ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )
38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర రచయిత్రుల సభ జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియం లో నవనవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి సభా ప్రాంగణం లో ,’’మోహనవంశీ’’ నాదం తో , ఊహాగానం తో ,రామాయణ విష వృక్ష ఖండన ,లత రామాయణం వంటి ప్రసిద్ధ రచనలతో ఆంద్ర ప్రేక్షక జనాల హృదయ సీమల నేలిన ‘’లత ‘’గా కీర్తిపొందిన శ్రీమతి తెన్నేటి హేమలత వేదికపై ‘’అంగనా’’ రంగరంగ వైభవం తో జరగటం ,సముచితం చారిత్రాత్మకం ,చిరస్మరణీయం .
7-1-19 సోమవారం –రెండవ రోజు కార్యక్రమాలు
ఉదయం 10 గంటలకు కవి సమ్మేళనం తో రెండవ రోజు కార్యక్రమం ప్రారంభమైంది .అందుబాటులో ఉన్న కవయిత్రులు తమ కవితలను చదివి రక్తి కట్టించారు .తర్వాత నాల్గవ సదస్సు డా .చిల్లర భవానీదేవి ఆధ్వర్యం లో జరిగింది .శ్రీమతి మందరపు హైమవతి –స్త్రీ వాద రచయిత్రులు ,శ్రీమతి సి ఎస్ ఏం లక్ష్మి –మహిళలు –ఆధ్యాత్మికత ,శ్రీమతి కన్నెగంటి అనసూయ –మహిళ.బాల సాహిత్య వేత్తలు ,డా దేవులపల్లి పద్మజ –బాలికలపై అత్యాచారాలు – నివారణోపాయాలు,డా లీలా సుష్మ గుమ్మా –మహిళా –పోషకాహారం ,కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళలు –వ్యక్తిత్వవికాసం లపై తమకున్న అనుభవాన్ని రంగరించి తలొక 7 నిమిషాలలో మాట్లాడారు .మహిళా బాల సాహిత్య వేత్తలపై ప్రసంగించిన అనసూయగారు అందరి హృదయాలను దోచుకొన్నారు .దాదాపు మనకు తెలియని ఎన్నో విషయాలు ఆమె తెలిజెప్పి అందరి ప్రశంసలు అందుకొన్నారు .అందుకే అధ్యక్షతవహించిన భవానీ గారు అనసూయగారి వ్యాసం తప్పకుండా పత్రికలో ప్రచురించి అందరికి అందుబాటు లోకి తేవాలని మంచి సూచన చేశారు .దివ్యా౦గు రాలు కుమారి నిఖిల మహిళా వ్యక్తిత్వం పై పుస్తకాలు రాసింది .తన అంగవైకల్యాన్ని సవాలుగా తీసుకొని ఎదిగిన’’ స్వయం సిద్ధ ‘’అని పించింది .వేదిక నుంచి దిగగానే నేను ఆమెతో , ఆమె తల్లిగారితో మాట్లాడి మార్చి 31 ఆదివారం సరసభారతి నిర్వహి౦చే ఉగాది వేడుకలో పాల్గొనమని ఆమెకు ఆరోజు ‘’స్వయం సిద్ధ’’ అవార్డ్ అందజేస్తామని ఆహ్వానించాను . ఇద్దరూ తప్పక వస్తామని తెలిపారు వారి అడ్రస్ ఫోన్ నంబర్ కూడా తీసుకోన్నాను .ఆమె తండ్రిగారు విజయవాడలో గొప్ప మానసిక వైద్యులట. నిన్ననే ఆమెకు సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను .
ఈ వేదికపైననే శ్రీమతి సూరెడ్డి శాంతాదేవి ,శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి ,శ్రీమతి ఏ ఎల్ ఏం ప్రకాష్ కుమారి ,డా బళ్ళూరు ఉమాదేవి ,శ్రీమతి సింహాద్రి పద్మ ,శ్రీ మతి పి.అమరజ్యోతి (అనకాపల్లి )లకు వారి సాహిత్య సేవకుగాను సత్కారం చేశారు .
