గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం –

గౌతమీ మాహాత్మ్యం -28

40చక్ర తీర్ధం –

దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి దేవతలంతా హాజరవగా ,యజ్ఞ భోక్త శివుని అందరి ముందు దూషించి ద్వేషం పెంచుకొని ,పిలవకపోయినా వచ్చినకూతురు  దాక్షాయణి ని అవమాని౦చగా  ఆమె కోపోద్రేకం తో తండ్రిని వారించినా  ఆ మొండి ఘటం  వినకపోతే తనభర్త సర్వలోక శుభంకరుడైన శంభుని తనఎదుటే నిందావాక్యాలు పలకటం సహించలేక ఇక బ్రతకటం సతీ ధర్మం కాదని భావించి అక్కడికక్కడే తాను భస్మమై పోయింది .ఈ విషయం నారదుడు శివునికి తెలిపాడు .కోపించిన రుద్రుడు జయ ,విజయలను దక్షయజ్ఞం విశేషాలు అడిగి తెలుసుకొన్నాడు .

  ఉద్రేకుడైన రుద్రుడు ప్రమధగణాలతో ,భూతనాదులతో కలిసి దక్ష వాటికకు బయల్దేరి వెళ్ళాడు .దక్ష యజ్ఞానికి ఆహ్వాని౦పబడిన ఇంద్ర ,ఆదిత్యాది వసువులు ,రుగ్ యజు స్సామాలతో శ్రద్ధా తుష్టి ,పుష్టి ,శాంతి ,రుషా ,ఆశా జయా మతీ మొదలైన దేవకాంతలు లజ్జా సరస్వతీ భూమి ద్యౌ,శర్వరీ శాంతీ ,క్షాంతి ,సురభి నందినీధేనువు ,కామధేనువు ,కామ దోహిని, కల్ప వృక్షం ,పారిజాతం కల్ప లతాదులతో దేదీప్యమానంగా శోభాయమానంగా ఉంది .ఇంద్ర ,పూషా హరి లు మఖ పర్యవేక్షణ చేస్తున్నారు .అందరూ ఎవరికి ఇవ్వబడిన పనులు నెరవేరుస్తూ సందడి సృష్టిస్తున్నారు .

  అంతటి సంరంభంగా గా జరుగుతున్న దక్షవాటికకు  ,ముందుగా భద్రకాళీ సమేత వీరభద్రుడు ,ఆ వెనుక పినాకపాణి శూల దారి శివుడు వెళ్ళాడు .మహేశ్వరుని చుట్టూ వ్యాపించిన భూతగణాలు  క్రతు విధ్వంసం చేశారు .గొప్పకలకల౦  సృష్టించగా భయపడి కొందరు  పారి పోవటానికి ప్రయత్ని౦చారు  .కొందరు శివుని చుట్టూ చేరి స్తోత్రాలు చేశారు .కొందరు శంకరుని దూషించారు .ఇదంతా చూసి పూష శివుని చేరగా అతడి దంతాలు పీకేసి ఇంద్రుని వెంటపడితే’’ దౌడో దౌడు’’.వీరభద్రుడు భగమహర్షి కళ్ళు పీకి,సూర్యుని చేతులతో గిరగిరా తిప్పి భయంకర వాతావరణం కలిగించగా దేవతలంతా విష్ణువును శరణు వేడారు.శివుని రౌద్రాన్నుంచి తమందర్నీ రక్షించమని వేడారు .

