కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర

వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ  వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని ,ముంబై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆర్కి టెక్ట్స్ లో ఫెలోగా ఉన్నారు .ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ గా ,తెలంగాణా ఘటకేశ్వర్ లోని హెచ్. ఐ .టి .ఎస్ .ప్రిన్సిపాల్ గా ఉన్నారు .ఇప్పటికే 1- వెయ్యేళ్ళ వీణ వంక 2-రేచర్ల రెడ్డి వంశ చరిత్రలో మెరుపులు3-bruhatamma ,బృహతమ్మ బ్రతుకమ్మ బతుకమ్మ   3-Roman foot prints in Charminar 4-Batukamma 5-My Forays  వంటి ఎన్నో చారిత్రిక పరిశోధనా  గ్రంథాలు రాసి దేశం లో సుప్రసిద్దులయ్యారు .వీరికి ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ ఈమని శివనాగి రెడ్డి స్పూర్తిప్రదాత .శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారు నాకు పరిచయస్తులు కారు .కాని వారు ఈ పుస్తకం నాకు నా అడ్రస్ ఎలా తెలుసుకొని పంపారన్నది నేను శోధించాల్సిన విషయమైంది .పుస్తకం నాకు నవంబర్ 20 అందగానే ధన్యవాదాలు చెబుతూ నా వైనం ఎలా తెలిసిందని మెయిల్ రాశానుకాని ఇంతవరకు సమాధానం రాలేదు .

శ్రీ రెడ్డిగారు నల్లగొండ జిల్లా ఆమనగల్లు లో పుట్టిపెరిగారు .వీరి పూర్వీకులకు రేచర్ల వంశానికిచెందిన ‘’దేశముఖ్ ‘’వారసత్వ హక్కున్నది .కాకతి గణపతి దేవ చక్రవర్తి పిల్లలమర్రికి చెందిన రేచర్ల బేతిరెడ్డి ,నామి రెడ్డి  చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆమనగల్లు ప్రాంతానికి సర్వ స్వతంత్ర రాజులుగా నియమించాడు .కనుక వీరు శాసనాలలో ‘’ఆమనగంటి పుర వరాధీశ్వరులు ‘’గా గుర్తింపు గౌరవం పొందారు  .చిన్నతనం నుండి రెడ్డిగారికి రే చెరువులు అనబడే రేచర్ల రెడ్ల చరిత్రతోపాటు  వెలమ వంశ మూల పురుషుడుగా చెప్పబడే చెయ్యూరి చెవ్వి రెడ్డి కథా,అతనికీ  పిల్లలమఱ్ఱి ప్రాంతం లో ప్రచారం లో ఉన్న రేచ బేతాళతో ముడివేయబడిన కధలువింటూనే ఉన్నారు .జటప్రోలు సంస్థానాధీశులు శ్రీ వెలుగోటి రాజ గోపాలకృష్ణ యాచేంద్ర  కోరికపై శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి ,శ్రీ అవధానం శేషశాస్త్రి గార్లు ‘’వెలుగోటి వంశావళి ‘’రాస్తే 1910లో ముద్రితమైంది .కాని దీని పై రెడ్డిగారికి నమ్మకం కుదరలేదు .మెకంజీ మాన్యు స్క్రిప్ట్ లన్నిటిలో కొన్ని బ్రౌన్ రాత ప్రతులను తయారు చేసి ,సంపుటాలుగా బైండ్ చేయించాడు .ఇవే స్థానిక చరిత్రలు లేక కైఫీయత్తులు .వెలుగోటి వంశావళి కూడా మెకంజీ కృషి ఫలితమే .