అయిదవ సదస్సు ఉదయం 11-30కు డా తుర్లపాటి రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది .మహారాష్ట్రలో తెలుగు మహిళా ప్రగతి పై శ్రీమతి తురగా జయ శ్యామల ,బహిరంగ ప్రదేశాలలో మహిళలకు ప్రత్యెక సౌకర్యాలు పై శ్రీమతి నండూరి సుందరీ నాగమణి ,మహిళాలోక వ్యవహార జ్ఞానవశ్యకత పై శ్రీమతి మణి వడ్లమాని , మహిళా సాధికారత సవాళ్ళు పై శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి ,హింస –మహిళ పై శ్రీమతి తాటికోల పద్మావతి ,తెలుగు భాషా సంస్కృతుల పరి రక్షణ –మహిళల పాత్ర -పై డా కొమాండూరి మారుతీకుమారి లు సామాజిక దృక్పధం ఉన్న ఈ అంశాలపై బాగా స్పందించి అనుభవాలను జోడించి మాట్లాడి ,అంశాలకు తగిన న్యాయం చేకూర్చారు .
ఈ వేదికపై ప్రముఖ రచయిత్రులుశ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి ,శ్రీమతి తమ్మిన పరమాత్మ ,శ్రీమతి చివుకుల లక్ష్మి లను సన్మానించారు .
మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన ఆరవ సదస్సు నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీమతి తేళ్ళ అరుణ అధ్యక్షతన జరిగింది .శ్రీమతి శిస్ట్లామాధవి ,శ్రీమతి ఎ.దుర్గా సుందరి ,శ్రేమతి గురజాడ రాజరాజేశ్వరి ,శ్రీమతి పాతూరి అన్నపూర్ణ ,డా ఫై ఉష ,శ్రీమతి జి మేరీ కృపాబాయి వక్తలు- వరుసగా ఉద్యోగినుల సాధకబాధకాలు ,స్త్రీవాద సాహిత్యం –సామాజిక చైతన్యం ,గృహ నిర్వహణలో స్త్రీపాత్ర ,పిల్లలపోషణ –తల్లులపాత్ర ,పల్నాటి వీరగాథ లో మహిళామూర్తులు ,మహిళా ఆర్ధిక సాధికారికత అనే అంశాలపై ఆసక్తికరం గా మాట్లాడి న్యాయం చేశారు .
మొత్తం మీద రెండు రోజులలో ఆరు సదస్సులు వివిధ అంశాలపై జరిగి ,మహిళలు తమ మనో భావాలను వ్యక్తపరచటానికి చక్కని వేదిక లభించి సార్ధకత చేకూరింది .ఈ వక్తల మాటలు వేదికకు మాత్రమె పరిమితం కాకుండా వారు వెలిబుచ్చిన భావాలను క్రోడీకరించి ఒక సంకలనం గా ప్రభుత్వం తీసుకొని వస్తే తగిన ప్రయోజనం కలుగుతుంది .శ్రీ విజయభాస్కర్ దీనిపై చొరవ తీసుకోగలరని భావిస్తాను .
మధ్యాహ్నం 2-30కు ‘’వనితా వైభవం ‘’సాహిత్య రూపకం ను డా వెలువోలు నాగరాజ్య లక్ష్మి నిర్వహణలో జరిగింది –కొన్ని పౌరాణిక ,కావ్యాలలోని ప్రముఖ పాత్రలను ,ప్రసిద్ధ రచయిత్రులు ఆ పాత్రల పోషణ చేసి ,పాత్రల ద్వారా వారి వ్యక్తిత్వాలను ఆవిష్కరింప జేశారు .దమయంతి పాత్రను డా తాడేపల్లి వీరలక్ష్మి ,ద్రౌపదిగా డా కావూరు సత్యవతి ,వరూధినిగా డా .మైలవరపు లలిత కుమారి ,సత్యభామగా –శ్రీమతి ఎన్.సిహెచ్ మైథిలి నటించి మెప్పించారు .ముప్పావుగంట సేపు జరిగిన రూపకం ఆసక్తికరంగా సాగింది .
