డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం )

కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి వంగడాలు౦డేవట .1522లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘’డోమింగో ఫేస్ ‘’విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి కనీసం సంవత్సరకాలమైనా కావాలని ,రోమ్ కన్నా చాలా విశాల సామ్రాజ్యమని ,ఏడు ప్రాకారాలమధ్య అత్యంత విశాల కట్టు దిట్టమైన సైనిక బందో బస్తు మధ్య అత్యంత విశాల భవనాలలో జ్వాజ్వల్యమానంగా అలరారేదని ,సామాన్యప్రజలు కూడా మంచి ఆభారణాలు  నాణ్యమైన దుస్తులతో అలంకార ప్రియత్వంగా ఉండేవారని ,జాజి గులాబీ పూలంటే ప్రజలకు చాలా ఇస్టమని ,ఎక్కడ చూసినా సంతృప్తి తా౦డవి౦చేదని ,రాయలు రాజ్య ధనాగారం నుండి తనకోసం, తన కుటుంబం కోసం ధనంవాడుకోవటం జరగలేదని ,సంవత్సరానికి కోటి బంగారు నాణాలు ప్రజలనుండి ప్రభుత్వానికి జమ అయ్యేదని ,ఆ డబ్బు అంతా ప్రజల సాంఘిక ధార్మిక కాభి వృద్దికే వెచ్చి౦చేవారని ,కటకం నుండి గోవా వరకు ,హిందూ మహా సముద్రం నుండి రాయచూరు వరకు విస్తరించిన విజయనగర సామ్రాజ్యం శాంతి సౌభాగ్యాల సంక్షేమ సామ్రాజ్యమని వేనోళ్ళ పొగిడాడు .

పోర్చుగీసు యాత్రికుడు ‘’బార్బోసా ‘’రాయల పరమత సహనాన్ని ప్రత్యేకించి మెచ్చాడు. ప్రతి వ్యక్తికీ తాను నమ్మిన ధర్మాన్ని అనుసరించే స్వాతంత్య్రం ఉండటం రాయల వ్యక్తిత్వానికి ప్రతీక అన్నాడు .వీరిద్దరికంటె ముందు 1420లో వచ్చిన ఇటలీ యాత్రికుడు నికోలాకొంటీ ,1446లో మధ్య ఆసియా నుంచి వచ్చిన అబ్దుల్ రజాక్ లు రాయల సామ్రాజ్య విభాగాన్ని తనివితీరా పొగిడారు .రజాక్ ‘’Pupil  have never seen,and the ear of intelligence never heard of such city ‘’అని ఘనంగా చెప్పాడు .ధార్వాడ జిల్లాలో మాసూర్ లో రాయలు త్రవ్వించిన కాలువను’’ ఫ్లె ఫేర్’’అనే  బ్రిటిష్  ఇంజనీర్ చూసి అంతపెద్ద కాలువ త్రవ్వించటం 19 వ శతాబ్ది సెంట్రల్ యూరప్ దేశాలకు ఇప్పటికే సాధ్యమయ్యే పనికాదని  ఆశ్చర్యం లో మునిగిపోయాడు .థామస్ మన్రో అయితే కృష్ణరాయల సామర్ధ్యాన్ని వర్ణించటానికి వేయి నోళ్ళు చాలవు అన్నాడు .ఇదంతా చరిత్ర చెప్పిన సాక్ష్యమే అని మనం గ్రహించాలి .ప్రజలనూ, సైనికులనూ, వాణిజ్య సముదాయాన్నీ ఒకే రకమైన ఆదరాభిమానాలు చూపాడు రాయలు .కళలపట్ల దీనికి రెట్టింపు అభి రుచి ఉండటం రాయల ప్రత్యేకత .హంపీవిరూపాక్ష దేవాలయం ,రాతిరధం, విఠలేశ్వరాలయం ,రాణీ వాసపు స్నానాగారమైన లోటస్ మహల్ , సప్తస్వర మండపం ,బృహదీశ్వరాలయం ,లేపాక్షి, తిరుమల వెంకటేశ్వర దేవాలయ స్వర్ణఖచిత గోపురం,  పెనుగొండ రామాలయం కృష్ణరాయల కళా ధార్మిక సేవకు నిలువెత్తు నిదర్శనాలు .

