్యాభ్యాసం అంతా ధర్మపురి లోనే జరిగింది .ఓరియెంటల్ స్కూల్ శ్రీ సీతారామలింగేశ్వర దేవాలయం అనే శివాలయం లోనే చాలా కాలం ఉండేది. ఇక్కడే చెట్లక్రింద అరుగులమీద చదువు సాగేది .కాలేజీ కూడా ఇక్కడే ప్రారంభమైంది .తర్వాత నూతనభవనాలలోకి మారింది .శార్మగారికీ శివాలయానికి అవినాభావ సంబంధం చాలాఉంది.వారి తాతగారి కాలం నుంచి ప్రతిదినశివార్చన నైవేద్యం సంప్రదాయం కొనసాగిస్తున్నారు .శివాలయం లోనే కార్తీక ,మాఘ మాసాలలో ,దత్త నవరాత్రులలో పురాణ ప్రవచనాలు చేస్తారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో బ్రాహ్మీ ముహూర్తములో జరుగు ధనుర్మాస విశేష పూజలో అంతర్భాగం గా ‘’ధనుర్మాస మాహాత్మ్య పురాణ ‘’ప్రవచనం చేస్తున్నారు  . .ప్రస్తుతం ఒక గృహిణి కోరికపై వారింట్లో తాము అనువదించిన  ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ .పురాణం చెబుతున్నారు ..పౌరాణిక శేఖరులు శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ఆధ్వర్యం లో అనేక పురాణ ప్రవచనాలు చేశారు .ఇది వారి వృత్తికాదు, ధార్మిక ప్రవృత్తి ..స్ఫురద్రూపం తో, వెడల్పు ముఖంతో, నుదుట తీర్చి దిద్దబడిన  విభూతి రేఖలతో ,చక్కని వెడల్పు అంచు మల్లెపూవులాంటి ధోవతీ,  అడ్డంగా భుజాలపై వ్రేలాడే ఉత్తరీయం తో బ్రహ్మ వర్చస్సు వెలిగిపోతూ  ,బ్రాహ్మీమయ మూర్తిగా ,రాజసం ఉట్టిపడే నడకలో మరో శ్రీనాధ కవి సార్వభౌమునిలా , అపర కాశీ విశ్వనాథునివలె  ఈ ధర్మపురి  విశ్వనాథ  శర్మ గారు గోచరిస్తారు . మంచి స్థితి పరులైన శర్మగారు బంగారానికి తావి అబ్బినట్లు, ఉదార గుణ సంపన్నులు .తమ ‘’కొరిడె సాహితీ సంస్థాన విజయాలకు చిహ్నంగా ,తమ కుటుంబ ,వంశ కీర్తి ప్రతిష్టలకు ,వినయవివేక సంపత్తికి గౌరవ భూషణ౦ గా ,  తమ రెండస్తుల మేడకు ‘’విజయ భూషణం ‘అని సార్ధక నామకరణం చేశారు .

శర్మగారిధర్మపత్ని  శ్రీమతి విజయ లక్ష్మిగారు శర్మగారి కళాశాలలో శిష్యురాలు . గొప్ప విదుషీమణి .ఈ దంపతులు అతిధి మర్యాదలకు పెట్టిందిపేరు  .బ్రాహ్మణ్యం ఎవరొచ్చినా తమ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టకుండా పంపరు .ఆమె ప్రవరాఖ్యుని ధర్మపత్ని లాగా ‘’వండనలయదు వేవురు వచ్చి రేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి  ,నడికి రేయైన’’ అనే సంప్రదాయం పాటించే ఉత్తమ గృహిణి .

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు .మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .

ఆధారం –శ్రీ విశ్వనాథ శర్మగారు నాకు ధర్మపురిలో 28-10-18 ఆదివారం వారింటిలో ఆత్మీయంగా అందజేసిన బృహద్గ్రంథం-‘’గౌతమీ మహాత్మ్యం

గీర్వాణ కవితా విశ్వనాథీయం ‘’.