   మహేశ్వర సంహారానిఅకి విష్ణువు చక్రాన్ని ప్రయోగించాడు .శివుడు దాన్ని అమాంతం మింగేశాడు .కాళ్ళు వణుకుతూ దక్షుడు మామగారి కాళ్ళు పట్టుకొని –

‘’జయ శంకర సోమేశ జయ సర్వజ్ఞ శంభవే –జయ కళ్యాణభ్రుత్ శంభో జయ కాలాత్మనే నమః –ఆది కర్త నమస్తే స్తు నీలకంఠ నమోస్తు తే –త్రిమూర్తయే నమో దేవత్రిథామ పరమేశ్వర –సర్వ మూర్తే నమస్తే స్తు త్రైలోక్యాదార కామద’’అంటూ గుక్క తిప్పుకోకండా స్తుతించాడు .ఆగకుండా మళ్ళీ అందుకొని –

‘’నమో వేదాంత వేద్యాయ నమస్తే పరమాత్మనే – యజ్ఞ రూప నమస్తే స్తు యజ్ఞ దామ నమోస్తుతే –యజ్ఞ దాన నమస్తేస్తు హవ్యవాహ నమోస్తుతే – యజ్ఞ హర్త్రే నమస్తేస్తు ఫలదాయ నమోస్తుతే ‘’

అని బుర్రతిరిగి  యజ్ఙ పురుషు  డెవరో ఎరుక కలిగి అహంభావమంతా వదిలి అల్లుడైన దక్షుడు మామగారు పరమ శివుని స్తోత్రించాడు .ఇంతటితో ఆగక –

‘’త్రాహి త్రాహి జగన్నాధ శరణాగత వత్సల –శంకరః సర్వభూతాత్మా కరుణా  వరుణాలయః’’అని శంకర నిజతత్వాన్ని ఆవిష్కరిస్తూ రక్షించు రక్షించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు .భోళాశంకరుడు ప్రసన్నుడై ఏం కావాలని కోరగా తనక్రతువు సంపూర్ణ  మవ్వాలని కోరగా సరే అని యాగం పూర్తి చేయించి ,భూతగణాలతో కైలాసం వెళ్ళిపోయాడు  ఆకరుణామయుడు.

  దైత్యులంతా వైకుంఠంచేరి శ్రీహరిని చేరి ప్రస్తుతించి మెప్పించగా వారికోరిక అడిగి తెలుసుకొని దానవ సంహారానికి తన చక్రాన్ని శివుడు మిగేశాడు కనుక తానేమీ చేయలేనని ఊరడించి పంపేశాడు .

  తర్వాత శ్రీహరి తన చక్ర సాధనకు గౌతమీ తీరం చేరి మహేశ్వర ధ్యానం చేస్తూ ,రోజూ సహస్ర సువర్ణ  కమలాలతో ఉమామహేశులను అర్చించాడు .ఒక రోజు వెయ్యికి ఒక కమలం తగ్గింది .వెంటనే కమలాదళాయతాక్షుడు తన కన్ను ఒకటి పీకేసి వాటికి చేర్చి సహస్ర కమలాతో పూజ పూర్తి చేయగా,శ్రీహరి అనన్య శివభక్తికి ఆనంద పరవశుడై ఉమా సహితంగా మహేశ్వరుడుప్రత్యక్షమవగా –

‘’త్వమేవ దేవా జానీషేభావ అంతర్గతం నృణాం-త్వమేవ శరణో ధీశోత్రకా భవేద్విచారః ‘’అని స్తుతించాడు –మానవ హృదయ భావం తెలిసినవాడివి ,అధీశుడివి ఐన నువ్వే నాకు శరణు .

  ఇలా స్తుతించి ఆన౦దా శ్రువులతో విష్ణువు శివునిలో లీనమయ్యాడు .భవానీ  సమేత శివుడు ప్రత్యక్షమై హరిని గాఢం గా హృదయానికి హత్తుకొని హరి కోర్కెలన్నీ తీర్చాడు .ఆ నేత్రమే మళ్ళీ విష్ణు చక్రమయింది .దేవతలంతా వచ్చి హరి హరులను స్తుతించి ఆశీస్సులుపొందారు . ఈ తీర్ధమే చక్ర తీర్ధంగా పేరు పొందిందని ,ఇప్పటికీ అది చక్రా౦కితమ౦ గా దర్శన మిస్తుందని సర్వకామాలను తీరుస్తుందని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-18-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.