గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)
14వ శతాబ్దికి చెందిన ఆనంద పూర్ణముని ‘’న్యాయ చంద్రిక ’’రాశాడు .ఇతనికి విద్యాసాగరుడు అనే బిరుదున్నది .ద్రవిడాచార్య బాలకృష్ణానంద తెలియజేసినదాని ప్రకారం పూర్ణానంద సరస్వతే ఆనంద పూర్ణముని .13వశతాబ్దిలో మధ్వాచార్య ‘’బ్రహ్మ సూత్రభాష్య౦ రాసి అద్వైతమతాన్ని ఖండించగా ,శ్రీ చిత్సుఖాచార్యులు ‘’భాష్య భావ ప్రకాశిక ‘’రాసి అద్వైతాన్ని సమర్ధించాడు .దీనిపై ద్వైతమతం పక్షాన శ్రీ జయతీర్ధులు ‘’న్యాయ సుధా ‘’రాయగా అది ద్వైతానికి బలవాత్తర గ్రంథంగా చెలామణి అయింది .తర్వాత అటూ ,ఇటూ చాల వచ్చాయి .కాని ‘’న్యాయ చంద్రిక ‘’వచ్చాక దానిని ఎదుర్కొనే ద్వైత గ్రంధం ఇంతవరకు రాలేదు అని దీని భూమికలో మహామహోపాధ్యాయ శ్రీ అనంత కృష్ణ శాస్త్రి చెప్పారని శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారన్నారు .
న్యాయ చంద్రికలో ఆనంద పూర్ణ ముని వైశేషిక దర్శనాన్ని ,భాస్కరుని ద్వైతాద్వైత బ్రహ్మ పరిణామ వాదాన్ని సూక్షంగా ఖండించాడు .భాస్కరవాదానికి శ్రీమద్రామానుజుల విశిస్టాద్వైతానికి పెద్దగా భేదంలేదు .న్యాయ చంద్రికలో 1-సమన్వయ పరిచ్చేదం 2-అవిరోధ పరిచ్చేదం3-సాధన పరిచ్చేదం 4-ఫల పరిచ్చేదంఉన్నాయి .ఇందులో మొదటిదిపెడ్డది మూడోది చిన్నది .విషయ వివరణ చేస్తూ కారికా రూప శ్లోకాలు కూడా ఉన్నాయి .వీటిని గ్రంథం మొదట్లోనే పెట్టారు .కారికలకు ముందు ద్వైతాద్వైత వాదభేదాలలో ముఖ్యమైనవి 44శీర్షికలు గా క్రోడీకరించటంవలన ఒకదానికొకటి ఎదురుగా ఉండి,కళ్ళకు కట్టినట్లు కనబడుతాయి . దీన్నీ మద్రాస్ ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీ వారు ప్రచురించారు .
350-వేదసమీక్షా –సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర యూని వర్సిటి )
1964ఫిబ్రవరి లో తిరుపతిలో జరిగిన వేద సెమినార్ లో సమర్పించబడిన వ్యాస సంకలనం ఈ’’ వేదసమీక్షా ‘’.వ్యాసకర్తలంతా వేదవిద్వాంసులే .వీరిలో కొందరు ప్రాచీనపద్దతి వారు మరికొందరు పాశ్చాత్య రీతులను అర్ధం చేసుకొన్న ఆధునిక విద్వాంసులు .సంస్కృత దేవనాగర లిపిలో 44పేజీలు ,మిగిలిన పేజీలు ఇంగ్లీష్ లో ఉన్నాయి .దీన్నిబట్టి ప్రాచీన ,నవీన పద్ధతుల ఉపయోగాలేమిటో స్పష్టమౌతుంది .వేదాసక్తి ఉన్నవారంతా చదవాల్సిన పుస్తకం .ఆంద్ర ,కేరళ ,తమిళనాడు ,కర్ణాటక రాష్ట్రాల కళాశాల , విశ్వ విద్యాలయ ఉద్దండ పండితులు రాసిన వ్యాసాలివి .
