డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2
ప్రాకృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గతొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్లభ సంకలించిన ‘’వజ్జా లగ్గ’’లో 795గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తావన .ఒకే విషయానికి చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే అదొక వజ్జ అవుతుంది .ఒక్కో వజ్జలో ఒక్కో విషయం ఉంటుంది .కావ్యం ,సజ్జనులు, స్నేహం, దేవుళ్ళు మొదలైన శీర్షికలతో వజ్జలున్నాయి అని విశ్లేషించారు పద్మిని ..’’స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం ‘’అనే సినీకవితా పంక్తి మనకు తెలిసిందే .స్నేహాన్ని గురించి ఒక ప్రాకృతకవి ‘’స్నేహం పాలూ నీళ్ళు లాగా కలిసి పోవాలి. పాలను వేడి చేస్తే ముందుగా ఆవిరయ్యేది నీళ్ళే .ఆపదలో తాను ముందు ఎదుర్కొని, మిత్రుడిని రక్షించినవాడే నిజమైన స్నేహితుడు ‘’అంటాడు .అలాగే పది మందికీ ఉపయోగపడని ధనవంతుడి వలన సమాజానికి ఏమి లాభం ?వాడిని తాటి చెట్టు తో పోల్చి చెప్పాడు కవి అందంగా నీతి బోధకంగా –‘’ఛాయా రహి నిరాసమస్స దూర వరదావి య ఫలస్స-దొసెహి సమజా కా వి తుంఇ యా తుజ్జరే తాల ?’’
తాటి చెట్టూ !నీడ ఇవ్వలేవు ,నీ ఫలాలూ అందన౦త ఎత్తులో ఉండటం వలన ఎవరికీ ప్రయోజనం లేదు నువ్వు యెంత ఎత్తుగా ఉన్నా మాకేమిటి నీ వల్లలాభం ?.12వ శతాబ్ది హేమచంద్రకవి పవిత్రత గురించి చెప్పిన ‘’గంగా యమునా సరస్వతీ నదులలో స్నానం చేసినంత మాత్రాన శుద్ధి జరుగు తుందా ?అలా అయితే వాటిలో రోజూ ఈదులాడే గొడ్లకుకూడా శుద్ధి లభిస్తుందా ?తెలిసీ తెలియకస్నానం చేస్తే ఫలితం రాదు అని తమాషాగా చెప్పాడు .కోపం ,అభిమానం మాయ లోభం మనిషి లోంచి దూరమైతే తప్ప అంతశుద్ధి సాధ్యం కాదని కమ్మగా చెప్పాడు హేమ చంద్రుడు .హాలుడు సేకరించిన గాదా సప్త శతి శృంగార౦ రంగరించినది మాత్రమే కాదు అది సామాజిక దర్పణం అని కూడా గ్రహించాలన్నారు పద్మిని .సోమరి , సొంబేరు ను ఎప్పుడో హెచ్చరించాడు ఒక ప్రాకృతకవి –‘’ఆరంభతస్స ధు అం లచ్చీమరణం వి హోయి పురిసస్స-త౦ మరణ మణా రంభే వి హోయి లచ్చీ వుణ ణ హోయి ‘’-ఏదైనా పని మొదలు పెట్టేవారికి లక్ష్మీ ,చావు రెండూ వరిస్తాయి .అసలు పనే చేయని వారికి చావు మాత్రం తప్పదు .
లక్ష్మణ పాత్రనుఉపయోగించి ఒక వదిన తనమరిది దురాలోచన ను యెంత సున్నితంగా మరల్చే ప్రయత్నం చేసిందో తెలియ జెప్పే ప్రాకృత గాధ చూడ౦డి –‘’దిఅరస్సఅసుద్ధ మనస్సకులవహూ ణి అఅ కుడ్డలిహి ఆ ఇం-ది అహం కహేయి రామాణు లగ్గ సోమిత్తి చరి ఆ ఇం’’.ఒక పల్లెటూరులో ఒక వదినపై మరిది దురూహను పెంచుకొన్నాడు .అది బయట పడితే కుటుంబ గౌరవం బజారున పడుతుంది .కానీ వాడిని దారిలో పెట్టాలి లాఘవంగా ఎలా ?అన్యాపదేశంగా మరిదికి రామ లక్ష్మనులున్న చిత్రాన్ని పదేపదే చూపిస్తూ లక్ష్మణుడు లాగా అన్న పెద్దరికాన్ని నిలబెట్టు.వదిన నైన నన్ను చెడు దృష్టి తో చూడకు ‘’అని హితవు బోధించి అపాయం నుంచి తననూ ,కుటుంబ గౌరవాన్ని చాలా తెలివి తేటలతో కాపాడింది ఆ వదిన .
