376-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ్ ఎస్.హసూర్కర్ ( 1924-1988 )
మంచి పండిత సంప్రదాయ వంశం లో మధ్యప్రదేశ్ -ఇందోర్ లో15-2-1924న జన్మించినశ్రీనాథ్ ఎస్ హసూర్కర్ పితృ దేవులు పండిట్ రత్న శ్రీపాద శాస్త్రి చరణాలవద్దనే సంస్కృతం అభ్యసించి పెరిగాడు .తల్లి రాధాబాయి .తండ్రి ఇందోర్ లోని హోల్కార్ వంశరాజైన ప్రిన్స్ యశ్వంతరావు హోల్కార్ కు మతగురువేకాక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్.కూడా .సంప్రదాయ కుటుంబం లో జన్మించి, అప్పటికే ఆధునికత జీవితాలలో చొచ్చుకు పోయి ఉండటం చేత శ్రీనాథ్ సంప్రదాయ బద్ధంగానూ ఆధునిక విధానం లోనూ సంస్కృతం అభ్యసించాడు .సంప్రదాయ విద్యాలయాల కావ్య ,వ్యాకరణ ,తర్క ,మాయ పరీక్షలో అత్యున్నత శ్రేణి లో ఉత్తీర్ణుడయ్యాడు .ఈ పనిలో నిమగ్నమై ఉన్నా ,సంస్కృతకాలేజిలో చదివి సంస్కృతం లోఎం.ఏ .లో 84 శాతం మార్కులు సాధించి ఉత్తీర్ణుడై’’నోపాని సంస్కృత మెడల్ ‘’పొందాడు . సాహిత్యాచార్య కూడా పాసయ్యాడు .
1950-51లో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో ప్రొఫెసర్ పి.ఎల్.విద్యా దగ్గర పరిశోధన చేశాడు .అతని రిసెర్చ్ అంశం –‘’అద్వైత వేదాంతం –మాయ సిద్ధాంతంపై వాచస్పతి మిశ్రా కృషి ‘’ .దీనిని దర్భంగాలోని మిధిలా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ఓరియెంటల్ రిసెర్చ్ వారు ముద్రించారు .
1952లో మధ్యప్రదేశ్ కాలేజీ విద్యా సేవ లో చేరి ,రిటైరయ్యేదాకా 1982వరకు 30ఏళ్ళు విలువైన సేవలు అందించాడు .ఈకాలం లో ఆయన విశిష్ట సేవలలో రాయపూర్ లో 1955-57లో శ్రీ దూధా ధారి వైష్ణవ సంస్కృత మహా విద్యాలయం నెలకొల్పటం ఒకటి .పండిట్ రవి శంకర శుక్లా మార్గ దర్శకం లో పురాతన సంస్కృత గ్రంథ వ్రాత ప్రతులను భద్రం చేయటానికి ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేశాడు .తర్వాత చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల ప్రిన్సిపాల్ గా పని చేశాడు .విద్యాలయాలను అత్యంత క్రమశిక్షణగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందాడు .ముఖ్యంగా గొప్ప పరీక్షా కాలమైన 1970-80దశకం లో విద్యార్ధుల ఆ౦ దోళనలతో అట్టుడికి పోయి అస్థిరత రూపు దాల్చిన కాలం లో విద్యార్ధులపై ప్రేమ, వాత్సల్యం ,కారుణ్యం,గౌరవం కురిపించి , మనసులను గెలిచి , ,మార్గదర్శనం చేసి వారి విద్యావ్యాసంగానికి విద్యాలయాల నిర్వహణకు భంగం కలుగకుండా ప్రవర్తించిన తీరు బహుదా శ్లాఘనీయమై అత్యుత్తమ నిర్వహణకు ఉదాహరణగా నిలిచాడు శ్రీనాథ్ .మద్యప్రదేశ కాలేజి విద్యా శాఖలో అత్యదిక కాలం ప్రిన్సిపాల్ గా పని చేసిన ఘనత కూడా ఆయనదే .
తండ్రి గారికున్న అపార సంస్కృత పాండిత్యాన్ని వారసత్వంగా పొందాడు ,తండ్రి రాసిన 7అత్యుత్తమ సంస్కృత గ్రంథాలలో ‘’మోక్ష మందిరస్య ద్వాదశ దర్శన సోపానావళి’’అనే ఉత్తమ గ్రంథాన్నిమనకున్న 42 వివిధ వేదాంత శాఖలపై గొప్ప వ్యాఖ్యాన౦. తండ్రికి సాటైన కుమారుడిగా శ్రీనాథ్ తన సంస్కృత పాండిత్య పాటవాన్ని రచనలోనూ నిరూపించాడు .సంస్కృత దర్శనం పై 15 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు .1100పురాతన సంస్కృత శ్లోకాలను ‘’పుష్పాంజలి ‘’పేరుతొ సంకలన౦ గా తెచ్చాడు .ఉద్యోగాకాలం లో రచనకు వ్యవధి లేకపోయింది .
1982లో రిటైరయ్యాక కలానికి పదును పెట్టాడు .అయిదేళ్ళలో అయిదు సంస్కృత నవలలు రాసి గణనీయంగా కీర్తి పొందాడు .అవి విషయానికి ,శైలికి ,నిర్వహణకు ఆదర్శంగా ఉన్నాయని మెచ్చుకొన్నారు విశ్లేషకులు .సంస్కృత నవలా రచనకు మార్గదర్శి అయ్యాడు .భారతదేశ చారిత్రిక విషయాలే వీటిలో కదాంశాలవ్వటం మరొక ప్రత్యేకత .వీటికి మూడు ప్రత్యెక అవార్డ్ లు పొందాడు .ఇవే సి౦ధుకన్య ,ప్రతిజ్ఞా పూర్తి.అజాత శత్రు ,దావానలః ,చెన్నమ్మ.
1984లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ ,1985లో భాణభట్ట పురస్కార ,1986సరస్వతి సమ్మాన్ పురస్కార౦ అందుకొన్నాడు .
నిరంతర కార్య నిర్వహణలో అలసి పోయిన శ్రీనాద్ 64 ఏళ్ళకే 4-3-1988నమరణించి ఆ శ్రీనాథుని సన్నిధానం చేరాడు . సరస్వతి సమ్మాన్ పురస్కారం అందుకొంటూ తాను మహాత్మా గాంధీ జీవితం పై ‘’వ్రతి ‘’శీర్షిక తోఒక చారిత్రాత్మక నవల రాయబోతున్నాను అని ప్రకటించాడు .దురదృష్ట వశాత్తు అది నెరవేరకుండా మరణించాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-19-ఉయ్యూరు
