గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

340-  శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)

భార ద్వాజస  గోత్రీకులైన వెల్మకన్నెవారి మూలపురుషులు గోపాళంగారు మంత్రం శాస్త్ర పారంగతులు .వీరి దత్తపుత్రుడు రామయ్యగారు జ్యోతిష్ శాస్త్రవేత్త .వీరికుమారుడు తాతగారి పేరుతొ నటనా వైదుష్యంతో ‘’వేషాల గోపాల౦ ‘’గా పేరుపొందారు .వీరిపెద్ద కొడుకు గోపయ్య అని పిలువబడే   గోపాలం గారే శ్రీ హన్మాన్ శర్మగారి తండ్రిగారు .వీరికి 20ఏళ్ళవయసులో  మాడేపల్లికి చెందిన10 ఏళ్ళ వయసున్న  శ్రీ రామోజ్జల నరహరి గారి కుమార్తె  శ్రీమతి సత్యమ్మగారితో పెళ్లయింది .ఈ దంపతులకు లింబాద్రి శ్రీ నరసింహస్వామి అనుగ్రహం తో నరహరి .కొండగట్టు శ్రీ హనుమాన్ అనుగ్రహం తో మన హన్మాన్ శర్మగారు 8-8-1951 నజన్మించారు .వీరి సోదరి భూజాత.

  వేములవాడ లో జన్మించిన శర్మగారిది 8కిలోమీటర్లలో ఉన్న లింగం పల్లి .కుటుంబానికి దాదాపు 30ఎకరాల  పొలమున్నా సరైన సేద్యం లేక కుటుంబ పోషణ కష్టంగా ఉండేది . తండ్రిగారు వ్యవసాయం తోపాటు పౌరోహిత్యమూ చేసేవారు .మూలపురుషుడు లింగంపల్లి గోపాళం గారు శ్రీ వేణుగోపాలస్వామి శ్రీ రాజరాజేశ్వరదేవాలయంగా పిలువబడే శివపంచాయతనం ,శ్రీ జగన్నాథదేవాలయం శ్రీ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాలు నిర్మించిన పుణ్యమూర్తి .శర్మగారి తండ్రిగారు వీరి పదవఏటనే మరణించగా తల్లిగారు కుటుంబం ఆలనాపాలనా చూశారు .

     విద్యాభ్యాసం –వివాహం –ఉద్యోగం

శర్మగారి చదువు  లింగం పల్లిలోనే శ్రీ హన్మంతరావు గారివద్ద అక్షరాలూ నేర్చి ,5వ తరగతి వరకు మాడెపెల్లిలో అమ్మమ్మ, చిన్నమ్మల వద్ద సాగింది .1960లో సిర్సిల్లలో 6 ,7 తరగతులు  చదివి ఉత్తీర్ణులై,1992లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల లో చేరి ,బాగా చదవటం వలన డబుల్ ప్రమోషన్ పొంది, 8 చదివి 1965-66కు ఎంట్రన్స్ పరీక్షరాశారు .ప్రాచార్యులైన శ్రీమాన్ కోవెల్ కందాలై శఠగోప రామానుజా చార్యులు,  దిగ్గజాలవంటి శ్రీ వంగీపురం రామానుజా చార్యులు ,  శ్రీమాన్ మరిగంటి రంగాచార్యులు ,శ్రీమాన్ సముద్రాల శ్రీనివాసాచార్యులు ,శ్రీ అమరవాది కృష్ణమాచార్యులు ,శ్రీమాన్ శేషాచార్యులు ,శ్రీ అణ్ణ౦గ రాచార్యులు,బ్రహ్మశ్రీ ఖండవెల్లి నరసింహ శాస్త్రి ,శ్రీ వర్ ఖేట్ కర్కృష్ణమాచార్యులు మొదలైన పండిత ప్రకా౦డులవద్ద విద్యనేర్వటం  తన అదృష్టం అన్నారు శర్మగారు  హైదరాబాద్ సీతారా౦ బాగ్ లోని వివేక వర్దినీ సంస్కృత కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు . .శ్రీ మల్యాల తిగుళ్ళ  గంగయ్య ,శ్రీమతి  సుశీలమ్మగార్లకుమార్తే శ్రీమతి భవానిగారితో శర్మగారికి 11-12-1967నవివాహం జరిగింది .దురదృస్టవశాత్తు డి.వో.ఎల్ .రెండో సంవత్సరంలో  శర్మగారి  భార్య 8 నెలలకే మరణించగా  విద్యాభంగమౌతుందని తెలియజేయనందుకు కుమిలిపోయారు .

