మన ఘంటసాల

తెలుగు వాడికి తెల్లవారితే ‘దినకరా శుభకరా’ ;
మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే ‘భగవద్గీత’ ;
సాయంత్రం వేడుకైతే ‘పడమట సంధ్యా రాగం,
కుడి ఎడమల కుసుమ పరాగం’ ; రాత్రి ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ , అలా కానప్పుడు ‘నడిరేయి ఏ జాములో” … ‘నిద్దురపోరా తమ్ముడా’ ….’కల ఇదనీ నిజమిదనీ తెలియదులే’ , అంతలోనే తెల్ల వారితే ‘నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో’ అన్న సందేహంలో సంతృప్తి – ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే.
తెలుగు విద్యార్ధికి ‘ప్రేమ తమాషా వింటేనే కులాసా’ . కానీ ‘పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే’ అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే ‘కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు’ అన్న అక్షర లక్షల ‘థెరపీ’, ఆవేశం వస్తే ‘ఆవేశం రావాలి’ కానీ ‘ఆవేదన కావాలి’ అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే ‘తెలుగు వీర లేవరా’ అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే ‘ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి’ అన్న విదిలింపూ- ఇవన్నీ ఆయన అందించిన వివరాలే.
తెలుగు తల్లికి ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి’ నువ్వున్నావమ్మా అనగానే ఎంత సంబరం!
తెలుగు పడుచుకి ‘దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవే’ అనగానే ఎంతటి గర్వం!
‘తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా’ ఎంతటి సిగ్గూ! ఇదంతా ఆయన గొంతు మహత్మ్యమే.
‘పాపాయి నవ్వులే మల్లె పూలు’ , ‘ ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే’ అన్నప్పుడు ఎన్ని మల్లెలు పాపాయిలుగా పుట్ట్టా లను కున్నాయో? ఎన్ని బంతి పూలు ఆది శంకరుని తలచు కున్నాయో! ‘బలే బలే పావురమా’ , ‘జగమే మారినది మధురముగా — పావురములు పలుక’ , ‘గోరోంక గూటిలో చేరావు చిలక’ , ‘నా పాట నీ నోట పలకాల సిలక’ అన్నప్పుడు ఎన్ని పక్షులు తెలుగు నేర్చుకున్నాయో!’శివ శంకరీ శివానంద లహరీ–మనసు కరుగదా’ అనగానే ఎన్ని మృదంగాలు నాట్యమాడ లేదూ! ‘మది శారదా దేవి మందిరమే’ అనగానే ఎన్ని గంటలు మ్రోగ లేదూ!
ప్రతి సంక్రాంతి ‘అసలైన పండుగ– కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ’ గా వాసి కెక్కిందంటే అది ఆ గళం అందించిన బలమే.ప్రతి ఉగాది ‘భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు’ గా చెలామణి అయ్యిందంటే అది ఆ కంఠం ప్రోద్బలమే. ఇన్నిటికీ, ఇందరికీ, అన్నిటికీ, అందరికీ ‘తెలుగు వారి ఇలవేల్పు’ గా వెంకటేశ్వరుడుంటే “తెలుగు వారి గళ వేల్పు” ఘంటసాల !”
ఆరుద్రగారు అన్నట్టు మాస్టారూ, ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు (నీవు)
పాడే పాట వినిపించునే వేళా’!
అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల – సి.నారాయణరెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగభావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది! – దాశరథి
అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి
సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి
లలిత గాంధర్వ దేవత కొలువుదీరు
కలికి ముత్యాలశాల మా ఘంటసాల – కరుణశ్రీ
“ఘంటసాల” ఆ పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి.
“ఘంటసాల” ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు.
ఆబాల గోపాలాన్ని తన కంచు కంఠంతో ఊగిసలాడించి, ఉర్రూతలూగించి, ఊయలలూపిన గాన గంధర్వుడు, గాయకులలో ‘న భూతో న భవిష్యతి’ గా వాసికెక్కిన మన గళవేల్పు ఘంటసాల మాస్టారి 90 వ పుట్టినరోజిది. ఏ అమరలోకంలో వారీ వేళ సురలకు స్వరలహరుల కచేరీ ఇస్తున్నారో ప్రస్తుతం. త్రిస్థాయిలలో పాడటమే కాక, అద్భుతమైన బాణీలు కట్టి, తెలుగు పద్యాలకు తన శైలిలో, తన ప్రతిభతో క్రొత్త వరవడిని దిద్ది పద్యమంటే ఇలా పాడాలని సూత్రీకరించిన మహా మేధావి, అయినా నిగర్వి మన మాస్టారు. గొంతులో తీపి, హృదయంలో మధురిమ గల గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
తెలుగు వారి హృదయాలలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922లో డిసెంబర్‌ 4 గుడివాడ సమీపం లోని చౌటుపల్లి గ్రామం లో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు . భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది. ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శృతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. విజయనగరం చేరిన ఘంటసాల వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. వారాలు చేసుకుంటూ, మధుకరం(భిక్షాటన) చేసుకుంటూ సంగీత సాధన చేసి ద్వారం వెంకట స్వామి నాయుడి గారి చేతుల మీదుగా సంగీత పట్టా పుచుకున్నారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో ఘంటసాల గారి కచేరి ఏర్పాటు కావడం, ఆదిభట్ల నారాయణ దాసుగారు తంబూరా బహూకరించడం ఘంటసాల జీవితం లో ఒక పర్వదినం. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు.
