గౌతమీ మాహాత్మ్యం -22
35-విశ్వామిత్రాది తీర్దాలు
ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుని దగ్గరకు నారద ,తు౦బురులొచ్చి ,ఆతిధ్యంపొంది అయన అడిగిన ‘’పుత్రులతో ఏం పని ‘’?ప్రశ్నకు సమాధానం ఒకవిధంగా, వందవిదాలుగా, వెయ్యి విధాలుగ ఉందనీ ,పుత్రుడు లేకపోతె మోక్షం రాదనీ ,పుత్రుని పొందిన తండ్రి స్నానం చేస్తే దశ అశ్వ మేదాలు అవబ్రుధ స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని ,పుత్రుని వలన ఆత్మ ప్రతిష్ట కలుగుతుందని ,అతడు అమరోత్తముడు అవుతాడని ,దేవతలు అమృతం తో అమరులైతే బ్రాహ్మణులు పుత్రునిచే అమరులౌతారని ,పుత్రుడు దేవ రుషి పితృ ఋణం తీర్చి తరి౦ప జేస్తాడని ,పుత్రుడు లేకపోతె వేదమూ వ్యర్ధమే నని స్నానతర్పణలు పనికి రావని గడ్డాలు మీసాలతో నిష్ప్రయోజనమే నని ,స్వర్గ ప్రాప్తి, మోక్షం పుత్రుని వలననే కలుగుతాయని ,పుత్రుడే ధర్మార్ధ కామ మోక్షాలు ,పరలోకం ,పరం జ్యోతి ,సర్వ ప్రాణులను తరింప చేసేవాడు పుత్రుడే .కనుక పుత్రుడులేని జన్మ వ్యర్ధం ‘’అని నిష్కర్షగా చెప్పారు .
ఈ సమాధానానికి ఆశ్చర్య పోయి హరిశ్చంద్రుడు తనకు పుత్ర సంతానం కలిగే ఉపాయం చెప్పమని వేడుకొన్నాడు .క్షణకాలం తపస్సు చేసి వారిద్దరూ గౌతమీ స్నానం చేసి ,వరుణుని ప్రార్ధిస్తే కోరిక తీరుతుందని చెప్పారు .అలాగే చేశాడు. సంతసించిన అపాం పతి’’నీకు లోక త్రయాలంకారుడైన కొడుకునిస్తాం .ఆపుత్రునితో నువ్వు యజ్ఞం చేస్తే నీకు పుత్రుడు పుడతాడు ‘’అన్నాడు.అలాగే అని చెప్పి వరుణ సంబంధమైన చారు ద్రవ్యాన్ని సిద్ధం చేసి భార్యకిచ్చాడు రాజా హరిశ్చంద్ర .దీనితో అతనివలన కుమారుడు జన్మించాడు .వరుణుడు వచ్చి ఆ పుత్రునితో యాగం చేయమని చెప్పాడు .రాజు ‘’దంతాలు రాని పశువు యజ్ఞానికి పనికిరాదుకదా ,వాడికి దంతాలొచ్చాక చేస్తా ‘’అన్నాడు .కొడుక్కి పళ్ళురాగానే మళ్ళీ జ్ఞాపకం చేశాడు వరుణ .పూర్తిగా పళ్ళు వచ్చాక చేస్తానని సాకు చెప్పి పంపించేశాడు .అన్ని పళ్ళూ వచ్చాక వచ్చి మళ్ళీ జ్ఞాపకం చేస్తే ,పాతపళ్ళు రాలి కొత్తవి వచ్చాక చేస్తాననగా వెళ్లి మళ్ళీ వచ్చి గుర్తుచేయగా వాడు ధనుర్విద్య నేర్వగానే చేస్తానని పంపేశాడు .
