గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4
354-సంస్కృత చలన చిత్రాలు
జివి అయ్యర్ సంస్కృతం లో ఆదిశంకరాచార్య భగవద్గీత చలన చిత్రాలు తీసిన సంగతి మనకు తెలుసు .మరికొన్ని సంస్కృత సినిమాల గురించి తెలుసుకొందాం –
1-ప్రియామానసం -2015లో కేరళలో ప్రియామానసం సంస్కృత సినిమా తీశారు .ఇది బెస్ట్ సాంస్క్రిట్ ఫిలిం అవార్డ్ పొందింది .17 వ శతాబ్దికి చెందిన ఇతి వృత్తాంతం.నల చరితం అట్టకం ప్రదర్శించటం లో ఉనయ్ విన్నాయి అనే కవి పడిన కస్టాల గురించిన కథ .దర్శకుడు వినోద్ మంకారా .సోమతీరం, బేబీ మాధ్యూస్ నిర్మాతలు . వినోద్ మంకారా కథ,డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే రాశాడు .రాజేష్ హెబ్బార్ ,ప్రతిభా కాశి నటీనటులు .సంగీతం శ్రీనివాసన్ మీనన్.
2-ఇష్టి—డా .జి .ప్రభ దర్శకత్వం లో నేదుమూడి వేణు ,అతిరా పటేల్ నటించి ,కైతాపరం దామోదరన్ నంబూద్రి సంగీత దర్శకత్వం లో 2016లో విడుదలైంది .ఇస్టి అంటే యాగం .లోపలి అన్వేషణ అనే భావం తో తీసిన సినిమా .సాంఘిక ఇతి వృత్తం తో సంస్కృతం లో వచ్చిన మొదటి సినిమా. నిర్మాణం ,రచన ,స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా సంస్కృతంలో ప్రొఫెసర్ ,డాక్టరేట్ అయిన ’’ ప్రభ’’ దే.అక్కితం అత్యుతం నంబూద్రి,వి.మధుసూదన్ నాయర్ కు పాటలు రాశారు.
20వ శతాబ్దం మధ్యలో యువ నంబూద్రి బ్రాహ్మణులు ,చాందస బ్రాహ్మణులను స్త్రీల పట్ల చూపుతున్న నిరంకుశ ధోరణి ,ఆడవారి చదువుకు ఆటంకం కలిగించటం మొదలైన సమస్యలపై చాలెంజ్ చేయటం ఇతి వృత్తం కనుక ఇది మొదటి సంస్కృత’’ ఫెమినిస్ట్ ‘’సినిమాగా పేర్కొన్నారు .సమాజం లో వస్తున్న విప్లవాత్మక భావజాలానికి అద్దంపట్టిన సినిమా .
కుటుంబలో పెద్దన్నగారు తమ సమాజం లోని పిల్లనే వివాహం చేసు సుకోవాలి అనే నిబంధన ఉండేది .వయసున్న మొగాళ్ళు ,బాలికలను వివాహం చేసుకోవటం సంప్రదాయం .బహు భార్యాత్వం చెల్లుబాటులో ఉండేది .ఈ సినిమాలో రామవిక్రమన్ న౦ బూద్రి ముగ్గురు పెళ్ళాల ముద్దుమొగుడు .మూడో పెళ్ళాం వయసు అతని కూతురి వయసే ఉంటుంది .ఇతని 26 ఏళ్ళకొడుకు రామన్ నంబూద్రి మంత్రాలు వల్లిస్తాడు కాని చదువు రానివాడు .కధకళి కాస్టూమ్స్ తయారు చేస్తూ కాలం గడుపుతాడు .రామవిక్రమ ఒక నాయర్ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉంటాడు .మూడవభార్య శ్రీదేవి విద్యావంతురాలు .ఆమె కుటుంబం లో అందరు చదువు కోవాలని ఒత్తిడి తెస్తుంది .ఆమె రామన్ ను చదువుకోమని హితవు చెబుతుంది . దీన్ని అక్రమ సంబంధంగా మిగిలినవారు చిత్రీకరించగా కుటుంబ కలహాలేర్పడి శ్రీదేవి ని పెద్దలమధ్య దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు .భర్త కూడా వంతపాడటం ఆమెను ఆశ్చర్య పరుస్తుంది .తనకు స్త్రీలకూ జరుగుతున్నా అన్యాయాన్ని పెద్దలముందు శ్రీ దేవి ప్రశ్నిస్తుంది .న్యాయ నిర్ణయం రాకముందే ఆమె చీకటిలో కలిసిపోతుంది .భర్త రామ వికరన్ నంబూద్రి అప్పటిదాకా పోషిస్తున్న అగ్ని హోత్రమూ దూరమై పోతుంది.