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ,తురుష్కులను పార ద్రోలి తెలుగు దేశం లో స్వా తంత్రాన్ని  స్థాపించటానికి  ముసునూరి ప్రోలయ ,కాపయ నాయకుల పాత్ర అమోఘం .వీరికి రేచర్ల గోత్రీకులైన వెలమనాకకులు సహాయపడ్డారు .1361 నుంచి 1475వరకు రాచకొండ ,దేవరకొండ రాజధానులుగా తెలంగాణా అంతా పాలించారు .1475లో దేవరకొండ రాజు లింగమనేని తో వీరి పాలన పూర్తయింది .వీరి చరిత్రకు  సాక్ష్యంగా  31శాసనాలున్నాయి .గణపతి దేవుడు, రుద్రమ దేవి ,ప్రతాప రుద్రుల కాలం లో వీరు కాకతి సామ్రాజ్యానికి అమోఘ సేవలందించారు .చేయ్వి రెడ్డి కొడుకు ప్రసాదిత్యుడు రుద్రమ దేవిని కాకతీయ సింహాసనం పై  అధిస్టింప జేసి ,ఆమె కు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచి వేశాడని వెలుగోటి చరిత్ర చెబుతోంది .ఇదే ఇప్పటికీ ప్రామాణిక గ్రంధం గా వెలమవారు భావిస్తారు .చేయ్వి రెడ్డికి పూర్వం ఉన్నవారి గురించి ప్రస్తావన లేదని బుచ్చి రెడ్డిగారంటారు .

కాకతి రుద్రుని  క్రీ.శ. 1181 మొరిపి రాల శాసనం ప్రకారంమరొక కొత్త వంశ వృక్షం కనిపిస్తోందని ,ఇది విర్యాల కుటుంబానికి చెందినకొల్లిపాక సోమనాధుని భక్తుడు  కేతి రెడ్డి, భార్య వెలుసాని  తో మొదలై ,వరుసగా దేవి రెడ్డివరకు వచ్చి ఇతడిని దేవి రెడ్డి బేతియగా చేసి ,ఇతని తండ్రిని విర్యాల బేతియబంటు చేర్చటం జరిగింది కనుక బేతయే బేతాల నాయకుడు అన్నారు రెడ్డిగారు. .   వెలుగోటి వంశావళి లో చేయ్వి రెడ్డి బేతాల రెడ్డి గా చెబితే ,తర్వాత వచ్చిన వెలుగోటి వంశ చరిత్రలో బెతాలనాయుడు అన్నారు .

రేచర్ల పద్మనాయక మూలాలను ఇంతవరకు ఎవరూ పరిశోధించనందుకు రెడ్డి గారు బాధపడ్డారు .వీరత్వం వలన వీరి వంశం ‘’వెలమ వంశం’’ అయిందని శ్రీనాధుడు చెప్పాడు .కొందరు చరిత్రకారులు రెడ్డి సామాజిక వర్గం వారికి రేచర్ల అనే,ఇంటిపేరు ఉంటుందని ,వెలమవారికి రేచర్ల గోత్రంగా ఉంటుందన్నారు .రెడ్డి గారి దృష్టిలో వెలమలు అంతా పద్మనాయకులు కారు .13వ శతాబ్దం నుంచి వెలమ రాజులకు పేరు చివర నాయనంగారు లేక నాయన గారు చేరింది .ఉదాహరణకు ఎర్రమ నాయనిం గారు .ముసునూరు కాపయ నాయకుడు లేక నాయని౦గారు  వెలమ కాదని చరిత్రకారుల నిర్ణయం .ఇతడు వెలమ అనవోతా నాయకుని చేతిలో 1367-68లో భీమవరం వద్ద యుద్ధం లో చనిపోయాడు .

వెంకట గిరి సంస్థానాధీశులు రాజ దానినిని వెలుగోడు నుంచి  వెంకటగిరి కి  మార్చినప్పటినుండి ఇంటిపేరు వెలుగోటిగా ప్రచారమైంది .వీరి వంశ పరంపర నామం ‘’యాచేంద్ర ‘.రేచర్ల రాజధానిగా 6 తరాలు పాలించిన రేచర్ల రాజుల ప్రధాన స్థానం వెంకట గిరి .అసలు వెలుగోడు పెరేలావచ్చింది ?రాయప్ప కపిలేశ్వర గజపతి రాజ లాంచనమైనవెల్ల గొడుగు అంటే  తెలుపు గొడుగు పట్టుకొని కోట గోడపై నిలుచున్న  తర్వాత వెలుగొడుగు పేరొచ్చి ,వెలుగోడు గా  మారింది .15వ శతాబ్ది లో వెలుగోటి వారు విజయనగర సామంత రాజులు .కృష్ణ దేవరాయల పట్టాభి షేకం సందర్భంగా ధూర్జటి కవి ‘’ధాటీ నీరావార ఘోటీ హత విరోధి కోటులై  వెల్గు వెలుగోటి వారు ‘’అనే చాటువు చెప్పాడు .రాయలు రాయప్పకు రాజలా౦ఛనమైన  తెల్ల గొడుగుకు ప్రదానంచేస్తూ ‘’వెలు గొడుగు ప్రభువు ‘’బిరుదు ఇచ్చాడు .

