- గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )
ఆది శంకరాచార్య శిష్యుడు ఆనందగిరి .శంకర విజయం ,న్యాయ నిర్ణయం ,తర్క సంగ్రహ గ్రంథాలు రచించాడు .ఇతడినే ఆనంద జ్ఞాన అంటారు .
349-హారలత కర్త –అనిరుద్ధ భట్టు (11వ శతాబ్దం )
బెంగాల్ లో స్మృతి రచనకారులలో ప్రసిద్ధుడు అనిరుద్ధ భట్టు .12వ శతాబ్ది రాజు వల్లాలసేన అనిరుద్ధభట్టు తన గురువు అని చెప్పుకొన్నాడు .హార లత ,పితృ దయిత అనే స్మృతి వ్యాఖ్యానాలు రాశాడు .’’కర్మోప దేశిని పధ్ధతి ‘’కూడా ఇతని రచనే అంటారు .
350-వార్తిక సూత్రకర్త –అనుభూతి స్వరూపాచార్య (12వ శతాబ్దం )
12వ శతాబ్దికి చెందిన ఆచార్యుడు అనుభూతి స్వరూపాచార్య .సారస్వత వ్యాకరణం లోని వార్తిక సూత్రాలు రాశాడని అంటారు .
351-మీమాంస న్యాయ ప్రకాశ కర్త –ఆపదేవ (17వ శతాబ్దం )
ఆపదేవి గా పిలువబడే ఆపదేవ మీమాంస న్యాయ ప్రకాశ రచించాడు .తత్వ శాస్త్రం లో ఇది పూర్వ మీమాసకు గైడ్ లాంటిది .ఇతని కొడుకు అనంత దేవుడు తన ‘’స్మృతి కౌస్తుభం ‘’లో తండ్రి గురించి రాశాడు .వీరిది సకల శాస్త్ర పారంగత ,ఆధ్యాత్మిక స౦పన్నత ఉన్న మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం .ఆపదేవ ముత్తాత 1609 నాటి ఏకనాధుడు అనే మహా భక్తకవి .ఆపదేవుని తాత పేరు ఆపదేవుడు .తండ్రిపేరు అనంత దేవుడు.బహుశాకవి 17వ శతాబ్దికి చెందినవాడు అయి ఉండాలి .మీమాంస శాస్త్రం లో భట్ట పధ్ధతి అనుయాయి .
352-చతుశ్శతక కర్త –ఆర్య దేవుడు –(క్రీ.శ.2వ శతాబ్దం )
కానదేవుడుఅంటే ఏకాక్షి ,నీలనేత్రుడు అని పిలువబడిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని శిష్యుడు ఆయన పీఠానికి ఉత్తరాదధికారి అని హుయాన్ సాంగ్ ,ఇత్సింగ్ యాత్రికులు చెప్పారు .ఆర్యభట్టు జీవిత చరిత్రను 405కు చెందిన కుమార జీవ చైనాభాషలోకి అనువదించాడు .కనుక ఆర్యదేవ రెండవ శతాబ్ది చివరి కాలం వాడు అయి వుండచ్చు,చతుశ్శతకం ,అస్టావలప్రకరణం లేక ముష్టి ప్రకరణం రాశాడని భావిస్తారు .ఆర్యదేవుని రెండు చిన్నవ్యాఖ్యానాలను బోధిరుచి చైనాభాషలో త్రిపిటకలలో అనువాదం చేశాడు .చిత్త విశుద్ధి ప్రకరణ కూడా ఇతని రచనగా చెబుతారు .
353-జాతకమాల కర్త –ఆర్య సూర(3-4శతాబ్దాలు )
మూడు లేక నాలుగో శతాబ్దికి చెందిన ఆర్యసూర జాతకమాల రాశాడని చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నాడు .అజంతా లోని కుడ్య చిత్రాలలో దీని విషయం ఆనాడు చెప్పబడింది
354-బాలం భట్టి కర్త –బాలంభట్ట –(1730-1820)
బాలంభట్టు లేక బాలకృష్ణ పాయ గుండ దక్షిణ భారత దేశానికి చెందినవైద్యనాథ,లక్ష్మి దంపతుల కుమారుడు .విజ్ఞానేశ్వరుడు రాసిన ‘’మితాక్షర ‘’కు బాలంభట్టి అనే వ్యాఖ్యానం రచించాడు .శబ్ద కౌస్తుభం ,శబ్ద రత్న , శబ్దేందు శేఖర వ్యాకరణాలకు కూడా వ్యాఖ్యానం రాశాడు .ఇదే పేరుతొ ఉన్న తంజావూరుకవి బాలబోధిని బాలరంజని అనే చిన్న వ్యాకరణ పుస్తకాలు రాశాడు .
355-ప్రబోధ ప్రకాశ కర్త-బలరామ పంచానన (?)
కాలం వగైరా విషయాలు తెలియనిబ్రాహ్మణకవి బలరామ పంచానన ‘’ప్రబోధ ప్రకాశం ‘’అనే వ్యాకరణ గ్రంథం రాశాడు . ఇతనిదే ‘’ధాతు ప్రకాశిక ‘’కూడా అంటారు .
ఆధారం – సురేష్ చంద్ర బెనర్జీ రచించిన – ‘’ఎ కంపానియన్ టు సాంస్క్రిట్ లిటరేచర్’’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-18-ఉయ్యూరు