గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )
నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే ఆయుర్వేదం పై ఒరిజినల్ గ్రంథం.శబ్ద చంద్రిక,ద్రవ్యగుణ సంగ్రహ ,చికిత్సాసార లేక గూఢ వాక్య బోధక ,సర్వ సార సంగ్రహ ఇతర రచనలు .చరక సుశ్రుతుల గ్రంథాలపై వరుసగా ఆయుర్వేద దీపిక ,భానుమతి అనే వ్యాఖ్యానాలు రాశాడు .
400-చంద్ర వ్యాకరణ కర్త -చంద్ర గోమిన్ (7వ శతాబ్ది )
7వ శతాబ్ది బెంగాల్ కవి చంద్ర గోమిన్ చంద్ర వ్యాకరణం రాశాడు .లోకానంద అనే నాటకం ,న్యాయ సిద్ధ్యాలోకం ,ఆర్య తారాదేవి స్తోత్ర మౌక్తికమాల ,కూడా ఇతని రచనలే .
401 –నిబంధ సంగ్రహ కర్త –దల్లాన (13వ శతాబ్ది )
దళ్బన ,దళ్హన అని కూడా పేర్లున్న దల్లాన 13వ శతాబ్ది ప్రముఖ వ్యాఖ్యాత .సూత్ర సంహితకు అమోఘమైన ‘’నిబంధ సంగ్రహ ‘’వ్యాఖ్యానం రాశాడు .అంకోల కు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి భరుపాల .
402-కుట్టానిమత కర్త –దామోదరగుప్త (8-9శతాబ్దం )
కామ కళాకేళీ గ్రంథమైన ‘’కుట్టాని మత ‘’ రాసినవాడు దామోదరగుప్త .క్రీ.శ.779-813కాలం కాశ్మీర రాజు జయాపీడుని మంత్రి అని కల్హణుడు రాజతరంగణిలో చెప్పాడు .
403-అవలోక వ్యాఖ్యాన కర్త –ధనిక (10వ శతాబ్దం )
ధను౦జయుని దశరూపకం పై ‘’అవలోక ‘’వ్యాఖ్యానం రాసిన ధనిక కవి విష్ణు కుమారుడు. .10వ శతాబ్ది ఉత్పల దేవ రాజు మంత్రి .కావ్య నిర్ణయం కూడా ఇతని రచనే అంటారు .ధనుంజయుని సోదరుడు అని కొందరంటారు .మరికొందరు ధనిక యే ధనుంజయుడు అన్నారు .
405-వాదగ్ధ ముఖ మండన కర్త –ధర్మ దాససూరి (13వ శతాబ్ది )
13వ శతాబ్దికి చెందిన బౌద్ధకవి ధర్మ దాస సూరి .వాదగ్ధ ముఖ మండన అనే ఛందో గ్రంథం రాశాడు
406-పవన దూత కర్త –ధోయి (12-13శతాబ్ది )
12లేక 13వ శతాబ్ది బెంగాల్ రాజు లక్ష్మణ సేన ఆస్థానకవి ధోయి.ఇతనికే ధోయికా అనే పేరుకూడా ఉంది .బ్రాహ్మణుడని ,వైద్యుడని కొందరు అంటే చేనేత వాడని కొందరన్నారు .పవన దూత కావ్యం రాశాడని సదుక్తి కర్ణామృతం ,సుభాషిత ముక్తావళి ,సారంగధర పద్ధతిలో చెప్పబడినా అందులోని శ్లోకాలు అలభ్యం .
407-రసేంద్ర చింతామణి కర్త –ధుందూక దత్త (15వ శతాబ్ది )
15వ శతాబ్దికి చెందిన ధుందూక దత్త ఆయుర్వేద వ్యాఖ్యానం ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు
408-చందోమంజరి కర్త –గంగాదాస (12వ శతాబ్ది )
12వ శతాబ్దికి చెందిన ఒరిస్సా కవి గంగాదాస చందోమంజరి అనే అలంకార గ్రంథంరచించాడు వైద్యగోపాలదాస ,సంతోష కుమారుడను అని కవే చెప్పుకొన్నాడు .తాను అచ్యుత చరిత ,కంసారి శతకం ,దినేశ శతకం కూడా రాశానని చెప్పాడు .
409-ఘట కర్పర కావ్య కర్త –ఘట కర్పర (105 బి.సి.)
క్రీపూ 105కు చెందిన విక్రమాదిత్య మహారాజు ఆస్థాన కవులైన నవరత్న కవులలో ఘట కర్పర ఒకరు.ఘటకర్పర అనే కావ్యం రాశాడు .ఇది 22శ్లోకాల సందేశ కావ్యం కొత్తగా పెళ్ళైనవాడు భార్యకు పంపిన సందేశమే ఇతి వృత్తం .యమకాలతో కావ్యమంతా నింపేశాడు .
410-హరిభక్తి విలాస కావ్యకర్త –గోపాల భట్ట (1503-1578)
బెంగాల్ లోప్రముఖ వైష్ణవ మత ప్రచారకులైన ఆరుగురు బృందావన గోస్వాములలో ఒకరైన గోపాలభట్ట బెంగాల్ కుచెందినవాడు .1503లో జన్మించి 75ఏళ్ళు జీవించి 1578లో మరణించాడు ,చైతన్య స్వామి శిష్యుడు .హరిభక్తివిలాసం అనే ప్రముఖ రచన చేశాడు దీనిలో వైష్ణవులు సామాజిక మత ధర్మాలను ఎలా నిర్వహించాలోసాధికారంగా రచించాడు వారికి ఇది కరదీపిక .సత్క్రియా సార దీపిక కూడా ఈయన రచనే అని అంటారు .
మనవి – ఇప్పటివరకు నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ మూడు భాగాలలో 146+482+462=1090మంది సంస్కృత కవుల గురించి రాశాను .అంతర్జాలం లో రాస్తున్న ఈ నాలుగవ భాగం లో ఇప్పటికి 410మంది గీర్వాణ కవుల పై రాశాను .అంటే మొత్తం 1500మంది గీర్వాణ కవులపై రాసే అదృష్టం దక్కింది .కానీ ఇంకా చాలామంది ఉన్నారు .కనుక ప్రస్తుతం గీర్వాణం-4 కు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,మళ్ళీ వీలువెంట రాసేఅవకాశం తీసుకొంటానని సాహితీ బంధువులకు సవినయంగా తెలియ జేస్తున్నాను .
సశేషం
రేపు ప్రారంభమయ్యే పవిత్ర మాఘమాసం శుభాకాంక్షలు
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు
—