చెలికాని శేషారావు ,డా చెన్నమనేని పద్మ వెలుగోటి వంశావళి చరిత్రలలో లేని ఒక కొత్త విషయం చెప్పారు –‘’వివాహ లేక శోభనం వేళ రేచని కులస్తులు ఇచ్చిన అక్షతలు స్వేకరించాలి .1181వెలనాటి రెండవ కులోత్తుంగ రాజేంద్ర చోళుడు మరణించగా ,పల్నాడులో అన్నదమ్ముల మధ్య కలహాలు రావటం తో నలగామ రాజు సాయం కోరటం తో  కాకతి రుద్రుడు జోక్యం చేసుకొని,సైన్యం తో కోట నాయుడైన దొడ్డ భీముని ఓడించి ,ధరణికోట పట్టుకొని ,వెలనాటి పడమర సరిహద్దులోకాపలా దారులుగా  ఉన్న కొండపడుమతి రాజులనురెండవ కేతరాజు సాయం తో ఓడించి,కృష్ణా పశ్చిమ  తీరం  లోని వెలనాడు ,పలనాడు లను లోబరచుకొని ,,రేవూరు గ్రామాన్ని త్రిపురాంతక మహాదేవుడికి కానుక ఇచ్చినట్లు 1185త్రిపురారం శాసనం తెలియజేస్తోంది .సింగమ దేవ నాయకుని కుటుంబం రుద్ర దేవుని ఆహ్వానం పై ‘’అలుగడప ‘’ప్రాంతానికి వెళ్లి ,రుద్రుని మహా ప్రధాని అయ్యాడు .సి౦గమ మతాత కు  గడికోట మల్లుడు అనే బిరుదుంది వెలనాటి చోళులకు చివర మల్ల ఉంటుంది .కనుక వీరే తెలంగాణాకు వచ్చిన మొదటి తరం వెలమ నాయకులు అని అన్నారు రెడ్డిగారు.వెలనాటి నాయకులు ‘’వెలనాటి మల్లులు ‘’గా పిలువబడి ఉండాలని, వెలనాటిమల్లులే  కాలక్రమ లో ‘’వెలమల్లు ‘’లై ఇప్పటి ‘’వెలమలు’’ అయ్యారని రెడ్డిగారి మాట యదార్ధంగానే కనిపిస్తోంది  .ఆలుగడప శాసనం లో గుండపనాయుని ‘’గడికోట మల్ల ‘’గా పేర్కొనటం వలన మల్ల బిరుదు తో వారు మల్లుల పాత్ర పోషించి ఉండాలన్నారు .గుండప నాయకుని  పూర్వీకులు  ‘’వెలనాటి చోళులే ‘’అని రెడ్డిగారు నిర్ధారించారు .