శర్మగారు’సంస్కృతం లో ’1-బాల్య స్మృతిః’’అనే 7శ్లోకాలు రాసి ,తమ చిన్ననాటి జ్ఞాపకాలను అక్షర బద్ధం చేశారు . అ౦దు లో మొదటి, చివరి శ్లోకాలు –

1-‘’అహం బాల్యకాలే సదామిత్రవర్గో –సమీపస్థ గోదావరీ  వారి మధ్యే –ప్రభాతే నిమజ్జ ర్ధ మేవాగమం తు –జలే క్రీడనాయ వ్యతీతోహి తుస్టయా’’

7-తదీయాచ్చ విద్యాలయాన్మోదపూర్ణః –వినిర్గత్య సాయం పునర్మందిరం చ-వ్యతీతోహి కాలః ముదా క్రీడనాయ-అహో బాల్యకాలః  స్మృతి ర్మాధు రీ హి.’’

ఇలా బాల్య కాలక్రీడా ,విద్యలపై తమకున్నమక్కువను  స్పష్టంగా తెలియ జేశారు .

2-చాము౦డేశ్వరీ సుప్రభాతం –

‘’జాగృహిత్వం మహాదేవి –జాగృహి దేవి చండికే –జాగృహి దోమ కొండేశి-లోక రక్షణ హేతవే ‘’

‘’రాత్రా వాప్త తమః సుదీర్ఘ పటలైః హ్యందీ కృతం వారిజం –ప్రాతర్ భాస్కర రశ్మిభిఃస్వనయనా  వున్మీల్య తత్పంకజం –సామీప్యం తవ పాదయోశ్చగమితుం భక్తా గ్రహస్తే స్థితం-చాముండేశ్వరి దోమకొండ నిలయే తే సుప్రభాతం శివే  ‘’

స్తోత్రం -భక్తకల్పవల్లికే ! సుభక్తకోటిపాలకే !

భక్తవైరిభంజని ! త్వమార్తిబాధవారిణీ,ఋ

శిష్టకర్మమోదినీ విరక్తమోక్షదాయినీ

దోమకోండచండికే ! జయోఽస్తు తే నిరంతరమ్.

ప్రపత్తి-1) ఆద్యా త్వం జగతాం త్వమేవ జననీ మాయా పరాదేవతా
త్వం శక్తిత్రయరూపిణీ త్వమనఘా విద్యా హ్యవిద్యా పరా
క్షేత్రజ్ఞా హ్యపరా త్వమేవ భవతి !  జ్ఞేయా పరబ్రహ్మణీ
చాముండేశ్వరి ! దోమకోండనిలయే ! పాదౌ ప్రపద్యే తవ

మంగలాశాసనమ్

1.వేదవేదాంతవేద్యై తే వైదికాచారసంస్తుతే ,

దోమకొండాధివాసిన్యై చాముండేశ్వరి ! మంగలమ్ .

3-శ్రీ లక్ష్మీ నరసింహ గీతః

హరినరాకృతిం సైంహికాననం

జలధిపుత్రికా సేవితాంఘ్రికం,

భరణభూషితం భూషిత ప్రభమ్,

నరహరిం భజే ధర్మపూర్విభుమ్.1

కలివిమర్దనే కల్కిదేహినం.

అభయరూపిణం ఆశ్రితాశ్రయం

నతముఖోఽస్మ్యహం నైకధాకృతిం

నరహరిం భజేధర్మపూర్విభుమ్.11

4-శృంగేరి శ్రీ భారతీతీర్ధ స్వామికి స్వాగత శ్లోకాలు

శ్లో. సకలనిగమశాస్త్రావాస! పుంభావవాణే! ,

ప్రణతనిజముఖస్త్వ ద్దర్శనాసక్తచిత్తః  |

వదతి సహృదయం సుస్వాగతం ధర్మపుర్యాం ,

పురజనసముదాయో భారతీతీర్థ యోగిన్ ! ||1||

శ్లో. విధువదన! భవంతం తంగిరాలాబ్ధి వంశః ,

నిజసుతముపగమ్యోత్తుంగవీచీయశస్కః |

సకలజనహితాయ ప్రాపయత్ ఋష్యశృంగం ,

సుతమివ వసుదేవో బంధనాత్ నందగేహమ్ || 3 ||

5-శ్రీధర్మపురి రామలి౦గేశ్వరసుప్రభాతమ్ కూడా  విశ్వనాథ శర్మగారు రచించారు

ఇవన్నీ వారి అచంచలభక్తికి ,అమృత దారాకవితోక్తికి గొప్ప ఉదాహరణలు .అన్నీ అన్నే .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-18-ఉయ్యూరు


 

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.