డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5
అయ్య చూసి (పి)న హంపి-3
మాధవుని తల్లి, భార్య మరణించారు .భవబంధాలు తెగిపోగా ఇక శ్రీ భువనేశ్వరీ సేవలోనే జీవిస్తున్నారు .దేశాన్ని రక్షించే మార్గం నిర్దేశించమని మనసార ప్రార్ధిస్తున్నారు .పంపా౦బిక పరమేశ్వరుని పతిగా పొందేందుకు తపస్సు చేసిన చోటే ,అంజనాదేవి ఆంజనేయుని వాయుపుత్రునిగా పొందిన చోటు , శ్రీరాముడు వాలి సంహారం చేసి సుగ్రీవ పట్టాభి షేకం చేసిన చోటు ,కుక్కలు కుందేలును తరిమికొట్టిన పౌరుష గడ్డ అయిన పంపా తీరం లోనే 12 ఏళ్ళు ఘోర తపస్సు చేశారు ఆహార పానీయాలు లేకుండా . .అమ్మ కరుణించి ప్రత్యక్షమై ‘’ఇక నుంచి నువ్వు ‘’విద్యారణ్యుడు’’ అని పిలువబడుతావు .త్వరలోనే నీ మనస్సులోని సంకల్పం నెరవేరుతుంది ‘’అని అభయమిచ్చి ఆశీర్వదించింది జగన్మాత .’’త్వరలో అంటే ?’’అని అడిగాడు అమ్మను .‘’వచ్చే జన్మ లోనే .కారణం నువ్వు సన్యాసికావాలి ‘’అని వెంటనే అమ్మ సమాధానం .అంతే వెంటనే ‘’ఇదుగో ఇప్పుడే’’ అంటూ సన్యాసం స్వీకరించగా అమ్మ పెదవులపై దరహాసం ద్విగుణీకృతమై ‘’కొన్ని రోజుల్లోనే నీ కోరిక నెరవేరుతుంది ‘’అని చెప్పి తృప్తి కలిగించింది .
విద్యారణ్యులు విరూపాక్ష సన్నిధానం లోనే ధార్మిక ప్రవచనాలు చేస్తూ , సమర్ధులైన భావి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు .ఆనె గొందే యుద్ధం లో రాజు జ౦బుకేశ్వరుని మహమ్మద్ బీన్ తుగ్లక్ చంపేసి మల్లిక్ నబీ ని ప్రతినిధిని చేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు .అదే అదనుగా భావించి కొంతమంది యువకులతో తిరుగుబాటు చేయించారు విద్యారణ్యులు .వాడు భయం తో ఢిల్లీ కి పారిపోయి తుగ్లక్ కు చెప్పగా తనవద్ద ఖైదీలుగా ఉన్న హరి హర ,బుక్క రాయలను తిరుగుబాటు అణచి వేయమని పంపాడు .తమకూ మంచి రోజులు వచ్చాయని గ్రహించి సోదరులు విద్యారణ్యులను శరణు వేడారు .వీరిలో రాజ ఠీవి గమనించారు .వీళ్ళను అంతకుముందు తురకలు కుమ్మట దుర్గాన్ని నాశనం చేసి ధిల్హీకి బందీలుగా పట్టుకెళ్ళి మతం మార్పించారు .దేశికుల ‘’అభీతి స్తవం ‘’ప్రభావం ఇక్కడా కనిపించిందని సంతోషించారు .వారిద్దరినీ హిందూమతం లోకి మార్చి ,తన పాండిత్య ప్రకర్ష హిందూ ధర్మ దేశ రక్షణ ,రాజతంత్రం మేళవించి సోదరులను ఆనె గొందే కోట జయించి మల్లిక్ నల్లీ ని బందీగా పట్టుకోనేట్లు వ్యూహం పన్ని తొలి విజయం సాధించారు .
