గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
342- ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా) కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –
దక్షిణ దేశ సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ ఆర్యలతో ఈ పుస్తకాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శాస్స్త్రి శ్రీ మానవల్లి రామకృష్ణయ్య పంతులు గార్లు పరిష్కరించి ప్రచురించారు .దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు తెలుగు లోకి అనువదించారు .
‘’పాండ్యు ని సంస్కృత కవిత్వం అలతి అలతి పదాల కూర్పుబిగువుతో శోభాయమానంగా ఉంటుంది చివరి –‘’ఇమాం కాంచన పీఠస్ధాం స్నానయంతి వధూమివ ‘’శ్లోకాన్ని బట్టి ఈ గ్రంథం’’తమిళ సంగం ‘’చేత బంగారు పీటమీద కనకాభి షేకం పొందిందని తెలుస్తోంది .
పాండ్య కవితా వైభవం
1-మూర్ధాః-న ద్రస్టవ్యాః –ద్రష్టవ్యాశ్చేన్నతైస్తు సహతిస్ఠేత్-యది తిస్టేన్నతుకథ యేత్-యఅలసతి కథయేన్మూర్ధ వత్ కథ యేత్’’
దీనికి రాళ్ళపల్లి వారి అనువాదం –మూర్ఖులను జూడ బోరాదుమొదలు ,చూడ –వలసెనా,కూడి వారితో నిలువ దగదు –నిలువ వల నేనియు బల్కవలదు-పల్క-,వలసె బోమూర్ఖునట్లె తా బలుకవలయు ‘’
మరో శ్లోకం –శబ్దార్ధ సూక్ష్మ వసనా – సత్యాభరణా,విచిత్ర హేత్వంగీ-విద్వన్ముఖ నిష్క్రాంతా-సుస్త్రీవ విరాజతే వాణీ’’
అనువాదం –‘’చిత్ర హేతు ఘటన చెలుంపు మేను,స-త్యంబు తొడవు ,పద పదార్థ రచన –సన్న వలువ గాగ ,సత్కాంత పోలిక –వెలయు బుధుల నోటవెడలు మాట ‘’
ఆధారం -1971జులై భారతి మాసపత్రికలో శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి సమీక్ష –సుందర పాండ్య విరచితా –ఆర్యా ‘’
మరికొంత సమాచారం ‘’నీతిద్వి షస్టికా’’నుంచి లభించింది .ఆ వివరాలు –
నీతి ద్విషస్టిక రచయిత సుందర పాండ్య.రాజు దీనిని మొదట దేవనాగర లిపి లో శ్రీ పండిత పురాణం సూర్యనారాయణ తీర్ధ,శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు పరిష్కరించగా ,బ్రహ్మశ్రీ కనుపర్తి మార్కండేయ శర్మ 1928లో ప్రచురించారు. సంస్కృతం లో ముందుమాట శ్రీ వేటూరి వారు రాస్తే, శ్రీ మానవల్లి రామకృష్ణకవి ఇంగ్లీష్ లో కవి జీవిత విశేషాలపై సంస్కృత ,తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం మొదలైన వాటిపై విపుల చర్చ చేశారు .
ఆర్యా ఛందస్సులో కవి రాయటం వలన దీన్ని ‘’ఆర్యా ‘అన్నారు .దీనికి 116వ శ్లోకమే ఆధారం .రాళ్ళపల్లి వారి తెలుగు అనువాదం తో 1970 లో ప్రచురితమైంది .ద్వి షస్టికా’’అంటే 120.ఉన్నవి .116శ్లోకాలే కాని దాన్ని రౌండ్ ఫిగర్ చేశారన్నమాట ;కాని అసలు అర్ధం 62 మాత్రమేకాని 120కాదు .62 శ్లోకాలలో నీతి చెప్ప బడింది కనుక ‘’నీతి ద్వి షస్టికా’’పేరు సార్ధకమైంది . 1981లో ‘’సురభారతి’’ వారు సంస్థ తెలుగు అర్ధతాత్పర్యాలతో ప్రచురించారు .నీతి విషయాలలో పరనింద పనికిరాదని ,మాట తూలరాదని ,క్రోధం నిరోధించుకోవాలని ,సజ్జనులతో స్నేహం చేయాలని మొదలైనవి ఉన్నాయి .
