గౌతమీ మాహాత్మ్యం -29
41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )
పిప్పలాదుడు గౌతమీ తీరం లో శివునికై ‘’ ఏకాగ్రతతతో సుషుమ్నలో మనసు నిల్పి ,నాభిలో స్వస్తిక రూపం లో హస్తం ఉంచి ,క్రమంగా తీవ్రతరం చేస్తూ ,శివుని మహా తేజస్సును ధ్యానిస్తూ ,యోగ సాధనద్వారా శివుని త్రినేత్రాన్ని దర్శించాడు .చేతులు జోడించి శివ స్తోత్రం చేశాడు –
‘’శంభునా దేవ దేవేన వారో దత్తః పురా మమ-తార్తీయ చక్షుషోజ్యోతిర్యదా పశ్యసి తత్ క్షణాత్-సర్వం తే ప్రార్ధితం సిద్దే దిత్యా దిత్యాహ త్రిదశేశ్వరః – తస్మాద్రిపు వినాశాయ హేతుభూతాం ప్రయచ్ఛమే’’-తన త్రినేత్రాన్ని చూడగలిగితే నేను కోరినదంతా సిద్ధిస్తుంది ‘’అని పరమేశ్వరుడు చెప్పాడు నేను ఆ జ్యోతిని సందర్శించాను కనుక శత్రు వినాశ శక్తి నాకు ప్రసాదించు .
అప్పుడు పిప్పల వృక్షాలు, వాడవ ‘’పరుల నాశనం కోసం ప్రయత్నించేవారు నరకానికి పోతారు ‘’అనగా కోపం వచ్చి ,ఆమె మాట వినకుండా ,తనకోరిక తీరాల్సిందే అని పట్టుబట్టాడు .శివుని నేత్రం నుంచి ‘’కృత్య ‘’వెలువడి ఆడగుర్రం గా మారి ,ఆ కృత్య కూడా అతని తల్లి లాగా అగ్నిని చేరి ,మహా రౌద్రాకారం లో కనిపించి పిప్పలాదుని తానేమి చేయాలని అడిగింది .తన శత్రులైన దేవతలను తినమని కోరాడు .కృత్య వెంటనే పిప్పలాదుని గ్రహించగా బిత్తర పోయి ,ఇదేమన్యాయం అని అడిగితె ‘’నీశరీరమూ దేవతలచే చేయ బడింది కాదా ?’’అని అడిగితె శరణు శరణు అని ప్రాధేయపడి,శివుని ధ్యానించగా ఆయన కృత్యతో యోజన దూరం లో ఉన్న వారి జోలికి పోవద్దని ఆపై ఆమె ఇస్టమని శాసించాడు .
అప్పుడా పిప్పలా కృత్య పిప్పలా తీర్దానికి తూర్పుదిశగా యోజన దూరం వరకు వెళ్లి పోయింది.బడబా రూపం లో ఉన్న ఆకృత్య నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహించటం ప్రారంభించింది .తల్లడిల్లి వారంతా శంభోమహా దేవా అంటూ శరణు కోరగా ,యోజన ప్రాంతం లో సుఖంగా ఉండచ్చు అని చెప్పగా స్వర్గం వదలి ఇక్కడ యెలా ఉంటామని అంటే, ప్రత్యక్ష దైవం సూర్యుడే కనుక ఆరాధించమని కోరగా, పారిజాత వృక్షాలకర్రలతో సూర్యుని తయారు చేయాగా విశ్వకర్మ సూర్యునితో అక్కడే ఉండిపొమ్మని కోరగా, ముప్ఫై కోట్ల అయిదు వందల దేవతలు అర అంగుళానికి ఒకరు చొప్పున నివశించారు .ఈ ఏర్పాటు నచ్చక మళ్ళీ శివుని, పిప్పలాదుని శాంత పరచమని వేడగా, సరే అంటూ పిప్పలాదునితో ‘’నీ తండ్రి దీవతల సం తృప్తికై ప్రాణం త్యాగం చేశాడు .మళ్ళీ తిరిగి రాడు .నీతల్లి కూడా మీనాన్న తో స్వర్గం చేరింది ‘అనగా శా౦తపడి తలొగ్గాడు .ఆయన గంగలో స్నానం చేసిన వారికి కైలసం పొందే వరమివ్వమన్నాడు .పిప్పలాదుని తమతో దేవతలు స్వర్గానికి తీసుకు వెళ్ళారు .అక్కడ తలిదండ్రులను చూశాడు. తండ్రి అతన్ని పెళ్లి చేసుకొని సంతానం పొందమని చెప్పి ,కృత్యను శాంతింప జేయమని కోరగా, అది తాను చేయలేనని చెప్పగా ,కృత్యనే శాంతించమని కోరగా తానేదో ఒకటి భక్షి౦చకుండా ఉండలేని అంటే, బాడవ నదీ రూపం పొంది బడవానలంగా మారి,పంచభూతాలలో మొదటిదయింది .దేవతలు బాడబను సముద్రుని ఆహారంగా భుజించమన్నారు .నీళ్ళున్న చోట, తను యెలాఉండగలను అని, గుణవతి ఐన కన్య తనను బంగారు కలశం లో ఎక్కడికి తీసుకు వెడితే అక్కడికి వెడతానన్నది అగ్ని .దేవతలు సరస్వతిని ప్రార్ధింఛి అగ్నినితీసుకు వెళ్ళమని కోరగా ,తాను ఆశక్తురాలనని వరుణాలయానికి తీసుకు వెళ్ళమని చెప్పింది .గంగా ,యమునలు కూడా తమ అశక్తత చెప్పాయి .అప్పుడు గంగా యమునా సరస్వతీ తపతీ నదులతోకూడిన హిరణ్య కలశం లో అగ్నిని ఉంచి ,వరుణాలాయానికి తీసుకు వెళ్ళారు .అక్కడినుంచి ప్రభాస తీర్ధంచేరి అగ్నిని కలిపారు .అగ్ని నెమ్మదిగా జలాలను తాగటం మొదలెట్టింది .శివుడు దేవతలతో దేవతలు పాపవిముక్తులైన చోటు పాప నాశనమని ,గోవులు పావనమైన చోటు గోతీర్ధమని ,దధీచి అస్థికలు పవిత్రమైన చోటు పితృ తీర్ధమని ,పిలువబడుతాయని శివుడు చెప్పాడు .
దేవతలు దినకరుడు ప్రతిష్ట చెందిన చోట దేవతలంతా ఉన్నట్లే అని చెప్పి పిప్పలాదుని శివుని అనుమతితో స్వర్గం చేరారు .పిప్పలాదుడు గౌతముని కుమార్తెను పెళ్ళాడి సంతానం, సంపదా పొందాడు .అప్పటినుంచి ఇది పిప్పల తీర్ధమైంది .ఈ ముఖ్య ఆఖ్యాయాన్ని చదివినా విన్నా దీర్ఘాయుస్సు పొంది ధనవ౦తు డౌతాడు ‘’అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .
మనవి -పవిత్ర కార్తీకమాసం ఇవాల్టితో పూర్తికనుక ప్రస్తుతానికి గౌతమీ మాహాత్మ్యానికి విరామం ప్రకటిస్తున్నాను .వీలున్నప్పుడు మళ్ళీ ప్రారంభిస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-18-ఉయ్యూరు