ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు 

ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు

విద్యావారిధి డా.శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో గొప్పకవి శేఖరులు .30కి పైగా గ్రంథాలు రాశారు .వారి విద్వత్తుకు వెలకట్టటం అసాధ్యం . వేద,శాస్త్ర పురాణాదులలో విస్తృత పరిశోధన బహు గ్రంథాలపరిశీలన చేసి ఇటీవలే ‘’ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు ‘’అనే చిన్నపుస్తకం ప్రచురించి ,నాకు  ఆత్మీయంగా నవంబర్ 20 న పంప,వెంటనే చదివేశాను .వారి లోతైన అవగాహన కు ఆశ్చర్యపోయాను .వారేది రాసినా అంతటి నిశిత పరిశీలన ఉంటుంది .అందరికి అర్ధమయ్యే తీరులో చక్కగా రాశారు .అందుకు అభినందనలు .అందులోని ముఖ్య విషయాలు మీకు అందజేస్తాను .

  ప్రారంభం లోనే శాస్త్రిగారు భోజమహారాజు చెప్పిన ఒక శ్లోకాన్ని ఉల్లేఖించి తమ ప్రణాళికను అమలు చేశారు –‘’ఉచ్చ్చైర్గతి ర్జగతి సిద్ధ్యతి ధర్మ తశ్చేత్-తస్య ప్రమాచ వచనైః కృత కేతరై శ్చేత్-తేషాం ప్రకాశన దశా చ మహీసురై శ్చేత్-తా నంతరేణ నిపతే త్క్వనుమత్ప్రణామః –‘’

భావం –ప్రపంచం లో ఉన్నతమైన ధర్మం వలన నే మానవులకు లభించేట్లయితే ,ఆ ధర్మ స్వరూపం వేదాలచే చెప్పబడితే ,ఆ వేదాలు బ్రాహ్మణుల వలననే లోకం లో ప్రచారమౌతుంటే ,ఆ బ్రాహ్మణుడికి తప్ప నానమస్కారం ఇంకెవరికి చెందుతుంది?

  కాళిదాసు సరస్వతీ అవతారం. భోజుడు బ్రహ్మ అవతారం .అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు ?’’బ్రహ్మత్వం బ్రహ్మ విజ్ఞానాత్ ‘’అంటే పరబ్రహ్మ జ్ఞాన౦ కలవాడే బ్రాహ్మణుడు .మహాభారతం ‘’యః క్రోధ మోహౌత్యజతి తమ్ దేవా బ్రాహ్మణం విదుః’’అంటే రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను  జయించినవాడు బ్రాహ్మణుడు అని దేవతలు చెబుతున్నారు అన్నది .బ్రాహ్మణ ఆచార విధానాలు అనుసరించినవాడు ద్విజుడు .వేదం నేర్చి విప్రుడు ,బ్రహ్మజ్ఞానం పొందటం వలన బ్రాహ్మణుడు ఔతాడు .బ్రాహ్మణ ధర్మాలు చాలాఉన్నాయి. అన్నీ పాటించటం కష్టం .కనీసం వాటిని తెలుసుకోవాలి .ఒకసారి గరుత్మంతుడు బోయ వాళ్ళనందర్నీ తింటూ ఒక వ్యక్తిని తినలేక కక్కేస్తే, తల్లి వినత ‘’అతడిని తినలేవు ఎందుకంటె అతడు బ్రాహ్మణుడు ‘’అని చెప్పిందని శంకరాచార్యులు తమ బ్రహ్మ సూత్ర వేదాంత భాష్యం లో ‘’రక్షితే హిబ్రాహ్మణత్వేరక్షిత స్స్యాత్సర్వతో హి వైదికో ధర్మః ‘’అని చెప్పారు .