సాధారణంగా దేశమంతా వేదోచ్చారణ ఒకే రీతిగా ఉంటుందని అందరిభావన .కాని దీనిలో గోదావరి మండల ,కేరళ పద్ధతులలో భేదాలున్నట్లు ,ముఖ్యంగా సామవేదపాఠం లో,కేరళవారికి ,మిగిలిన ప్రాంతాల వారికి తేడా ఉంటుందని .’’కేరళేషు వేదాధ్యన సంప్రదాయః ‘’వ్యాసం లో శ్రీ ఇట్టిరవి నంబూద్రి తెలిపారు .ఆయన సామవేద జైమిని శాఖలో అగ్రేసర పండితులు .కేరళలో ముందు సామవేదం నేర్చి ,తర్వాతే మిగిలిన వేదాలు నేర్చేవారు .ఋగ్వేద,యజుర్వేద పాఠాలలో అక్కడి వారికి మిగిలినవారికి పెద్దగా భేదాలు లేవు .కేరళ సామవేద పాఠంలో’’ కంపము ‘’ఎక్కువ .ఇతర ప్రాంతాలలో గీత స్వరాలైన షడ్జాదులకు ఎక్కువ ప్రాధాన్యముంది . వారుమధ్యమ స్వరం మీదనే ఎక్కువ శ్రమ పెడతారుకాని ,సప్తమమైన నిషాదం అసలు ఉపయోగించరు .ఇలాంటి అపూర్వ విషయాలు ఈ వ్యాసం లో ఉన్నాయి .
‘’శౌనకీయ శిక్షా ‘’వ్యాసం లో శ్రీ వే.వెంకటరామ శర్మ ఋగ్వేదానికి అన్వయించే ఆ శిక్షలో వీరకరణము ,రంగము ,సంయుక్త వర్ణోచ్చారణం మొదలైనమెలకువాలు రాస్తూ, వేదోచ్చారణలో కేరళీయులకున్న౦త శ్రద్ధ, మిగిలినవారికి లేదన్నారు. వీరు ప్రాతిశాఖ్య ,క్రమ శిక్షలో అద్వితీయ పండితులు .శ్రీ ప్రతివాద భయంకర అణ్ణ౦గరాచార్యులు ‘’పద పాఠ పరిశుద్ధి’’వ్యాసం లో తైత్తిరీయ సంహిత ‘’లో 1,09,287పదాలున్నాయని ,,వీటిలో ఏకాక్షర ద్వ్యక్షర ,బహ్వక్షరములున్నాయని ,ఒకే పదం వేర్వేరు చోట్ల భిన్నస్వరాలలో ఉచ్చరించటానికి కారణం వేదపురుషుని ఉచ్చారణ విశేషమే అనీ ,అ ఉచ్చారణ దశ విధాలని చెప్పారు .
శ్రీ వే. వేంకట రామ శర్మ ‘’వైదికః ప్రకృతిపాఠః’’లో వేదపాఠం ప్రకృతి,వికృతిఅనే భేదాలతో ఉంటుందని అందులో ప్రకృతిపాఠంసంహిత ,పదం ,క్రమం అనే మూడు అంతర్భాగాలతో ఉంటుందని ,వికృత పాఠంఘన ,జటమొదలైన 8విధాలని వేడ్యాచార్యులు ‘’వికృతివల్లి ‘’లో చెప్పాడని,వ్యాడి-పాణిని మేనమామకుమారుడని ,,ఆయన లక్ష శ్లోకాలతో పాణినీయం ను గురించి గ్రంథం రాశాడని చెప్పారు .యజ్ఞం లో ,స్వాధ్యాయం లో సంహితార్ధ పరిజ్ఞానం సంబంధం కలిగి ఉండటం వలన సంహితార్ధ పరిజ్ఞానానికి ,పదాధ్యయనానికి ప్రయోజనం ఉందని ,క్రమ పాఠానికి అలాంటి ప్రసిద్ధి లేదని ,స్మృతిప్రయోజనమున్నదని,క్రమం కూడా ఆర్షమే అనీ ,వ్యాకరణ శాస్త్రం లో ‘’తదథీతే తద్వేద ‘’అని మొదలు పెట్టి ,’’క్రమదిభ్యో వున్’’అంటే క్రమాధ్యయనం చేసేవారిని ‘’క్రమకులు ‘’అంటారని ,పఠాధ్యయనం చేసిన వారిని ‘’పదకులు ‘’ అంటారని ,కనుక క్రమపాఠం అందరూ అంగీకరించారని వివరించారు .శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు దీనిపై ‘’వేద స్వరూప ప్రయోజనాలు తెలీకుండా ‘’ఘనపాఠులు’’ ఘన స్వస్తి ఆంద్ర దేశం లో చెబుతున్నారని ,అది రానివాళ్ళు కూడా ఒకటి రెండు పనసల ఘన వల్లించి ,దానితో ఆశీర్వదించటం ఉందని ,ఇది వేదవిదులు వేద ప్రామాణ్య౦ తెలిసినవారు ఆలోచించాలని’’ అన్నారు .
ఆధారం –349,350 వ్యాసాలకు ఆధారం శ్రీ నోరి నరసిఇంహ శాస్త్రిగారు 1963జనవరి ,1967నవంబర్ ‘’భారతి ‘’మాసపత్రికలో చేసిన సమీక్షలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-18-ఉయ్యూరు
,
.