గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)
ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .
కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .
సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .
విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .
కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర సుప్రభాత శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –
‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం -ఉత్తిష్ట పరమేశ్వర
‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.
సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు అక్షర సత్యాలు .
ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు