గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4  గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి సంగీత గాయకురాలు .బికాం పాసై ,హిందీలో విశారద అందుకొన్నాడు .తల్లి నుంచి క ర్ణాటక సంగీత అభిరుచికలిగి ,గాయకుడు మహమ్మద్ రఫీ అంటే అభిమానమేర్పడింది .మద్రాస్ లో జెమిని స్టుడియోలో సంగీత శాఖ నిర్వాహకులు ప్రఖ్యాత వీణ విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి గారి మన్నన పొందాడు .నిర్మాత ఎస్ ఎస్ వాసన్ ను హిందీపాటతో మెప్పించి ,1952లో జెమినీవారి హిందీ చిత్రం ‘’మిస్టర్ సంపత్’’లో గీతాదత్ తో పాడి తెరంగేట్రం చేశాడు  .వరుసగా కన్నడ తెలుగు మొదలైన సినిమాలలో అవకాశాలు వచ్చి వేలాది పాటలుపాడాడు .పాడటమే కాదు చక్కని పాటలూ రాశాడు .అగ్రనటులందరికీ పాడినా, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు ఆయన స్వరం చక్కగా సరిపోయేది .అందుకే ఆయనకు 300 కు పైగా పాటలు పాడి అభిమానం సంపాదించాడు

సంస్కృతం లో ఎన్నో స్తోత్రాలు ,భజనలు రచించాడు .మొత్తం 3 వేలపాటలు సంస్కృతం ,తెలుగు ,కన్నడం తమిళం ,హిందీ ,మలయాళం ,తుళు ,కొంకణి భాషలో పాడిన అష్ట భాషా జ్ఞాని .ఆయన జీవిత చరిత్ర ‘మాధుర్య సార్వభౌమ డా.పిబి శ్రీనివాస్ –నాద యోగి ‘’పేరుతొ  వచ్చింది .కర్ణాటక ప్రభుత్వం ఈ పుస్తకానికి’’ బెస్ట్ బుక్ అవార్డ్ ‘’అందించింది .శ్రీనివాస్ లలిత గాన మాధుర్యానికి కర్ణాటక ప్రభుత్వం ‘’కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం’’ ఇచ్చింది .తమిళనాడు ప్రభుత్వం ‘’కలైమణి’’బిరుదాన్నిచ్చింది .రాజకుమార్ కుటుంబీకులు ‘’రాజకుమార్ సౌహార్ద్ర అవార్డ్ ‘’అందించి గౌరవించారు .కన్నడ యూని వర్సిటి ‘’కర్నాటక నాదోజ అవార్డ్ ను ,తమిళనాడు  ఫిలిం ఆనరరి అవార్డ్ ‘’కలైవర్ కూడా అందుకొన్నాడు .పుంభావ సరస్వతి పి.బి.శ్రీనివాస్ 2013 ఏప్రిల్ 14న 82 వ ఏట సరస్వతీ సన్నిధానం చేరాడు .ఇంటిపేరే ‘’ప్రతివాది భయంకర’’ కాని ఆయన స్వరం అత్యంత కోమలం, లలితం  ముఖాన నిలువు బొట్టు, మెడలో కండువా ,శిరస్సున తలపాగా శ్రీనివాస్ ప్రత్యేకత .

ఇంతవరకు నేను రాసినదే .దీనితర్వాత శ్రీకాంత్ జయంతి సాక్షి పత్రికలో 2017సెప్టెంబర్ 17రాసిన ‘’అష్టభాషా కవి పి.బి.’’ను చేర్చాను –