1201లో తీరాంధ్రపై కాకతీయ దాడి మొదలైంది .అయ్య కుటుంబానికి చెందిన పిన్న చోదడి  వెలనాటి సామంతుడు .కాకతి సైన్యం తో పోరాడి ఓడిపోయి ,తనకూతుళ్ళు నారాంబ , పేరాంబలను గణపతి దేవునికిచ్చి పెళ్లి చేశాడు .ఇలా ఒక శతాబ్దం  వెలనాటిపాలనలో ఉన్న తీరాంధ్రం కాకతీయ పాలనలోకి వచ్చింది .అలాగే గణపతి నేరుగా  పృధ్వీశ్వరునిపైకాకుండా   మొదట దివిసీమపాలకుడు అయ్యనాయకుని పై దాడి చేసిఓడించటం తో పృధ్వీశ్వరుడు గణపతి ని ఎదిరించకతప్పలేదు .ఈలోగా వెలనాటి శత్రువులైన నెల్లూరి తెలుగు చోడరాజు తిక్కభూపాలునితో ,కొణిదన కుచెందిన మహామండలేశ్వర చోడ బల్లయ తో సఖ్యమేర్పరచుకొని ,చివరి దెబ్బగా పృధ్వీ శ్వరుడిని1209లో  ఓడిద్దామనుకొని ,అయ్యరాజ్యం ద్వీపాన్ని (దివిసీమ )జయైంచి ఆరాజు కుమార్తెలను పెళ్ళాడి దక్షిణ సరిహద్దు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఇతనిమిత్రులు పృధ్వీ శ్వరుడిని ఓడించి చంపారు .ఈ దాడిలో పాల్గోన్నవారందరికీ ‘’ప్రుద్వీశ్వర శిరః కందుక క్రీడా వినోదులు’’అనే బిరుదు పొందారు .1209లో చందవోలు లో వెలనాటి చోడరాజ్యం అంతమై ,కాక తీయ సామ్రాజ్య భాగమైంది .వెలనాటి రాజ ప్రతినిదిత్వాన్ని గణపతి దేవుడు తనబావమరది జాయప  నాయకునికి అప్పగించి తర్వాత సైన్యాధిపత్యం అందజేశాడు .యితడు నృత్త రత్నావళి రాశాడు .సురవరం ప్రతాపరెడ్డిగారు వెల్లాల వారే వెలమలు అయిఉంతారని ఊహించగా థర్ స్టన్అనే పరిశోధకుడు ‘’కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఇన్ సౌత్ ఇండియా ‘’అనే పుస్తకం లో అలుగడప శాసనం వలన వెల్లాల వారే వెలమలయ్యారని గట్టిగా చెప్పాడు .నరసరావు పేట పద్మనాయక వెలమ సంస్థానాధీశులు విరియాల గోత్రీకులని ఇంటిపేరు మల్రాజు వారని ,విరియాల మల్రాజు గణపతి దేవ చక్రవర్తి సామంతుడని 1234’’పమ్మి దాన శాసనం ‘’రుజువు చేస్తోంది .

ఇదీలా ఉండగా  మరొక వెలమ రాజు  దేవాద్రి రాజధానిగాఅనవోత రాజు  మెదక్ జిల్లాలో కొంతభాగాన్ని పాలించాడని 1453దర్పవల్లి శాసనం చెబుతోంది.ఇతని రెండవభార్య మల్లమాబ వీరిమనుమడు పల్లయ .అనవోతకు రెండవ సింగభూపాలుడు ,ధర్మానీడు కొడుకులు .అనవోత తండ్రి సి౦గమ నేనికి ఇద్దరు భార్యలు ఉండి ఉండవచ్చు  అంటారు రెడ్డిగారు .ఆ కాలం లో బహమనీ  సుల్తాన్ లతో యుద్ధ తప్పించుకోవటానికి హిందూ రాజులు తమ కూతుళ్ళనిచ్చి పెళ్ళిచేసేవారు .అల్లాఉద్దీన్ తండ్రి మొదటి అహ్మద్ షా సామంతుడైన సంగమేశ్వరుని కూతుర్ని పెళ్ళాడి ఆమెకు ‘’చెబ్రా చెహరా ‘’బిరుదు ఇచ్చాడు.పన్నయ  కూడా సింగభూపాలుడికి భయపడి సుల్తాన్ తో సంబంధం కలుపుకొని ఉంటాడని రెడ్డి గారి ఊహ  .