  1969లో డి .వో. ఎల్. పూర్తి చేసి ,బివోఎల్ లో చేరి ,కాలేజి మాసాబ్ టాంక్ కు మారగా విద్యార్ధి నాయకులై అందరినీ కలుపుకు పోతూ 1972లో పూర్తి చేశారు.వెంటనే  శ్రీకాకుళం జిల్లాపరిషత్ పాతశాలలో సంస్కృత పండితులుగా ఉద్యోగం వచ్చినా దూరాభారమని తల్లి పంపటానికి అంగీకరించలేదు .వదినగారి తమ్ముడు శ్రీహరి  శర్మతో బాంధవ్యమేకాక ,నేస్తం కూడా ఉండటం తో ,ఆయన ప్రోత్సాహంతో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్కృత కళాశాలలో లెక్చరర్ పోస్ట్ పొంది, 1973లో చేరి ఒంటరి జీవితం గడుపుతూ ,ధూళికట్ట వాస్తవ్యులు శ్రీ మల్లోజ్జల దామోదరశర్మ గారి జ్యేష్ట పుత్రిక శ్రీమతి లక్ష్మీ కుమారిగారిని  ద్వితీయ౦ వివాహం  చేసుకున్నారు . వీరికి శ్రీమతి గీర్వాణి ,శ్రీమతి శర్వాణి కుమార్తెలు .వీరి వివాహాలు చేసి మనవళ్ళు మనవ రాళ్ళతో సుఖజీవనం గడిపారు .  జీతాలు సరిగా ఇవ్వని యాజమాన్యం లో ఉండలేక లెక్చరర్లు వెళ్ళిపోగా శర్మగారే ఇన్ చార్జి ప్రిన్సిపాల్ గా ఒక ఏడాది పనిచేయాల్సి వచ్చింది .

  అనేక వొడి దుడుకులను ఎదుర్కొని కాలేజి 1981లో స్వంతభవన౦ఏర్పడి ,  యూనివర్సిటీ పరీక్షాకేంద్రం కూడా వచ్చి , డా.సంగనభట్ల నరసయ్య గారు ప్రిన్సిపాల్ అయ్యారు .1987లో శర్మగారు ‘’రాజ శేఖరుని కృతులు ‘’పై పరిశోధన చేసి ఉస్మానియా యూని వర్సిటి నుండి పిహెచ్ డి పూర్తిచేసి డాక్టరేట్ పొంది రీడర్ రికగ్నిషన్ సాధించారు .ఈ కళాశాలలో శర్మగారు 37సంవత్సరాల 7నెలలు విద్యా సేవ అందించారు .విద్యాబోధనచేస్తూనే తెలుగులో బివోఎల్ ,ఏం వో ఎల్ ,సంస్కృతం లో ఏం ఏ సంస్కృతం లో పిహెచ్ డి ,తెలుగులో ఎం .ఏ సాధించారు .వారి దీక్ష తపనకు  విద్యా తృష్ణ శ్లాఘనీయం .

  17-1-1971న లెక్చరర్ గా చేరి ,20-1-1987నుండి రీడర్ గా ,16-10-1974నుండి 26-7-1982వరకు  ప్రిన్సిపాల్ గా పని చేశారు .

 –పూనే ,లక్నో వరంగల్ విశ్వవిద్యాలయాలలో  రిఫ్రేషర్ కోర్సులు చేశారు

                   రచనా హనూమంతం

శ్రీ హన్మాన్ శర్మగారు హైదారాబాద్ రేడియో కేంద్రం నుండి అమరవాణి కార్యక్రమలో పలుసార్లు సంస్కృతం, తెలుగులలో ప్రసంగించారు  .వీటిలో ‘’సందేశకావ్యాని ,మమ్మటోక్తకావ్యభేదా,భారకవేః నయన కోవిదత్వం ,జగన్నాథ పండిత రాయస్య చాటూక్తయః,ప్రాచీన కావ్యాలలో భౌగోళిక జ్ఞానం ,ముద్రారాక్షసం లో రాజనీతి మొదలైనవి ఉన్నాయి .

