గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
హర నామామృత మహా కావ్యకర్త -విద్యా ధర శాస్త్రి (1901-1983)
సంస్కృత ,హిందీభాషలలో మహా విద్వాంసుడు విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో 1901జన్మించి 82ఏళ్ళ వయసులో 1983లోమరణి౦చాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతంలో డిగ్రీ పొందాడు .ఆగ్రా యూని వర్సిటీ నుండి సంస్కృత ఎం.ఏ.డిగ్రీపొంది బికనీర్ లో ఉంటూ సాహిత్య సేవలో ధన్యుడై రాష్ట్రపతి నుంచి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదునందుకున్నాడు .1928లో బికనీర్ లోని దుంగార్ కాలేజి లో సంస్కృత లెక్చరర్ గా చేరి ,1936లో శాఖాధిపతి అయ్యాడు .1956లో ఇక్కడ రిటైరై ,ఆలిఘర్ లోని హీరాలాల్ బరాహసైని కాలేజీలో సంస్కృత హెడ్ గా చేరాడు .1958 లో బికనీర్ లో సంస్కృత,హిందీ ,రాజస్థాని భాషాభి వృద్ధికోసం ‘’హిందీ విశ్వభారతి ‘’సంస్థ స్థాపించాడు .దీనికి జీవితాంతం అధిపతిగా సేవలందించాడు .
బికనీర్ రాజకుటుంబ ‘’కులగురువు ‘’హోదా లో ఉంటూ శాస్త్రి ,ఎందరెందరో విద్యార్ధులను ఉత్తేజితులను చేసి తీర్చి దిద్దాడు .వీరి శిష్యపరంపరలో ప్రసిద్ధి చెందిన స్వామి నరోత్తమ దాస్ , బ్రహ్మానంద శర్మ ,కాశీరాం శర్మ ,కృష్ణ మెహతా ,రావత్ సరస్వతి వంటి ఉద్దండులున్నారు .విద్యాధర శాస్త్రి సంస్కృత మహాకావ్యం’’హరనామామృతం ‘’రచించి జగద్విఖ్యాతి చెందాడు.ఈ రచన ముఖ్యోద్దేశ్యం చదువరులు ప్రభావితులై ప్రపంచాభి వృద్ధి కోసం కృషి చేయాలనే .రెండవ మహాకావ్యం గా ‘’విశ్వమానవీయం ‘’రాశాడు .దీనిలో ఆధునికత ప్రభావం, 1969లో చంద్ర గ్రహం పై మానవుడు కాలుపెట్టటం వంటి అంశాలున్నాయి .మిగిలినవి లఘు కావ్యాలు . ‘’విక్రమాభినందనం ‘’లో భారతీయ సంస్కృతీ ,చంద్ర గుప్త విక్రమాదిత్య పాలన ,ఆది శంకరాచార్య ,రాణి పద్మావతి ,గురుగోవింద సింగ్ ,శివాజీ మహారాజ్ మొదలగు మహాత్ములు సంస్కృతీ పరి రక్షణకు చేసిన స్మరణ ఉంటుంది .’’వైచిత్ర్య లహరి ‘’లో మానవ మానసిక వైచిత్ర్యాన్ని చిత్రీకరించాడు .’’మత్త లహరి ‘’లో త్రాగుబోతు సృష్టించే అరాచకాన్ని హాస్యం మేళవించి ,ప్రబోధాత్మకంగా రచించాడు .దీనికి వ్యాఖ్యానంగా ‘’ఆనంద మందాకిని ‘’రాశాడు .మదన మోహన మాలవ్యా శత జయంతి,1962ఇండో –చైనా యుద్ధం సందర్భంగా ‘’హిమాద్రి మహాత్మ్యం ‘’రచించి మాననీయ మాలవ్యా చేత భారతీయులకు హిమాలయాలను కాపాడుకోమని హితవు చెప్పించాడు .అభిజ్ఞాన శాకుంతలం పై ‘’శకుంతల విజ్ఞానం ‘’వ్యాఖ్యానం రాశాడు .ఇందులో ప్రేమకు అపజయం ఉండదని ఉద్ఘాటించాడు .’’అలి దుర్గ దర్శనం’’కూడా రాశాడు .
1915లోనే ‘’శివ పుష్పాంజలి ‘’సంస్కృత కావ్యం రాశాడు దీనిలో ప్రత్యేక ఛందస్సు వాడలేదు .ఘజల్ ,ఖవ్వాలి ధోరణిలో రాశాడు .అదేసమయం లో ‘’సూర్య స్తవం ‘’రాసి ప్రచురించాడు .’’లీలా లహరి ‘’లో భారతీయ వేదాంతాన్ని అద్వైతం భూమికగా విశ్లేషించాడు .ఒక సంస్కృత నాటకం ‘’పూ ర్ణానందనం ‘’నుజానపద కధ ఆధారంగా రాశాడు .దీనిలో భౌతిక జీవితం కన్నా , ఆధ్యాత్మిక జీవన సౌందర్యం విశిష్టమైనదని నిరూపించాడు .కలి దైన్యం, దుర్బలబలం నాటకాలు కూడా రాశాడు.చంపు కావ్యంగా’’విక్రమాభ్యుదయం ‘’.తులసీ దాసు రాసిన కృష్ణ గీతాలను సంకలించి ‘’కృష్ణ గీతావళి ‘’గా తెచ్చాడు .
పేరుకు తగినట్లుగా విద్యాధర శాస్త్రి ప్రతిభకు పురస్కారాలు లభించాయి భారత రాష్ట్ర పతి చేతులమీదుగా వారణాసి లోని విశ్వ సంస్కృత పరిషత్ పురస్కారం అందుకొన్నాడు .1962లో అఖిలభారత సంస్కృత సమ్మేళనం లో డా సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు, సత్కారం పొందాడు .ఉదయ పూర్ లోని రాజస్థాన్ సంస్కృత అకాడెమి ‘’మనీషి ‘’బిరుదం తో ఘనంగా సన్మానించింది .1972భారత స్వాతంత్ర్య రజతోత్సవం లో రాష్ట్రపతి శ్రీ వివి గిరి సన్మానించారు .అఖిలభారత సంస్కృత ప్రచార సభ ‘’కవి సామ్రాట్ ‘’బిరుదుప్రదానం చేసింది .బికనీర్ భారతీయ విద్యామందిర్ 1980లో విశేష సత్కారం చేసింది .భారతీయ సంస్కృతికి, స౦స్కృత భాషకు చేసిన సేవ కు మహారాజా మేవార్ ఫౌండేషన్ వారి ‘’హరిత్ రుషి ‘’బిరుదును 1982లో అందుకున్నాడు శాస్త్రీజీ .
సశేషం
రేపు భోగి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-19-ఉయ్యూరు