వీటన్నిటికి మించి రాయల ‘’భువన విజయం ‘’దేవేంద్రుని ‘’సుధర్మ ‘’కు సాటి .భువన విజయకవుల కవితా పాండిత్యం నభూతో అనిపిస్తుంది .తొలి ప్రబంధం అల్లసాని  పెద్దనా మాత్యుని ‘’ మను చరిత్ర ‘’పురుడు పోసుకొన్న నేల .ఇది ఎన్నో ప్రబంధాలకు బాట వేసింది .సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పించాడు ఆముక్తమాల్యద ప్రబంధ రచనలో రాయలు .ధూర్జటి గారి కాళహస్తీశ్వర మహాత్మ్యం శివ భక్తీ తత్పరమై జేజేల౦దుకొన్నది తెనాలి రామలింగని పాండురంగ మహాత్మ్యం ,ఆయన చుట్టూ అల్లుకొన్న కథలు చాటువులు నేటికీ నిత్య వినోదాలు .రాయల ఆముక్తమాల్యద కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు సన్నిధానం లో రూపు దాల్చింది .భక్త శిఖామణి పురందరదాసు ,వాది రాజు ,కన్నడ భక్త శిఖామణి కనకదాసు రాయలకాలం లోని వారి స్వర్ణయుగానికి రేకులు తొడిగారు .ఇదేకాలం లో భరతముని భారత శాస్త్రమూ వర్దిల్లిందట .

కన్నడ సరస్వతిని అర్చించి వీర శైవామృత ,భావ చిన్తారత్న సత్యేంద్ర చోళ గాదె వంటి రచనలు చేసిన మల్లనార్యుడు’’కృష్ణనాయక ‘’రచయిత తమ్మన్నకవి,భేదో జ్జీవన ,తాత్పర్య చంద్రిక ,న్యాయామృతం ,తర్క తాండవ వంటి అజరామర గ్రంధాలను రచించి ,కృష్ణరాయల కులగురువుగా గౌరవ స్థానం అలంకరించిన వ్యాసరాయలు రాయల కీర్తి కిరీటానికి వన్నెలు చిన్నెలూ తీర్చి దిద్దిన మహానుభావులు .732శ్రీ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు నిర్మించిన  మహాహనుమభక్తులు వ్యాసరాయలు .వ్యాసరాయల పేరువింటే పులకించి పోయే పుట్టపర్తివారు ‘’ దేశాధినేతగా ,పాలన దక్షునిగా ,కళాభిమానిగా ,వాణిజ్య వేత్తగా ,న్యాయ సంరక్షకునిగా  బహు ముఖీన వ్యక్తిత్వం తో దక్షిణ దేశ చరిత్రనే తన వెంట నడిపిన రాయలవారిని తన ఉపాసనా బలం తో తిరుగు లేని నాయకునిగా నిలిపిన పరమ పవిత్ర యోగి వర్యులే వ్యాసరాయలవారు ‘’అని పొంగి పోయి చెప్పారు .మధ్వమత మూల స్తంభం శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాసరాయలు  ఆజన్మ మేధావి .అమేయ సాధనా సంపత్తికి ప్రసిద్ధి .బాలునిగా ఉండగానే సన్యసించిన వారు. దీని వెనుక ఒక కధఉంది .సాలువ నరసింహ రాయల కాలం లో తిరుమల ఆలయం లో పూజాదికాలలో జరిగిన దోషాలను నివారించటానికి వ్యాసరాయలనుప్రార్ధించి  పంపారు .ఆయన అక్కడ 12ఏళ్ళు నిరాఘాటంగా పూజాదికాలు నిర్వహించి  దోషనివారణ చేసి ,నిత్యపూజకై వంశ పారంపర్య పూజారులను నియమించి ,తాము తపస్సమాదిలోకి వెళ్ళిపోయారు .ఈలోగా విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు .కానీ రాయల జాతక రీత్యా ఉన్న ‘’కుహూ యోగం ‘’ఆయన్ను కబళిస్తుంది అని జాతక పండితుల హెచ్చరిక .

