శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు
శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో అధ్యాపకులుగా ప్రవేశించారు .ప్రముఖ చారిత్రిక నవలా రచయిత,ప్రసిద్ధ చిత్రకారుడు ,జర్నలిస్ట్ అయిన ‘’శ్రీ అడవి బాపి రాజు-నవలా సాహిత్యం ‘పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.అందుకొన్నారు.ఆచార్య పదవి చేబట్టాక ఎన్నో గురుతరబాధ్యతలు స్వీకరించి ,విద్యార్ధులను తీర్చి దిద్ది, వారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు మార్గ నిర్దేశం చేసిన మనీషి .ఏక సంథాగ్రాహి ఆయన మన్నవ ,తన పుట్టు అంధత్వాన్ని జయించి ,విద్యార్ధుల, సాహితీ ,సంగీత మూర్తుల హృదయాలలో చోటు సంపాదించారు .ప్రతి పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదివి౦చుకొని ,అందులోని విషయాన్ని కరతలామలకం చేసుకొనే అద్భుత నేర్పున్నవారు .వారి నిశిత పరిశీలన కు అందరూ ఆశ్చర్యపోయే వారు .సంపాదించిన జ్ఞానాన్ని,విజ్ఞానాన్నీ మస్తిష్కం లో నిక్షిప్తం చేసుకొన్న’’ విజ్ఞానఖని ‘’మన్నవ మాస్టారు .తమ ప్రజ్ఞా సంపన్నతతో 19 ఎం ఫిల్ డిగ్రీలు ,10 పి.హెచ్ .డి డిగ్రీలు పొందేట్లుగా విద్యార్ధులకు శిక్షణ నిచ్చిన వారి తీరు మరువ రానిది.
నిరంతర విద్యార్దియైన మన్నవ వారు అనుక్షణం నేర్చుకొంటూనే ఉంటారు .వారిది అనుభావాలప్రోది ..వారి సహవాసం తో వారి’’ పరిపూర్ణత్వాన్ని’’ అనుభవించగలం .ఏ వ్యక్తితోనైనా పది నిమిషాలు మాట్లాడితే చాలు ఆమనిషి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అంచనా వేయగల గొప్ప నేర్పున్న ‘’మానసిక శాస్త్ర వేత్త’’ .జీవితం లో ఎన్నో కస్టాలు అనుభవించారు .ఆ కస్టాలను పంచుకొనే మిత్రసమూహమూ వారికి ఎక్కువే .ముక్కుసూటిగా మాట్లాడే నైజం .నరనరానా నిర్భీతి ఉన్నవారు .మన్నవ వారి అంత స్సౌ౦దర్యానికి ఎవ్వరైనా’’ ఫిదా ‘’కావలసిందే .
బాల్యం నుండి సంగీతంపై మక్కువున్నా ,నేర్చుకోవటానికి ప్రయత్నించినా ,ఆటంకాలేర్పడి కొనసాగించలేక పోయారు వారి సంగీత జిజ్ఞాసకు జేజేలు పలికారు అందరూ .రేడియో, సిడిలు వింటూ .సంగీతజ్ఞానం పెంచుకున్న’’ ఏక లవ్య శిష్యు’’లాయన .ముఖ్యంగా ఘంటసాలమాస్టారు అంటే ఆయన గానమంటే ,సంగీత దర్శకత్వమంటే ఈ మాస్టారు గారికి వల్లమాలిన అభిమానం ఆరాధనా . .మన్నవ వారికి సాహిత్యం ద్వారా కొందరు, సంగీతం ద్వారా కొందరు చేరువయ్యారు .సరస్వతి రెండు కళ్ళు సాహిత్య సంగీతాలైతే ,కళ్ళు లేని మా స్టారు గారికి ఆ రెండు అంతర్నేత్రాలయ్యాయి.’’ఆచర్యాత్ పాదమాదత్తే,పాదం శిష్యస్య మేధయా –పాదం సబ్రహ్మ చారిభ్యః ,పాదం కాలక్రమేణ చ ఇతి ‘’అంటే ఆచార్యులు సావయస్కులు ,శిష్యబృందం ,కాలం లనుండి జ్ఞానాన్ని నేర్చుకొంటారు అన్నది వేదం అలాంటి జ్ఞానమంతా మన్నవవారి సహవాసం తో అనాయాసంగా లభిస్తుంది అని వారి అంతేవాసుల ప్రగాఢ విశ్వాసం . ఆచార్య మన్నవ గారు 27-1-2014న పదవీ విరమణ చేశారు .
