గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)
సంస్కృత మహా విద్వాంసుడు మహాకవి అనేక గ్రంథ రచయిత కాళీ ప్రసన్న విద్యారత్న 1849లో బెంగాల్ లో జన్మించి 75వ ఏట 1924లో మరణించాడు .1908నుంచి 10వరకు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భట్టా చార్య కుటుంబానికి చెందిన ఈ కవి బరిశాల్ లోని ఉజిర్ పూర్ గ్రామం లో జన్మించాడు .ఫరీద్ పూర్ జిల్లా ధనూకా గ్రామం లో చతుష్పతి అంటే వీధి బడిలో సంస్కృతం అభ్యసించాడు.బారిశాల్ లో ఎంట్రన్స్ పాసై కలకత్తా స్కాటిష్ చర్చ్ కాలేజి చేరి బి .ఏ ,ఎం.యే లు పాసై ,1881 లో ఢక్కాజగనాథ కాలేజిలోసంస్కృత టీచర్ గా చేరి ,తర్వాత 1901వరకు ప్రెసిడెన్సి కాలేజిలో పనిచేసి ,తర్వాత ఆకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .
భారతీయ పురాణాల ను తనసంపాదకత్వం లో వెలువరించి ,సంస్కృత రచనలు ఎన్నో చేశాడు .ఆయన రచనలలో బృహత్ శివ పురాణం ,శ్రీ శ్రీకృష్ణ చరితం ,వేదాంత దర్శనం ,బృహద్యాగమిత,బృహద్దహ పురాణం ,శివ సంహిత ,సంజీవ్ చందర్ గ్రంధావళి ,కాళీ కైవల్యదాయిని ,కల్కిపురాణ౦ ,స్తబ్ కోవచమాల ,కైతంత్ర మొదలైనవి ఉన్నాయి .సంస్కృత విద్యా వ్యాప్తికి టోల్ లను సందర్శించి ,టోల్ వ్యవస్థను పటిస్టపరచాడు .1911లో సంస్కృత సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యాడు .మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నాడు.
384-విష తంత్ర కర్త – కవిరాజ్ జైమిని భూషణ్ రే(1879- 1926)
కవిరాజపంచానన రే కుమారుడు కవిరాజ్ జైమిని భూషణ్ రే 1879లో ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లా పోయోగ్రాం లో జన్మించాడు .స్థానికంగా విద్యాభ్యాసం ప్రారంభించి ,తర్వాత దగ్గరే ఉన్న కలకత్తా లో14వ ఏట సౌత్ సబర్బన్ స్కూల్ లో సెకండరీ విద్య పూర్తి చేసి ,కలకత్తా సంస్కృత కళాశాలలో బి ఏ చదివి ,ప్రభుత్వ సంస్కృత కాలేజి లో మాస్టర్ డిగ్రీ పొంది ,కలకత్తా మెడికల్ కాలేజీ లో డాక్టర్ డిగ్రీ అందుకొన్నాడు .ఇంటిదగ్గర తనతండ్రి వద్ద ఆయుర్వేద విద్య క్షుణ్ణంగా అభ్యసించాడు .విద్యా తృష్ణ తీరక సంస్కృతం లో ఎం .ఏ .చేశాడు .మెడిసిన్ లో గోల్డ్ మెడల్ పొందాడు .ఆయన అభిమాన విషయం గైనకాలజీ అండ్ మిడ్ వైఫ్రి ‘’ఇంగ్లిష్ వైద్యం పై వ్యామోహం పెంచుకోకుండా తండ్రిలాగా కవి రాజ్ అవ్వాలని నిశ్చయించుకొన్నాడు .బంగ్లా –మార్వారీ హాస్పితలో లో నెలకు నలభై రూపాయలజీత తో కవిరాజ్ గా ఉద్యోగం పొందాడు .
