గౌతమీ మాహాత్మ్యం గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం

గౌతమీ తీర్ధం -25

38-వృద్ధాసంగమ తీర్ధం

వృద్ధేశ్వర శివుడున్నదే వృద్ధాసంగమ తీర్ధం .వృద్ధ గౌతమమహర్షి కి ముక్కు లేని కొడుకు పుట్టాడు .వాడు వైరాగ్యంతో దేశ సంచారం చేసి ఏ గురువువద్దా చేరకుండా సిగ్గుపడి ,మళ్ళీ తండ్రిని చేరగా ఉపనయనం చేశాడు .బ్రహ్మ సూత్రం మాత్రమె ధరించి బాల గౌతముడు వేదా ధ్యయనం లేకుండా చాలాకాలమున్నాడు .కాని నిత్యం అగ్నికార్యం మాత్రం శ్రద్ధగా చేసి బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు .వయస్సు పెరిగిందికాని పిల్లనిస్తానని ఎవరూ ముందుకు రాలేదు .తీర్ధ యాత్రలు చేస్తూ పుణ్య తీర్ధాలలో మునుగుతూ శీత గిరి చేరి ,అక్కడొక గుహ లో ప్రవేశించాడు .

  ఆ గుహలో ఒక శిధిల అ౦గాలున్నకృశించిన ఏకాంతంగా తపస్సులో ఉన్న వృద్ధ ఉత్తమ స్త్రీ  కనిపింఛి ,ఆమెకు   నమస్కరించబోతే వారించి ‘’నువ్వు నాకు గురువు అవుతావు కనుక నమస్కారం చేయద్దు ‘’అనగా అప్రయత్నంగా నమస్కార భంగిమలో ‘’నువ్వు తపస్వివి వృద్దురాలివి ,గుణ గరిస్టవు .అల్పవిద్యా, అల్ప వయస్సు ఉన్న నేను నీకు ఎలా గురువు నౌతాను ?’’అని ప్రశ్నించగా ఆమె ‘’ఆర్స్టి ణేషుడనే ఆయన ప్రియ పుత్రుడు ధర్మవంతుడు ,శూర ,క్షత్రియ ధర్మావలంబి .మృగయావినోదం లో వేటకు వెళ్లి సైన్యం తో సహా  ఈ గుహలోనే విశ్రాంతి తీసుకున్నాడు .ఆ రాజు గ౦ధర్వ రాజ కన్య సుశ్యామ ను చూసి కామింఛి సుఖించి ఒక ఆడపిల్లను నన్ను  కని, మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు . మా అమ్మ ఎవడు ఈ గుహలో ప్రవేశిస్తే వాడే నీ మొగుడు అవుతాడు ‘’అని చెప్పి మా  ఆమ్మసుశ్యామ కూడా వెళ్ళిపోయింది .ఇంతవరకు ఈ గుహలో ఏ పురుషుడూ ప్రవేశించలేదు. నువ్వే ఇక్కడికి వచ్చినమగాడివి .నా తండ్రి వెయ్యి ఎనిమిదేళ్ళు రాజ్యపాలన చేసి ,,ఇక్కడే తపస్సుచేసి స్వర్గం చేరగా, ఆయన తమ్ముడు రాజ్యానికి వచ్చి వెయ్యి పదేళ్ళు రాజ్యమేలి స్వర్గం చేరాడు .నేను అప్పటినుంచి ఒక్కదాన్నే ఇక్కడే ఉన్నాను .నేను  తలిదండ్రులు లేని ఒంటరి దాన్ని .స్వతంత్రురాలను. ఇంతవరకూ పెళ్లి చేసుకొనే లేదు .సదాచార సంపన్ననైన క్షత్రియ పుత్రికను .పురుషార్ధ వ్రతస్తురాలిని కనుక నన్ను పెళ్ళాడు ‘’అన్నది .

  గౌతముడు తాను వందేళ్ళ వయసువాడనని ,ఆమె తనకంటే ఎక్కువ వయసున్న వృద్ధ అనీ జతకుదరదని చెప్పాడు .ఆమె ‘’పూర్వమే నువ్వు నాకు భర్తగా నిర్దేశి౦ప బడ్డావు  .ఇంకొకరిని చేసుకోను .నిన్ను బ్రహ్మ నాకు ఇచ్చాడు .నువ్వు  పెళ్ళాడకకపోతే నీ ఎదుటే ఆత్మహత్య చేసుకొంటాను ‘’అనగా గౌతముడు తాను విద్యా,ధన విహీనుడనని,కురూపినని ,తపస్సు చేయని వాడినని కనుక వరుడిగా తగనని  తనకు మంచి రూపమిచ్చి విద్యా తపస్సు కలిగిస్తే వివాహం చేసుకొంటానని చెప్పాడు .