అమర సి౦ హుని ‘’నామ లింగాను శాసనం ‘’లో చెప్పినట్లు ఒక అమావాస్య నాడు రవి, కుజ,శని, రాహు గ్రహాలకలయిక 12 వ ఇంట జరిగినపుడు జాతకునికి ప్రమాదం అని హెచ్చరించింది దీనినే కుహూ యోగం అంటారు ..రాయల జాతక రీత్యా ఇది 1514సంవత్సరం ఫిబ్రవరి 4న అంటే స్వభాను నామ సంవత్సర మాఘ అమావాస్య  శతభిషానక్షత్రం రోజు .ఆరోజు సూర్యగ్రహణం కూడా ఉండి ఉండచ్చు.కుహూ యోగ ఫలంగా జాతకునికి బంధు మిత్ర పరి వార జనుల౦దరి నుండి వియోగం సంభవించి ,నివసించటానికి నీడ కూడా కరువై చివరికి ప్రాణహాని సంభవిస్తుంది .ఈ ఆపద నుంచి రక్షించే పుణ్య పురుషునికోసం వెతుకుతూ గజరాజు కు పూలదండ ఇచ్చి వదిలి దాని వెనక సైనికులు పరుగులు పెడుతున్నారు .అది తిరిగి తిరిగి ఎక్కడో కొండాకోనల్లో ధ్యాననిమగ్నుడైన వ్యాసరాయలను చేరి పుష్పహారాన్ని ఆయన కంఠ సీమను అలంకరించింది .కృష్ణరాయలకు ఊపిరి లేచి వచ్చింది .వెంటనే వ్యాసరాయల సన్నిధి చేరి శరణు వేడి సగౌరవం గా  విజయనగరానికి ఆహ్వానించగా ,ఆయనా సంతోషం తో వచ్చి కుహూ యోగం ఉన్న రోజున విజయనగర సింహాసనాన్ని అధిస్టించి మహారాజయ్యారు .ఆ విష ఘడియలలో కుహూ యోగం ఒక విష సర్పం రూపం లో వారిని కాటు వేయటానికి వచ్చింది .వారు చిరునవ్వుతో దానివైపు చూసి తన పై ఉత్తరీయాన్ని దానిపై వేయగా ,అది కనురెప్పకాలం లో మలమల మాడి  బూడిదగా నేల రాలింది .తాను  సింహాసనం అధిరోహించిన అవసరం ,అలా శుభ ప్రదంగా మారిన సందర్భంగా వ్యాసరాయలు శ్రీ  కృష్ణ దేవరాయలను పట్టాభి షిక్తుని చేశారు .తనకు ప్రాణ భిక్ష పెట్టినందుకు రాయలు వ్యాసరాయలవారిని స్వర్ణ సింహాసనం పై సగౌరవంగా కూర్చోబెట్టి ,నవ రత్నాభి షేకం నభూతో గా  చేసి కృతజ్ఞత ప్రకటించాడట రాయలు ..

కుహూ యోగాన్నే ఉపాసనాబలం తో భక్తి తన్మయత్వం తో లొంగ దీసిన మహా శక్తి తపో సంపన్నులు వ్యాసరాయలు బాలకృష్ణుని కూడా తమ కను సన్నలలో  ఆడించేవారట .దీనికి సాక్ష్యమే వారు యమునాకల్యాణి రాగం లో రచించిన ‘’కృష్ణా నీ బేగనే బారో ‘’కీర్తన .వారు పిలిస్తే ‘’కిత్తమూత్తి మామయ్య’’ పట్టు పీతాంబరం ధరించి శ్రీ చందన ఘుమఘుమలతో ,కాలిగజ్జెల దిమి ధిమి  ధ్వనులతో నాట్యం చేస్తూ లీలా మానుష వేషధారి ప్రత్యక్షమవ్వాల్సిందే .అంతటి భక్తి శక్తి సంపన్నులాయన .

హంపీలో వ్యాసరాయలు ‘’యంత్రోద్ధారక ప్రాణ దేవరు ‘’హనుమను ప్రతిష్ట చేయాలని సంకల్పించి ,అనేకమారులు చిత్రం గీసేవారు. వెంటనే అది మాయమై పోయేది .ఇలా 12రోజులు గడిచాయి .13వ రోజు వాయు చిత్రం గీసి దాన్ని యంత్రం లో బంధించారు .చిత్రం లో 12 వానరాలు ఒక దాని తోక మరొకటి పట్టుకొని ఉన్నట్లుగా వాయు చిత్రం చుట్టూ గీశారు  .ఈ బంధం లో చిక్కుకునిపోయిన వాయు జీవోత్తముడు బయటికి రాలేక అలాగే నిలిచి పోయాడని ,ఆయ౦త్ర౦ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నదని పుట్టపర్తి వారు చెప్పారు .