3-సూర్య కాంత –సమకాలీన సంస్కృత సినిమా సూర్య కాంత .ఎం .సురెంద్రన్ డైరెక్టర్ .2017విడుదల .సంస్కృతం లో వచ్చిన అయిదవ సినిమా .సమకాలీన సమస్యలపై వచ్చిన మొదటి సంస్కృత సినిమాకూడా ఇదే .వృద్ధాప్యం లో జీవిత చరమాంకం లో ఉన్న ముసలి దంపతులు గడిపిన జీవితం కథ కు మూలం .ఇందులో సామాన్య ప్రజలు కూడా సంస్కృతం లో మాట్లాడటం ఈ సినిమా ప్రత్యేకత .రమేష్ నారాయణ్ సంగీతం ,రాజేష్ హెబ్బార్ నటుడు .
4-అనురక్తి –పి.కె.అశోకన్నిర్మాణ దర్శకత్వం లో సంస్కృత పాటతో 2017లో విడుదలైన మొదటి సంస్కృత చిత్రం .కూడియాట్టం పై వచ్చిన సినిమా .ఇందులోని సంస్కృత గీతాన్ని 3డిలో చిత్రీకరించారు .కనుక 3డిలో సంస్కృతం లో వచ్చిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది .జయ చెరువాతూర్ సంగీత దర్శకత్వం లో , కాలమండలం శివన్ నంబూద్రి నటనతో వచ్చిన చిత్రం .
5-పుణ్యకోటి-2018లో విడుదలైన మొదటి సంస్కృత యానిమేషన్ చిత్రం పుణ్యకోటి.దర్శకుడు వి.రవి శంకర్ .రవి శంకర్ స్వయంగా రాసిన చిత్ర కథాపుస్తకమాదారంగా తీశాడు .కర్నాటకకు చెందినజానపద కధలలో ఒక ఆవు చెప్పే సత్యాలే ఇందులో వస్తువు .మనిషికి ,జంతువుకు మధ్య ఉన్న తేడాలను వివరిస్తుంది .నిజాయితీ, సామరస్యం మానవ మనుగడకు ఆధారం అనే నీతి బోధించే చిత్రం .కావేరి నది ఒడ్డున కారునాడు గ్రామం లో చిత్రీకరించారు .పద్మ పురాణం 18వ అధ్యాయం శిష్టి కాండ పై ఉన్న జానపద గీతమే ఈసినిమాకు ఆధారం .లయరాజా ఇలయ రాజా సంగీత దర్శకత్వం లో రవి శంకర్ దర్శకత్వం లో 2018లో విడుదలైన సినిమా ..
సంస్కృత చలన చిత్రాలకు జివి అయ్యర్ జీవం పోస్తే ,కేరళ వారు పెంచి పోషించి వైవిధ్యభరిత చిత్రాలు తీసి సమకాలీనతపాటించి యానిమేషన్ లోనూ ముందడుగు వేయటం ఆదర్శం స్పూర్తి దాయక౦ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-18-ఉయ్యూరు
—