గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -1
సారస్వత నికేతన్ స్థాపన ,ఉద్దేశ్యం ,అభివృద్ధి
ప్రకాశం జిల్లా వేటపాలెం లోని ‘’సారస్వత నికేతన్ ‘’గ్రంథాలయం కు వందేళ్ళ చరిత్ర ఉంది ,బాల సాహిత్య బ్రహ్మ ,మధుర కవి ,తెలుగు వైతాళికుడు ,సంఘ సంస్కర్త ,రాజమండ్రి ‘’గౌతమీ గ్రంథాలయ’’ స్థాపకులు,’’ మానవ సేవ’’ పత్రిక సంపాదకులు ,స్వాతంత్ర్య సమరయోధులు ,భాషా వేత్త కీ.శే .శ్రీ నాళ౦ కృష్ణా రావు గారి బంధువు శ్రీ ఊటుకూరి వెంకట.శ్రేష్టి గారు 15-10-1918 న ప్రజలలో సాహిత్యం ,నైతికత ,శీల సంపద ,దేశభక్తి,మానవత్వం ,దాతృత్వం ,భక్తీ మొదలైన మానవ విలువలు వ్యాప్తి చెంది౦చటానికి ఈ గ్రంథాలయాన్ని స్వంత ఖర్చులతో స్థాపించారు . బహుశా నాళం వారి ప్రభావం శ్రేష్టి గారిపై మిక్కుటం అని పిస్తుంది .కావలసిన సామగ్రి అందించి,రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి ,తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం, ఇంగ్లిష్ ,హిందీ భాషలను ప్రోత్సహించటానికి తగిన గ్రంథాలను సమకూర్చారు .సాధారణ పాఠకులకోసం ,మహిళల కొరకు వార్తాపత్రికలు, మేగజైన్లు తెప్పించారు సంచార గ్రంధాలయాలు నడిపారు . తరువాత దీన్ని అభివృద్ధి చేసినవారు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాస రావు పంతులుగారు .
ప్రముఖుల సందర్శన
.1929లో జాతిపిత మహాత్మా గాంధీ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు .1935లో గాంధీజీ రెండో సారి రావటం చిరస్మరణీయం .
1935లో భారత తొలి రాష్ట్ర పతి శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ సరస్వతీ నిలయాన్ని సందర్శించారు.భవనాల ప్రారంభోత్సవం సేఠ్ జమ్నాలాల్ బజాజ్ ,ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గార్లు చేశారు.దీన్ని సందర్శించిన ప్రముఖులలో శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం ,కాశీనాథుని నాగేశ్వరరావు .కట్టమంచి రామ లింగారెడ్డి ,పాతూరి నాగభూషణం గారు మొదలైన ప్రముఖులున్నారు .
విద్యా విజ్ఞాన వినోద వికాసాభి వృద్ధి
ఈ గ్రంథాలయ నిర్వాహకులు పేద విద్యార్దులకోసం ఉచిత పాఠశాల నడిపారు .నిరక్షరాస్యులకోసం పుస్తకాలు పేపర్లు చదివి వినిపించి విషయాలు తెలుసుకొనే ఏర్పాటు కూడా చేశారు .ఆరు బయట ఉన్న స్థలం లో పెద్దలను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు .ఆనాడు అందుబాటులో ఉన్న’’ మాజిక్ లాంతరు ‘’నుపయోగించి స్లైడ్స్ ప్రదర్శించి పారిశుద్ధ్యం ,ట్రాఫిక్ రూల్స్ ,మొదలైన సమాజ విషయాలను తెలియేసేవారు .పుస్తకాలవరకూ మాత్రమె లైబ్రరీ కాదు , సమాజ అవసరాలకూ అది తోడ్పదాలన్న శ్రేష్టి గారి ‘’శ్రేష్టమైన’’ ఆలోచనకు గోపురమే ఈ సారస్వత నికేతనం .ఏ శుభ ముహూర్తం లోప్రారంభమై౦దో,ఏ శుభ దేవతలు ఆశీస్సు లంది౦చారో కాని, అవిచ్చిన్నంగా వారి ఆశయాలకు అనుగుణంగా ,నడుస్తూ తనను తానూ తీర్చి దిద్దుకొంటూ సమాజాన్నీ అన్ని కోణాల్లోనూ ఆదుకొంటోంది .స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు లాభాపేక్ష లేని ప్రైవేట్ యాజమాన్యం లో నడవటం విశేషం . ఇందులో పని చేసిన గ్రంథాలయ అధికారులు ,వర్కర్లు కూడా స్వచ్చందంగా సేవ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు .వారికిది సరస్వతీ దేవాలయమే .మనకు కావలసిన పుస్తకం సుమారు లక్ష దాకా పుస్తకాలలో ఏ బీరువాలో ఎన్నో నంబర్ లో దొరుకు తుందో చెప్పగలిగిన సుదీర్ఘ కాలం పని చేసిన లైబ్రేరియన్ ఉన్నారంటే ,యెంత అంకిత భావం తో ఇక్కడ సేవ చేస్తున్నారో అర్ధమౌతుంది . ఆనాటి యువజనులు ‘’హిందూ యువజన సంఘం ‘’పేరిట సంస్థ స్థాపించి ,కార్యకలాపాలను ఇక్కడే నిర్వహించేవారు .లైబ్రరీకి అండ దండలు గా ఉండేవారు .ఈ ప్రాంతపు సారస్వత తృష్ణ తీర్చి కర్తవ్య పరాయణులను చేస్తోంది వేటపాలెం సారస్వత నికేతన్ .ఇన్ని విధాల సేవలు ఈ గ్రంథాలయం అందించి సమాజానికి దగ్గరై,సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించి విద్యా విజ్ఞాన వికాస కేంద్రంగా భాసించి ఆదర్శ ప్రాయమైనది .