ప్రముఖ సాహిత్య ,సంగీత సభలకు మన్నవ వారు విచ్చేసి ఆసా౦త౦ ఉండటం వారి ప్రత్యేకత . వారి ప్రసంగాలు అందర్నీ ఆకట్టు కొంటాయి .అంతర్జాలం లో తెలుగు గురించి వారు చేసిన ప్రసంగం తననెంతో ఆకట్టుకోన్నదని మన శాశన సభ ఉపసభాపతి మాన్యులు శ్రీ మాండలి బుద్ధ ప్రసాద్ చెప్పారు .పునశ్చరణ తరగతులను ,జాతీయ సదస్సులను మన్నవ వారు కడు సమర్ధంగా నిర్వహించారని వైస్ చాన్సలర్ శ్రీ వియ్యన్నా రావు మెచ్చుకొన్నారు .ఉత్తమభావాలు ,ఉన్నత ఆదర్శం ఉదాత్త ఆశయాలు అంకితభావం మన్నవ వారి సొత్తు .వీరి సంగీత పరిజ్ఞానాన్ని గుర్తించి విజయవాడ రేడియో కేంద్రం వారిని ‘’ఆడిషన్ కమిటీ సభ్యుని చేసి గౌరవి౦చిదని స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అన్నారు .’’నా రచనలన్నిటిమీదా పరిశోధన జరిపిన ఘనత మన్నవ వారిదే ‘’అన్నారు శ్రీ గొల్లపూడి మారుతీ రావు.రేడియో ప్రయోక్తలపై కార్యక్రమాలపై విద్యార్ధులకు మార్గ నిర్దేశం చేసినందుకు తమకెంతో ఆత్మీయులయ్యారని మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి ము౦జులూరి కృష్ణకుమారి అన్నారు .’’నన్ను గౌరవంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసి ,నాతో శ్రీ శ్రీ పై సమగ్రంగా మాట్లాడించి, వైస్ చాన్సలర్ సమక్షం లో సన్మానించిన ‘’జ్ఞానేత్రుడు’’ మన్నవ గారు ‘’అని మురిసిపోయారు స్వర్గీయ శ్రీ అద్దేపల్లి రామమోహనరావు.డా సంజీవ దేవ్ ‘’మన్నవవారి మాటలు మనో వైజ్ఞానిక సత్యాలతో నిండి ఉంటాయి .ధోరణి స్వతంత్ర మౌలిక దృక్పధం కలిగి ఉంటుంది .చక్షువులు చూడరాని లోతుల్ని వీరి మానస చక్షువులు దర్శిస్తాయి .స్పటిక స్వచ్చ సత్యాన్ని అందుకొంటారు సత్యనారాయణగారు ‘’అని కీర్తించారు .’’బాపిరాజుగారు నాతొ చెప్పిన ఎన్నో అంశాలు మన్నవ ఆయా పాత్రల గూర్చి వెలిబుచ్చిన తీర్పుతో సరి పోల్చుకొంటే ఈ అంధ గ్రంథకర్తఅంతటి సత్యానికి ఇంత దగ్గరగా ఎలా చేరుకొన్నాడు అనే ఆశ్చర్యానందాలు కలిగాయి ‘’అచ్చపు బుద్ధికి లేవు అగమ్య ముల్’’ అనే పింగళిసూరన చెప్పినమాట జ్ఞాపకమొస్తుంది .వీరి పరిశోధన ఆధునిక ఆంద్ర వాజ్మయం అధ్యయనం చేసేవారికి దీపస్తంభం గా ఉపకరిస్తుంది ‘’అని హృదయపు లోతులనుంచి శ్లాఘించారు శ్రీ నండూరి రామ కృష్ణాచార్య వర్యులు .