గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి(1905)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి (1905

కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైనబాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల (నాయకరాజుల) ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవైద్యునిగా పనిచేశారు.

వేంకటరాయుడు, వేంకమాంబిక దంపతుల సంతానములో ప్రథముడు కాకరపర్తి కృష్ణశాస్త్రి. 1905వ సంవత్సరంలో (స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామసంవత్సర ఆశ్వయుజ శుద్ధ ఏకాదశీ గురువారం) జన్మించిన వీరు పిఠాపురం, పెద్దాపురం, కాకినాడలలో ఆంగ్ల విద్యాభ్యాసం అనంతరం తండ్రిగారివద్ద సంస్కృతవిద్య, సంస్కృత కావ్యములు, నాటకములు, ఆంధ్ర గీర్వాణ భాషా వ్యాకరణములు, ఆయుర్వేదము, జ్యోతిష, సాముద్రిక, వాస్తు శాస్త్రములు నేర్చుకున్నారు.

వంశపారంపర్యంగా వస్తున్న వైద్యవృత్తిని చేపట్టి కాకినాడ పట్టణంలో సుమారు 36 సంవత్సరాలపాటు ప్రజల శారీరక ఆరోగ్యాన్ని కాపాడారు. శ్రీ రావు చెల్లయాంబికా రాజ్ఞీమణుల ఆస్థానవైద్యులుగా ‘రాజవైద్య’ బిరుదాంకితులైనారు. తూర్పుగోదావరి జిల్లా వైద్యసంఘముకు అధ్యక్షులుగా ఆయుర్వేదాభివృద్ధికి కృషి చేశారు.

సంస్కృత పంచకావ్యాలు చదువుతున్న రోజులలోనే తన పద్దెనిమిదవయేట ‘సంయుక్తా కల్యాణము’ అనే ఆంధ్ర ప్రబంధాన్ని రచించారు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారిచే పీఠిక రాయబడిన ఈ కావ్యాన్ని శ్రీ రావు చెల్లయాంబికా జమీందారిణివారు కృతిగా స్వీకరించారు. తన ఇరువదవయేట చంద్రహాస విలాసము అనే ఆంధ్రప్రబంధాన్ని సృజించి శ్రీ చెలికాని సత్యనారాయణ కవిగారికి కృతిగా సమర్పించారు. మూడవ కృతి కౌశికాభ్యుదయము, శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారి కోరిక మేరకు రచింపబడి, వారికే కృతిగా నొసంగబడినది. ఆనాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరువారి యధ్యక్షతను జరుపబడిన పండితమహాసభలో దీని ఆవిష్కారం జరిగింది.

సంస్కృత, ఆంధ్రభాషలలో పది అద్వైత గ్రంథములు వీరిచే రచింపబడ్డాయి. వాటిలోని ‘సదాముక్తి సుధార్ణవము’ అనే గ్రంథము వావిళ్ళ ముద్రణాలయమువారిచే ప్రచురింపబడింది. దీని ప్రతి ఒకటి హైదరాబాదులోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఉన్నది. ప్రత్యక్షమోక్షసౌధము అనే గ్రంథము జర్మనీభాషలోనికి అనువదింపబడింది. వీరు రచించిన జగద్గురు పూజా విధానము అనే గ్రంథాన్ని అనుసరించి శంకరాచార్యుని పూజలను ప్రతి సంవత్సరమూ ఆచరించేవారట!

షష్టిపూర్తి అనంతరము వీరు ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ అధ్యక్షునిగా ఉన్నారు. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికకు సంపాదకులుగా, ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు’ ముద్రణ వ్యవహారాలను వీరు పర్యవేక్షించారు.

వీరు రచించిన ‘అభయసిద్ధి’ అనే అద్వైత వేదాన్త గ్రంథము హైదరాబాదుకు చెందిన ఒక మహనీయునిచే ఆంగ్లభాషలోనికి, పెద్దాపురము నకు చెందిన ఒక విద్యాధికునిచే హిందీ భాషలోనికి అనువదింపబడినది అని తెలుస్తోంది. మరి ఆ అనువాదాల ప్రతులు ఎవరివద్దనైనా ఉన్నవో, లేవో తెలియదు.

కృష్ణశాస్త్రి గారికి కవికంఠీరవ, కవిమూర్ధన్య, ప్రౌఢకవిచంద్ర, విద్వత్కవివర, బ్రాహ్మీభూషణ. అనే ఐదు బిరుదులు ఉన్నాయి. వాటిలో కవికంఠీరవ బిరుదము ఆనాటి ఫ్రాన్స్ దేశ ప్రభుత్వ అధికారులచే బహుకరింపబడింది. కవిమూర్ధన్య బిరుదము శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి గారిచే కౌశికాభ్యుదయము కృతిని స్వీకరించిన సందర్భంలో ఇవ్వబడింది. ప్రొఢకవిచంద్ర బిరుదు కాకినాడ పట్టణంలో ప్రతివాదిభయంకరపార్ఠసారథిగారికి కంచుఢక్క కృతిని సమర్పించినపుడు ఒసగబడింది. విద్వత్కవివర బిరుదముతో రాజమండ్రి గౌతమీ గ్రంథమండలి వారు సత్కరింపగా, బ్రాహ్మీభూషణ బిరుదము గుంటూరు నగర పండితసభలో అప్పటి ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి శ్రీ కాశీకృష్ణాచార్యులచే ఒసగబడింది. ఆగస్టు 06, 1944వ తేదీన కాకినాడ పురప్రముఖులచే సువర్ణఘంటా కంకణముతో సన్మానం జరిగింది.

ఆనాడు అత్యంత ప్రఖ్యాతులైన వ్యక్తుల చేత,సంస్థల చేత ఇవ్వబడిన ఈ బిరుదులు కృష్ణశాస్త్రిగారి భాషాపాండిత్యానికి సూచికలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ బిరుదులన్నీ వారికి గల లౌకికమైన గుర్తింపును మాత్రమే సూచిస్తున్నాయని గమనించాలి. వారి గురువైన అల్లంరాజు నరసింహమూర్తి మహాత్ముల వద్ద ఆర్జించిన అద్వైత జ్ఞానం, దాని ద్వారా పొందిన అనుభూతి, అంతకంటే ముఖ్యం, ఆ జ్ఞానాన్ని అతి సరళమైన, సులభమైన రీతిలో శిష్యులకు, ప్రజలకు పంచిన తీరు – ఇవి ఎక్కడాగ్రంధస్థం కాని విషయాలు.

సశేషం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.