ప్రత్యేకతలు
మనకు కావాల్సిన తెలుగు పుస్తకం ఏ లైబ్రరీలోనూ దొరకకపోతే అది తప్పకుండా వేటపాలెం గ్రంధాలయం లో దొరుకు తుంది అనే నమ్మకం నిలబెట్టు కొని తన ప్రత్యేకత చాటుకుంది .మనకున్న అతి ప్రాచీన గ్రంథాలయాలలో దీని తర్వాత చెప్పుకో తగింది కడపలోని బ్రౌన్ లైబ్రరీ .ఏ నాటి వార్తాపత్రికైనా మేగజైన్ అయినా ఇక్కడ లభ్యమౌతుంది .వాటిని అతి భద్రంగా జాగ్రత్త చేసి సంరక్షిస్తున్నారు .పరిశోధకుల పాలిటి కొంగుబంగారం గా వర్ధిల్లు తోంది. అమెరికా ,జపాన్ ,ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి ,భారత దేశం లో అన్ని ప్రాంతాలనుండి పరిశోధకులు ‘’పుస్తకాల వేట’’లో వేటపాలెం వచ్చి గ్రంథాలయ భవనాలలో బస చేసి ,సౌకర్యాలను విని యోగించుకొని తమ ప్రాజెక్ట్ లను నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని సఫల మనోరధు లౌతున్నారు .కొన్ని వేలమంది ఇక్కడ పరిశోధనలకోసం వచ్చారు .
వివిధ కార్యక్రమాల వేదిక –సాహితీ మూర్తుల స్పందన
మొదట పెంకు టి౦ట్లో ప్రారంభమై ,నేడు కాంక్రీటు రెండు అంతస్ధుల భవనాలలో విరాజిల్లు తోంది ఇక్కడి’’ సారస్వత సరస్వతి ‘’..ఇక్కడే 1942లో గుంటూరు జిల్లా గ్రంథాలయాధికారుల సభ అంతర్జాతీయ సహకార ఉద్యమ సభ ,దక్షిణభారత యువత విద్యాసదస్సు జరిగాయి .1950లో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ‘’జర్నలిజం తరగతులకు ‘’ప్రధాన ఆచార్యులుగా వ్యవహరించారు .శ్రీ తల్లావఝల శివ శంకర శాస్త్రి శ్రీ తల్లావఝల కృత్తివాస తీర్ధులు ,మహాకవి శ్రీ బండ్ల సుబ్రహ్మణ్యం ,శ్రీ మాచి రాజు దేవీ ప్రసాద్ ,శ్రీ నేలనూతుల కృష్ణమూర్తి ,శ్రీ బూదరాజు రాధా కృష్ణ వంటి రచయితలూ ఈ సరస్వతీ ప్రాంగణం గురించి విపులంగా రాశారు .వేట పాలెం నివాసి ,ఆర్ధిక -గణాంక శాస్త్ర నిపుణులు దేశ విదేశాలలో అత్యున్నత పదవులనలంకరించి రిటైరయిన సాహితీ వేత్త శ్రీ బందా లక్ష్మీ నరసింహారావు ‘’సారస్వత నికేతన్ ‘’చరిత్రను రచించి శాశ్వతం చేస్తున్నారు .