  ధర్మ శాస్త్రాలలో మను ధర్మ శాస్త్రం ప్రాచీనమైనది. బ్రహ్మ దేవుని నుంచి మనువు అవతరించాడు ‘’యద్వైకిం చ మను రవదత్ తద్ భేషజం ‘’అన్నది వేదం ప్రపంచం లో అధర్మం అనే అనారోగ్యాన్ని పోగొట్టే దివ్యౌషధమే మనువు చెప్పాడు .మను చక్రవర్తి,శత రూప అనే తన ధర్మపత్నితో బ్రహ్మావర్త క్షేత్రం లో బర్హిష్మతి నగరం లో దర్భాసనంపై కూర్చుని  ,ఏకాగ్రమనసుతో ,యజ్ఞ పురుషుని ధ్యానిస్తూ , విష్ణుకథలు వింటూ భ్రుగువు మొదలైన మహర్షులకు ధర్మతత్వం బోధిస్తూ 71యుగాలకాలం భూమండలం పై యోగులు ప్రాణ శక్తిని రక్షించు కొన్నట్లు రక్షించాడు .భ్రుగువు నుండి శిష్యులకు ,ప్రశిష్యులకు మనుధర్మం వ్యాపించి ‘’మను స్మృతి ‘’అయింది .దీనికి ‘’కుల్లూక భట్టు ‘’’’మన్వర్ధ ముక్తావళీ’’అనే గొప్ప వ్యాఖ్యానం రాశాడు .

 ముఖ్య బ్రాహ్మణ ధర్మాలు –వేద, శాస్త్ర పురాణాలు నేర్వటం వాటిని ఇతరులకు బోధించటం,యజ్ఞాలు చేయటం చేయించటం ,దానాలు గ్రహించటం, దానాలివ్వటం అనే ఆరు షట్కర్మలు విధిగా చేయాలి ..బ్రాహ్మణులకు ఆచారం ముఖ్యం .అంటే తనకు తానూ క్షేమం కలిగించుకోనేదే ఆచారం ..ధర్మాలను ఆచరిస్తే ఈలోకం లో కీర్తి ,పరలోకం లో ఉత్తమ స్థితి కలుగుతుంది  .బ్రహ్మావర్త దేశం అంటే ?భారతదేశం లో సరస్వతి ,దృషద్వతి నదులమధ్యభాగం .దీని తర్వాత బ్రహ్మర్షిదేశం  గొప్పది .కురుక్షేత్రం మత్స్య నగరం ,పాంచాల శూర దేశాలే  బ్రహ్మావర్తం .తూర్పున బంగాళాఖాతం ,పశ్చిమాన అరేబియా సముద్రం ,ఉత్తరాన హిమాలయం దక్షిణాన వింధ్య పర్వతాల మధ్య ఉన్నదే ఆర్యావర్తం .

   గృహస్తులు అయిదు యజ్ఞాలు –వేదాలు నేర్వటం  నేర్పటం ,పితృదేవతలకు పిండాలు, నీటితో తృప్తి చెందించటం ,హోమం అనే దేవ యజ్ఞం చేయటం ,భూతబలి అంటే చిన్నప్రాణులకు ఆహారం ఇవ్వటం ,మనుష్యయజ్ఞం అంటే అతిధులను గౌరవించి తృప్తి పరచటం చేయాలి .బ్రాహ్మణ జీవిత విధానం ఎలాఉండాలి ?ఇతరులకు ద్రోహం చేయరాదు ,సత్యం  తో జీవించాలి .లభించినదానితో సంతృప్తి చెందాలి .ఆత్మ సంతృప్తియే అన్ని సుఖాలకు మూలం అని గ్రహించి జీవించాలి .అగ్ని హోత్రాన్ని నోటితో ఊదకూడదు .అపవిత్రవస్తువులు అందులో వేయరాదు .విధి యజ్ఞం కంటే జప యజ్ఞం పది రెట్లు గొప్పది మానసిక జపం శ్రేష్టం .మితభోజనం మంచిది .ప్రతినమస్కారం చేయటం తెలియనివాడికి నమస్కారం చేయరాదు .ఎవరినైనా ‘’క్షేమంగా ఉన్నారా ?’’అని పలకరించాలి .విద్యకు,  వయసుని బట్టి గౌరవం చూపాలి .జ్ఞానం వలననే గొప్పతనం వస్తుందని తెలియాలి. సన్మానం అంటే భయపడాలి..

