గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

విజయవాడ నుంచి వేటపాలెం

30వ తేదీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకే లేచి ,స్నానం సంధ్యావందనం ,పూజా ముగించుకొని 5-45 కు ఉయ్యూరు సెంటర్ కి వెళ్లి 6-10కి బెజవాడ రైల్వే  స్టేషన్ కు వెళ్ళే 222 సిటీ బస్ ఎక్కి ఉదయం 7-20కి స్టేషన్ చేరా .అక్కడే ఉన్న కాంటీన్ లో ప్లేట్ వడ 35 రూపాయలకు కొని, తిందామని ప్రయత్నిస్తే, ఏదో మాదిరిగా ఉంటె, అందులో పది రూపాయల విలువగల సరుకు కూడా తినకుండా ప్లేట్ వదిలేసి ,బిపి టాబ్లెట్ వేసుకొని 19 రూపాయల తో కాఫీ తీసుకొన్నా .నా అదృష్టం బాగుండి .కాఫీ చాలా బాగా రుచిగా ఉంది .తాగి ,చలపాక ప్రకాష్ వాళ్ళు అప్పటికే స్టేషన్ కు చేరారని తెలుసుకొని ,ఉదయం 8 కు బయల్దేరే రాజమండ్రి -ఒంగోలు  ఫాస్ట్ పాసెంజర్ కు నా టికెట్ 25 రూపాయలకు కొనుక్కొని 6వ నంబర్ ప్లాట్ ఫాం చేరగా, ప్రకాష్ నాదగ్గరకు రాగా, అందరం ఒక చోటికి చేరాం .కుమారి రితిక ,ప్రశాంత్ లు కూడా అక్కడే ఉన్నారు .ప్రకాష్ అందరికీ టీ ఇప్పించారు .తాగాలని లేకపోయినా ప్రయత్నించా .’’నీళ్ళ తేనీరు’’కాస్త కాటికి మిగతాది పారపోశా . సుమారు గంట ఆలస్యంగా 8-50 గంటలకు పాసెంజర్ వస్తే ,బాగా రష్ గా ఉంటె ,ప్రకాష్ ముందు దూరి ,మా అందరికీ సీట్ లు ఏర్పాటు చేశారు .అందరం ఎలాగో అలా సర్దుకు కూర్చున్నాం .మాతోపాటు బృందావనరావు గారు కల్పన,వాణి ,చెన్నకేశవ గార్లు మొదలైన వారం అందరం కలిసి బయల్దేరాం .దుగ్గిరాలలో మరో చలం గారు ఎక్కారు .

మంచి టీం ఆర్గనైజర్ అయిన ప్రకాష్ అందరికి తలొక రెండు బొబ్బట్లు ఆర్డర్ ఇచ్చి ,బెజవాడలోనే చేయించి ,ప్లేట్ లలో పెట్టి మా అందరికీ ఇప్పించారు .ఇంకా కావాలా అని కొసిరి అడిగారు .చాలాబాగా రుచికురంగా ఉన్నాయి బొబ్బట్లు .’’కేక ‘’అనిపించాయి .సీసాలతో  వెంట  తెచ్చిన మంచినీరూ సప్ప్లై చేశారు  .మధ్యలో స్టాపుల ఒక్క నిమిషమే ఆగి రన్నింగ్ లోమాత్రం ‘ఫాస్ట్’’ అనిపించి నిడుబ్రోలు చేరే సరికి ,రెండు రైళ్ళ క్రాసింగ్ తో పావుగంట ఆలస్యమై ,ఉదయం 11-30కి వేటపాలెం చేరాం .మధ్యలో కల్పనా గారిచ్చిన ఆమె రాసిన  రెండుపుస్తకాలు చదివేశా.ఆవిడ దానిమ్మకాయలుకొని ఒకటి ఒలిచి అందరికీ పెట్టారు .కాలక్షేపం బటాణీ ల్లా  దానిమ్మ గింజలు బాగున్నాయి  స్టేషన్ లో అందరం ‘’భంగిమ ‘’లో ఉండి ఫోటోలు దిగి ,లైబ్రరీ వారు ఏర్పాటు చేసిన ఆటోలలో  సారస్వత నికేతన్   చేరాం .అప్పటికే   వెంకట సుబ్బయ్యగారు వచ్చేశారు .ప్రకాష్  బెజవాడలోనే బానర్లు తయారు చేయించి, వెంట తెచ్చి, ఇక్కడికి చేరుకోగానే కట్టించారు .,అదీ ఆయన కమిట్ మెంట్ .అతిధులకు శాలువాలు ,కానుకగా బంగారు పెన్నులు కూడా  బెజవాడ నుంచే తెచ్చారు .

