శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక

శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక

  ‘’రంగడు బెండ్లియాడిన నప్పిన్నది ‘’అని కృష్ణ దేవరాయలతో కీర్తించబడిన గోదా దేవి ,తమిళదేశం లో ‘’ ఆండాళ్ళు’’గా సుప్రసిద్ధం . ఆమె నెల రోజుల కాత్యాయనీ వ్రతం సందర్భంగా రచించిన 30పాశురాల ‘’తిరుప్పావై ‘’తమిళనాడంతా ధనుర్మాసం లో మారు మ్రోగిపోతుంది  .అదే ఆంద్ర దేశానికీ ప్రాకి రేడియోలో ప్రసారమై తర్వాత ముఖ్య వైష్ణవాలయాలలో చోటు చేసుకొని ,ఇప్పుడు  అన్ని చోట్లా ప్రాచుర్యం పొందింది .తమిళులకు అది ద్రవిడ వేదమై భాసిల్లింది .ఆమెపై  వేదాంత దేశికులవారు వారు ‘’గోదా స్తుతి ‘’రాశారు .తిరుప్పావై కి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో మొదలుపెట్టి ఎందరెందరో తెలుగు లో అనువాదాలు చేశారు .కొందరు ముక్కస్య చేసి జటిలమూ చేశారు. ఆ వైఖానస భాష అర్ధంకాక జుట్టు పీక్కోనేట్లు చాలా వచ్చాయి .కాని వీటిలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ రాసి ,బాపు కనువిందు చేసే బొమ్మలేసిన  ‘’మేలి నోము ‘’మంచి పేరు పొందిందింది .ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగా ప్రచురణా పొందింది .’’బాగుంది ‘’అని ఒకకార్డు ముక్క రాస్తే అత్యంత విలువైన సుందరమైన ఆ ప్రతిని బాపుగారు సంతకం చేసి నాకు పోస్ట్ ఖర్చులు కూడా పెట్టుకొని’’డబ్బులు పంపకండి ‘’అని రాసి మరీ  పంపి నన్నురుణ గ్రస్తుడిని చేశారు .  శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ ఎంతో శ్రమించి ‘’ వేదాంత దేశికులపై సమగ్రమైన పరిశోధనా గ్రంథం రచించి ప్రచురించి  ,గోదా స్తుతి తో పాటు నాకు ఆత్మీయంగా పంపారు .చదివి వెంటనే ఆమెకు అభినందనలు తెలియజేశాను .ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఆంధ్రజ్యోతిలో ఆమె,అత్య౦త ప్రతిభతో అనువాదం చేసి ,వివరణలతో రచించిన   తిరుప్పావై ధారావాహికగా వస్తోంది .దీనికి’’ కేశవ్’’ వేసిన చిత్రాలు మరింత శోభ చేకూరుస్తున్నాయి .

   సరసభారతికి ఆత్మీయురాలు మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు ఫేస్ బుక్ లో రోజుకొక పాశురం సీసపద్యం లో అనువాదం చేసి అందిస్తున్నారు .ఇవీ రస గుళికల్లాగా ఉన్నాయి.వన్నె తెచ్చాయి .జనవరి 6,7 తేదీలలో విజయవాడలో జరిగిన ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు మొదటి రోజున నా ఫాన్ ,శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చర్యులవారి కుమార్తె , విదుషీమణి ,బహు గ్రంథ కర్త ఆంధ్రాంగ్ల హిందీ భాషలలో అఖండురాలు శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారు ఎంతో ఆదరంగా అందమైన ముఖ  చిత్రం తో ఉన్న , ‘’తిరుగీతికలు ‘’ అనే తిరుప్పావై అనువాదాన్ని ,’’వ్యాస రించోళి’’ని నాకు అందజేశారు .ఇప్పుడు  చెప్ప బోయే దంతా  ‘’తిరు గీతికలు’’ గురించే .

   ముందుమాటలలో తమ ‘’అయ్య’’ పుట్టపర్తి వారి తిరుప్పావై ప్రసంగాలు విని ,తిరుప్పావై లోని లోకోత్తర సౌందర్యానికి ఆకర్షితురాలై ఆయన చెప్పినట్లు తల్లిగారి వద్ద నేర్చి అప్పటినుంచి అదొక ధనుర్మాస వ్రతంగా సాగిస్తున్నట్లు చెప్పుకొన్నారు నాగపద్మిని .హిందీ లో అనువదించిన తన తిరుప్పావై హిందీ సప్తగిరి లో దారావాహికయై ,తర్వాత ముద్రణపొందిందట .ఈ సందర్భం గా ఆమె ‘’హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో ఇప్పటికీ ,ప్రతి ధనుర్మాస సుప్రభాతానా భక్తి రంజనిలో తిరుప్పావై వినిపిస్తుంది. 1990లలో డా ఎల్లా వెంకటేశ్వరరావు గారి నిర్వహణ  లో రికార్డ్ అయింది ప్రవచన శిఖామణి శ్రీ సంతానం గోపాలాచార్యులవారి క్లుప్త వ్యాఖ్య ,శ్రీరంగం గోపాలరత్నం గారి ‘’సప్తపది ‘’ప్రసారమయ్యేది ‘’అని  గుర్తు చేసుకొన్నారు  .మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో శ్రీ బాలమురళీ కృష్ణ తిరుప్పావై పాశురం దానికి కృష్ణశాస్త్రి గారి అనువాదం పద్యం శ్రీరంగం గోపాల రత్నం పాడగా ధనుర్మాసం నెలరోజులూ వచ్చేవి. హాయిగా మైమరచి వినే వాళ్ళం