  శర్మగారి వ్యాసాలలో –దత్తాత్రేయ దేవాలయం –ధర్మపురి ,అభిజ్ఞాన శాకున్తలే కణ్వ మహర్షేః లోకజ్ఞతా ,పుష్కర మాహాత్మ్యం ,ముద్రారాక్షసే రాక్షసస్య రాజనీతిః,గోదావరీ పుష్కర మాహాత్మ్యం మొదలైనవి ఉన్నాయి

సంస్కృత రచనలు – శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారు రచించిన ‘’శ్రీగణ పురా౦జనేయ స్తుతి ‘’కి సంస్కృత వ్యాఖ్యానం రాశారు . శ్రీ లింగంపల్లి వేణుగోపాల సుప్రభాతం-మంగళాశాసన,స్తోత్ర ప్రపత్తి తోసహా రాశారు .

తెలుగు రచనలు -స్కంద పురాణాంతర్గతమైన ‘’సింహస్థ మహాత్మ్యం ‘’ను తెలుగులోకి అనువదించి 2003గోదావరీ పుష్కరాలలో ప్రచురించారు .ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి ఆధ్వర్యం లో ,సహ  సంస్కృతోపన్యాసకులు ప్రిన్సిపాల్  శ్రీ కోరిడే విశ్వనాధ శర్మగారితో కలిసి ‘’లింగపురాణం ‘’ఆంధ్రీకరించారు..శ్రీ మదానంద సరస్వతీ పీఠాధిపతులు సంకల్పించి ప్రోత్సహించిన శ్రీమద్భాగవత౦  శ్రీధరీయ వ్యాఖ్యతోసహా  7స్కంధాలకు  తెలుగు అనువాదం చేసిన అమృత మూర్తి శర్మగారు .మంత్ర పుర(మంథెన )వాస్తవ్యులు  శ్రీ గట్టు నారాయణ గురూజీ ఆదేశంతో ‘’గౌతమీ మాహాత్మ్యం ‘’ను శ్రీ కోరిడే విశ్వనాధ శార్మగారితోకలిసి ఆంధ్రీకరించారు . లింగంపల్లి గోపాళం చరిత్ర .

   హన్మాన్ శర్మగారి శేముషి

ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు –‘’వైదిక ధర్మ ప్రవణః  శర్మన్ –పూతో సి కర్మణాపిత్వం –లింగ౦పల్ల్యభిజన  రాడ్రాజేశ్వర రక్షి తోసి సకుటుంబః’’

‘’విద్యా ధీత్యా  బోధై రాచరణై  రన్వహం ప్రచారై శ్చ-కాలం కిలానయ స్త్వం భవ హైందవ ధర్మ రక్షణో ద్యుక్తః’’

డా.శ్రీ కోరిడే రాజన్న శాస్త్రిగారు –

‘’జయతాద్ హనుమాన్ శర్మా –ఖ్యాతో భాషాద్వయ పండితాగ్రవినుత్యః-వేదాంతే ఔపనిషదే-పురాణ నియ యేషుసూక్ష్మ దర్శీచ ‘’

ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ ,మల్లినాథ సూరిపై అద్భుత పరిశోధన చేసిన శ్రీ ప్రమోద్ గణేష్ లాల్యే –

‘’హనుమాన్ శర్మ మహోదయో నివృత్తి మాసాదయితీతి జ్ఞాత్వా ఆనందోలితం మమ చేతః  హర్ష ణో ది౦చ ,ఏనచ కృత్స్నో జీవితే ఘ్రు త వ్రతో  దీక్షిత ఇవ స స్వకార్యం నిర్యూదయాన్-‘’

శ్రీ శివనూరి విశ్వనాథ శర్మ –

‘’నిర్మధ్య రాజషేఖరకవి కావ్యాని స్వబుద్ధి మంధ దండేన-శ్రీమాన్  శ ర్మాగాత్  తద్వైషిస్టాఖ్య మమృత మపి సుదీభ్యః ‘’-హనూమాన్ బుధ చంద్రః భాతి విశిస్టో దివా నిశం భాతి-రుజు రకలంకో యస్మాత్ గురుమిత్ర హితో గుణాకరః శివాంఘ్రి మూలస్ధః’’

శ్రీ దోర్బల ప్రభాకర శర్మ –

‘’ఆబాల్యం హరిభక్తి రణ్య విషయా నాసక్తి రాధ్యాత్మిక –శ్రేరక్తిః స్థిరబుద్ధి రుత్తమజనాసంగఃసతాం గతిః ‘’

