గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

387-పోతన భాగవతం  సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

  వ్యాసమహర్షి సంస్కృత భాగవతం మహా ప్రశస్తి రచన .దానికి పోతనామాత్యుని అనువాదం మందార మకరందం .అలాంటి పోతనగారి తెలుగు భాగవతాన్ని సంస్కృతం లోకి తర్జుమా చేయటం అంటే ఆషామాషీ కాదు .అసాధ్యం అని కూడా అని పిస్తుంది .కాని దాన్ని సుసాధ్యం చేసిన పండితకవి శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు .పోతనగారి రచనలో ప్రహ్లాద చరిత్ర ,గజేంద్ర మోక్షం ,,వామనావతారం ,గోపీ కృష్ణ విలాసం ,కంస వధ ,ఉద్దవ సందేశం భ్రమర గీతాలు  రాత్నాలవంటి భాగాలను ఎన్నుకొని సంస్కృతీకరించారు .పోతనగారి మాధుర్యానికి ఏమాత్రం భంగం రాకుందే  సంస్కృ తానువాదం సాగటం చాలా గొప్ప విషయం .పోతనగారి తెలుగు పద్యాలకు దీటుగా సంస్కృత శ్లోకాలు రాసి సెభాష్ అనిపించుకొన్నారు .పోతన చెప్పని విషయాలను కూడా చెప్పి మెరుగులు కూడా దిద్దారు .

  ధర్మరాజు నారదుని ప్రశ్నించటం లో మూలం లో లేని ‘’ప్రహ్లాదస్తుల పీలతా సురకలం జారణ్య జాతాః భవత్ ‘’అనే రూపకాన్ని చేర్చి పవిత్రతను కాపాడారని శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు తన సమీక్షలో తెలిపారు .పోతన అనుప్రాసాలను ఉన్నది ఉన్నట్లుగా ,కొన్ని చోట్ల వేరే శబ్దాలతో సన్నిధానం వారు సొగసు చేకూర్చారు .’’బాలం హరిపద చిన్తాలోలం దూరీ కృతాఘ జాలం త౦ శ్రీలం పితాజిఘాం సత్కథ  ,మిత్యాహస్మ –సూనుం శాంత గుణ ప్రదాను’’మొదలైన పద్యాలను ‘’పుత్రం పాప లతా లవిత్ర మమలజ్ఞానైకపాత్రం మహా భ్రాత్రం’’మొదలైన స్వతంత్ర అనుప్రాసలతో సంస్కృతీకరించి వన్నె తెచ్చారు .-

‘’హాలాపాన విజ్రుంభమాణమద గర్వోద్రిక్త దేహోల్లసత్ –బాలాలోకన శ్రుమ్ఖలా నిచయ స౦బద్ధొన తర్తు౦ క్రమః –సంసారంబు నిధిం కదాపి చమహా విద్యా౦శ్చధిక్కామినీ –హేలా కృష్ణ కురంగ శాబక ఇవ స్యాద్ భ్రాతరఃపశ్యత ‘’.

  నృసింహావతార౦ లో వచనం విభక్తి ప్రత్యయాల మార్పుతో  ఎక్కువభాగం మూలమే ఉండటం చేత పోతన ప్రదర్శించనట్లే అయింది అంటారు నోరివారు .గజేంద్ర మోక్షం లోని ‘’లావొక్కింతయు లేదు ‘’పద్యానికి  సంస్కృతాను వాదం చూద్దాం –

‘’క్షీణం మే అంగబలం ధృతి ర్విచలితా ,స్థానాచ్చ్యవంతే నవః –నమ్ముగ్దోస్మి,భ్రుశం ,కృశోస్మి భిన్నోస్మి చ –

నత్వద్వేద్యపరం శరణ్య మనమాం క్షాంతాపరాదాన్ ,రయా –దాయా హేశ్వర,పాహిమాం ,వరద  భో రక్ష సర్వేశ్వర’’

  వామనావతారం లో ‘’ఆదిన్ శ్రీసతికొప్పుపై ‘’అనే పోతన ప్రశస్త పద్యానికి  సన్నిధానం వారి    సంస్కృతానువాదం –

‘’ఆదౌ శ్రీ యువతేః కచేష్యద తనూ వల్క్యాంతదంశోత్తరా-సంగే గంగ తలేతతః కుఛ తటే పాదాంబుజా తద్వయే

యోస్తే వ్యాపృత యేష పాణి రధరో మేపాణి రస్త్యుత్తరః-శ్రేయో స్మాత్కిము శాశ్వతం భవతి కిం శరీరం శ్రియః ‘’