1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.ముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.
1951లో పాతాళభైరవి ,1953లో వచ్చిన దేవదాసు 1955లో విడుదలయిన అనార్కలి ,1955లో విడుదలయిన అనార్కలి ,1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని ‘శేష శైలవాస శ్రీ వేంకటేశ ‘ పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాటలతో ఆంధ్రుల మనసులని పరవసింపచేసారు .
ముద్దబంతి పూవులో…
నీవేనా నను పిలచినది…
శివశంకరి… శివానందలహరి…
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై…
దేవదేవ ధవళాచల…
ఘనాఘన సుందరా…
కుడిఎడమైతే…
జేబులో బొమ్మ…
తెలుగువీర లేవరా…
రాజశేఖరా నీపై…
కనుపాప కరువైన…
పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు.
.త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.
ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.
“నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది ” అని ఎన్నోసార్లు చెప్పేవాడు.
మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.
సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను ‘అన్నా’ అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు ‘అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ’ అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.
ఘంటసాల ఆ తాత్వికతను జీవితంలోనూ పొదుగుకున్నారు. కొత్తగా వచ్చిన గాయకులకు అవకాశం వచ్చేలా తన వంతు ధర్మాన్ని నిర్వర్తించే వారు. తమ సినిమాలో తానే పాడాలని ఒత్తిడి చేసే నిర్మాతలు, దర్శకుల్ని ఉద్దేశించి కొత్తగా వచ్చిన వారు బాగానే పాడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వండి అంటూ వారిని తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తో ‘నా తరువాత నా అంతటి వాడవవుతావు నాయనా’ అంటూ మనసారా ఆశీర్వదించిన నిండు మనిషాయన. ‘బతికి ఉన్నంత కాలం పాడుతూ ఉండాలని, పాడుతున్నంత కాలమే బతికుండాలని కోరుకుంటున్నాను’ అంటూ తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసేవారు. చివరికి తాను ఆశించినట్లే , బతికున్నంత కాలం ఆయన పాడుతూనే ఉన్నారు.
1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి రావటం తో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో భగవద్గీత చేయాలన్న ఆలోచన రావటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగాయి. ఈనాటికీ ఘంటసాల వారి భగవద్గీత ఒక ఆణిముత్యం. 1974 ఫిబ్రవరి 11న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అర్ధశతాబ్దం పాటు మనలని తన గాన మాధుర్యం తో అలరించిన ఆ గొంతు మూగబోయింది. ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు.
ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి
రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.
గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ, శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం, కరుణశ్రీ వారి సులభ శైలి గద్యాలు, పద్యాలు, రావులపర్తి బద్రిరాజు గారి వెంకటేశ్వరుడు, ఘంటసాల వారి ‘మృత్యు వంటే భయం లేని’ రచన, దేవులపల్లి వారి అపర కాళిదాసీయ మేఘ సందేశం– ఆ గొంతులో ఎంతగా బందీలైపోయాయంటే మళ్ళీ అటువంటివి మరో గొంతు నుండి విడుదల కాలేదు.
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 1944 లో ‘స్వర్గ సీమ’ చిత్రానికి తొలుతగా పాడి మూడు పదుల కాలం సంగీత సామ్రాట్టు గా చిత్ర సీమను ఏలారు. ‘విధి ఒక విష వలయం’ కనుక ఆ అమృత కంఠానికి కేవలం అయిదు పదుల కాలం మాత్రమే భౌతిక రూపం దక్కింది. ఇక అప్పటి నుంచి తెలుగు వారికి పద్యాలు కరువయ్యాయి, మంచి తెలుగు పలుకులు అరుదయ్యాయి.
చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల
గంధర్వ మణిమాల ఘంటసాల
సంగీత సాహిత్య సరసార్ధ భావాల
గాత్ర మాధుర్యాల ఘంటసాల
పద్యాల గేయాల వచనాల శ్లోకాల
గమకాల గళలీల ఘంటసాల
బహువిధ భాషల పదివేల పాటల
గాన వార్నిధిలోల ఘంటసాల
కమ్ర కమనీయ రాగాల ఘంటసాల
గళవిపంచికా శృతిలోల ఘంటసాల
గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.