‘’వేట పాలెము తెలుగుల పేర్మి ధనము –నిత్య పరిశోధనకాంచి తౌన్నత్య గృహము’’అని శ్రీ గుండు మధుసూదన్ ,’’వేట వలదోయి ,గ్రంథాలు వేలకొలది –ఒక్క చోటనే దొరకును నిక్కముగను ‘’అని శ్రీమతి నేదునూరి రాజేశ్వరి ,’’జ్ఞాన దాహపరుల దాహార్తి దీర్చు చెలమ ‘’ అని మరోకకవి ఈ గ్రంధాలయాన్ని కవిత్వం తో ప్రస్తుతించారు .
సందర్శనాభి లాష
ఇంతటి ఘన చరిత్ర ఉన్న సరస్వతీ మహల్ ను దర్శించాలని సారస్వతాభిమానులకందరికీ ఉ౦డటం సహజం .దాని శత వసంత వేడుకలలో పాల్గొనటం అదృష్టం .కాని అప్పటిదాకా ఆగటం ఎందుకు ?2018 లోనే సందర్శించి ,అక్కడ సభ జరిపి దాని ఉన్నతికి కృషి చేసిన వారిని సంస్మరించి ,సేవ చేస్తున్న వారిని సత్కరించి ‘’ మనం ముందు౦దా౦ ‘’అనే ‘’నావెల్ థాట్ ‘’ఆంద్ర ప్రదేశ్ రచయితల సఘం కార్యదర్శి రమ్యభారతి సంపాదకుడు ,కవి కధకుడు విమర్శకుడు ,అనుక్షణ సాహిత్యోప జీవి శ్రీ చలపాక ప్రకాష్ కు రావటం ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు,కవి రచయిత సోమేపల్లి పురస్కారస్థాపకులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి చెప్పటం వారు ఆమోదించటం ,వీలైనంత మంది కవులు రచయితలూ పాల్గోనేట్లు ప్రణాళిక సిద్ధం చేసి ,అక్కడ వేటపాలెం లోని నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి ,ఏర్పాట్లు చేయించి ,అందరినీ అందరికీ అనుకూలమైన ఈ 30-12-18 ఆదివారం యాత్రలో పాల్గోనేట్లు అవిరళ కృషి చేసి సందర్శన యాత్ర కు ఘన విజయం చేకూర్చి ,ఈ సరస్వతీ యాత్రాఫలాన్ని సాహిత్యాభి మానులకు అందజేసిన శ్రీ చలపాక కృషికి హాట్స్ ఆఫ్ .
శ్రీ చలపాక కృషి ఫలించి ,మాధ్యమాలలో, వాట్సాప్ వార్తలలో చూసి రచయితలకూ స్పందనకలిగి చూడాలని ,పాల్గొనాలని ఉత్సాహం గా సందర్శన యాత్రలో ఎవరి ఖర్చు వారు భరించి స్వచ్చందంగా భాగ స్వాములయ్యారు . .బొంబాయి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘’య౦గ్ అండ్ ఎనర్జేటిక్’ విలేకరి కుమారి’’ రితిక ‘’మాతో పాల్గొనటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది , ప్రకాష్ కే ఆశ్చర్యమేసింది .విజయవాడ విలేకరి శ్రీ ప్రశాంత్ కెమెరామన్ గా ,విషయ వివరణకు సహాయకునిగా ఆమెకు తోడ్పడ్డారు .అలాగే చెన్నై, విశాఖ లనుంచి ,ప్రకాశం నెల్లూరు ,గుంటూరు జిల్లాలనుంచి పాల్గొన్నారు .చలపాక అధ్వర్యం లో విజయవాడ నుంచి ఆయనా ,ఆయన అర్ధాంగి, తమ్ముడి కుమారుడు ,నేనూ, ప్రముఖ కవి కధకులు విమర్శకులు శ్రీ సి హెచ్ , వి .బృందావనరావు ,రిటైర్డ్ లెక్చరర్ కవి శ్రీ చెన్నకేశవ ,శారదా విపంచి అధ్యక్షురాలు శ్రీమతి కోనేరు కల్పన,కవయిత్రి శ్రీమతి సింహాద్రి వాణి , దుగ్గిరాలనుండి కవి శ్రీ మరో చలం మొదలైన వాళ్ళం 13 మంది ఉన్నాం . మొత్తం మీద వేట పాలెం సందర్శన యాత్రలో సుమారు 50 మంది సాహితీ కారులు ఉండటం విశేషమే ,యాత్రా విశేషాలు వేటపాలెం సభా విషయాలు, అక్కడి అనాధ వృద్ధాశ్రమ౦ సంగతులు వివరంగా మరో వ్యాసం లో తెలియ జేస్తాను .
. సశేషం
2019 నూతన సంవత్సర శుభాకాంక్షలతో –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2019-ఉయ్యూరు