సరిగ్గా 12గంటలకు సభ ప్రారంభమైంది .సభాధ్యక్షులు రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు .డా.సత్రం మల్లేశ్వరరావు రాసిన ‘చీకటి దాచిన వెలుతురు’’కవితా సంపుటి ఆవిష్కర్త శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ,లలిత కళాసమితి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ లొల్లా శ్రీరామమూర్తి ,కళాంజలి సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీ కాకరపర్తి వెంకటేశ్వర్లు ,ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ బి హనుమా రెడ్డి ,కవయిత్రి సాహితీ విమర్శకురాలు డా వి నాగ రాజ లక్ష్మి , సాహితీవేత్త శ్రీ బీరం సుందరరావు ,కవి శ్రీ శ్రీనివాస గౌడ్ ,సమీక్షకులు శ్రీ సజ్జా వెంకటేశ్వర్లు , రాష్ట్ర రచయితల సంఘం కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ గార్లు అతిధులుగా వేదికనలంకరించారు .కార్యక్రమాన్ని చక్కని సంభాషణా చాతుర్యం తో నిర్వహించారు వృద్ధాశ్రమం అధ్యక్షులు శ్రీ గుత్తి విశ్వేశ్వరరావు .మరొక పుస్తకమూ ఆవిష్కారం పొందింది అప్పాజోశ్యులవారి అమృత హస్తాల మీదుగా .

వక్తలు గ్రంథాలయ క్రమాభి వృద్ధిని వివరించారు .ప్రభుత్వం కూడా సహకరిస్తే ఇంకా బాగా విస్తరణ జరుగుతుందని వక్తలు అభిప్రాయ పడ్డారు .ప్రైవేట్ యాజమాన్యం లో లాభా పేక్ష లేకుండా ,నిస్వార్ధంగా మొదటి నుంచి ,ఇప్పటి దాకా నికేతన్ నిర్వహింప బడుతోందని తెలియ జేశారు .ఉద్యోగులు కూడా క్రమశిక్షణ, అంకిత భావం తో ,జీతాలు పెద్దగా లాభించకపోయినా సేవా దృక్పధం తో పని చేస్తున్నారని ఒక కంప్యూటర్ అసిస్టెంట్ ఉచిత సేవ అందిస్తోందని చెప్పారు .వేదికపై వ్యవస్థాపకులు శ్రేష్టి గారి నిర్వాహకులు పంతులుగారి, రెండు సార్లు సందర్శించిన పూజ్య బాపూజీ చిత్రపటాలు ఏర్పాటు చేసి పెద్దలచే పుష్పమాలా౦కరణ చేయించటం సముచితంగా,  గౌరవ ప్రదం గా ఉంది , లైబ్రరీ సేవలో ధన్యులైనవారిని పేరు పేరునా స్మరించి అంజలి ఘటించటం సంస్కార వంతమైన చర్య గా ఉన్నది ..లైబ్రరీ స్వీపర్ వాచ్ మాన్ దంపతులను గౌరవంగా కుర్చీలలో ఆసీనులను చేసి   పూల హారం వేసి   శాలువాకప్పి బంగారు పెన్ బహూకరించారు .అలాగే లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి  సేవలను ప్రస్తుతించి ఘనంగా సత్కరించారు . మిగిలినవారిని కూడా సత్కరింఛి గౌరవం చూపారు .ఆవిష్కరింపబడిన పుస్తకాలపై సూక్ష్మమైన పరిచయాలు జరిగాయి .కవులనూ,సమీక్షకుని ,అతిదుల౦దరినీ,  తగిన విధంగా సన్మానించారు .

కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొన్న స్థానిక మహిళ ఒకరు ఆమె భర్త గారి స్మారకం గా ఒక లక్ష రూపాయలు లైబ్రరీకి విరాళం అంద జేశారు  . దీనితో స్పందించి ప్రేరణ పొందిన వదాన్యులు పది వేల రూపాయలు  వంతున విరాళాలు అందించి యదా శక్తి అభివృద్ధికి తోడ్పడి,తమ వదాన్యత చాటుకున్నారు .ఇది అభిలషణీయ మైన విషయం .అందరికీ స్పూర్తి దాయకం కూడా .

నేను ఉయ్యూరు నుంచి నాతో తెచ్చిన 36పుస్తకాలను వేట పాలెం గ్రంధాలయానికి లైబ్రేరియన్ గారి చేతులమీదుగా అందజేశాను .వీటిలో సరసభారతి పుస్తకాలతోపాటు డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల సంస్కృత గ్రంథాలు ,డా.శ్రీమతి వాణీ కుమారి,  కవి సామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ,శ్రీ  ఎం ఆర్ వి ఎస్ మూర్తి ,శ్రీ ఆవాల బుచ్చిరెడ్డి ,ఆచార్య శ్రీ వత్స ,శ్రీ తాడేపల్లిసుబ్రహ్మణ్య శాస్త్రి,మొదలైన వారి పుస్తకాలున్నాయి .ఇవే కాదు సరసభారతి ఇప్పటి దాకా ప్రచురించిన దాదాపు అన్ని పుస్తకాలు ,ఆవిష్కరణ జరిగినవెంటనే ప్రకాష్ గారు ఈలైబ్రరీ కి పంపటం అలవాటే.పుస్తకాలు అందగానే అందినట్లు ధన్యవాదాలు తెలియ జేస్తూ,  లైబ్రేరియన్ శ్రీ వల్లిగారు వెంటనే పంపటం రివాజు .ఇది చక్కని సంప్రదాయం .అందరు లైబ్రేరియన్లు విధిగా  పాటించాల్సిన సూత్రం  . వల్లి గారితో మాట్లాడుతూ సెప్టెంబర్ లో అమెరికానుంచి వచ్చిన ఒకాయన ,మరో హైదరాబాద్ ఆయన ఇక్కడికి వచ్చినట్లు ,ఏదో ఆర్ధిక సాయం లైబ్రరీకి చేయాలను కొన్నట్లు విన్నాను ఎంతవరకు వచ్చిందని అడిగాను .ఆమె వాళ్ళు తమ పుస్తకాలు ఇచ్చారు కాని ఆర్ధిక సాయం గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు .

సభ పూర్తవగానే అందరం లైబ్రరీ లో సామూహికంగా ఫోటోలు తీసుకొన్నాం .ఇక్కడ గాంధీ గారు వాడిన చేతి కర్ర ఉంది .అది వారసత్వపు ఆస్తిగా ,పవిత్రంగా అందరూ భావించి ఆ  కర్ర చేతబట్టి ఫోటోలు తీసుకున్నాము .అక్కడ నాకు కవి రాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారు రాసిన ‘’ఖడ్గ తిక్కన ‘’పద్యకావ్యం నాతోపాటు మిగిలిన వారందరికీ  అర్చక ప్రవర శ్రీ చల్లా రామారావు గారు రచించిన ‘’శ్రీ రామాయణ సారామృతం ‘’వచన గ్రంధం ,డాశ్రీ సత్రం మల్లేశ్వరరావు గారి ‘’చీకటి దాచిన వెలుతురు’’తొలి కవితా సంపుటి అందజేశారు .సాధారణంగా సాహిత్య సభలు అంటే వేదికపైనా ముందు రచయితలూ తప్ప ,ఊళ్ళోని వారెవరూ రారు. ఉండరు .కాని వేటపాలెం లో ఆ ఆనవాయితీ తప్పించి ఊరి పెద్దలు చాలామంది పాల్గొని ఘన విజయం చేకూర్చారు.ఇందుకు  ఊరివారిని తప్పక అభినందించాల్సిందే . కార్యక్రమం ముగియగానే మమ్మల్ని అందర్నీ కార్లు  ఆటోలలో దేశాయ పాలెం లో ఉన్న అనాధ వృద్ధాశ్రమం లో కమ్మని విందు ఏర్పాటు చేశారు .టేబుల్ మీల్స్ .పూర్ణం, వడ ,పులిహార ,పప్పు ,రెండుకూరలు ,చట్నీ ,సాంబారు ,గడ్డ పెరుగు నెయ్యి తో రుచికరమైన భోజనాలు కొసరి కొసరి వడ్డించి తినిపించారు .