ప౦పా క్షేత్రం లో అనువైన ప్రదేశం లో 1336లో వైశాఖ శుద్ధ సప్తమినాడు వియనగర సామ్రాజ్య స్థాపనకు శంకు స్థాపన చేశారు .అన్నీ బాగానే ఉన్నాయి .మరి రాజ్యానికి కాసులు లేవు .అమ్మవారిని ఆర్తిగా వేడుకున్నారు .అమ్మ కృపా వర్షం తో పాటు ఏడున్నర ఘడియల సేపు కనకవర్షం కురిపించింది .ఈ ధనంతో సైన్యం,ఆయుధాలు సమకూర్చుకొని ,హరిహర బుక్క సోదరులు రాజ్య విస్తరణ చేసి ముందుగ హరిహరుడు తర్వాత బుక్క రాయలు రాజ్యపాలన చేశారు .విద్యారణ్యులు ప్రధానమంత్రిగా పథనిర్దేశనం చేశారు .అధికార కాంక్ష ఇసుమంతైనా లేకుండా, సన్యాసి గానే జీవిస్తూ తమ్ముడు సాయనుని సాయం తో ‘’సర్వ ధర్మ దర్శన సంగ్రహం ‘’రచించారు .అక్షోభ్యులవారిని ఆహ్వానించి గౌరవమర్యాదలు చేశారు వారి శిష్యులు జయతీర్దుల వారిని విజయనగరానికి ఆహ్వానించి గజా రోహణ గౌరవం కల్పించి సత్కరించి ,భారతీ తీర్ధుల నిర్యాణం తర్వాత శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాదిపతిగా అభిషిక్తులయ్యారు శ్రీ విద్యారణ్య స్వామి .55 సంవత్సరాల సేవలో తరించి ‘’పంచదశి ‘’,జీవన్ముక్తి వివేక ‘’అనుభూతి ప్రకాశిక ‘’,పరాశర మా౦డవీయ’’ తో పాటు శ్రీ శంకర భగవత్పాదుల ‘’జీవిత చరిత్ర ‘’శంకర విజయం ‘’రచించారు .ఇదే చాలా సాధికారమైన రచన గా గుర్తింపు పొందింది .మొత్తం మీద 16 ధార్మిక గ్రంథాలు రచించి ఆర్ష ధర్మానికి ,అద్వైత మత ప్రచారానికి విశేష కృషి చేశారు . కర్ణాటక సంగీతం లోనూ నిష్ణాతులుకనుక 16రాగాలకు రూప కల్పన చేసి తాను రాసిన ‘’సంగీత సార ‘’లో వివరణ కూడా ఇచ్చారు .విశాల హిందూ సామ్రాజ్య స్థాపనకోసం చెల్లా చెదురుగా ఉన్న పాండ్య ,చోళ కేరళులను మేధా శక్తితో సైన్యబలం తో లోబడేట్లు చేసి ,దక్షిణ దేశాన్ని అంతటినీ ఒకే త్రాటిపై నిలబెట్టిన మేధావి .వారు శృంగేరిలో సమాధి చెందలేదని ,’’ముడుబాగల ‘’లో అని అభి ప్రాయ భేదం ఉందని పుట్టపర్తి వారు ఉవాచ .విరూపాక్ష ఆలయం లోని భూగృహం లో విద్యారణ్యుల వారి సమాధి ఉందని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మగారి చివరి సోదరుడు ,విజయనగర చరిత్ర పరిశోధకులు శ్రీ గోపాల కృష్ణమాచార్యులు పుట్టపర్తి వారికీ చూపించారట .పరమ శివావతారం అయిన విద్యారణ్యస్వామి పై అచంచల భక్తి విశ్వాసాలున్న హరిహర బుక్కరాయలు ఇలా స్వామి వారిని విరూపాక్ష స్వామి దేవాలయ భూగృహం లో సమాధి చేయించి ఉంటారని పుట్టపర్తివారూ సమర్ది౦చారట .’’దక్షిణభారత చరిత్రనే మార్చి వేసి,118 ఏళ్ళు జీవించిన విద్యారణ్యుల వారిని తలచుకొని కన్నీరు కార్చేవారు అయ్య’’అని కుమార్తె పద్మిని చెప్పారు .ప్రజాక్షేమమే ధ్యేయంగా ,నిజాయితీ ఉన్న కార్యకర్తగా, స్వార్ధ రాహిత్యం తో,దేశ రక్షణకు దైవీ శక్తి ,తన సంకల్పం తో తపస్సంపన్నతతో , ధార్మిక ప్రవక్త గా శిఖరాయమైన ప్రజ్ఞా పాటవాలతో వెలుగొందిన హిమాలయోన్నత మనీషి శ్రీ విద్యారణ్య స్వామి అని అ౦జలి ఘటించారు శ్రీమతి నాగపద్మిని.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-19-ఉయ్యూరు