అలాగే ‘’ఇట్లు విష్ణుండు గుణ త్రయాత్మక౦ బగు విశ్వ రూపంబు ధరియించిన భువియు ,నభంబును ,దివంబును దిశలు ‘’అనే విశ్వ రూప వర్ణన వచనం అంతా,   సంస్కృతానువాదం లో ప్రత్యయాలమార్పుతో –‘’ఏవం వటునా ధృతే  గుణ త్రయాత్మకే విశ్వ రూపే ద్యావా పృధివ్యౌదిశః ‘’అనే పోతనగారి శబ్దాలతోనే చేయటం సంమోదావహంగా ఉంది అన్నారు నోరి నరసింహ శాస్త్రి గారు .

  మను చరిత్రను శ్రీ కుంటి మద్దిశేష శర్మగారు సంస్కృతం లోకి  అనువాదం చేసినప్పుడు నోరి వారు ‘’ఆంద్ర కావ్యాలను సంస్కృతం లోకి అనువదించేవారు సంస్కృత భూయిష్ట భాగాలను ఆ ఛందస్సులతోనే అనువదించినందుకు అభినందించాను .ఇతర అనువాదకులు కూడా ఈమార్గాన్నే అనుసరించాలి అని సూచించాను .సన్నిధానం వారు అదే మార్గాన్ని అనుసరించటం అభినందనీయం ‘’అన్నారు .’’ఈ  సంస్కృతానువాదం లో పోతన కవితా మాధుర్యం సంస్కృత భాషా విదులకు చవి చూపి నందుకు సన్నిధానం శాస్త్రి గారు స్తవనీయులు ‘’అని శ్లాఘించారు .

2-సన్నిధానం వారు కొన్ని ప్రసిద్ధ  కావ్యకథలను’’ ‘’కావ్య కథా’’పేరిట సంస్కృతీకరించారు . .ఈకథలను ఇంగ్లీష్ లో చార్లెస్ లాంబ్ షేక్స్పియర్ నాటక కధలను రాసినట్లు రాశానని శాస్త్రిగారు చెప్పుకొన్నారు  .శాస్త్రిగారి ప్రయత్నం మంచిదేకాని కాని అందులో మాధుర్యం లేదన్నారు నోరి వారు .కొన్ని ఆంధ్రకావ్య కథలను అనుసరించక స్వతంత్రత చూపారనే అన్నారు .కాని జాగ్రత వహించనందున అనౌచిత్యాలేర్పడ్డాయంటారు .శ్రీరాముడు సముద్ర తరణం ‘’సాగరోయం దశ యోజన విస్తీర్ణఃశతకాల దఘ్నశ్చ’’అని మాత్రమె అన్నాడుకాని శాస్త్రిగారు దాన్ని’’’శతయోజనమాయతమ్’’అని చెప్పటం భ్రమ జనితం .ఉడత సాయాన్ని ;;చిక్రోడకధ’’గా రాశారు .ఉడతకన్నా ముందే కాకులు గ్రద్దలు ,చీమలు సేతుబంధనానికి సాయం చేసినట్లు  శాస్త్రిగారు కల్పనా చేశారని ,కాని రాముని దయ ఉడతపై మాత్రమె చూపి మిగిలిన జంతువులపై చూపక పోవటం సందర్భ శుద్ధిగా లేదంటారు నోరివారు .రంగనాధ రామాయణం లో ఉడుత సాయమే ఉందికాని మిగిలినవాటి సాయం లేనేలేదన్నారు .ఏమైనా ఇదంతా అవాల్మీకం .

  ‘’ఏకలవ్య కధ’’లో ద్రోణుడే కుడి బొటన వ్రేలును గురు దక్షిణగా కోరినట్లు చేసిన శాస్త్రిగారికల్పన ఆంద్ర భారత కధకు కూడా విరుద్ధమే అని తేల్చారు శ్రీనోరి ..ప్రస్తావనలో శాస్త్రిగారు ‘’సంస్కృతం లోని వాసవదత్త మొదలైన వాటిని ప్రస్తావించి వాటిలో కదా సరస్వతీ నది లాగా కనబడీ కనబడనట్లున్నది ,అందుచే వాటిని చదవటానికి బుద్ధిపుట్టదు’’అని ఆక్షేపణ సమంజసం కాదు .లోకోత్తర చమత్కారం అయినప్పుడే రసవంతం అవుతాయి ‘’అని తీర్పు ఇస్తూ ఈ సంస్కృత  కథలు  సంస్కృత భాషాధ్యయనం చేసే విద్యార్ధులకు ఉపయోగపడుతాయి అనటం లో ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పారు .

