దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

 

image.png

 నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు  దాసు శ్రీరాములు గారు – పరిచయము
– నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ 

అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన యశస్సు గాంచిన కొక్కొండ వేంకటరత్నం పంతులు, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, గోపీనాధం వేంకటకవి, వసురాయకవి (వడ్డాది సుబ్బారాయడు) మున్నగు వారి శతాబ్దజయంతులు జరుగనే లేదు. ఆ మహాకవి పండితుల కోవలోని వారే దాసు శ్రీరామ కవీంద్రులు.

ఆధునిక వాఙ్మయ చరిత్రలో శ్రీరాములుగారి కింకొక విశిష్టత గలదు. లౌకిక వృత్తిచే న్యాయవాదులయ్యు సాహిత్య ప్రపంచమున స్థిరకీర్తి నార్జించిన వారాకాలమున గలరు. ఆంధ్రనాటక పితామహ ధర్మవరము రామకృష్ణమాచార్యులు, ప్రథమ చారిత్రక నాటకకర్త కోలాచలము శ్రీనివాసరావుగార్లు న్యాయవాదులే. న్యాయవాది పట్టము బడసి ప్రభుత్వోన్నతోద్యోగులైన – భాషా ప్రపంచమున కసమానమగు సేవ గావించిన శ్రీ జయంతి రామయ్య పంతులుగారును స్మరణీయులు. ఈ దృష్టితోఁజూచిన శ్రీరాములుగారికి నవ్యయుగమున నున్నత స్థానము గలదు.

సంస్కృతాంధ్ర భాషలలో కవిపండితులగుటయేగాక, శాస్త్ర విద్వాంసులగుటయు, శ్రీరాములుగారి యింకొక విశిష్టత – వారి సమకాలికులలో కొక్కొండ వారి తరువాత, కవిపండితులలో శాస్త్ర విద్వత్తుగలవారు శ్రీరాములుగారొక్కరే – వారికి ధర్మశాస్త్రము, భరతశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము మొదలగు శాస్త్రములందు మంచి ప్రావీణ్యము గలదు.

1901వ సంవత్సరమున (ప్లవ) నధికమాస నిర్ణయమును గూర్చి తెలుగుదేశమున జెడ్డ వివాదము చెలరేగినది. ప్రఖ్యాత పంచాంగ కర్తలైన పిడపర్తివారు అధికమాసము వచ్చునని వాదింపగా, రాణి మహాగ్ని చిన్న నరసింహ విద్వాంసులు (వీరే రాణీచయనులు గారని పేరుపొందినవారు) రాదని వాదించిరి. రాజమహేంద్రవరములో జరిగిన యీ నిర్ణయ సభకు, ఆంధ్రదేశమున జ్యోతిష్కులందరునూ వచ్చిరి. ఆ మహాసభకు శ్రీరాములుగారే అధ్యక్షులై అధిక మాసము వచ్చునని తీర్పు చెప్పిరి. సభవారు వారి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యమున కాశ్చర్యచకితులైరి.

సమకాలిక సాహిత్య ప్రక్రియల యందన్నింటనూ శ్రీరాములు గారు సిద్ధహస్తులు.