కరీం నగర్ జిల్లా కోరు కల్లుమండలకేంద్రం వీణవంక గ్రామ ఉత్తరాన గోదావరి ఉపనది మానేరుకు ఆనుకొని ఉత్తరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయమున్నదని మానేరు నది మధ్యలో పూర్వపు కోరుకల్లు గ్రామ ఆనవాళ్ళు కనిపిస్తాయని ,నది ఒడ్డున నాగ దేవత శిల్పం ,కొంతదూరం లో గుట్టవైపు ఆంజనేయ శిల్పం కనిపిస్తాయని ,నది వరదలవలననో కలరావలననో ,  గుట్టకు నైరుతి దిశకు గ్రామం మారి ఉంటుందని ,గుట్టపై16 స్తంభాల శిధిల మండపం ఉందని ,,కోరుకొల్లులో ప్రాచీన   ‘’మహా కూటే శ్వరాలయం’’ఉందని ,దీనిప్రక్కన ఒక రాజకుటుంబం వేయించిన శిలాశాసనముందని  కనుక రాచకొండ వెలమరాజులతో సంబంధమున్న కోరుకొల్లు తెలంగాణా చరిత్ర లో చెప్పుకోదగిన విషయమనీ శ్రీ బుచ్చి రెడ్డి ఉవాచ   .కోరుకొల్లు లోని ‘’ఎర్రపోచమ్మ’’దేవత దగ్గర కోడి ని బలిస్తే విత్తనాలకు పట్టే యెర్ర చీమల బెడద తప్పుతుందని దీనికి తాను ప్రత్యక్ష సాక్షినని రెడ్డిగారన్నారు .ఈవిషయాలపై ఆయన ‘’వెయ్యేళ్ళ వీణవంక ‘’పుస్తకం రాశారు .

అలెక్స్ హెలీ తనజాతి  దక్షిణాఫ్రికా మూలాల కోసం ఎంతో శ్రమించి సాధించి ‘’రూట్స్ ‘’పుస్తకం రాసి చరిత్ర సృష్టించాడు .అలాగే శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి గారు తమ వెలమవంశ మూలాలను త్రవ్వి తీసి సహేతుకంగా శాసనాలనాదారంగా రుజువు చేసి వెలమవంశజులకు మహోపకారం చేశారు .మనకు తెలియని కొత్తవిషయాలు ఆవిష్కరించి చెప్పారు .వీరి పరిశోధన ,తపన ఎన్నదగినది .వారుకోరినట్లు మరింత లోతుగా ప్రభుత్వాలుపూనుకొని నిజమైన వెలమ చరిత్రను వెలువరిస్తుందని ఆశిద్దాం . శాసనాలు, రాజవంశ చరిత్ర అయినా ,రెడ్డి గారి రచన ఆరుద్ర సాహిత్య చరిత్ర లాగా హాయిగా చదివించే గుణం ఉండటం వలన విషయం తేలికగా అర్ధమౌతుంది .దీనికి వీరిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే .

ఈ పుస్తకం లో చివర అనుబంధంగా శ్రీ బుచ్చి రెడ్డిగారు  రాసిన ‘’నాయకురాలు నాగమ్మ’’ జీవిత చరిత్రనూ చేర్చారు .నాకు తెలియని ఎన్నో విషయాలున్నందున మీకూ అందించాలనే తపనతో అందులోని ముఖ్యాంశాలను అందజేస్తున్నాను .

నాయకురాలు  నాగమ్మ

పలనాటి మంత్రిణి నాగమ్మ  కరీం నగర్ జిల్లా పెగడపల్లి లోని ఆరవెల్లి గ్రామం లో భూస్వామి రామి రెడ్డి కూతురు .చిన్నప్పుడే తల్లి చనిపోతే ,కలరా వంటి వ్యాధులు గ్రామాన్ని కలవర పెడితే ,కూతురుతో తండ్రి పల్నాడు వెళ్లి అక్కడ  జిట్టలో గామాలపాడు లో ఉన్న సోదరి ,బావమరది మేకపోతుల జగ్గా రెడ్డి  ఊరికి చేరి ,క్రమంగా వారి సహకారంతో భూములు కొని వ్యవసాయం చేసి పెద్ద భూస్వామి అయ్యాడు .చలాకీ పిల్లనాగమ్మ ఏక సంథాగ్రాహి.కనుక శివభక్తుడు గోపన్నమంత్రి పర్యవేక్షణలో చదువుతో పాటు ధనుర్విద్య సాముగరిడీలు అశ్వ శిక్షణ పొంది ,ఆ గ్రామంలో శివాలయం నిర్మించగా తండ్రి చెరవు నిర్మించాడు , తండ్రి తనమేనల్లుడికిచ్చి నాగమ్మ పెళ్లి చేయగా, పెళ్లి అయిన మూడు రోజులకే అతడు చనిపోగా ,ఆబాధ మర్చిఏందుకు కూతురిని సంస్కృత ,తెలుగు కన్నడ తమిళభషలు ,రాజనీతి, తత్వశాస్త్రం మొదలైనవి నేర్పించాడు . ఈ గ్రామ౦ లో పెద్దగా నిలిచి దానధర్మాలు చేస్తూ ,న్యాయ  సలహాలతో  ప్రజలకు చేరువై ‘’ నాయకురాలు నాగమ్మ ‘’అని పించుకోన్నది  .