సుందర పాండ్య రాజు మదురానగర పాలకుడు.వేద,ధర్మ శాస్త్రాలలో నిష్ణాతుడు .అక్కడి దేవుడు సుందరేశ్వరుడు అమ్మవారు మీనాక్షి దేవి . పాండ్యరాజులు కళాసాహిత్యాలను బాగా పోషించారు .ఎవరుకావ్యం రాసినా పండిత సభ ఆమోదం పొందాలి .ఈ ముక్తకాలు ఆర్యా శ్లోకాలు .ఆర్యా అంటే ఇక్కడ మీనాక్షీదేవిఅమ్మవారు అనే అర్ధం కూడా ఉంది .
‘’ ప్రొఫెసర్ ఎస్.కుప్పుస్వామి శాస్త్రి ఆచార్య సుందరపాండ్య పై పరిశోధన చేసి ,వార్తికం రాశాడని ,దీన్ని ఆదిశంకరాచార్యులు శారీరక భాష్యం లోనూ , ,కుమారిలభట్టు తంత్ర వార్తికం లోనూ పేర్కొన్నారని ,సిన్నమనూరు శాసనం లో ఉన్న క్రీశ 750కాలపు అరికేసరి ఈ పాండ్య రాజు వారసుడని ,కనుక ఈ రాజు కాలం క్రీ. శ .650కావచ్చునని చెప్పాడు 1250వాడైన కృష్ణ లీలాశుక –‘’పద్ధతి’’రాసిన ‘’ఈశాన దేవ’’శిష్యుడు ,సుందర పాండ్యుని ‘’నక్షతి,చుంబతి నిస్తే తన్వయా ముఖ పంకజం ప్రేయాన్ ‘’అనే శ్లోకాన్ని ఉదాహరించాడని ,ఈ పాదం వీరపా౦డ్యుని ‘’క్రియా నిఘంటువు లో ఉందని చెప్పాడు .ఈ నిఘంటువు 13వ శతాబ్దం లో కూర్పబడింది .
వల్లభ దేవ ,జల్హణ,సారంగధర మొదలైనవారు కూడా ఈకవిని పేర్కొన్నారు .సుందర పాండ్య మీమాంశాస్త్రానికి వేదాంత సూత్రాలకు వార్తికలు రాశాడు .వాచస్పతి మిశ్ర సాంఖ్య వార్తికలోచివర చెప్పిన’’ రాజవార్తిక ‘’ఈ రాజకవిదే అయి ఉండవచ్చు.క్రీశ 500కు పూర్వపుదైన’’పంచతంత్రం ‘’లో కూడా ఉదాహరి౦పబడింది .విష్ణు కుండినరాజు కుబ్జ విష్ణు వర్ధనునిఆస్థాన౦ లోని’’ జనాశ్రయకవి’’రాసిన ‘’జనాశ్రయి’’ లో ఈకవి శ్లోకం ‘’చారిత్ర నిర్మల జలః సత్పురుష నదోశ్రయో భవతు నిత్యం –యస్య విభాత్రార విందే మిత్ర భ్రమరః కృతా విహారః ‘ అనే దాని ’ప్రకారం కుబ్జుడు జనాశ్రయుడిని బయటికి పంపేశాడు.ఈకావ్యం క్రీశ600లో రాసినది అయి ఉండాలి .ఆశ్వఘోష ,కాళిదాస, శూద్రక ,సుందరక ,వరరుచి మొదలైన వారు’’ఆర్యా ‘’గురించి చెప్పారని జనాశ్రయి లో ఉన్నది .కనుక ఆర్యా నీతి శతక౦ అంటే ‘’నీతి ద్వి షస్టికా ‘’కర్త రాజ సుందర పా౦డ్య కవి కాలం క్రీశ 600లకు పూర్వమే అని ప్రొఫెసర్ కుప్పుసామి శాస్త్రి నిర్ధారించాడు ‘’అని శ్రీ మానవల్లి రామకృష్ణకవి ఉపోద్ఘాత౦ లో విపులంగా చర్చించి నిగ్గు తేల్చారు.
అదనపు సమాచారం రాయటానికి ఆధారం -ఈ రోజు ఉదయం మా అబ్బాయి శర్మ మెయిల్ లో పంపిన ప ”నీతి ద్వి షష్టికా ”కావ్యం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 13-12-18-ఉయ్యూరు
—