అనాధ వృద్ధాశ్రమం

.               విశాలమైన ఆవరణలో పచ్చని  వృక్షాలమధ్య మంచి బిల్డింగ్ లలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు.శ్రీ సత్రం మల్లేశ్వరరావు గారు వ్యవస్థాపకులు నిర్వాహకులు .ఆస్ట్రేలియా లో ఉన్న వారి కుమారులు ఆశ్రమ నిర్వహణకు ఆర్ధిక సాయం అందిస్తున్నారట .వేటపాలెం శ్రీ అరుళానంద స్వామి దివ్య ఆశీస్సులతో ,గ్రామ పెద్దల వదాన్యుల సహకారం తో అన్ని కులాల వారితో ఉన్న గొప్ప ఆదర్శమైన కమిటీ తో ఆదర్శంగా నిర్వ హిప బడుతోంది  .ఆశ్రమవాసులను సర్వే చేసి సెలెక్ట్ చేసి చేర్చుకొంటారు .వృద్ధాప్యం తో పాటు అనాధలు అయి ఉండటం ప్రాధమిక విషయంగా భావిస్తారు .ఆశ్రమం లో చేరినదగ్గరనుంచి మట్టిలో కలిసి పోయే దాకా ఖర్చు అంతా ఆశ్రమానిదే .ఒక్క రూపాయ కూడా ఎవరూ కట్టనక్కర లేదు .ఇప్పటికి 110 మందికి అంత్య క్రియలు ఏ లోటూ లేకుండా నిర్వహించారట .వాషింగ్ మెషీన్ ,ఫాన్ లు మంచి గాలి వెలుతురూ లభిస్తాయి .రోజూ ఒక ఆర్ ఏం పి డాక్టర్ పర్య వేక్షిస్తాడు. నెలకొకసారి డాక్టర్ వచ్చి పరీక్షలు చేస్తాడు .షుగర్ పేషెంట్ లకు  ప్రత్యెక కాంపులు నిర్వహించి నెలకు సరిపడా  మందులు ఉచితం గా  అంద చేస్తారు .కుష్టు రోగులకు నెలకొకసారి ఊళ్ళో పరీక్ష చేయటానికి  క్రిస్టియన్ మిషనరీ డాక్టర్ వస్తాడు .వారికి అంటే సుమారు యాభై అరవై మందికి  అక్కడే  భోజనం అందేట్లు  ఆశ్రమకమిటీ మెంబర్అయిన నవాబు గారు స్వంత ఖర్చు తో ఏర్పాటు చేస్తాడట . ఎందరో మహానుభావులు ,ఉదార హృదయులు . ఈ విషయాలన్నీ మా భోజనాలయ్యాక చెట్లకింద కుర్చీలలో మమ్మల్ని కూర్చోబెట్టి ,మల్లేశ్వరరావు గారు చెప్పారు .అప్పటికప్పుడు అందరం స్పందించి ఎవరికి తోచిన దనం వారు ఇచ్చి మా కర్తవ్యమూ నెరవేర్చాము .ఇదొక  సంతృప్తి మాకు .

వేట పాలెం జీడి పప్పు కు ప్రసిద్ధి

వేట పాలెం అంటే జీడి పప్పుకు ప్రసిద్ధి అని బీరం వారన్నారు .ఇండియాలో నంబర్ వన్ నాణ్యమైనజీడిపప్పు వేటపాలెం లోనే దొరుకుతుంది .ఆ తర్వాత స్థానం’’ పలాస’’ పొందింది వేటపాలెం లో 42 జీడిపప్పు ఫాక్టరీలున్నాయట .కాని మాకు కొందామనుకొంటే దారిలో ఎక్కడా జీడిపప్పు అమ్మే కొట్లు కనిపించలేదు .రైల్ లోనూ ఎవరూ అమ్మకానికి రాలేదు .చాలా సార్లు మద్రాస్ నుండి వచ్చేటప్పుడు కొనే వాళ్ళం .ఇప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళే టప్పడూ జీడిపప్పు దర్శనం కాలేదు .అది బాధగానే ఉంది .