 1. పురాణ ప్రక్రియ: వీరికి ముందు ములుగు పాపయారాధ్యుల వారును, త్రిపురాన తమ్మయ్య దొరగారును దేవీభాగవతమును రచించిరి. కాని దాసువారి ఆంధ్రీకరణము తోడనే దానికి వ్యాప్తి కలిగినది. శ్రీరాములుగారి కృతి తరువాతనే పురాణ రచన తిరిగి ప్రారంభమైనది. జనమంచి శేషాద్రిశర్మగారి బ్రహ్మాండ పురాణము, ములుగు చంద్రమౌళిశాస్త్రిగారి లింగ కూర్మ పురాణములు వెలసినవి.
 2. శతక ప్రక్రియ: ఈ ప్రక్రియలో వీరితరులకన్నా నాలుగు విధములుగా ప్రత్యేకత చూపిరి.
  1. సంస్కృత భాషలోనే శతకము రచించుట – కామాక్షీ శతకము.
  2. సంస్కృత శతకానువాదము చేయట – సూర్య శతకము; సంస్కృతమున మయూర మహాకవి రచించిన సూర్యశతకము మహా ప్రౌఢకృతి. శ్రీనాధుడు కొన్ని శ్లోకములకు పద్యములు రచించినాడు. కాని శ్రీరాములుగారు పూర్తిగా దీనిననువదించినారు. ఇది విశేషముగా నభినందింపదగినది. దీని ముద్రిత ప్రతి గౌతమీ గ్రంథాలయము (రాజమండ్రి)న గలదు.
  3. తెలుగు శతక రచనము: సోమలింగ శతకము, చిలుకల కొలికి శతకము, ముద్దులగుమ్మ శతకము.
  4. అచ్చతెలుగు శతకరచన: చక్కట్లదండ. వీరి దేవీభాగవతమున రెండు శతకములు సందర్భానుసారముగ గలవు.
 3. నాటక ప్రక్రియ: ఇందునూ త్రివిధములుగా వీరు ప్రత్యేకతను ప్రదర్శించిరి.
   1. అనువాదములు: శ్రీరాములుగారి సమకాలికముగా సంస్కృత నాటకానువాదములు చేయుట పరిపాటియైనది. వీరు, రామభద్ర దీక్షితుని జానకీ పరిణయమునూ, భవభూతి మాలతీ మాధవము, మహావీర చరిత్రలనూ ఆంధ్రీకరించిరి. వీనిలో మాలతీ మాధవము “సరస్వతి” అను పత్రికలోను, మహావీర చరిత్ర “మంజువాణి” అను పత్రికలోనూ ప్రకటితములైనవి. ఇంకనూ ముద్రారాక్షస, మృచ్ఛకటిక, రత్నావళి, మంజరీ మధుకరీయము మున్నగువానిని తెనిగించినట్లు తెలియుచున్నది.
   2. స్వతంత్ర నాటక రచనము: మహాలక్ష్మీ విలాసము, సీతా కళ్యాణము.

  1. అచ్చతెనుగు రచన: శాకుంతల నాటకాంధ్రీకరణము అచ్చ తెనుగున నాటకము రచించినవారు శ్రీరాములు తక్క వేఱెవ్వరు లేరు.1
 4. ఖండ కావ్య ప్రక్రియ: అధునాతన ఖండ కావ్య ప్రక్రియకు నొకవిధముగా ఆద్యులువీరే.

  వీరి ‘తెలుగునాడు’ అను ఆంధ్రవీధి స్వతంత్రమగు సాంఘిక కావ్యము. 14వ శతాబ్దిని క్రీడాభిరామము వెనుక వెలసిన సాంఘిక వ్యవస్థను నిరూపించు కృతియిదే. క్రీడాభిరామములో చరిత్ర, సాంఘిక ప్రవృత్తులు రెండూ కలసియున్నవి. తెలుఁగునాడులో నితివృత్తము కేవలము సాంఘికము – దాసువారి కృతులలో హెచ్చు ప్రచారము బడసినది తెలుఁగునాడే.

  ఈ నవయుగములో సాంఘికేతివృత్త రచనకిదియే మొదలు. దీని తరువాత ప్రసిద్ధమైనది భోగరాజు నారాయణమూర్తిగారి పండుగ కట్నము.

