గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)
బహుముఖీన ప్రతిభ
వాగీశ్ శాస్త్రిగా గౌరవింప బడుతున్న డా .భగవతీ ప్రసాద్ త్రిపాఠీ అంతర్జాతీయ సంస్కృత వ్యాకరణ కోవిదుడు ,భాషా శాస్త్రవేత్త ,తాంత్రికుడు ,యోగి.1935లో మధ్యప్రదేశ్ లోని ఖురాలీ సిటీ లో జన్మించాడు .విద్యాభ్యాసం బృందావనం బెనారస్ లలో సాగింది .వారణాసి తిక్ మణి సంస్కృత కాలేజిలో 1959లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి,అక్కడే ఉన్న సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి లోని రిసెర్చ్ సంస్థకు1970 లో డైరెక్టర్ అయ్యాడు .మూడు దశాబ్దాలు దీనిలోనే సేవలందించాడు . 1959లోనే సంపూర్ణానంద యూని వర్సిటి నుండి సంస్కృత వ్యాకరణ ఆచార్య(ఎం. ఏ .) పి.హెచ్. డి,(విద్యా వారిధి )ను వ్యాకరణం ,హిస్టారిక్ లింగ్విస్టిక్స్ లో 1964లో పొందాడు .1966 జర్మన్ డిప్లొమా ,1969లో వాచస్పతి (డి .లిట్.)అందుకొన్నాడు .
రచనా వాగీశం
19వ ఏట నుండే డా వాగీశ్ శాస్త్రి సంస్కృత వ్యాసాలూ రాయటం ప్రారంభించి రెండువందలకు రిసెర్చ్ పేపర్లతో సహా వివిధ జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ లో రాశాడు .అయిదవ సంస్కృత సమ్మేళనానికి సెక్రెటరి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .సరస్వతి భవన గ్రంథాలయం మొదలైన సంస్థలకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించాడు .300 వ్రాత ప్రతులను పరిష్కరించి తన సంపాదకత్వం లో గ్రంథాలుగా ప్రచురించిన వైదుష్యం ఆయనది .ప్రముఖ సంస్కృత జర్నల్ ‘’సరస్వతి సుషమ’’ ముఖ్య సంపాదకుడుగా చాలాకాలం ఉన్నాడు .వ్యాకరణం ,ప్రాచీన భాషాశాస్త్ర౦ (ఫైలాలజి) సంబంధ రిసెర్చ్ విషయాలు ,నాటకం చరిత్ర ,కవిత్వం ,వ్యంగ్యం ,చారిత్రిక పరిశోధన ,ఆధి భౌతిక (మెటా ఫిజిక్స్ )మొదలైన వాటిపై అనేక గ్రంథాలు రచించాడు .
మాగ్నం ఓపస్
వాగీశ్ శాస్త్రి మేధో సర్వస్వమైన రచన’’ మాగ్నం ఓపస్’’ ఒకటి ఉన్నది .విట్నీ అనే పాశ్చాత్య పండితుడు పాణిని –పాణిని ధాతుపథం పై తీవ్ర విమర్శ చేస్తూ రాసిన దానిపై ప్రతి విమర్శ పై చేస్తూ ‘’పాణినీయ ధాతుపథ సమీక్ష ‘’రచించి 1965లో ప్రచురించాడు .విపరీతమైన శ్రమ చేసి వర్ణక్రమం లో వివిధ ధాతుపథాలలోఉన్నసంస్కృత ,పాళీ ,అపభ్రంశ ,మిగిలిన ప్రాకృత భాషలలోని ధాతువుల కేటలాగ్ తయారు చేసి వాటి ధృవీకరణ ,వాటి క్రియా రూపాలు మామూలు రూపాలతో సహా కళ్ళముందు నిలబెట్టాడు .ఇది విట్నీ విమర్శను పూర్తిగా త్రిప్పికోట్టిన అరుదైన గ్రంథం గా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది .
శరపరంపర రచన
శాస్త్రి మరో ముఖ్య రచన ‘’కృష్ణం నాగ పాశః ‘’అనే రేడియో నాటకం .సింబాలిక్ గా రాయబడిన ఈ నాటకం దేశభక్తిని ,మతసామరస్యాన్ని ,జాతిపై గౌరవాభిమానాలను ,మాతృ దేశ సంరక్షణలో చూపాల్సిన త్యాగ నిరతిని బహు చక్కగా చెప్పింది .శాస్త్రి సృజనాత్మతకు నిలువెత్తు అద్దంగా ఈ నాటకం భాసించింది .ఇవికాక సంస్కృతం లో తద్ధితాన్తః కేచన శబ్దః ,అనుసాధన పధ్ధతి ,దాత్వర్ధ విజ్ఞానం రాశాడు .మిగిలిన రచనలలో శబ్ద నిర్వచన ఔర్ సబ్దార్ధ ,జిప్సీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ ,ఉప్సహితం వంటివి ఉన్నాయి .సృజనాత్మక రచనలలో –కథా సంవారిక టాల్ స్టాయ్ కథాసప్తకం , భారత్ మే సాంస్క్రిట్ కి అనివార్యకోమ్ ,శ్రీ గంగా స్తవన చయనిక , శ్రీ శివ స్తవన చయనిక ,నర్మ సప్త శతి ,సాంస్క్రిట్ వాజ్మయ మ౦ధనం ,ఆతంకవాద శతకం ,నాద శాబ్దికం ,సంజయ క్రియా పాద,సంక్షిప్త సార్ వ్యాకరణ్,శివ సంకల్ప సూక్తం మొదలైన 24 ఉన్నాయి .