శ్రీ కోరిడేరామయ్య –‘’బహుముఖ ప్రజ్ఞాశీలి ,సాదుగుణ శీలి శర్మగారు ‘’

డా.సంగనభట్ల నరసయ్య –‘’సంస్కృత కావ్య నాటకాలు కరతలామలకం గా విద్యార్ధులకు బోధించిన అనుభవశాలి

డా.పి.టి.జి.వి .రంగాచార్యులు –

‘’శ్లిస్టాక్రియా  కస్య చిదాత్మ సంస్థా సంక్రాంతి రన్యస్యవిశేషయుక్తా –యస్యోయభయం చారు ,స శిక్షకాణా౦ ధురి ప్రతిస్టాపయితవ్య ఏవ’’అంటే విశేషజ్ఞానం ఉన్నా కొందరు చెప్పలేరు,కొందరు  తమకు తెలిసింది కొంచెమైనా బాగా చెప్పగలరు .విశేష పాండిత్యం ఉండి,ఇతరులకు బాగా చెప్పగలవారు అధ్యాపక వరేణ్యులు .అలాంటి విశిష్ట వ్యక్తి శర్మగారు

శ్రీ కోరిడే విశ్వనాథ శర్మ –

‘’గీర్వాణా౦ధ్ర సువాజ్మయాది నిపుణో,యో నంత విద్యానిధిః-‘’శర్వాణీ ‘’పతిపాదభక్తి రమణో వాగర్చిత శ్రీధరః –శ్రీ లక్ష్మీ నరసింహదత్త విభవో,జ్యోతిర్విదాం యోవరః-సోయం పండిత వేల్మకన్ని హనుమచ్చర్మా సదామోదతాత్ –సకల జనభిరామ ,బహు సద్గుణ శీల వికసిత హృత్సరోజ,వరపండిత మండిత సత్య భూషణా-సహజ దయార్ద్ర చిత్త శుభ వాజ్మయ సేవిత వేణుమాధవ –నుతబుధ ఛాత్ర తేహి విజయార్ధమాహం  శశిభూషణం భజే ‘’

 వంటి ప్రశంసలననెన్నిటినో శర్మగారు పొంది ధన్యులయ్యారు  .

 తమ ప్రతిభా పా౦డిత్యాలకు అర్హమైన బిరుదులూ ,పురస్కారాలు పొందారు .బోర్డ్ ఆఫ్ స్టడీస్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఓరియెంటల్ లెర్నింగ్ ,బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ ఫర్పిజి అండ్ యుజి కోర్సెస్ లో మెంబర్ .కాకతీయ యూనివర్సిటి ఫాకల్తి ఆఫ్ ఆర్ట్స్ లో సభ్యులు

  శర్మగారి గీర్వాణ వాణీవైభవం

1-శర్మగారి మాతా పితృ వందన౦ –

2-శర్మగారు తమ వెల్మకన్నె వంశచరిత్రను సంస్కృతం లో 61శ్లోకాలో రచించి వంశ ప్రతిష్టకు కీర్తి చంద్రికలల్లారు .

1-గణాధిపం నమస్కృత్య విఘ్నధ్వాంత వినాశకం-వక్షతే వంశ వృక్షోయం వెల్మకన్నేకులస్యవై అని ప్రారంభించి

61-గోపాలః కరుణాకరో మమ పితాపూజ్య స్త్వమాయాపరః-కౌటిల్యస్య నిరాలయో హితకరోహ్యాబాల వృద్ధస్యచ –మన్మాతా హిత కాంక్షిణీ,శుభకరీ లోకస్య రక్షాప్రదా-నౌమ్యేతౌ హనుమాన్ హం మమప్రియౌ ధన్యోస్మి తత్పుత్రకః ‘’

అని ఇలవేల్పు శ్రీ వేనుగోపాలస్వామికి కృతజ్ఞాతాపూర్వక నమస్సు లందజేశారు .