3- భర్తృ దానం –అనేది సన్నిధానం వారు పారిజాతాపహరణ కధకు చేసిన    సంస్కృతానువాదం శృంగారం .దీనికి ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు ఇంగ్లీష్ లో అద్భుతమైన ఉపోద్ఘాతం రాశారని నోరి వారు కితాబిచ్చారు .పారిజాత కధవరకు శృంగార రస ప్రాదాన్యమనీ ,తులాభార కథ శాంతరస ప్రదానమైనదనీ, శృంగారం  అంగరసమై ,ఇంద్రునితో యుద్ధాన్ని రెండుపద్యాలతో సంక్షిప్తఎపింఛి ,అంగ కధకు అతి విస్తృతి దోషం రాకుండా చేశారని పుల్లెలవారు మెచ్చారనీ ,కాని సన్నిధానం వారి కథలో 23పేజీలు  పారిజాత కథ ఉంటె శీర్షికగా పెట్టిన భర్తృ దానకద 12పేజీలే ఉందని కనుక పుల్లెలవారు చెప్పిన దోషం ఇక్కడా వర్తి౦చిదనీ   నోరి వారు ఉవాచ .సంస్కృత దృశ్యకావ్యాలలో ఉన్న కథా బిగువు శ్రవ్యకావ్యాలలో ఉండదనటం ప్రసిద్ధం .వ్యాకరణ శాస్త్రం చేత సాధించలేని ప్రయోగాలు   సంస్కృతానువాదం లో సన్నిధానం వారు చేయటం ఉచితంకాదని నోరి శాస్త్రిగారి అభిప్రాయం .పునీత శబ్దాన్ని తానూ సమర్దిస్తాననీ నోరి ఉవాచ .పారిజాత కథను సులభ  సంస్కృతం లో రచించి అఖండ భారత వ్యాప్తికల్గించిన శాస్త్రిగారి ప్రయత్నాన్ని తాను ‘’అగ్గించు చున్నాను ‘’అన్నారు నోరిశ్రీ .

4-నందచరితం అనేది సన్నిధానం వారు ‘’భక్తనందనారు ‘’చరిత్రగా సంస్కృతం లో రాసిన రచన .దీనికి ఆంగ్లం లో ఉపోద్ఘాతం శ్రీ కేవిఎన్ అప్పారావు రాశారు .’’నక్క ఎక్కడ నాగలోకమెక్కడ ‘’వంటి  తెలుగు సామెతలను చాలా సులభంగా  సంస్కృతీకరించినందుకు అప్పారాగారూ నోరివారూ సన్నిధానం శాస్త్రిగారిని మనస్పూర్తిగా శ్లాఘించారు .

5-కళాపూర్ణోదయః – పింగళి సూరన కళాపూర్ణోదయ కథకు సన్నిధానం వారి   సంస్కృతీకరణం ఇది .ఆంద్ర కావ్యాలలోనే కాదు భారతీయ భాశాకావ్యాలన్ని టి లోనూ విశిష్టమైంది పింగళి సూరన కళాపూర్ణోదయం అనీ,రామరాజ భూషణుడి ‘’ వసు చరిత్ర’’వచ్చిన వందేళ్ళకు’’ కాళహస్తి ‘’కవి దాన్ని  సంస్కృతీకరింఛి గొప్ప గౌరవం కలిగించాడనీ , పూర్వం సంస్కృత భాషమీద దండయాత్ర చేసిన ప్రాకృత భాషాకవుల కావ్యాలు వాటిలోని సంస్కృత చాయవలననే  ఇప్పటికీ నిలిచిఉన్నాయని ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ దూరదృస్టి తో చేబట్టిన సంస్కృతీకరణ చాలా విశేషమైనదని నోరి నరసింహ శాస్త్రిగారు అభిప్రాయ పడ్డారు .