అయ్యకు గత జన్మలో హంపీ ప్రాంతం తో గట్టి బంధమే ఉండి ఉంటుందని నాగపద్మిని గారి గట్టినమ్మకం .అక్కడి శిల్పాలలో సహజ శృంగారం ,బంధాలు అన్నీ శాస్త్రబద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పేవారట .క్రోధ ప్రదర్శన కోసం భీమ సేన దర్వాజా దగ్గర భీముని ముఖ కళను చూడాలని చెప్పేవారాట .మహర్నవమి దిబ్బ వెనకాలున్న భేతాళాకారాన్నీ చూడాలట .విఠలాలయం కళ్యాణ మండపం లోని లోపలి స్తంభాలపై చెక్కిన శిల్పం మరీ ప్రత్యేకమైందిట .ఒక హిందువు ఒక తురకవాడిని కోపం తో నిండినకళ్ళతో గడ్డం కింద కత్తి పెట్టి చంపబోతున్నట్లు చెక్కిన శిల్పం చూచి తీరాల్సి౦ దే నట .విఠలాలయ భిత్తికా (గోడ )భాగాలలో,చుట్టూ ఉన్న బొమ్మలలో ,గుర్రాలను నడిపించుకొని వస్తున్న ఒక పోర్చు గీసు వ్యాపారి బొమ్మ ఉందట .అతని కళ్ళల్లో తన గుర్రానికి తగిన ధర వస్తుందా రాదా అనే సందేహం కొట్టవచ్చినట్లు శిల్పి చెక్కిన తీరుపరమాద్భుతమట .ఇలాంటి భావాలు కవిత్వం లో సాధ్యమేమోకాని చిత్రాలో సాధ్యమా అని పిస్తాయట .సాధ్యమే అని ఆశిల్పి నిరూపించాడట .                               స్వచ్చమైన దేదీ లేదని సా౦కర్యమే రసపోషణకు మూలమని విజయనగర శిల్పం కూడా సాంకర్య సూత్రానికి లోబడిందే అని ,కాని దాని సహజ లక్షణం హైందవం అని ,హైందవం లో ద్రావిడం ద్రావిడ శిల్పకళ లో ఎన్నో సా౦కర్యాలు ఉన్నాయో ఇందులోనూ అన్నీ ఉన్నాయంటారు లోచూపున్న పుట్టపర్తి వారు . అరబ్బీ యవన కళాలక్షణాలు హంపీ శిల్పాలలో  ఉన్నాయి .ఈ సాంకర్యం వల్ల కళ తేజో వృద్ధి పొంది౦దేకాని ,సహజత్వాన్ని కోల్పోలేదని తీర్పు ఇస్తారు .విజయనగరాన్ని స్వర్గ ఖండం అంటారు కాని విదేశ ఖండం అని ఎవ్వరూ అనరు అని అయ్య వాక్యాలతో ఈ సుదీర్ఘ వ్యాసాన్ని ముగించారు నాగపద్మిని .

ఎన్నెన్నో ‘’అయ్యా ,అమ్మడూ’’ తవ్వి తలపోసిన మధురాను భూతులివి .అందుకే ఎక్కడా వదలకుండా మీకు ప్రతి విషయమూ అందజేశాను .నాకు ముంజేతి జున్ను గా అనిపించింది ,జుర్రి జుర్రి తృప్తి చెందాను .మీకూ ఆ అనుభూతి కలగాలని ఆరాటపడి ఆ రచన అంతా ‘’ఏతం తో తోడాను.’’ ఈ సారి హంపీ విజయనగరం సందర్శించినపుడు కనువిందు పొందటానికి ఇందులో చెప్పినవి సహకరిస్తాయని నమ్మకం .ఇంత మధురోహల హంపీ విజయనగరాన్ని మనముందుంచిన  ఆ ఇద్దరికీ ధన్యవాదాలు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.