డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1
సరస్వతీ పుత్రులు ‘’అయ్య’’శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారి సరస్వతీ ప్రసాద౦ కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు కీర్తి పొందింది .1972-73 లో అయ్య పుట్టపర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి అంటే చిలకల గుంపు దగ్గర ఆమె మనసు హత్తుకు పోయింది .రించోళి అంటే సమూహం గుంపు అని అర్ధం ..ఆకాశం నుంచి దిగుతున్న చిలకల గుంపు గగన లక్ష్మి మెడ నుంచి కి౦దికిజారుతున్న పచ్చలపతకం లా కనిపించిందట ప్రాకృత కవికి . అప్పటి నుంచీ ‘’రించోళి’’పదం ఆమెను ‘’హాంట్ ‘’చేస్తూనే ఉంది .దాన్ని ఎలాగైనా తనరచనలలో వాడుకోవాలని తపిస్తున్నది .అమెరికాలో ఉండగా తమకుమార్తె శ్రీమతి వంశీ ప్రియ ,అల్లుడు శ్రీ కార్తీక్ ధర్మరాజు దంపతుల కుమారుడు,తమ ప్రధమ దౌహిత్రుడు ,చిరంజీవి అక్షయ్ జన్మించి ఆటపాటలతో మురిపించినప్పుడు రూపు దిద్దుకొన్న అక్షర సంపుటికి ‘’వ్యాస రించోళి’’గా నామకరణం చేసి ఎన్నాళ్ళను౦చో కంటున్నకలకు సార్ధకత చేకూర్చింది. పద్మిని గారి’’ సాహితీ రించోళి’’ లో నన్నూ ఒకనిగా గుర్తించి ,ఆమె విజయవాడ రచయిత్రుల సభ మొదటి రోజు నాకు సరస్వతీ ప్రసాదంగా అందజేశారు .ఇవాళే సంక్రాంతి రోజు సాయంత్రం తీరిక చేసుకొని చదవటం ప్రారంభించి కొంత చదివి, ఇక ఆపుకోలేక అందులో కొంతైనా అర్జెంట్ గా’’ నా సరసభారతి ‘’సాహితీ రించోళి ‘’ కి అందించాలని తపనతో మొదలు పెడుతున్నాను. ఈ సాహితీ వ్యాస సమూహం లో అధికభాగం గాదా సప్తశతి కి చెందిన వ్యాసాలే ఉన్నందున ఆమె పెట్టిన పేరు చాలా సమర్ధనీయంగా ఉందని పి౦చింది .మధుర పదార్ధాలను ,మధుర భావాలనూ కలసి పంచుకోవాలి అన్నది ఆర్యోక్తి .’’కలాసీమా కావ్యం ‘’.కవులు హృదయ నేత్రాలతో దర్శించి అనుభవించిన అనుభూతులకు ,సత్యాలకు కవితా రూపమిచ్చి సంతోషిస్తారు .సమాజం అంటే ఒకరి అవసరాలకు ఒకరు ఆదుకుంటూ ,ముందుకు అడుగు వేసే ఒక సామాజిక వ్యవస్థ అనీ ,అది భౌతిక అవసరాలకే కాక మానసిక ఆనందాలకూ సమభావ సౌరభ వేదికగా ఉండాలి అని పద్మిని చెప్పారు .ఇలాంటి వేదికలు ఆమెకు ఇండియాలో విశేషంగానే లభించాయి. అమెరికాలో కూడా డల్లాస్ లోని శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం,న్యు జెర్సీ లోని డా వైదేహీ శశిధర్ లు అందించారు .పద్మిని గారి శ్రీవారు శ్రీ నల్లాన్ చక్రవర్తుల హర్ష వర్ధన్ గారి తోడ్పాటు తోనే తాను ఇంతగా ఎదిగానని కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .ఈ వ్యాస రించోళి ని దౌహిత్రులు ఛి అక్షయ్,విరజ్ లకు అమ్మమ్మ కానుకగా అందిస్తూ తన అమ్మ ,అయ్యలు శ్రీమతి కనకమ్మ ,శ్రీ నారాయణా చార్యులవార్లను సంస్మరించారు . ఈ వ్యాస సమూహం లో ముందే చెప్పినట్లు అధికభాగం గాదా సప్త శతికి చెందినవే .అందులోని మానవ ప్రకృతి ,అలంకార ప్రియత్వం ,రుతు వర్ణనలో నవ్యత ,చందమామ అందాలు ,గ్రామ జీవితం ,ప్రకృతి,హేమంత సీమంతినీ విలాసం ,ఉన్నాయి .ఇవికాక ‘’అయ్య చూపిన హంపి ,’’గుణిని గుణజ్ణో రమతే ‘’ సూర్యాయ విశ్వ చక్షుషే,సుప్రసన్న దీప వృక్షం ,ఏవితల్లీ నిరుడు విరిసిన స్మృతి లతా౦తాలు కూడా ఉన్నాయి. అనుబంధంగా ఆమె రాసిన ‘’అంతర్జాలం లో మాటల తేటలు ‘’చేర్చారు .
రించోళిపదం నన్నూ బాగా ఆకర్షించింది .ఇదేకాక చేకూరి రామారావు గారు వాడిన ‘’స్మృతి కిణాంకం ‘’లోని కిణాంక శబ్దమూ చాలా ఇంపుగా ఉంది .మూడోసారి 2008లో మేమిద్దరం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తో ఫోన్ సంభాషణలలో చేకూరి రామారావు గారి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది .చేరా తన రూమ్ లోనే ఉండేవారని తామిద్దరికీ మంచి మైత్రీ బంధం ఉండేదని అమెరికావస్తే తమ ఇంటికి రాకుండా చేరా దంపతులు ఉండరని చెప్పారు .మేము ఆ అక్టోబర్ చివర్లో ఇండియా వస్తూ ఉంటే మైనేనిగారు చే రా గారి అడ్రస్ ,ఫోన్ నంబర్ నాకు ఇచ్చి ,నేను ఆయనను కలవటానికి వస్తున్నట్లు ము౦దే చేరా గారికి ఫోన్ చేసి చెప్పారు .2008 నవంబర్ 1వ తేదీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నేనూ మా అబ్బాయి రమణ చేరా గారింటికి వెళ్లి కలిశాము. ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రాచీనభాషగా గుర్తించిన చిరస్మరణీయమైన రోజు . చేరా దంపతులు యెంతో ఆప్యాయంగా ఆహ్వానించి కాఫీ టిఫిన్ ఇచ్చి తమ అమూల్య గ్రంధాలను సంతకం పెట్టి నాకు అందజేశారు చేరా ..అందులో ‘’స్మృతి కిణా౦కం ‘’కూడా ఉంది .అప్పటినుంచీ ఆపదం నన్నూ ‘’హాంట్’’ చేస్తూనే ఉంది.
‘’ గాదా సప్త శతి అమూల్య మౌక్తిక రాశి .ముక్తకాలు –వేటికవే సంపూర్ణార్ధం కలిగి ,చదువరులను ఆహ్లాద పరచే రసగుళికలు .దీనినే అనిబద్ధ కావ్యముక్తకం అంటాడు భామహుడు .’’చమత్కార సృష్టిలో సామర్ధ్యమున్న శ్లోకమే ముక్తకం అన్నది అగ్నిపురాణం’’.పూర్వాపర నిరపేక్ష ణాపియేన ,రస చర్వణా క్రియతే తదేవ ముక్తకం ‘’అని లోచనకారుడు అన్నాడు. వ్యంజనం తోపాటు రస సృష్టిలోనూ సామర్ధ్యమున్న ముక్తకాన్ని ‘’సరస ముక్తకమని ‘’,కల్పనా, నీతీ గంభీరంగా ఉంటె ‘’సూక్తి ‘’అనీ అంటారు .చమత్కారం లేకపోతె ‘’వస్తు కథన ముక్తకంఅంటారు .మనిషిలోని మానసిక శక్తి 1-పూర్ణ నియంత్రణాత్మక బౌద్ధిక దృష్టి 2-పూర్ణ భావాత్మక చేతన 3-నైతికత 4-కవిత్వ శక్తి ఉంటాయని వీటిలో కవిత్వ శక్తి శ్రేష్టమైనది ‘’అని గాధలలోని వైశిష్ట్యాన్ని నాగపద్మిని విశ్లేషించారు .
ఈ రించోళి లో నాకు తెలియని విషయాలు చాలా తెలిశాయి .వీటిని మీకు వరుసగా అందించే ప్రయత్నం చేస్తున్నాను .
సశేషం
సంక్రాంతి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-19-ఉయ్యూరు