మధ్యాహ్నం 3-15కు చివరి కవి సమ్మేళనం శ్రీ మతికోడూరు సుమన ,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ,శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి ,శ్రీమతి ములుగు మైథిలి ,శ్రీమతి జి పద్మకళ ల నిర్వహణలో జరిగి అర్ధవంతమైన కవితలతో సార్ధకత చేకూరింది .
సాయంత్రం 4-30కు రొటీన్ గా జరిగిన సమాపనోత్సవం తో రెండు రోజుల రచయిత్రుల సదస్సు సమాప్తమైంది .
రెండు రోజుల ఈ సదస్సుకు జిల్లా రచయితల సంఘం ,శారదా స్రవంతి ,సరసభారతి సభ్యులు సభా నిర్వహణకు విశేషంగా తోడ్పడ్డారు .
ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ రచయిత్రులు తమ రచనా విశేషాలను పాత్రికేయులకు తెలియజేశారు .శ్రీమతి చిల్లర భవానీదేవి 1980తర్వాత స్త్రీ సాహిత్యం ఎక్కువగా వచ్చిందని ,ఇప్పుడు ఆంక్షలు లేవని బాలసాహిత్యం పిల్లల మానసిక వ్యక్తిత్వ వికాసాలకు తగిన పుస్తకాలు రావాలని ,తానూ యాభై ఏళ్ళుగా రచన చేస్తున్నానని 40పుస్తకాలు రాసి ప్రచురించానని చెప్పారు . శ్రీమతి యలవర్తి అనూరాధ –పద్యం తప్ప అన్ని ప్రక్రియలో రచన చేశానని దాదాపు వెయ్యి ప్రచురణలు తనవి ఉన్నాయని, 50కి పైగా అవార్డ్ లు పొందానని ,ఇలాంటి సభలలో ఎంతోమంది మేధావులతో గడిపే అదృష్టం కలుగుతు౦దని, దీనితో జ్ఞాన సంపద పెరుగుతుందని అన్నారు శ్రీ మతి కన్నెగంటి అనసూయ –బాల సాహిత్యం లో మహిళల కృషి తక్కువే అని ,శ్రీమతి రావి శారద దీనిలో బాగా కృషి చేస్తున్నారని తెలుగు బాలకధలు ఇతరభాషల లోకి అనువాదం పొందాలని, తాను 300 బాలకథలను రాశానని ,ఈ ఏడాది 150బాలకథలు రాయాలన్నది తన లక్ష్యమని తెలియ జేశారు .శ్రీమతి కోడూరి సుమన-తాను సంగీత సాహిత్య నాట్య రంగాలలో కృషి చేస్తున్నానని ,స్త్రీలు ఎంచుకున్న రంగాలలో ముందుకు వెళ్ళాలంటే కుటుంబ ప్రోత్సాహం చాలా అవసరమని ,మహిళలు ఐకమత్యంగా ఒకే అవగాహనతో కలిసి పనిచేస్తే సాధించలేనిది ఉండదని భరోసాగా చెప్పారు . దివ్యా౦గు రాలు, ఉపాధ్యాయిని శ్రీమతి పెండ్యాల గాయత్రి – బ్రెయిలీ లిపి తో తనవిద్య సాగిందని ,తెలుగులో ఎం .ఏ చేసి ,బిఎడ్అయ్యానని ,సామాజికాంశాలు స్త్రీ వైకల్యం పై రచనలు చేశానని, స్త్రీ అభి వృద్ధికి మానసిక ప్రోత్సాహం చాలా అవసరమని ,రచయితలు సామాజక నిర్మాతలని ,వర్తమానం తో పాటు భవిష్యత్తును చూపించగల దిక్సూచులని గొప్ప అభిప్రాయాలను వెల్లడించారు .
సభలలో సరిగమలు –
1-రెండు రోజులు జరిగిన సదస్సులో ‘’ఆంద్ర ప్రదేశ్ స్త్రీ రచయితల సంఘం’’ రూపు దాల్చకపోవటం దానికి కార్యవర్గం ఏర్పాటు చేసుకోకపోవటం పెద్ద వెలితి అనిపించింది .