శ్రీ మధునాపంతుల సత్యనారాయణ ‘’బాపిరాజుగారి సారస్వత జీవితానికి ,నవలా రచనకు మన్నవ వారి పరిశోధన మనో ముద్రితమైన మన్నన ‘’అని కితాబిచ్చారు .కరుణశ్రీ ‘’జిజ్ఞాసువు , ప్రజ్ఞాచక్షువు ,విజ్ఞాననిధీ , వివేకశాలీ ,వినయశీలి .సమీర కుమారునిలా ఆటంకాలను అధిగమించిన ‘’చిరంజీవి’ .ఆయన రచన రమణీయం ,కథనం కమనీయం ,శైలి స్తవనీయం ,భావ ప్రకటన ప్రశంసనీయం ‘’అని మందారమకరంద మాధుర్య పదాలతో నిండుమనసుతో దీవించారు .ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ‘’కళ్ళున్న పరిశోధకులకన్నా ,కళ్ళులేని ఈ ‘’మన్నవ’’ మిన్న .అందుకే అతడు మా మన్నవ ‘’అని ఆశీస్సులిచ్చారు .
’’నవతామూర్తి ,నిరంతరాధ్యయన సందానైక చిత్తుండు,మా-నవతా మూర్తి ,సమస్త శిష్య దిషణా నవ్యాబ్జ భానుండు మ-న్నవ తారా పథ పూర్ణ చంద్రుడు ‘’అని మురిసిపోయారు డా .పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ . శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ‘’సంగీత సాహిత్య సాంగత్యమున కొక సమరస మానస సరసి బెనిచి –వివిధ కళాక్లిస్ట విషాద కీర్తి యడవి బాపిరాజున కర్ఘ్యపాద్యమిచ్చారని ‘’ సంతసించారు .డా .రామడుగు వేంకటేశ్వరశర్మగారు’’సాహిత్య వాగ్ధారణ న్సాహిత్య బోధనన్ –సమయపాలన తోడ జరుపు గురుడు ‘’అంటూ గురువందనం చేశారు .తెలుగు విభాగానికి ఆచార్యుడు అనే గర్వం లేని హుందాతనం మన్నవ గారి ప్రత్యేకత అన్నారు అన్నమాచార్యప్రాజేక్ట్ విశ్రాంత ప్రదానగాయకుడు శ్రీ జి.నాగేశ్వరరావు నాయుడు .అరవిందులు చెప్పిన ‘’యూనివర్సల్ మైండ్ ‘’మన్నవ గారిదన్నారు శ్రీ పింగళి వెంకట కృష్ణారావు . ‘’మన్నవ వారికి మా వారు స్వర్గీయ మల్లాది సూరిబాబు గారి స్మారక పురస్కారం అందజేసినందుకు నాకెంతో సంతృప్తినిచ్చింది ‘’అన్నారు శ్రీమతి మల్లాది రుక్మిణీ సూరిబాబు .’’పలు పరిశోధనలకు స్వీకృతి పలికిన వాక్ ఝరి.మాటల్లో తియ్యదనం చేతల్లో చల్లదనం వారి స్వంతం ‘’ఆన్నారు డా పుట్టపర్తి నాగపద్మిని .’’నిశ్శబ్దం లోనూ మనసు ను హాయిగా ట్యూన్ చేసుకొని సంగీతం వినగల సమర్ధుడు ‘’అన్నారు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి .’’వినికిడితో గ్రహించి పరీక్షలలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం వారి ప్రజ్ఞ’’అన్నారు శ్రీ రావి కొండలరావు .’’ ‘’అంతర్నేత్రుడు’’, అంధుడైనా అఖండుడు’’ మన్నవ ‘’అంటారు శ్రీ బులుసు కామేశ్వరరావు .’’చిలకమర్తిలాగా మన్నవ కూడా అమోఘ విజయాలు సాధించారు ‘’అన్నారు శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి .’’అ౦దరూ తక్కువగా చూసే ‘’ ఈల ప్రక్రియ’’కు నేను ప్రాణం పోస్తే ,మీరు భాష కు ప్రాణం పోసి చిత్తశుద్ధితో సంకల్ప సిద్దితో ఉన్నత స్థానం సాధించారు .మాలాంటి సంగీత కళాకారులకు మీరు మార్గ దర్శి ‘’అన్నారుర శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ పులకించిన డెందం తో.మన్నవవారు నాతో ‘’శివప్రసాద్ గారు మంచి ఆత్మీయులు ‘’అన్నారు .’’జ్ఞానా౦జన శలాక ‘’అని శ్రీ గణేష్ ,’’షావుకారు సినిమాలో ‘’మీ అందరికీ వెలుతురూ చీకటి –నాకు మాత్రం అంతా వెలుతురే ‘’అనేపాత్ర లాగా .నాకున్న అతికొద్ది మంది సాహితీ మిత్రులలో మన్నవ ఒకరు ‘’అన్నారు స్వర్గీయ పెద్దిభొట్ల సుబ్బరామయ్య .’’నేను పద్యం చదివే పోకడనచ్చి,నా నాటకపద్యాలన్నీ రికార్డ్ చేయించి ఇచ్చేదాకా ఊపిరి సలపని’’ సంగీత పిపాసి ‘’అన్నారు శ్రీ పొన్నాల రామ సుబ్బారెడ్డి .’’రసాస్వాది ‘’అని సామ వేదం వెంకట మురళీకృష్ణ ,’’మానవతావాది’’అని శ్రీ కోడూరుపాటి శ్రీ పాండురంగారావు ,’’మాది శబ్దమైత్రి ‘’అని ఆకాశవాణి జయప్రకాష్ ,’’సాహితీ కృషీవలుడు’’ అని శ్రీ చల్లా సాంబి రెడ్డి ,’’బ్రెయిలీ పుస్తకాలు కూడా అందుబాటు లేని రోజుల్లో మానసికంగా ,శారీరకంగా శ్రమించి ,పట్టుదలతో సాధించిన దీక్ష వీరిది .గొప్ప’’కళా తృష్ణ ‘’ఉన్న వ్యక్తి ‘’అన్నారు సత్యవాడ సోదరీమణులు .’’ఉషశ్రీ ప్రవచనాలకు ఆకర్షితులై ప్రేరణ పొంది ,పరిచయం పొంది ఎక్కడ ఆకార్యక్రమమున్నాహాజరై ,ఆయన్ను సభకుపరిచయం చేసే బాధ్యత తీసుకొనేవారు ‘’అన్నారు డా ఇరపనేని మాధవి .’’మానవేతిహాసం లో అన్ని శక్తులకన్న అక్షర శక్తిమిన్న ‘’అన్న’’ ఎరుక’’ మన్నవను ఉన్నత స్థితికి చేర్చింది ‘’అంటారు ఆచార్య కే సత్యనారాయణ .ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ వికలాంగ ఉద్యోగవిద్యార్ది సమాఖ్యకు అధ్యక్షులుగా, రాష్ట్ర వ్యాప్త వికలాంగుల సమావేశాలు విజయవంతంగా నిర్వహించినఘనత వారిది గుండెనిబ్బరం ఆత్మ స్థైర్యం గొప్ప సుగుణాలు ఆచార్య మన్నవ వారికి ‘’అని మెచ్చారు డా నారి శెట్టి వెంకట కృష్ణారావు .