 5. వచనప్రక్రియ: ఆ కాలమున గ్రాంథికవచన రచన చేయుట వ్యాప్తిలో నుండెను. శ్రీరాములు గారి “అభినవ గద్యప్రబంధము” చిన్నయసూరి గ్రాంథికశైలిలో రచితమైనది.
 6. శాస్త్ర గ్రంధములు: తెలుగులో శాస్త్ర గ్రంథరచన శ్రీరాములుగారి కాలమున ప్రారంభదశలో నుండెను. వారు తమ అభినవ కౌముది, తర్క కౌముది, వైశ్యధర్మ ప్రదీపిక, సారసీలగ్రహ గణితము (గణిత శాస్త్రము), అభినయ దర్పణము (నాట్య శాస్త్రము) మున్నగు రచనలచే నీ గ్రంథరచనకు నెంతో దోహదము గావించిరి.
 7. పద కవిత్వము: శ్రీరాములగారు పద్యకవిత్వ మందెంత ప్రవీణులో, పదకవిత్వ రచనము నందంత దిట్టలు. వీరు పదములనేగాక జావళీలను విశేషముగా రచించినారు. వీరు సంగీత నాట్యనాటక శాఖలకు చేసిన సేవ గుర్తించి సంగీత నాటక అకాడమీవారు నాట్యకళలో వీరిని గూర్చి రాసినారు.

ఇట్లు సప్తవిధ సాహిత్య ప్రక్రియలను సాధించుటయేగాక, వారి కవితా రచన యందు స్వతంత్రత వహించిరి. కవుల పోకడలను జీర్ణించుకుని, లక్ష్యలక్షణ వివేచనతో కవితారచన సాగించుట వీరి కావ్యములో ముఖ్య లక్షణము. 1. రేఫఱకారముల ప్రాసలో నుపయోగింపకూడదు. 2. పూర్వకవికృత పదజాలమునే వాడవలెను. 3. పూర్వకవి భావముల ననుసరింపవలెను అన్న లాక్షణిక నియమముల నన్నింటిని వీరి చర్చించి స్వతంత్రము, సజీవము, జాతీయమునైన రచనా రీతిని తమ గ్రంథములలో సుప్రతిష్ఠితము చేసినారు. పై విషయములు వారు దేవీ భాగవత పీఠికలో చర్చించినారు.

వారి కాలమున శబ్దరత్నాకరము కవులకు ప్రధానగ్రంథముగా నుండెడిది. వసురాయకవిగారి ప్రక్కనెప్పుడు శబ్దరత్నాకరముండెడిది. కవి పండితులలో, అందలి పదములనే తప్ప వాడకూడదని అభిప్రాయము బలీయమై యుండెడిది. శ్రీరాములు గారు స్వతంత్రించి ఇస్త్రి, రుమాలు, లింగకాయ మున్నగు వ్యావహారిక పదములను ప్రయోగించి వానికి గ్రాంథికతావస్థ చేకూర్చినారు.

“కవియే భాషానుశాసకుఁడు
కవి ప్రయోగ మూలము వ్యాకరణము”
అని వీరి సిద్ధాంతము.

అద్యతన కాలమున స్వాభావిక వర్ణనలకు వీరిది పెట్టిన పేరు. దేవీ భాగవతమునందు “అల్లూరి పల్లెటూరి వర్ణన” ఆంధ్రకావ్యవర్ణనలో ననుకరణీయమైది. ఆ వర్ణన ననుసరించి నేను పల్లెవర్ణన గావించితిని. (చూ. మించుపల్లి)

వీరు స్వతంత్రులు, మహాకవులు గావున వీరి గ్రంథములను సావధానముగా నధ్యయనము చేసిన మనకు నేడు, నిఘంటువుల కెక్కని పదములు, పలుకుబళ్ళు, కవితా సంప్రదాయములు నవేలముగా లభింపగలవు.

ప్రాచీన భావ సమన్వయము

సాహిత్యమున కొక్కొండ వారివలెనే శ్రీరాములుగారు సంఘమున ప్రాచీన సంప్రదాయములను, నవ్య సంస్కారముతో సమన్వయము చేసిన వారు. పాశ్చాత్య నాగరికతా సంస్కార విశేషములను గ్రహించి వానిని, మన ప్రాచ్యసంప్రదాయ సారముగా సమన్వయించి దేశ పురోభివృద్ధికి తోడ్పడినారు.