తిరుగు ప్రయాణం

ఆటోలో అందరం చీరాల స్టేషన్ చేరాం .చీరాల పేరాల  ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఉద్యమ కేంద్రాలు .వారు నడచిన పవిత్ర నేల గుండా ప్రయాణించటం ఆమహా పురుషుని స్మరణ ధన్యులను చేశాయి అని పించింది .స్టేషన్ కు చేరే సరికి ఇంకా ఫాస్ట్ పాసెంజర్  వెళ్ళ లేదని తెలిసి ఊపిరి పీల్చుకొన్నాం .ఎవరి టికెట్ వాళ్ళం కొనుక్కొని సరిగ్గా 4 గంటలకు వచ్చిన పాసెంజర్ ఎక్కాం. భవానీ దీక్షలు విరమణ రోజులు కనుక ట్రెయిన్ అంతా వారితోనే నిండి పోయింది .ఎక్కటానికి చాలా కష్టమైంది .వేటపాలెం నుంచి బెజవాడ దాకా అందరం నిలబడే ప్రయాణం చేశాం  .నెత్తిన ఇరుముడి మూటలు ,యెర్ర వస్త్ర ధారణా ,మెడనుండి మోకాలిదాకా  గజనిమ్మకాయ సైజులో గుచ్చిన నిమ్మకాయల దండ ,పుష్పహారం ,శూలం బల్లెం లతో వెంట వచ్చిన భార్య భవానీ లు పిల్ల భావానీల తో  ఇవికాక లగేజీ తో పాపం ఎంతో కస్టపడి ఎక్కి ,నుంచొనే చోటు కూడా లేక ఇబ్బంది తో  దుర్గమ్మవారిపై  మనసునిండా భక్తితో ఒకరినొకరు  ‘’భవానీ భవానీ ‘’అని పిలుచుకొంటూ సందడి సందడిగా ఉంది కంపార్ట్ మెంట్ .  బెజవాడ కు పాసేంజర్ సాయంత్రం 6 కు చేరింది .ఒకరికొకరం గుడ్ బై చెప్పుకొని  ఎవరి దారి వారు పట్టాం.నేను స్టేషన్ బయట 333 సిటీ బస్ కోసం గంట సేపు వెయిట్ చేసి ,లాభం లేదని ,బస్ స్టాండ్ కు సిటీ బస్ లో ఎక్కి వెళ్లి, అక్కడనుంచి రూట్ బస్ ఎక్కి ఉయ్యూరు చేరే సరికి రాత్రి 9 అయింది .ఇంతమజ్జిగా అన్నం తిని వేటపాలెం ఫోటోలు పెట్టి ,నిద్ర పోయేసరికి రాత్రి 10-30.అయింది .మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ధనుర్మాస కార్యక్రమానికి మా సువర్చలా౦జనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి .ఈ టైట్ ప్రోగ్రాం చూసి మా ఆవిడ దెప్పుతూ ‘’ఎఫ్ ఎం మిర్చీ రేడియోలో  ‘’ తరచుగా అనట్లు   ‘’బాబు బాగా బిజీ ‘’అన్నది .

చలపాక దంపతులు

శ్రీ చలపాక ప్రకాష్ పూనిక నేర్పూ వ్యూహం ప్రణాళిక సక్రమంగా .అమలు జరగటం వలన మా గ్రంధాలయ సందర్శన యాత్ర విజయవంతమైంది .ప్రకాష్ లాంటి నిస్వార్ధ సేవా పరాయణుడు నాకు ,సరసభారతికి మిత్రుడు, ఆత్మీయుడు అవటం మా అదృష్టం .ప్రకాష్ భార్యామణి కూడా ఆయనకు తగ్గ దొడ్డ ఇల్లాలు .అణకువ ,గౌరవం, మర్యాద మన్నన, ,సహాయం ఆతిధ్యాలలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది .’’అన్ని విధముల నుద్దియౌ నతని  గృహిణి‘’అని పెద్దనగారు ప్రవరుని భార్య గురించి చెప్పినమాట ప్రకాష్ అర్ధాంగి గారికి సరిగ్గా అన్వయిస్తుంది. ఈ సరస్వతీ తీర్ధ  యాత్రా ఫలం ప్రకాష్ దంపతుల పుణ్యమే .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.