2-సన్మానిత రచయిత్రులను క్లుప్తంగా తగిన విధంగా పరిచయం చేయటం అద్భుతః అని పించింది .
3- సన్మానితుల ప్రతిస్పందనా దీనికి తగినట్లే ఉండటం హాయి అనిపించింది ‘
4-రెండు రోజులూ ఒకే రకమైన టిఫిన్ పెట్టినా రుచిగా ఉండటం వలన ఇబ్బ౦ది కలగలేదు .అయితే’’ కాఫీగత ప్రాణులకు’’ఉదయం కాఫీ లేకపోవటం బాధాకరమే . ఉన్నా కాసేపు ఇచ్చినట్లు, అయిపోయి౦దని చెప్పినట్లు,తర్వాత వచ్చిన టీ కూడా మూడు నిమిషాలముచ్చటే అయిందని చాలా మంది అన్నారు .
5-రెండు రోజులలో భోజనాలలో వెరైటీ మెయింటేన్ చేసి తృప్తి కలిగించటం మెచ్చదగిన విషయం .
6-ఎంతసేపూ మాట్లాడటం, వినటం తప్ప వేరే రకపు ఆకర్షణ లేక పోవటం బాధాకరం .ఎలెక్ట్రానిక్ మీడియా ను చక్కగా ఉపయోగించు కొని కొందరు ప్రసిద్ధ రచయిత్రుల ఫోటోలను వేదికపై ఉన్న తెరపై ప్రదర్శిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేది .వారి స్వరాలు ఆడియో ద్వారా వినిపించి ఉంటె సార్ధకత కలిగేది .వారి ఇంటర్వ్యులలో అవసరభాగాలు చూపిస్తే ఆసక్తిగా ఉండేది .అసలా వైపు ఆలొచన చేసినట్లే లేదు .
7-పురస్కారాలు పొందినవారు చాలాసార్లు పొందినవారే .కొత్తవారికీ ఇచ్చి ఉంటె బాగుండేదని సామాన్యుడి సణుగుడు వినిపించింది .
8-ఎంతో దూరభారలనుండి సభలకు వచ్చిన వారిని శాలువా జ్ఞాపికలతో మాత్రమే సత్కరించటం నిరుత్సాహ పరచింది .కనీసం వెయ్యి నూట పదాహార్లు అయినా వారికి నగదు బహుమతి ఇచ్చి ఉంటె ఘనంగా జరిపినట్లు ఉండేది.
9-సభమీద సభ ఓవర్ లాప్ అవటం తో సభ దారి సభది, భోజనాల దారి భోజనాలది కబుర్లదారి కబుర్లది అయి, ప్రేక్షకుల కొరత స్పస్టంగా కనిపించింది .
10-కవి సమ్మేళనాలు ఆసక్తిగా లేవు అని శ్రీ కొంపెల్ల శర్మగారి లాంటి పెద్దలు అభిప్రాయ పడ్డారు .ఉత్సాహం మంచిదే కాని పదార్ధమూ ఉండాలి కదా .
11-కనీసం 1500మంది ప్రతిధులు హాజరవటం సంతోషదాయకం ,ప్రోత్సాహకరం కూడా .రచయిత్రుల తోపాటు వారి కుటుంబ సభ్యులూ హాజరవటం మెచ్చదగిన విషయం .
12-తమ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ,ఈ రెండు రోజుల సభల ఏర్పాట్లు ,వివిదాంశాల వాటికి తగిన వక్తల ఎంపిక చేసి అన్ని కోణాలలో అంశాలను రాబట్టటానికి ఎన్నో నెలలుగా తీవ్ర కృషి చేసిన శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,డా పూర్ణ చ౦ద్ ల ను ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది .ఇలాంటి సభలకోసమే వారు కారణ జన్ము లయ్యారా అని పిస్తుంది .
12- ఈ సభల అనుభవం మళ్ళీ జరిగే సభలకు ప్రేరణ స్పూర్తి నివ్వాలని కోరుతూ ,నిర్వహించిన ,పాల్గొన్న వారందరినీ మనసారా అభి నందిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-19-ఉయ్యూరు