‘అష్ట భాషా కవి నాచన సోముడు అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేరు వేరు భాషలు కావు’’.  సి.నారాయణరెడ్డి ఈ మాటలు అన్నారు. ‘‘మనకు తెలిసిన ఏకైక అష్టభాషా కవి తెలుగువారైన పి.బి.శ్రీనివాస్‌.’’ ఈ మాటలూ సినారెవే.
పి.బి.శ్రీనివాస్‌ ఒక బహుభాషా చలన చిత్ర నేపథ్య గాయకులు మాత్రమే కాదు; అష్టభాషా వేత్త, కవి కూడా! తెలుగువారైన ఆయన తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషలలో ఎన్నో కవితలు రాశారు. పద్య ఛందస్సులో కొత్త కొత్త వృత్తాలను సృష్టించారు. 1960ల ఉత్తరార్థంలో ఆంధ్రప్రభ పత్రికలో ఆయన సృష్టించిన కొత్త వృత్తాల పద్యాలు అచ్చయ్యేవి.
అంతర్లాపి కవితా పద్ధతిని ఆయన ప్రచారంలోకి తెచ్చారు. ఒక కవితలో మొదట్లోనో, మరో చోటో నిలువుగా ఉన్న అక్షరాలను కలిపి చదివితే విడిగా వేరే వాక్యం వస్తుంది. దాన్ని అంతర్లాపి అంటారు. ‘సద్వైద్వ జీవనము’ రాసిన వైద్య కవి లోలంబరాజు అంతర్లాపిలో ప్రసిద్ధుడు. పి.బి.శ్రీనివాస్‌ ఆ పద్ధతిలో ‘దశగీత గీత సందేశం– సంఖ్యాక్షర సందేశ పద్ధతి’ అని ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో వరుసగా 10 గీతాలు ఉంటాయి. వాటిల్లోని ఒక్కో గీతంలోని ఒక్కో వాక్యంతో 11వ గీతం పుడుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన దేవులపల్లి వారు పి.బి.శ్రీనివాస్‌ను ఇంగ్లిష్‌ కవి విలియం బ్లేక్‌తో పోల్చారు.
1979లో శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు అనే అపూర్వ చ్ఛందః ప్రకరణ గ్రంథాన్ని ప్రకటించారు పి.బి. శ్రీనివాస్‌. శ్రీనివాస వృత్తం పాద పాదానికీ 11 యతులతో 116 అక్షరాలతో నడిచేది. శ్రీ గాయత్రీ వృత్తం షడక్షర (కళా) గణాలతో పేర్లకు తగ్గట్టు రూపొందేది. ఛందః ప్రస్తారాల్లో గాయత్రీ ఛందస్సులోని 64 గురు లఘు సంయోగ పద్ధతుల ప్రాతిపదికగా ఈ గాయత్రీ వృత్తం సృష్టించబడింది. పంచతాళ వృత్తం అనే మరో అద్భుతమైన 72 అక్షరాల వృత్తాన్ని కూడా ఆయన సృష్టించారు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల రూపాలనూ, స్వరాలనూ తేలికగా గుర్తుంచుకోవడానికీ, గుర్తుపట్టడానికీ  గణితం అధారంగా ‘డైమన్డ్‌ కీ’ అనే సూత్ర రచన చేశారు.
1978లో కడప ఆకాశవాణి కేంద్రంలో తొలి తెలుగు గజల్‌ వాగ్గేయకారులుగా ‘‘కల్పనలు సన్నాయి పాడే వేళ చింతలు దేనికి?’’ అన్న గజల్‌ రాసి పాడారు. గజలియత్‌ను తెలుగుకు తెచ్చిన కవి ఆయనే. ఎనిమిది భాషలలో గజళ్లు రాసిన ఏకైక కవి. ఉర్దూ, కన్నడ, తమిళ గజళ్లు రికార్డులపై విడుదలయ్యాయి.