గురజాల పాలకుడు అలుగు రాజు మంత్రి బ్రహ్మనాయుడు నాగమ్మ తండ్రి  త్రవ్వించిన  చెరువు రాజ్యోపకారానికి కావాలని ఒత్తిడి చేస్తే ,నిరాకరిస్తే ,ఆగ్రహించి అర్ధరాత్రి రామి రెడ్డిని హత్య చేయించాడు .బ్రహ్మనాయుని అకృత్యాలకు చెక్ పెట్టాలని నాగమ్మ శపథం పూని, ఒక రోజు అలుగురాజు వేటకు వెళ్లి అలసిపోయిసైన్యంతో సహా  జిట్టగ్రామానికి వస్తే నాగమ్మ సాదరంగా ఆహ్వానించి అందరికి అతిదిమర్యాదాలు చేసి ,అతడి అనుగ్రహం పొంది ఏమికావాలో కోరుకోమంటే రాజాస్థానం లో ‘’ఏడుఘడియలు ‘’మంత్రిగా ఉండటానికి అధికారం ఇవ్వమని కోరితే ,ఒప్పుకొని రాజపత్రం రాసిచ్చాడు .ఈ అనుమతితో తరచూ రాజదర్బార్ కు వెళ్లి వచ్చేది .తనపలుకుబడితో అధికారులను  ,దగ్గరకు చేర్చగా మంత్రిదొడ్డనాయుడు మంత్రిపదవి త్యజించి ,తన రెండవ కొడుకు బ్రహ్మనాయుడిని ప్రధానమంత్రి చేశాడు .

తనకిచ్చిన ఏడు  ఘడియల  అధికారం తో నాగమ్మ ,నాయుడు, బంధువులుదోచిన సంపదనంతా ఖజానాకు చేర్పించి ,నలగామ రాజు విశ్వాసం పొంది ,శాశ్వతంగా మంత్రి అయి౦ది .నాగమ్మచింతపల్లికి చెందిన మేడిగం కాటి రెడ్డి ని సైన్యాధ్యక్షునిగా ,మాడగుల వీరా రెడ్డిని  సైన్యాదికారిగా చేసి ,రాజ్యాన్ని బలోపేతం చేసి  రాజ్య రక్షణకు విశేష కృషి చేసింది .నాగమ్మ మంత్రిత్వం గిట్టని బ్రహ్మనాయుడు మలి దేవాదుల సాయంతో హైహయ కుటుంబం లో అంతః కలహాలు సృష్టించి,పలనాడును రెండురాజ్యాలుగా చీల్చాడు .నాగమ్మ ఒకే రాజ్యంగా ఉండాలని పట్టుబట్టింది .నలగాముడు మలిదేవాదులకు 90 గ్రామాలతో  కూడిన మాచర్ల రాజధానిగా రాజ్యమిచ్చాడు .పెద్దమలిదేవుడు బ్రహ్మనాయుని ప్రధానమంత్రిని చేస్తే చిన్నవాడుకనుక నాయుడే మొత్తం పాలన సాగించాడు .