చారిత్రిక రచనలు –జిప్సీ భాష ,మహాకు౦భ ఏవం సంగమ స్నానం ,ఆతోబయాగ్రఫీ ఆఫ్ వాగ్ యోగి ,మైగ్రేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఫ్రం ఇండియా ,బుందేల్ ఖండ్ కీ ప్రాచీనత .పద్మ పురాణ అండ్ రఘు వంశ .
మెటా ఫిజిక్స్ –పర చేతన కి యాత్ర ,శక్తి ,శివ అండ్ యోగ ,యోగ చూడామణి ఉపనిషత్ ,సంవిత్ ప్రకాశ (వైష్ణవ తంత్రం ),త్రయంబకం యజామహే .
నవ్య సంస్కృత వ్యాకరణం –సాంస్క్రిట్ శిక్షన్ కి సరళ్ఔర్ వైజ్ఞానిక్ విధి ,వాగ్ యోగ –న్యుమానిక్ సాంస్క్రిట్ టెక్నిక్ ,వాగ్యోగ –కాన్వేర్సేషనల్ టెక్నిక్స్ ,సాంస్క్రిట్ మేడ్ ఈజీ -2 భాగాలు
నిఘంటు నిర్మాణం –వామన పురాణ విషయానుక్రమ శబ్ద కోశం ,ఎటిమలాజికల్ బుందేల్ డిక్షనరీ ,శబ్ద పరణ్యం నాం ధాతు నిర్భర్ శబ్ద కోష్.ఇలా బహువిధ ప్రక్రియలలో తన అసమాన శేముషీ ప్రతిభను చాటి ,చేబట్టిన ప్రతి విషయాన్నీ సువర్ణమయం చేసిన రచనా ఘనాపాఠీ శాస్త్రీజీ .
మార్గ దర్శి
వాగీశ్ శాస్త్రి మార్గదర్శకత్వం లో సంస్కృత వ్యాకరణం లో 20మంది , అలంకార శాస్త్రం ,కవిత్వం లో 20మంది ,ఫిలాసఫీ ,తంత్ర లో 6గురు ,వేద,పురాణ ఆయుర్వేద లలో ఇద్దరేసి , జ్యోతిషం లో ఒకరు విద్యార్ధులు పి.హెచ్ .డి .పొందారు .సంస్కృత వ్యాకరణం లో ఒకరు ,అలంకారం కవిత్వం లో ముగ్గురు ,ఫిలాసఫీ, తంత్ర ,పురాణ లలో ఒక్కొక్కరు విద్యార్ధులు డి.లిట్ .అందుకొన్నారు .
శాస్త్రీజీ సృజన విధానం –వాగ్యోగం
వాగ్యోగ అనే తన సృజనాత్మక విధానం లో సంస్కృతాన్ని మాటల , సంభాషణల రూపం లో గణిత విధానం లో సంస్కృత వ్యాకరణం నేర్పుతున్నారు .ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులు వచ్చిఅతి తక్కువ సమయం లో సంస్కృతం నేర్చుకొని వెడుతున్నారు .పాప్ సింగర్ మడోన్నా ‘’యోగ తారావళి ‘’గానం చేసింది .ఆమెగానం లో ఉచ్చారణ దోషాలు కనిపెట్టి తెలియజేశాడు శాస్త్రీజీ .ఆమె బిబిసి రేడియో ద్వారా శాస్త్రి గారితో పరిచయం పొంది తన ఉచ్చారణ ను చక్కగా తీర్చి దిద్దుకోన్నది .
వైదుష్యానికి తగిన బిరుదులూ సత్కారాలు పొందిన పద్మశ్రీ వాగీశ శాస్త్రి
1966లో కాళిదాస అవార్డ్ ,1982మహా మహోపాధ్యాయ ,1990బాణభట్ట అవార్డ్ ,1994లో వేద వేదా౦గ అవార్డ్ ,1995లో అను సంధాన్ పురస్కార ,స్వామి విష్ణు తీర్ధ సమ్మాన్ ,యశ్ భారతి పురస్కార్, విశ్వభారతి పురస్కార్, సాంస్క్రిట్ సాధన సమ్మాన్ ,ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమీ నుంచి 6 సార్లు గౌరవపురస్కారం వంటి అనేక విశిష్ట పురస్కారాలు బిరుదులూ సన్మానాలు శాస్త్రిగారిని వరించి ఆయన శేముషికి వన్నె తెచ్చాయి.2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి విశేష గౌరవం కలిగించింది .
83 ఏళ్ళ మహా సంస్కృత కవి శిరోమణి, భారత దేశ ఆధ్యాతిక జాతి రత్నమైన డా.భగవతీ ప్రసాద్ త్రిపాఠీ-వాగీశ శాస్త్రీజీ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లి,గీర్వాణి పద సమార్చనలో తరించాలని కోరుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-19-ఉయ్యూరు