చార్‌ దిన్‌ కీ జిందగానీ క్యూం కిసీసే దుష్మనీ

దుష్మనీ చాహేతొ కర్లీ దుష్మనీసే దుష్మనీ

(నాలుగు నాళ్ల జీవితంలో మనకెందుకు శత్రుత్వం శత్రుత్వమే కావాలనుకుంటే చేద్దాం శత్రుత్వంతో శత్రుత్వం)
అన్న ఆయన ఓ గజల్‌ షేర్‌ ఖండాంతరాలకు వ్యాపించింది. 1996లో విశ్వసాహితీ వారు ‘గాయకుడి గేయాలు’ అన్న పి.బి.శ్రీనివాస్‌ గేయాల సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో గజళ్లు కూడా ఉన్నాయి. ‘‘శక్తులలో గొప్ప శక్తి కల్పనా శక్తి/ పంక్తులలో గొప్ప పంక్తి కవితా పంక్తి’’ అన్నారు.
ఆకాశవాణి కేంద్రాల కోసం చాలా లలిత గేయాలు రాసి పాడారు. నవరసాలపై ఒకే రాగంలో రాసిన 9 పాటలు ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ప్రసారమైనాయి. ‘‘పాలవెల్లి నీ పిల్లన గ్రోవి నీల గగనమే నీ మ్రోవి’’ అంటూ ఆ పాటలో చివరి పంక్తులుగా ‘‘ప్రశ్నార్థకమే విధాత రాత, ప్రత్యుత్తరమే భగవద్గీత’’ అని తమ రచనా వైదుష్యాన్ని ప్రదర్శించారు. ‘‘అన్నీ పోతాయి ప్రేమ పోతే’’ అన్నారు ఓ పాటలో. ‘‘బ్రతుకు ప్రేమించడానికి, ప్రేమించు బ్రతకడానికి’’ అని అన్నప్పుడు దాశరథి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు.
1969లో చంద్రుడిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ దిగిన సందర్భంలో ‘మేన్‌ టు మూన్‌’, ‘మూన్‌ టు గాడ్‌’ అనే రెండు పాటలు రాసి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కూ, ఆర్మ్‌స్ట్రాంగ్‌కూ పంపి వారి నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 1970ల ఉత్తరార్థంలో ‘లవ్లీ లవ్‌ సాంగ్స్‌’, ‘వైట్‌ షాడోస్‌’ అన్న రెండు ఇంగ్లిష్‌ కవితా సంకలనాల్ని వెలువరించారు.
1997లో ఆకృతి సంస్థ వారు పి.బి.శ్రీనివాస్‌ అష్టభాషా కవితల సంకలనం ‘ప్రణవం’ విడుదల చేశారు. ఇందులో స్వదస్తూరితో ఆయన రాసిన సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ కవితలు ఉన్నాయి. ఈ సంకలనంలో ఇతర 7 భాషల కవితలకు ఇంగ్లిష్‌లో ప్రతిలేఖనం, అనువాదం ఉన్నాయి. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ప్రయత్నం, ప్రయోగం జరిగి ఉండదు.

ఆయన ఎన్నో తెలుగు, సంస్కృత, హిందీ, కన్నడ స్తోత్రాలను రాశారు. సంగీతా సంస్థ వారు ఆయన రాసిన హిందీ, సంçస్కృత భజనలను ‘భజన్‌ సుధ’పేరుతో క్యాసెట్‌ విడుదల చేశారు. 1963–64లో అప్పటి జ్యోతి పత్రికలో ‘స్వర లహరి’ శీర్షికతో దేశంలోని చలనచిత్ర సంగీత దర్శకులపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. మళ్లీ అదే ప్రయత్నాన్ని 1986లో శివరంజని పత్రిక కోసమూ చేశారు. కర్ణాటక సంగీత వాగ్గేయకారుడిగా ‘నవనీత సుమ సుధ’ అన్న రాగ సృజనా, దానికి సాహిత్య రచనా చేశారు. ‘ఏక స్వరి’ అంటే ఒకే స్వరంతో ఉండే రాగాన్ని రూపొందించి దానికి ‘‘ఆనందం, ఆనందం’’ అంటూ కృతి రాసి శ్రుతి నిచ్చారు. కొన్ని అన్నమాచార్య సంకీర్తనల్ని హిందీలోకి అనువదించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం వారు ఆయన గేయాలు కొన్నిటిని ‘గేయ కవితలు’ పేరుతో ప్రచురించారు.
‘‘ఎన్నో భాషలలో అఖండమైన పాండిత్యాన్ని ఆపోసన పట్టిన రచయిత. సాహిత్యంలో సాము గరిడీలకు ఆయన పెట్టింది పేరు’’ అన్నారు గొల్లపూడి మారుతిరావు. ‘‘ఆయన ఒక విద్యా సాగరం’’ అన్నారు తమిళ కవి వాలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘ (P) పుం (B)భావ (S) సరస్వతి’’ అన్నారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-18-ఉయ్యూరు
.

 

 

 

 

 

,

 గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.