‘’వరగంగార్భటివాక్ప్రవాహము లతో వర్ధిల్లి –సూక్ష్మమ్ములౌ –పరమాశ్చర్యపు శోధనమ్ములకు నీ వత్యంత దక్షు౦ డవై –గురు నిర్దేశక బాధ్యతల్నేర్పిన గుర్వగ్ర ‘’అన్నారు డా గుమ్మా సాంబశివరావు .’’Blindness is not an issue to me ,only pursuit of literature mattaers ‘’అన్నది మన్నవ వారి దృక్పధ౦-‘’అంధ జగత్సహోదరుల ఆదర్శపురుషుడు’’ అన్నారు శ్రీ నూతక్కి వెంకటప్పయ్య .’’మన్నన –మన్నవ శీలం ‘’అని శ్రీఆముదాల మురళి అంటే ‘’మా మెగా మాస్టారు ‘’అని డా గొరిపర్తి నాగరాజు,’,’మన్నవ మహాతపస్వి’’అని శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ ,’’జ్ఞానదీప౦ ఆచార్యమన్నవ’’అని శ్రీమతి వాడవల్లి విజయ లక్ష్మి మొదలైనవారు మన్నవ మాస్టారు గారిపై ప్రశంసల పూల జల్లు కురిపించి తమ ఆత్మీయతను స్నేహాన్ని ,గురుభక్తిని ప్రకటించారు .ఇందరి మన్ననలు అందుకున్న మన్నవ మాస్టారు ధన్యులలో ధన్యతములు .
మన్నవ వారిని సత్కరించినవారిలో శ్రీ వేటూరి సుందరామ మూర్తి ,చైతన్య విద్యానికేతన్ ,నటుడు చంద్రమోహన్,గుంటూరు లయన్స్ క్లబ్ , సినీనటుడు బాలయ్య ,నటుడు రంగనాద్ ,మంత్రి గీతారెడ్డి ,భీమవరం లో జరిగిన అఖిలభారత చిత్ర కళోత్సవ సంఘం , తాడేపల్లి గూడెం సాహిత్య సంస్థ ,భీమవరం లోజరిగిన బాపిరాజుశత జయంతి సంఘం ,కర్నూలుజిలల్లా తెలుగు రచయితల సంఘం ,అడవి బాపిరాజు లలితకళా పరిషత్ ,చిరంజీవి జన్మ దినోత్సవ సంఘం ,తెనాలి విజ్ఞాన వేదిక ,మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి ,మంత్రి మాణిక్య వరప్రసాద్ ,పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,గణితాచార్యులు భావనారి సత్యనారాయణ ,ఉయ్యూరు సరసభారతి మొదలైనవారున్నారు .
అనేక అవధానాలలో మన్నవ వారు పృచ్చకులుగా రాణించారు . ఎప్పుడు ఫోన్ చేసినా ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు మన్నవ గారు .’’ఏమైనారాశారా ? ఏమైనా పుస్తకాలు వేశారా?సరసభారతి అంటే నాకు మహా ఇష్టం .మీ గీర్వాణకవుల కవితా గీర్వాణం మీ రచనలో హై లైట్ ‘’అని నిండు హృదయంతో మెచ్చుకొనే సంస్కారవంతులు ,సహృదయులు ,సాహితీ సుసంపన్నులు.ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు .
ఈ తరానికి ,నేటి యువతకు ,ముఖ్యంగా దివ్యా౦గులకు ఆచార్య మన్నవ సత్యనారాయణగారి జీవితం ,అధ్యయనం స్పూర్తి ,ప్రేరణా కల్గించి మార్గ దర్శకం చేయాలనే తలంపుతో రాసిన వ్యాసం .
ఆధారం -8-12-18శనివారం ఉదయం దుగ్గిరాలలో ఆచార్య మన్నవ వారిని వారింట్లో నేనూ మా బావమరిది ఆనంద్ కలిసినపుడు వారు ఆప్యాయంగా అందజేసిన వారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక –‘’విపంచి ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-12-18-ఉయ్యూరు
.
—