ఆధునిక సాహిత్య యుగ ప్రక్రియలన్నింటియందు బహుముఖ ప్రజ్ఞతో తమ ప్రత్యేక గరిష్ఠ స్థానమును ప్రతిష్టించినవారు శ్రీరాములుగారే.

చెళ్ళపిళ్ళ వారన్నట్లు, శ్రీరాములుగారు సరసకవి, విద్వత్కవి, స్వతంత్ర కవి, ఆశుకవి, దాత, నేత.

రచనలు

వారు 33 గ్రంధములు రచించినట్లు భాగవతావతారికలో చెప్పుకొన్నారు. ఆ గ్రంథములు ముద్రితములైనను, నేడు లభ్యమగుట లేదు.

దిగవల్లి వేంకటశివరావుగారు చెప్పినట్లు వారిజీవితము, ఉదార భావములు, వారి సంతతి వారికే గాక ఆంధ్రులందరికి మేలుబంతులు.

సూచనలు

 1. శ్రీరాములుగారి జీవితచరిత్రను వారి కుమారులు విష్ణురావుగారు 700 అరటావు పుటలలో వ్రాసినారు. అది ముద్రితమగుట అత్యావశ్యకము. ఈనాడు మనకు నవ్యయుగ సాహిత్య చరిత్ర లేదు. అట్టి గ్రంథములు బయలు వెడలిన – పై చరిత్రకెంతో ఉపయోగము.
 2. వారి గ్రంథములన్నింటిని సేకరించి, ఒక కేంద్రమున హైదరాబాదు నందుంచుట. అప్పుడు ప్రత్యేకముగా సాహిత్యోపాసకులు కొందఱు వారి గ్రంథములామూలాగ్రముగా చదివి సమీక్షలు ప్రకటించి, వారి ప్రతిభ లోకమునకు వెల్లడించుట కవకాశము కలుగును.
 3. విశ్వవిద్యాలయములలో పరిశోధన: ఈనాడు విశ్వవిద్యాలయములలో నవీన యుగమున మహాకవులను గూర్చి పరిశోధన జరిపి సిద్ధాంత వ్యాసములను( Thesis ) రచించి పట్టములు ( Ph.D. ) పొందుచున్నారు.

దాసు శ్రీరామ మహాకవి ఆయన రచనలు అను విషయముపై విశ్వవిద్యాలయములలో పరిశోధన చేయించెదరని భావించున్నాను. శ్రీరాములుగారి వలెనే కొక్కొండ, మండపాక, గోపీనాధ వారలను గూర్చి విశ్వవిద్యాలయములలో పరిశోధన జరుగవలెను.

ఆరువేల పద్య సంఖ్యను పైఁబడిన దేవీభాగవతము నాఱునెలలలో, తనవృత్తి ధర్మమును నిర్వహించుచు, సంపూర్ణము చేసిన శ్రీరాములు గారి ప్రతిభ అనితర సాధారణము.(నియోగిసర్వస్వము – 75,76)

వారు వ్రాయునపుడు బాతు కలము నుపయోగించెడి వారని, ఆంధ్రపత్రిక 1916 సంవత్సరాది సంచికలో వారి ఛాయాచిత్రమునఁ గలదు. అందు వారు లౌక్యవృత్తి వేషముతోఁగాక – గృహస్తు వేషముతో నున్నారు. వారి కుమార్తె, కవయిత్రి శారదాంబగారు కూడ అందుఁగలరు. ఇట్టి ఛాయాచిత్రములను సేకరించవలెను.

ఆంధ్ర మహాజనులు, శ్రీరాములుగారి గ్రంథములు పునర్ముద్రించుటకే గాక, పై సూచనలను ఆచరణలో పెట్టి అవి పూర్తి యగుటకు తోడ్పడుదురుగాక అని విన్నవించుచున్నాను.

దాసు శ్రీరాములు గారి “తెలుఁగునాడు”
గ్రంథ రెండవ ముద్రణ పీఠిక నుంచి ఉద్ధృతము.

రచన -శ్రీ నిడద వోలు వెంకట రావు


image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.