 వృద్ధ తాపసి ‘’నేను తపస్సుతో సరస్వతీ దేవిని ,రూపవంతుడైన వరుణుని ,రూప దాత అగ్నిని ప్రసన్నం చేసుకొన్నాను .వాగీశ్వరి నీకు విద్య ,అగ్ని దేవుడు నీకు సుందర రూపం ప్రసాదిస్తారు ‘’అని చెప్పి వారిద్దరిని,సూర్యుని  ప్రార్ధించి గౌతముని విద్యా రూప గుణసంపన్నునిగా చేసింది .అప్పుడు ఆ ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .అనేక సంవత్సరాలు ఆ వృద్ధ తాపసితో అ విప్రోత్తముడు  ఆ గుహలోనే స్వర్గ సుఖాలు అనుభవించాడు .కొంతకాలానికి వసిష్ట వామదేవాది మునులు తీర్ధ యాత్రలు చేస్తూ ఆగుహలోకి వచ్చారు .ఈదంపతులు వారందరికీ స్వాగత సత్కారాలు చేశారు .అందులో కొందరు ఈ ‘’ముసలిపెళ్ళాం ,పడుచు మొగుడు ‘’జంటను చూసి నవ్వి ఆమెను ‘’అతడు నీకు కొడుకా మనవడా ఏమౌతాడు’’అని పరిహాసంగా అడిగారు .కొందరు మాత్రం ‘’వృద్దునికి యౌవనవతి భార్యకావటం విష తుల్యం .వృద్ధురాలికి యువకుడు భర్త అవటం అమృత తుల్యం .చాలాకాలానికి ఇష్ట, అనిష్ట సమాయోగం చూశాం ‘’అని  వారి ఆతిధ్యం తీసుకొని వెళ్ళిపోయారు .వారిమాటలకు ఇద్దరూ బాధ పడ్డారు..ప్రాజ్నులవటం వలన సిగ్గు కూడాపడ్డారు .తర్వాత ఇద్దరూ అగస్త్య మహర్షిని  సందర్శించి ‘’శ్రేయస్సు భుక్తీ ముక్తీ ఇచ్చే తీర్ధం తెలియజేయమని’’ కోరగా ఆయన ‘’’’గౌతమీనదికి వెడితే, మీ కోరికలు తీరుతాయి. మీ గుహకు వచ్చిన మునులు అన్నమాటలు విన్నాను .నా మాట విని గౌతమీస్నానం చేసి అన్నీ సాధించుకొండి’’అని ఆశీర్వది౦చి పంపాడు . వృద్ధభార్యతో యువ గౌతమ మహర్షి  గౌతమీనదిని చేరి ,శివ ,విష్ణు  గంగానదికోసం  తీవ్ర తపస్సు చేసి మెప్పించాడు .

‘’భిన్నాత్మానాం మత్ర భవే త్వమేవ శరణం శివ –మరుభూమాధ్వగానాం విటపీవప్రియాయుతః –ఉచ్చా వచానాం భూతానాం సర్వథా పాపనోదనః –సస్యానాం నిఃశ్రేణి స్త్వం పీయూష తరంగిణీ –అథో గతానాం తప్తానాం శరణం భవ గౌతమీ ‘’  అని స్తుతించాడు .

 భావం –పార్వతీ పతీ శివా !మరుభూమిలో బాటసారులకు వృక్షంలాగా ,ఈ సృష్టిలో భిన్నాత్ములకు నువ్వే శరణు .ఓ కృష్ణా !అనావృష్టి తో ఎండే పంటలకు మేఘం లాగా ,ఉచ్చ –నీచ ప్రాణుల పాపాలను తొలగించ గల సమర్దుడవు .అమృత మయీగౌతమీ !వైకుంఠానికి నిచ్చెన ఐన నువ్వు అధోగతి పాలైనవారికి ,బాధా తప్తులకు శరణం అవ్వాలి ‘’

  స్తుతికి సంతోషించిన గౌతమి ‘’సకలోపచారాలతో ,మంత్రయుక్తంగా నా జలంతో నీ భార్యను అభిషేకించు .సుందర రూపం తో ,యవ్వనవతి అవుతుంది .ఆమె కూడా నిన్ను అభిషేకిస్తే నువ్వూ సర్వ లక్షణ సంపన్నుడవై,ఆకర్షణీయ రూపం పొందుతావు ‘’అని ఇద్దరికీ చెప్పింది అలాగే ఇద్దరూ చేయగా ఇద్దరూ సుందరరూపాలు పొందారు .వారిద్దరూ ఎక్కడ అభిషిక్తులయ్యారో అదే’’వృద్ధా నదీ ‘’గా ప్రసిద్ధమైంది .గౌతముడు అందరి చేత’’ వృద్ధగౌతముడు ‘’అని పిలువబడ్డాడు .గౌతముని భార్య వృద్ధా ‘’అమ్మా గౌతమీ!ఈ నది నాపేర ‘’వృద్ధానది’’గా పిలువబడాలి .నీతో జరిగే సంగమం ఉత్తమ తీర్ధమవ్వాలి .ఈ సంగమం రూప సౌభాగ్య సంపదలతో ,పుత్ర ,పౌత్ర ప్రవర్ధన కారియై ,ఆయురారోగ్య కళ్యాణీ హేతువై ,జయ ప్రీతి వృద్ధికరమై ,స్నాన హోమాదుల చేత పితరులకు పావనకారియై విలసిల్లేట్లు చేయి ‘’అని ప్రార్ధించగా గంగ తథాస్తు అన్నది .ఇక్కడ గౌతముడు స్థాపించిన లింగం ‘’వృద్ధా’’అని పిలువబడుతోంది .అప్పటినుండి ఇది వృద్ధా సంగమ తీర్ధం అయింది అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-18-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.