బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల వృత్తాంతాలు ,చిత్రాలలో శిల్పాలలో , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి భక్త జయదేవుని గీత గోవి౦దకావ్యం .ఇందులో ముఖ్యపాత్ర రాధ శ్రీ కృష్ణునికి అత్యంత ఆత్మీయ ప్రేయసి .ఆమెకు కృష్ణుడు తప్ప ఎవరూ అక్కరలేదు .ఆమె కృష్ణుడినే చూసింది, ఆయననే విన్నది .ఆయన గురించిమాత్రమే భజనల్లో మాట్లాడింది .రాధ శ్రీ కృష్ణుని కోసమే ,ఆయనగురించే ఆయనతోనే మాట్లాడింది .ఆమె పై వలపు విసిరినివారెవ్వరినీ లెక్కచేయలేదు .ఆమె మనసా వాచా కర్మణా బృందావన నంద కిశోరునినే వలచింది ప్రేమించింది ఆరాధించింది .ఆమ మనసు, హృదయం నిండా కృష్ణుడే.వేరొకరికి చోటేలేదు .ఆయనమనసులో ,మదిలో కూడా ఆమె యే.గీత గోవిందం పాటలు దేశమంతటా అందరూ గానం చేసి పరవశిస్తారు .భజనలో పాడి తన్మయత్వం పొందుతారు .ఒక్కోసారి ఆ పారవశ్యం లో లోకమే మర్చిపోతారు .జయదేవకవి గీతాలకోలాహలం నిర్బంధం లేని మనోల్లాసం ,ఆత్మ సంతృప్తి కలిగిస్తాయి . .విక్టోరియన్ భావజాలం లో ‘’కామపూరిత శృంగారం’’(ఈరోటిక్) అనుకొన్నా, మనదేశం లో ఈ కావ్యం భక్తిమార్గం లో కేంద్ర బి౦దువైంది . ఇది దేవుడే రాసుకొన్న స్తుతి కావ్యం .ఈ గీతాలు గానం చేస్తూ నృత్యం చేస్తుంటే ఆ గానానికి,లయకూ , నాట్యానికి మాత్రమే కాదు అందులో వర్ణింపబడిన రాదా కృష్ణుల లీలా సాహిత్యానికి కూడా ముగ్దులమౌతాం .
దీనికి అంతటికి అసలు మూలం ఏది ?ఇదంతా జయదేవుని ఊహ ,సృష్టి యా.కానే కాదు .దీనికి వ్యాసమహర్షి రచించిన శ్రీమద్భాగవతం లోనే మూలాలున్నాయి.దశమ స్కంధం లో 29నుంచి 33వరకు ఉన్న అయిదు అధ్యాయాలను ‘’రాస పంచాధ్యాయి ‘’అంటారు .ఇవి శ్రీకృష్ణునికి , బృందావన గోపికలకు మధ్య జరిగిన రాసలీల ను పూర్తిగా తెలియ జేస్తాయి. దీన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకొని అభినందించాలనుకొంటే, ముందు మన మనసులను సరిగ్గా దానికి తగినట్లు ట్యూన్ చేసుకోవాలి .
ఒకసారి వెనక జరిగిన ‘’గోపికా వస్త్రాపహరణ౦ ‘’దగ్గరకు వెడదాం .ఆరేళ్ళు పిన్నడు ఆపనిచేయటం అనైతికం అనిపిస్తుంది .ఆకుర్రాడు ఆరిందాలాగా ఆడవారి వినయం పై ,పెద్దాడిగామాట్లాడుతాడు.దీనిపై అనిబిసెంట్ చాలా చక్కని వివరణ ఇచ్చింది .
‘’గోపికలు ఋషులు .బాలకృష్ణ రూప జగ దుద్దారకుడు, మహాత్ముడు శ్రీ కృష్ణుడు గోపికలకు పాఠం చెబుతున్నాడు .దీని వెనకాల పరమ నిగూఢమైన రహస్యం ఉన్నది .ఆత్మ పరమాత్మను చేరేముందు , కఠిన పరీక్ష ఎదుర్కోవాలి .అప్పటిదాకా బాహ్యంగా తన వెంట ఉన్నవన్నీ ,తనకు ఆధారమైనవన్నీ ఒక్క అంతరంగాన్ని తప్ప అనీ వదిలేయాలి అంటే విసర్జి౦చేయాలి .అంటే తనకు రక్షగా ఉన్న సర్వ విషయాలు ,ఆచ్ఛాదనలు వదిలేసి నిస్సిగ్గుగా ఆత్మనొక్కటే నమ్ముకొని అన్నీ విసర్జించి నగ్నంగా ,వంటరిగా నిలబడాలి .ఈ పరీక్షలో జంకు గొంకులకు తావే లేదు .బయటి సహాయం అపేక్షించకుండా ,దేనిపైనా ఆధారపడకుండా ,చివరికి గురువుపైనా భారం వేయకుండా యేకతా దృష్టిలో ఉండాలి ,వంటరిగా, నగ్నంగా మాత్రమే ఆత్మ పరమాత్మ వైపుకు ప్రయాణ౦చేయాలి .ఇక్కడెవరూ చేయి అందించేవారుండరు .చేయిచ్చినా, చేదుకొన్నాఆ లీలామానుష రూపుడుఒక్కడే .ఈ ఉత్కృష్ట భావాన్ని వ్యాసహర్షి గోపికా వస్త్రాపహరణం లో గోపికా కృష్ణుల నెపం తో అందరికీ ఎరుక కలిగించాడు .
సశేషం
వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలతో –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-18-ఉయ్యూరు