మంచి సంప్రదాయాలను తండ్రి తన వారసుల చేతకూడా కొన సాగించటం సంప్రదాయం .కానీ ఇలాంటి వారు అరుదుగానే ఉంటారు లోకం లో .దీన్ని అందంగా చెప్పాడు కవి –స్నేహం వలన ఏర్పడే అనురాగం ఏ మాత్రం తరగకుండా ,అప్పులాగా తన తరవాత తరాలకూ సంక్రమింప జేసే సత్పురుషులు లోకం లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు అంటాడు .సప్త శతి సంతరించిన హాలుడు రాజనీతిజ్ఞుడైన చక్రవర్తి కనుక రహస్యం విలువ ఎలాంటిదో గొప్పగా తెలియ జెప్పే గాధ ను ఎన్నుకొన్నాడు –సజ్జనులు తమకెవరైనా రహస్యం చెబితే ,దాన్ని ఆ ఆ తర్వాత వాళ్ళతో పోట్లాట వచ్చినా కూడా బయట పెట్టరు .అది వారి హృదయం లోనే ఇంకిపోయి వారితోపాటే చితికి ఆహుతైపోతుంది .బ్రతికి ఉండగా ఎన్నడూ అది బయట పడదు .ఆచరణలో అసాధ్యం అనిపించినా చాలా గొప్ప నీతి వాక్యం కదా ఇది .’’ఇల్లు చూడు ఇల్లాలిని చూడు ‘’అన్నారు మనవాళ్ళు .ఇల్లాలు అంటే స్నేహపూరిత హృదయం తో ,మంచి ఆలోచనలతో రూప గుణ సంపన్నత తో ,భర్త సుఖ దుఖాలలో భాగస్వామిని అయి శాంతిగా జీవితం సాగించేది .అలాంటి అర్ధాంగి దూరమైతే భర్త పడే మనో వేదన వ్యక్తం చేసే గాధ-‘’సుఖ దుఖాలను సమానంగా పంచుకొని జీవించిన దంపతులలో ఎవరు ముందు చనిపోయినా వాళ్ళే బ్రతికి ఉన్నవారితో సమానం .మిగిలిన వాళ్ళు బతికి ఉన్నా జీవన్మృతులే అంటాడు కవి .భార్యపై అత్యంత మమకారం ప్రేమల ఉన్న ఒక రైతు భార్య మరణిస్తే ,తట్టుకోలేక ఆమె లేని గృహం శూన్యంగా అనిపించి ,ఇంటికి వెళ్ళాలి అనిపించక పనులేమీ లేకపోయినా పొలం లోనే కాలం గడుపుతున్నాడట .భార్య జ్ఞాపకాలను అతడు మనసు నుంచి తుడిచి వేయలేకపోవటం వారి మధ్య ఉన్న అనురాగానికి పరాకాష్ట.అందరికీ ఆదర్శం ,ప్రేరణ కూడా –
దీర్ఘాయుర్దాయానికి కూడా సూక్తులు ఇందులో చోటు చేసుకొన్నాయి అందులో ఒకటి –‘’సిల దమ ఖంతి జుత్తా దయావరా మంజు భాషిణోపురిసా –పాణవహావు ణి యత్తా దీహావూ హో౦తి సంసారే ‘’-అంటే శీలం ,దయ, క్షమా, ఇంద్రియ నిగ్రహం ,మంచి సంభాషణ లతోపాటు అహింస ఉన్నవాడే దీర్ఘాయుస్సు పొందగలాడు .2016 ఆంద్ర ప్రభలో ప్రచురితమైన వ్యాసం ఇది .
మానవ ప్రకృతిని ప్రాకృత భాషలో అక్షరబద్ధం చేసి ,నిక్షిప్తం చేసి సర్వకాల సర్వావస్థలకూ మార్గ దర్శనం చేసే గాధా లహరి కి తనదైన బాణీలో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిన డా నాగపద్మిని అభిన౦దనీయురాలు .
సశేషం
శుభా కాంక్షలతో
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-19-ఉయ్యూరు