నలగామ రాజు గురజాల రాజధానిగా రాజ్యాన్ని పాలిస్తూ నాగమ్మను ప్రధాని చేశాడు .నాగమ్మ ప్రజాభిమానం పొందుతూ ఉండగా నాయుడు ‘’చాపకూడు ‘’సిద్ధాంతం తో ప్రజలకు చేరువయ్యాడు .కళ్యాణీ రాజ్యంతో బంధుత్వం కలిపి ,పెదమలిరాజుకు రాజు సోమేశ్వరుని కూతురు తో పెళ్లి చేయించి మాచర్ల రాజ్య పట్టం కట్టాడు .ఈ వియ్యం గురజాలను కలవర పరచింది .నాయుడుకాలచూరుతో వియ్యమంది చందోలు విరోదికూటమిలో చేరాడు .కోడిపందాల వ్యసనం తో రెంత చింతలవడ్డ జరిగిన కోడిపందెం తో మాచర్ల పుంజు ‘’చిట్టిమల్లు ‘’ఓడిపోగా మలిదేవాదులు  పందెం ప్రకారం  రాజ్యం కోల్పోగా, నాయుడు రెండో పందెం కాయించి గోలివాగు దగ్గర నాగమ్మ పుంజు సివంగి డేగ కు నాయుడు పుంజు చిట్టిమల్లుకు పోటీజరుగగా   బ్రహ్మన పుంజు ఓడిపోగా ,అన్యాయం అరిగిందని గగ్గోలు పెడితే మధ్యవర్తి అలరాజు  నాయుడి కోడి గెలిచిందని తీర్పు ఇవ్వగా మళ్ళీ మలిదేవాదులు రాజ్యం కోల్పోయి ,క్రష్ణదాటి మండాది అడవికి వలసవెళ్లి వీరా మేడపి పట్టణం కట్టుకొని పాలించగా ఏక రాజ్యం చేయాలన్ననాగమ్మ ఆశలు అడుగంటాయి .

ఏడేళ్ళ ఆరునెలల ప్రవాసం తర్వాత మలిదేవాదులు తమరాజ్యం, ఆదాయం ఇవ్వమని  , కోరగా  ,నాగమ్మ ఒప్పుకోక అలరాజును రాయబారిగాపంపగా ,రాయబారం విఫలమై తిరుగుప్రయాణం లో  విష ప్రయోగం లో  చనిపోయాడు .నాగమ్మే ఈపని చేయించినది అందరూ అంటారు .అతని తండ్రి కొమ్మరాజుకు నాయుడిపై అనుమానం వచ్చి౦ది .మలిదేవాదులు నాయుడుప్రోత్సాహంతో గురజాలపై యుద్ధం  ప్రకటించగా  ,నలగామరాజు సమకాలీన రాజుల సాయం కోరగా నాగమ్మ రాజకీయ చాతుర్యం తో కాలచూరులుతప్ప అందరూ సాయానికి వచ్చారు . ఇరు సైన్యాలకు కారం పూడిలో యుద్ధంకు  సన్నద్ధమైనా ,రక్తపాతం జరుగరాదని నాగమ్మ నలగామ రాజుకు నచ్చ చెప్పి మేడిదగం  కాటి రెడ్డి  ,మాడుగుల వీరా రెడ్డి ,ధరణికోట కేతరాజులను పంపి సంధి ప్రయత్నం చేసి సాధించింది .సందికుదిరిన సంతోషం తో రెండువైపులవారూకలిసి సహపంక్తి భోజనాలకు కూర్చోగా ,వడ్డన ప్రారంభంకాగానే  బ్రహ్మనాయుడి కొడుకుఉడుకురక్తపు  బాలచంద్రుడు దూసుకువచ్చి ‘’సంధీలేదు గిన్ధీ లేదు యుద్ధ జరగాల్సిందే ‘’అని వడ్డించిన  విస్తళ్ళను  కాలితో తన్నేసి చిందరవందర చేయగా నలగామునికి కోపంవచ్చి యుద్ధ ప్రకటన చేశాడు .