హరిశ్చంద్రుని కుమారుడైన రోహితుడు అస్త్ర శస్త్రాది విద్యలు నేర్చి ,శత్రునాశ సమర్దుడై ,వేద శాస్త్రాలలో నిష్ణాతుడై 16ఏళ్ళకు యువరాజయ్యాడు .వరుణుడువచ్చి అతనితో కలిసి యాగం చేయమని చెప్పగా ,అతడిని పిలిచి వరుణునికోసం యాగం చేద్దాం రమ్మనగా ఇదేమిటి అని ప్రశ్నిస్తే జరిగినదంతా కొడుక్కి చెప్పాడు .రోహితుడు తండ్రితో తాను ముందుగా వరుణుడిని పశువుగా చేసి విష్ణువు కోసం యాగం చేస్తానన్నాడు .దిమ్మ తిరిగిన వరుణుడికి కోపమొచ్చి హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి కలిగేట్లు శపించాడు .వెంటనే రోహితుడు ధనుర్బాణాలు ధరించి గంగానదికి తండ్రి తనను పుత్రునిగా పొందిన చోటుకువెళ్ళాడు .అ ఆరేళ్ళ తర్వాత ,తండ్రి వ్యాధి జ్ఞాపకం వచ్చి ,తనజన్మవలన తండ్రికి సుఖం లేకుండా పోయిందని చింతించి ,గంగాతీరం లో ఉన్న మహర్షులలో ఒకడైనముగ్గురు కొడుకుల తండ్రి అజీగర్తుని చేరి ఆయన కృశించి ఉండటం చూసి కారణం అడిగాడు .తనకు కుటుంబ పోషణకు తగిన ఆదాయం లేదని ఏమి చేయాలో చెప్పమని రాకుమారుని అడిగాడు .అతడు అసలు ముని మనసులో ఏముందని ప్రశ్నించగా తానూ భార్య ముగ్గురుకోడుకులను పోషించ లేని పరిస్థితి లో ఉన్నానని ,వాళ్ళలోఎవరినైనా అమ్మేద్దమన్నా కొనే వారు లేరనగా, ఆమాట నిజమే అయితే తానుకొంటానన్నాడు .ముగ్గురిలో ఒకకోడుకును తనకు అమ్మమన్నాడు .పెద్దకొడుకు తనకు, చివరికొడుకు భార్యకు ఇష్టం కనుక మధ్యవాడైన ‘’’’ శునశ్శేఫుని అమ్ముతానన్నాడు .వెల చెప్పమంటే ‘’వేయి ఆవులు వేయి నాణాలు ,వేయి వస్త్రాలు ‘’ఇస్తే ఇస్తానన్నాడు .అడిగినదంతా ఇచ్చేసి వాడిని కొని తండ్రిని చేరి అతడితో యాగం చేయమని చెప్పాడు .హరిశ్చంద్రుడు బ్రాహ్మణుడు యజ్న పశువుగా చేస్తే కులం వంశం క్షయమౌతాయి కనుక తానాపని చేయనని వాడిని తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు తండ్రి .ఇంతలో అశరీర వాణి ‘’ద్విజులతో ,మహర్షులతో కొడుకుతో గౌతమీ తీరానికి వెళ్లి క్రతువు చేయి ‘’అన్నది .
విశ్వామిత్ర వశిస్టాది మునులతో హరిశ్చంద్రుడు గంగాతీరం చేరి’’ నర మేధయాగం ‘’చేయటానికి సంకల్పింఛి శునశ్శేఫు ని యూప స్తంభానికి కట్టి యాగం మొదలు పెట్టబోగా విశ్వామిత్రుడు ‘’ శునశ్శేఫుని యజ్ఞపశువుగా అంగీకరించండి .అతని శరీరం లో ప్రతిభాగం హవిస్సు అవుతుంది ‘’అనగా హరిశ్చంద్రుని సహా అంతా అంగీకరించారు .శునశ్శేఫుడు గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం చేసి ,యాగ హవిస్సులు భుజించే దేవతలను స్తుతించాడు .అప్పుడు దేవతలు ‘’ శునశ్శేఫుడు లేకుండానే యాగం పూర్తి అవుతుంది ‘’అన్నారు .అందరూ జయజయ ధ్వానాలు పలికారు .హరిశ్చంద్ర యాగం నరమేధం లేకుండానే పూర్తయింది .విశ్వామిత్రుడు అందరి సమక్షం లో శున స్షేఫుని తన జ్యేష్ట పుత్రునిగా స్వీకరించాడు .మిగిలిన కొదుకులలో కొందరు అయిష్టతను ప్రదర్శిస్తే వారిని శపించాడు . అంగీకరించిన కొడుకులను మెచ్చుకున్నాడు ముని .కౌశికుడు వరాలిచ్చాడు .ఇదంతా గౌతమీ నది దక్షిణ తీరం లో జరిగింది .ఇక్కడే హరిశ్చంద్ర ,శునశ్శేఫ ,విశ్వామిత్ర ,రోహిత మొదలైన ఎనిమిది వేల పద్నాలుగు తీర్దాలేర్పడ్డాయి .ఈ కథ విన్నా, చదివినా పుత్ర సంతానం కలిగి ,మనసులోని కోరికలు తీరుతాయి అని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-18-ఉయ్యూరు
—