 తల్లిగర్భం నుంచి వచ్చినది మొదటిజన్మ .ఉపనయనం తర్వాత రెండవ జన్మ .యజ్ఞాలలో దీక్షవహిస్తే మూడవ జన్మ .వేద శాస్త్రాలు చదివే ముందు గాయత్రి చెప్పాలి .నిత్యస్నానం విధి .భారతం కర్ణ పర్వం లో శివుడు త్రిపురాసుర సంహారానికి భూమి రధంగా ,సూర్య చంద్రులు చక్రాలుగా గాయత్రి రధానికి పైనకట్టే త్రాడుగా ‘’గాయత్రీ శీర్ష బంధనా ‘’గా మారారని ఉంది .’’కస్సవితాకా సావిత్రీ స్తన యిత్నురేవ సవిత్రీ విద్యుత్సావిత్రీ సయత్ర  స్తన యిత్నుః’’-‘’తద్వి ద్యుద్యత్రవావిద్యు త్తత్ర స్తన ఇత్యుస్తే ద్వేయో నీతదేకం మిధునం ‘’అనే సావిత్త్ర్యు పనిషత్ లో చెప్పినట్లు మేఘాన్ని సవిత్రుడని ,మెరుపును సావిత్రిఅని భావన చేయాలి చంద్రుని సవిత్రునిగా ,నక్షత్రాలను సావిత్రిగ భావించాలి .గాయత్రి గురించిన జ్ఞాని శాశ్వతుడౌతాడని భీష్మ  పర్వం లో ఉంది .’’యోవా ఏతాం సావిత్రీ మేవ౦ వేద స పునర్మ్రుత్యుం జయతి’’గాత్రీ మంత్ర తత్వాన్ని గుర్తించినవాడు మృత్యువును జయిస్తాడని వేదమే చెప్పింది .

 ప్రపంచకర్త ఈశ్వరుడే .తార్కికులు’’జగతాం యది నో కర్తా కులా లేన వినాఘటః  ,చిత్రకారం వినా చిత్రం  స్వత ఏవభవేత్తతః ‘’అన్నారు –చిత్రకారుడు లేకుండా చిత్రం ,కుమ్మరి లేకుండా కుండా, రానట్లే ఈశ్వరుడు లేకుండా ప్రపంచం రాదు .చిత్ శక్తి , చేతనా శక్తి ,జడ శక్తీ అన్నీ శక్తి రూపాలే అని సప్త శతి చెప్పింది –‘’చిచ్చక్తి శ్చేతనా రూపా శక్తిర్జ డాత్మికా’’

   సంధ్యావందనం లో’’ హరి ,హర అభేద స్మరణం ‘’అనే అంశం ఉన్నది.

  ఇంకా చాలా చెప్పారు శాస్త్రిగారు .కాని అందులో చాలా వాటిని ఇప్పుడున్నకాలమాన పరిస్తి  స్థితులనుబట్టీ  ,ఉద్యోగ ధర్మాలను బట్టీ, అంటే నైట్ డ్యూటీలు, షిఫ్ట్ డ్యూటీలు ,ఒక్కోసారి ఇరవైనాలుగుగంటల డ్యూటీలు ఉన్న వాళ్ళు ,అలాగే అపార్ట్మెంట్ కల్చర్ లో ,మహిళలకు ఉన్న రుతుసంబంధ ఇబ్బందులు ,ఆడవాళ్ళూ ద్యూటీలలో ఉండటాలు  ,తప్పని సరి విదేశీయానాలు ,అక్కడ ఉద్యోగాలు మొదలైనవాటివలన అనుసరించటం కష్టం అని నేను వాటి జోలికి పోలేదు . దీనికి శాస్త్రిగారు మన్నిస్తారని భావిస్తాను .

  ఈ అమూల్యగ్రంథాన్ని(వెల-60రూపాయలు )పొన్నూరు బ్రాహ్మణ మహాసభ కార్యదర్శి ,ఆంద్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి శ్రీ పులిపాక వెంకట సత్య  సాయి వరప్రసాద్ గారు ప్రచురించి శాస్స్త్రిగారికి కుడిభుజంగా నిలిచారు .ఈ పుస్తకం ప్రతి బ్రాహ్మణుడికి అంది, మానసిక పరిణతి ,ఆధ్యాత్మికాభి వృద్ధి కలుగుతాయని విశ్వాసంతో రచయిత శాస్త్రిగారు, ప్రచురణకర్త వరప్రసాద్ గారు ఉన్నారు .వారి ఆశయం సఫలమవ్వాలని ఆశిద్దాం

శ్రీ గాయత్రీమాత సుందర ముఖచిత్రం తో పుస్తకం తేజో విరాజమానంగా ఉండటం ప్రత్యేకత .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-18-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.