3-శ్రీ లింగంపల్లి వేణుగోపాల సుప్రభాతం

1-ఉత్తిష్ట వేణు గోపాల లింగంపల్లి మహాప్రభో –ఉత్తిష్ట రుక్మిణీకాంత ఉత్తిష్ట జగతాం పతే ‘’

5-భక్తార్తి నాశనపటోర్భవ ముక్తి హేతో –అభ్యాగాతా స్సురపతే స్తవ దర్శనార్ధం –బ్రహ్మేంద్ర రుద్ర మరుత స్సుర సిద్ధ స౦ఘైః-గోపాలకృష్ణ భాగావంస్తవ సుప్రభాతం ‘

21-బాలాశ్చర౦తి సుభగా బహు కేళి లగ్నా –శ్చానంద పూర్ణ మనసస్తవ మందిరా గ్రే-పారావతాశ్చ సతతం తవ గోపురాగ్రే –

31-అజ్ఞానినం ప్రబల  మోహవశం త్వదీయం –భక్తం భవాబ్ధి పతితం హనుమంత మేనం –ఆదృత్య పాహి కరుణాకర లోకపూజ్యే –గోపాలకృష్ణ భాగవం స్తవ సుప్రభాతం .

స్తోత్రం –మధురాదిపమాధవ ధీరమతే –కమలాయత లోచన గోపపతే –నిఖిలాగమ కీర్తిత విశ్వపతే –విజయీభవ గోపా కిశోర విభో ‘’

మయాబహూనిపాపాని- జ్ఞానాజ్ఞాన కృతానిచ –కృపమా వేణుగోపాల –క్షమస్వ కరుణామయ ‘’ప్రపత్తి -1-శ్రీక్రిష్ణామల పాదపద్మ యుగళీ భ్రు౦గీభవ న్మానసాం-శ్రీదేవీం కమలాలయాంభగవతీం క్షీరాబ్ధి పుత్రీం రమా౦ –విష్ణోర్భక్తి సుపూత నిర్మలమతిం భక్తార్తి విధ్వంసినీం –వందేహం హరిహృన్నివాస రసికాం శక్తి స్వరూపాం శ్రియం

16-భక్తి ప్రయోసి వరదోసి ,జగచ్చరణ్యః-బ్రహ్మాసి , విష్ణురసి శంభురసి త్వమేవ –ఏవం స్తువంతి విదుషో య మనంత రూపం –తద్బాల కృష్ణ చరణం చరణౌ శరణం ప్రపద్యే .

మంగళాశాసనం -1- మంగళం వాసుదేవాయ గోకులానంద కారిణే-మంగళం బాలకృష్ణాయ లక్ష్మీనాథాయ మంగళం

14-శ్రీకరాయ సురేశాయ బాలవీరాయ మంగళం –గోపాలాయ రమేశాయ శ్రీకృష్ణాయాస్తు మంగళం

15-సుప్రభాత మిదం దివ్యం –నిత్యం యః పఠతే నరః –తస్య నశ్యంతి పాపాని –కృష్ణ సాయుజ్య మిష్యతే’’

  శర్మగారిని నిండు మనసుతోఆశీర్వది౦చిననవారిలో శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ ఎస్ .సుదర్శన శర్మ ,శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాదిపతులు శ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ,ధర్మపురి  శ్రీపీఠం పీఠాదిపతులు శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి మొదలైన ఆధ్యాత్మిక మహోదయులున్నారు .

 గీర్వాణ వాణీ పద సమార్చనలో జన్మ ధన్యం చేసుకొన్న ,వారి కుమార్తె శ్రీమతి దోర్బల గీర్వాణి గారు చెప్పినట్లు ‘’కొండంత విషయాన్ని గోరంతగా కూడా చెప్పుకోని మహోన్నత వ్యక్తిత్వ మూర్తి ‘’డా. శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మగారు 62 ఏళ్ళ వయసులో   3-6-2012న   నిత్యం తాము ఆరాధించే శివ సాన్నిధ్యం చేరారు .ఆధారం –నేను హన్మాన్ శర్మగారి విద్వత్తును గూర్చిన వివరాలు తెలియజేయమని కోరిందే తడవుగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీ కోరిడే విశ్వనాథ శర్మగారు ,హన్మాన్ శర్మగారి కుమార్తె శ్రీమతి దోర్బల గీర్వాణి గారికి తెలియ జేయటం, ఆమె నాకుఫోన్ చేసి మాట్లాడి,వెంటనే మెయిల్ లో పంపిన  శ్రీ కోరిడే విశ్వనాథ శర్మగారి సంపాదకత్వం లో వెలువరించిన  తమ తండ్రిగారు  శ్రీ వెల్మకన్నెహన్మాన్ శర్మ గారి ‘’పదవీ విరమణ అభినందన ‘’సంచిక.

  సశేషం

  -గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-18-ఉయ్యూరు    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.