  ఇక అసలు విషయానికి వస్తే పద్మిని గారు అనువాదానికి అచ్చ తెనుగు’’వృషభ గతి రగడ’’ ను ఎన్నుకొన్నారు .రగడ లలో  ఎంతో భక్తి ఇప్పటికే  ప్రవహించింది ఇప్పటికే .బహుశా అదంతా వీరశైవ భక్తీ అనుకొంటా .ప్రార్ధన పద్యాన్ని ఉత్పలమాలిక లో రచించి గోదా రంగానాధులకు ఉత్పలమాలిక హార సమర్పణ చేసినట్లనిపిస్తుంది .ఇందులో ‘’ఆముక్తమాల్యద ‘’గా అంటే’’ సూడికొడుత్తు నాచ్చియార్ ‘’ను స్తుతించారు .శ్రీరంగేశుని తలిస్తే మనసు ‘’సారంగంబు ను వోలె,సారములకై ,సారంగముల్ గోరి తా –సారంగమ్మును సారఘముకై వోలె ,సారంగమున్ బొందగా –సారంగమ్మును వోలెనార్ద్రతను సారంగమున్ జూడగా ‘’అంటూ  కురంగ గమనం తో రెండో పద్యంగా శార్దూలాన్ని పరిగెత్తించారు .మూడవపద్యం ఉత్పలమాలికలో గోదా దేవి తండ్రి పెరియాళ్వార్ శ్రీ విష్ణు చిత్తుని భక్తి పారమ్యాన్ని కళ్ళకు కట్టించి ,చివరిదైన నాలుగవ ఉత్పలమాలికలో ‘’కేశవా పాసుర సేవలంది ,యాపన్నుల బ్రోచుటందు హరి పారము లేదని’’  గోదా  దేవి చెప్పిందనీ ,కనుక ‘’నీ మన్నన వేల్పు బోనమిడి,మార్గళి సేచన సంతసి౦చుమా ‘’అని ఆర్తిగా వేడుకొన్నారు .

  మొదటి గీతిక చివరలో ‘’నీరమున వెలసిల్లు దైవము ,నీ దినమ్ముల వలెను గొలువగ-మీరలన్దరును రాగదే ,ఇక మిత్రతను నీరాడ బాగుగ’’అన్నారు .అలాగే ‘’వెన్న పెరుగును పాలధారల విభవమొసగుము మాకు ‘’.ముకుందుని వేడుకొంటే ‘’మిన్ను దాకెడు సంపదలు ,ధనమును మనకిక దెలుసుకోనుడీ ‘’.కన్నెపిల్లలకు ‘’మాయ నేర్చిన బాలకుండు  ,మాటలాడుట జాల నేర్చెను ‘’’’పీలులవిగో నరచు చున్నవి ,భూరి శంఖ ధ్వనుల వినుడే –చల్లనవ్వుల విషము గుడిపిన శఠత దునిమిన బుడుతదితడే ‘’.’’కట్టుకధలు  వింటి మమ్మా ,కానుపించవే త్వరగా కొమ్మా ‘’’’’ అంబరమ్ములు ,త్రాగు నీరాహారము ను గడుదాన మొసగెడి –ఎమ్బెరుమాళు నంద గోపుల ఏలికకుకు మేల్కొల్పు బాడుడి’’మొదలైన లైన్లు చాలాబాగా ఉన్నాయి .చివరి గీతికలో ‘’పాలమున్నీటిని మదించిన పావనుని ,మాధవుని పదముల –వ్రాలి లీలను మోక్షమందిన భాపతి బోలిన గోపకాంతల’’లో మాటలు అర్ధంకాక అసలే అరవం ,మళ్ళీ ఈతెలుగు సుదూర శబ్దాలే౦టిరా బాబో అనిపిస్తుంది.

  చివరలో అనుబంధంగా ఉన్న దేశికులవారి గోదా స్తుతిని పద్మినిగారు శ్లోకానుసరణగా వృత్త గీత కందాలలో చక్కని అనువాదం చేశారు .భక్తిఅతి సరళంగా  తేటగా ,సుమధురంగా  నాద యుత శబ్ద పరంపరగా ఉంటేనే శోభిస్తుంది అనిపిస్తుంది ఇదంతాచదివాక .

14-1-19  సోమవారం భోగి శుభాకాంక్షలతో 

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-1-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.