  ‘’కళాపూర్ణోదయం సరస్వతీ చతు ర్ముఖుల లీలా కేళి ని ఆధారం గా చేసుకొని ,దాని ఆధారంగా ‘’గృహరాజు మేడ ‘’గా నిర్మించిన సుందర కథా మందిరం ..దీన్ని  సంస్కృతీకరించే పని చేబట్టిన సన్నిధానం వారు మిక్కిలి అభినదనీయులు .’’అని మెచ్చారు నోరివారు .పుల్లెలవారి ప్రస్తుతిపొందిన ఈ అనువాదం అదే స్థాయిలో నడచింది అనవసర విషయాలు తీసేసి చిక్కని చక్కని కథను సంస్కృతం లో నడిపించారు .సంస్కృత కావ్యాలలో సర్గలో శ్లోకాలన్నీ ఒకే వృత్తం లో ఉండి,సర్గాంతం వేరే వృత్తం లో ఉంటుంది .సన్నిధానం వారు ఆంద్ర సంప్రదాయాన్నే అనుసరించారు .మూలం లోని 105పద్యాల మంగళాచరణం ,కృతిపతి వంశ వర్ణన వదిలేశారు అనువాదం లో .ద్వారకాపుర వర్ణనతో ప్రారంభించారు .దీనివలన తెలుగు కావ్యమర్యాద సంస్కృత భాష వారికి తెలియదు .కొన్నిపద్యాలను సంక్షేపించి కొన్ని యధామూలంగా అనువదించారు .

  మొదటి ఆశ్వాసం లో కలభాషిణి నోట సూరన వినిపించింది సీసపద్యం  -’’పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన’’  దీనికి శాస్త్రిగారి   సంస్కృతానువాదం –

‘’పదాని పంధాయ మిథో హితాని –కావ్యే రాసానా మనుకూల రీతీః-గుణానలంకార గణా౦ స్తదర్హాన్ –బద్నన్ కవీ౦ద్రో న మహీయతే కైః’’

 పద్యం తాత్పర్యమైతే వచ్చిందికాని ,కాని తెలుగుపద్యం అందం అసలు రానేలేదు .వాచ్య ,లక్ష్య ,వ్యంగ్యార్దాల ,నిర్దోషిత సంగతి మచ్చుకైనా అనువాదం లో రాలేదు .

సూరన లయభాతి పద్యం –‘’చలువల వెన్నెలలు చెలువునకు సౌరభము ‘’దీన్ని శాస్త్రిగారు స్రగ్ధరా వృత్తం లో అనువాదం చేశారు –

జ్యోత్స్నాయా శ్శీతలాయా యది సురభిలతా –శైత్య సౌరభ్య భాజాం –కర్పూరాయాం మృదుత్వం యదిచ ,మధురిమా –విద్యతే చే న్నిగాఢం-వాతానాం చంద్ర వాద్రేర్మసృణ మ్రుడులతా –శైత్య సౌరభ్య భాజా –మర్హం త్యాఖ్యాతు మేతే సదృశ ఇతి కవే –రస్య కవ్యస్య వాగ్భిః’’

  ఈ సంస్కృతానువాదం యధా మూలంగా హృద్యంగా ప్రౌఢం గా సాగిందని దీని తో శాస్త్రిగారి సంస్కృత కవన సమర్ధత జగత్తుకు  చాటిందని మనస్పూర్తిగా నోరి శాస్త్రిగారు మెచ్చుకున్నారు .శాస్త్రి గారి సంస్కృత అవతారికలో ఆంధ్రకవుల ఆచారాన్ని  సహృదయులకు నమస్సు లర్పించారు  –

‘’గోస్ఠశ్వా  విమృశ౦తియే కవి కృతీః కర్తుం –న శక్తాః స్వయం –తాన్ సంప్రీ జయితుం వహి ప్రభవతి బ్రహ్మాసి –తేభ్యో నమః ‘’

  ఇదీ బ్రహ్మశ్రీ సన్నిధానం సూర్యనారాయణ  శాస్త్రిగారు తెలుగు కావ్యాలకు సంస్కృతం లో చేసిన మహోపకారం .ఆంధ్ర గీర్వాణాలలో జగజ్జెట్టీలు కనుక వారి అశేష పాండితీ వైదుష్యానికి వారి అన్ని రచనలు మచ్చుగా నిలిచాయి .

  సన్నిధానం వారి మహుముఖీన ప్రతిభను గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం లోనే రాశాను .ఇప్పుడు ఈ అదనపు సమాచారం లభించటం చేత దాన్ని విస్తృత పరచాను .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార  వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో  సంస్కృతోతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .

   శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు  చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే  అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి  రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .

అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి  పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .

వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి  గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై  అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 ప్రస్తుత కథనానికి ఆధారం –శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1972 జులై భారతి మాసపత్రిక ,1964డిసెంబర్ భారతి ,మాసపత్రికలో చేసిన సమీక్షలు అని సవినయంగా మనవి చేస్తున్నాను .వీటిని నాకు అందించిన వారి కుమారులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.