బ్రహ్మనాయుడికి దన్నుగావచ్చిన గోసంగులు ఎడురుతిరగ్గా నాగమ్మవైపే ఎకువమంది చేరగా మూడు రోజులు యుద్ధం జరిగి నాయకురాలు నాగమ్మ స్వయంగా కత్తి పట్టి నాయుడితో యుద్ధం చేయగా,రెండవరోజు బాలచంద్రుడు చనిపోగా ,నాగమ్మ హృదయం ద్రవి౦చగా, మూడో రోజు కాలచూరి  కొమ్మన మరణించగా ,మలిదేవుడే స్వయంగా యుద్ధానికి వచ్చి హతమైనా ,నాయుడు యుద్ధం కొనసాగించి ,నాగమ్మ నాయుడు హోరాహోరీ యుద్ధం చేశారని చనిపోయాడని కొందరు అంటే ,నాగమ్మ శరణు వేడగా క్షమించి గుత్తికొండ బిలం చేరి తపస్సుతో తనువు చాలించాడని కొందరు అంటారు  .నాయుడి నిష్క్రమణతో పలనాటి యుద్ధం సమాప్తమైంది .నాగమ్మ నలగామరాజుకు విజయం చేకూర్చి రాజు కు అండగ నిలిచింది .

పల్నాడు  అంతటా కాలువలు  త్రవ్వించి  వ్యవసాయానికి తోడ్పడి ,గురజాలదగ్గర సంగమేశ్వర పురం లో ,అడిగొప్పుల ,జూలకల్లు లలో  పెద్ద చెరువులు త్రవ్వించి ,కారంపూడి వద్ద నాగులేరుకు ఆనకట్ట కట్టించి నీటికొరత తీర్చి సశ్యశ్యామలం చేసి రాజ్యాదాయం పెంచి ‘’రైతు నాయకురాలు’’ అనికూడా అనిపించుకొన్నది .చాలా శివాలయాలు కట్టించింది .గురజల  వీరభద్రాలయం ఆమె కట్టించిందే  .పాలనావ్యవస్ద ను  పటిష్టం చేసింది .పలనాడు ఆరాధ్య దేవత అయింది .ఆడపిల్లలకు’’ గౌరవంగా నాగమ్మ’’ పేరు పెట్టుకోవటం ఆనవాయితీ అయింది

జీవిత చరమాంకం లో నాగమ్మ గుర్రం మీద ఆయుధాలు పెట్టుకొని పనాడునుండి తెలంగాణా కరీంనగర్ జిల్లా  స్వగ్రామం ఆరవెల్లి వెళ్లిందని ,అక్కడిప్రజలు ఆమెను నాయకురాలిని చేయగా ,దొంగలభయం నుండి ప్రజలను కాపాడుతూ ,ప్రజలకు రక్షణ ఇస్తూ  ,దొంగలను ఎదిరిస్తూనే చనిపోయిందని కొందరు ,స్వచ్చందంగా నే నాగమ్మ జీవ సమాధి అయిందని కొందరు అంటారు .

శ్రీనాధ కవిసార్వభౌముడు –‘’పంట రెడ్డి వారి పడతి యన౦గా –ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ –మేకపోతుల రెడ్డి మేనకోడలు ను –ఆరవెల్లి వారింటి ఆడపడుచు అమర కోడలన ‘’- అని చెప్పిన పద్యం లో కూడా నాగమ్మ తెలంగాణా కరీంనగర్ జిల్లా ఆరవెల్లి గ్రామం ఆడపడుచు .అని నాయకురాలు నాగమ్మ చరిత్రను శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారు మరోకోణం లో ఆవిష్కరించారు  .

అయితే మన౦ విన్న దానికి దీనికీ తేడాలున్నాయి  .బ్రహ్మనాయుడు వైష్ణవమతావలంబి నాగమ్మ ది శైవం .సహజ వైరం ఉండేఉంటుంది .ఆయన చెన్నకేశవాలయం కట్టిస్తే ,ఈమె వీరభద్రాలయంనిర్మించింది .  ఈ హరిహర ద్వేషం చూసే తిక్కన సోమయాజి హరిహరాద్వైతం బోధిస్తూ మహాభారతాన్ని ఆంధ్రీకరించాడని మనకు తెలిసిన విషయం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-18-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.