ఆయుర్వేదం పై ఉన్న విపరీతమైన అభిమానం తో దానిలోనే రాణించా లనుకొని ,’’ఆయుర్వేదవైద్యం కడుపుకు కూడు పెట్టకపోతే ఆయుర్వేద ‘’పంచన్ ‘’అంటే విరేచనాలమందు అమ్ముకొని అయినా బతుకు తాను ‘’అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు .ఆనాటి ప్రభుత్వం కూడా ఆయుర్వేదానికి ఏరకమైన ప్రోత్సాహం ఇవ్వలేదు .చివరికి ‘’వైద్యరాజ్ ఫార్మసి ‘’ఏర్పాటు చేసి ఆయుర్వేద మందుల అమ్మకం సాగించాడు .ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యానికి సరిపోయేట్లు ఆయుర్వేద మందులను ఆయనా, ఆయన సిబ్బంది శ్రమించి తయారు చేశారు .దీని ఖర్చులకు తనఫీజును 4 నుంచి 32 రూపాయలకు పెంచాడు .బీదలకు ఉచిత వైద్యం అందించేవాడు .గ్వాలియర్ ఇండోర్ మొదలైన పట్టణాలకు వెళ్లి మహారాజులకు వైద్యం చేయటానికి ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొనేవాడు.క్రమంగా కవిరాజ్ పేరు ప్రఖ్యాతులు వ్యాపించి1915కు కలకత్తాలో సేలిబ్రేటి అయ్యాడు .మద్రాస్ లో జరిగిన ఏడవ అఖిలభారత ఆయుర్వేద సభకు అధ్యక్షుడయ్యాడు .
కలకత్తా 29 ఫరియా పుకూర్ వీధిలో అద్దె భవనం లో ‘’కవిరాజ్ అష్టాంగ ఆయుర్వేద కాలేజి హాస్పిటల్’’ స్థాపించాడు .ప్రాచీన ,అధునాతన ఆయుర్వేద వైద్యవిధానం బాగా ప్రచారమై మహాత్మాగాంధీ ని ఆకర్షించింది .9ఏళ్ళ తర్వాత రాజా దినేంద్ర స్ట్రీట్ లో నెలకొల్పిన స్వంతభవనానికి మహాత్ముడు తన అమృత హస్తాలతో శంకుస్థాపన చేశాడు .ఇప్పుడు అక్కడ ‘’జే .బి .రాయ్ స్టేట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ ‘’ హుందాగా అందరికీ దర్శనమిస్తోంది .దాని శతవార్శికోత్సవం 2016లో ఘనంగా నిర్వహించారు .కవి రాజ్ ఈ హాస్పిటల్ నిర్మాణానికి తన స్వంత డబ్బు 70 వేల రూపాయలు ఖర్చు చేయటమే కాక ,తన చిరాస్తులను కూడా అమ్మి అభి వృద్ధి చేశాడు .ఆయుర్వేదం లో అనేక విషయాలమీద అంటే శాలక్య తంత్ర ,ప్రసూతి తంత్ర ,విషతంత్ర ,కుమార తంత్ర లను ఆధారంగా గ్రంథాలు రాశాడు ర .ఆయన రాసిన ‘’వ్యాధులు –మూలకారణాలు –గుర్తించటం ‘’అనే పుస్తకం చాలా ప్రసిద్ధమై గొప్ప పేరు తెచ్చింది .’’ఆయుర్వేద ‘’అనే మాసపత్రిక కూడా నడిపాడు .
కవిరాజ్ జైమిని భూషణ్ రాయ్ సరోజ బాలాదేవిని వివాహమాడి ఆరుగురు సంతానం పొందాడు .కలకత్తాలో 11-8-1926న 47ఏళ్ళ వయసులోనే చనిపోవటం దురదృష్టకరం .చనిపోవటానికి ఒక్క రోజు ముందు తన అష్టాంగ ఆయుర్వేదవిద్యాలయానికి 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన మహా వితరణ శీలి .ఆయన మరణానంతరం పాతిపుకూర్ లో ఆయన నివాసమున్న ఇంటిని గార్డెన్ ను క్షయ ఆస్పత్రిగా మార్చారు . స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రముఖ వైద్యుడు, బెంగాల్ ముఖ్యమంత్రి బి. సి .రాయ్ అని పిలువబడే డా బిధాన్ చంద్ర రాయ్ ఈ హాస్పిటల్ కు శంకు స్థాపన చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-19-ఉయ్యూరు
—