మార్గశిరం లో హరి-హర కైంకర్యం
మధురకవి శ్రీమతిముదిగొండ సీతారామమ్మగారు మదినిండా భక్తి నింపుకున్న విదుషీమణి .వినయం ఆమె ఆభరణం .ఆమె తలిస్తే ,పిలిస్తే పద్యం వరదలై ప్రవహిస్తుంది .అతి సహజ సుందర పదాలతో క్లిస్ట విషయాన్ని సైతం సుందర పద్యంగా చెక్కగల నైపుణ్యమున్నవారు .ఇప్పటికే చాలా పద్య కావ్యాలు రాసి ప్రచురించిన అనుభవమున్నవారు .ఈ మార్గ శిరమాసం లో ఆమె దృష్టి గోదాదేవి ‘’తిరుప్పావై ‘’పాశురాలపై ,మాణిక్కవచకర్’’ తిరు వె౦బావై’’పడి, ఆ మాసంలోనే రెండిటినీ తన స్వంత బాణీలో సీసపద్యాలలోకి అనువదించి అటు ‘’ఆ౦డాళ్ళు’’ లాగా, ఇటు’’ శివబాల’’ లాగా తన భక్తిప్రపత్తులను చాటి, తానూ ఆ వ్రతాలలో అక్షర అర్చనతో భాగస్వామి అయి ధన్యమయ్యారు .అంటే హరిహరాద్వైతం సాధించారన్నమాట .తెలుగు సాహితీ లోకానికి వాటిలోని ఉదాత్తభావనలను సరళ సుందరంగా అందించి మన్ననలు అందుకొన్నారు .
తిరుప్పావై
తిరుప్పావై గురించి తెలుగునాట ఈ నాడు తెలియని వారు లేరు .ప్రతి వైష్ణవాలయం లో ధనుర్మాసం లో తిరుప్పావై గానం ,వాటిపై ప్రవచనం సర్వ సాధారణమే .అందులో శరణాగతి అందరినీ తన్మయులను చేస్తుంది .పేరుకు ‘’మేలి నోము ‘’కాని ,అంతరార్ధం చాలా వేదా౦త విషయ సమగ్రం .ముక్తికి మార్గం .సామీప్య సారూప్య సాయుజ్యానికి దగ్గరి దారి .శ్రీ కృష్ణావతారం లో శ్రీకృష్ణ పరమాత్మ అతిమానుష చేష్టలు ,సౌందర్యానికి వశులైన గోపకన్యలు ధూర్త గోపాలునిపై మనసు పారేసుకొని సర్వ సమర్పణ బుద్ధితో ఉంటె ,గోప వృద్ధులు ,తమ ఇంటి కన్యకలను వేణుమాధవునికి కనిపించకుండా నేల భోషాణం లో దాచారు .దీనివలన ప్రకృతి కన్నెర్ర జేయగా ,వర్షాభావం ఏర్పడింది .దీనికి పరిష్కారంగా వృద్ధులు రాజీపడి గోపకన్యలు వర్షం కోసం శ్రీ కృష్ణుని గురించి వ్రతం చేయమని ,వారికి , కృష్ణుడిచెప్పి ఉభయుల అంగీకారం తో ఆయనకు వీరిని అప్పగించి వెళ్ళారు..ఇక ఆలస్యంచేయరాదని ఆ రాత్రిని కొనియాడి ,అర్ధ రాత్రి నోముకై స్నానం చేయటానికి తనను లేపమని ఆనతిచ్చి ,తాను’’నప్పిన్న పిరాట్టి ‘’అయిన నీళా దేవి గృహ ప్రవేశం చేశాడుకొంటె కిట్టయ్య . .ఆయన చెప్పినట్లే శ్రీ కృష్ణ గుణ చేస్టితులైన గోపకన్యలు స్మరణానందం తో నిద్రరాక ,లేచీ లేవక ,లేవనివారిని మేల్కొలపటానికి నందగోపుని ఇంటికి వెళ్లి ,శ్రీ కృష్ణుని మేల్కొల్పి ,తమ ప్రార్ధనలు విన్నవించి నోము అనే పేర భగవత్ సంశ్లేషానందం పొందినట్లు గోదాదేవి పారవశ్యం తో రాసిన పాశురాలు ఇవి .అన్నిటికీ భావ గంభీరంగా పద్యాలలోకి మధుమదురంగా మలచి తమ ‘’మధురకవి ‘’బిరుదు సార్ధకం చేసుకొన్నారు ‘’సరసభారతి ఆస్థాన కవయిత్రి’’ శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు .
తిరు వె౦బావై
9వశతాబ్ది శైవకవి మాణిక్క వచకర్ పాండ్య రాజు రెండవ వరగుణ వర్మ మంత్రి .అనునిత్యం శివభక్తి తన్మయత్వం లో తేలియాడే వాడు .గొప్ప కావ్యాలు రాశాడు .కాని ఆయనపేరు 63నాయనార్ల పేర్లలో చేరకపోవటం ఆశ్చర్యం .తమిళనాడులోని మదురై జిల్లా వైగై నదీ(విశ్వనాథ వారి ‘’ఏక వీర’’నవల కథ జరిగిన చోటు) తీరం వాధవూర్ లో జన్మించి,శివాలయం పూజారిగా జీవిస్తూ ,రాజు విశ్వాసం పొందాడు .అతనిలోని సైనిక పటుత్వం గమనించి రాజు ,తన సైన్యం కోసం మేలు జాతి గుర్రాలను కొనమని చాలాడబ్బు ఇచ్చాడు.సరే నని బయలేరి వస్తూంటే దారిలో శివుడే ఒక శివముని రూపం లో కనిపించి,ఆత్మజ్ఞానం కలిగించగా రాజు ఇచ్చిన ధనం తో ‘’తిరు పెరునత్తురై ‘’లో గొప్ప శివాలయం నిర్మించి ,మన భక్త రామ దాసు అనిపించాడు .రాజునూ శివ భక్త శిఖామణిగా మార్చి ముక్తి పొందేట్లు చేసిన పరమ శివభక్తుడు మాణిక్య వచకర్ .ఈయన దేహం చాలించినప్పుడు ఆయన ఆత్మ దివ్యజ్యోతిగా మారి, పరమజ్యోతిలో కలిసి ,ఆయన శవం కనిపించకుండా పోయిందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు . చిదంబరం లో శ్రీ లంక బౌద్దులతో వాదం చేసి ఓడించిన ప్రతిభ ఆయనది .ఆయన ఆరాధనోత్సవం తమిళనాడు అంతటా జూన్ –జులై లో వచ్చే ‘’ఆణి’’నాడు ఘనంగా నిర్వహిస్తారు .
ఆయన రాసిన 20 పాశురాల ‘’తిరువె౦బావై ‘’తానేఒక మహిళగా భావించి ‘’పావై నొ౦బు’’ను అనుసరిస్తూ పరమ శివుని కీర్తిస్తాడు .ఆయన విగ్రహం ఆంద్ర ప్రదేశ్ ఆర్కేలాజికల్ మ్యూజియం లో త్రిభంగ భంగిమలో ఒక చేతిలోఓం నమః శివాయ అని రాయబడిన తాళపత్రం తో ఉన్నది .కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి మాణిక్య వచకర్ గురించి ,తిరువె౦బావై ఘనత గురించి తరచుగా చెప్పేవారు .ఇందులోని 9వ పాశురం కావ్యానికి ఆత్మ,ఫలశృతిగా ఉందని సీతారామమ్మగారు చెప్పిన మాటలు యదార్ధం –ఒక సారి ఆపద్య వైభోగం చూద్దాం –
‘’చిన్మయ రూపుడాచిత్త చిదంబర –నటరాజ గిరివాస నందివాహ –కామేశ్వరీ పతి ,కామ సంహారుడా –కనికరించుము స్వామి కరుణ చూపు —-
‘’భస్మధారుల కిల భవబంధ వితతి –త్రెంపి బాస టగుడదువయ్య దీనబంధు –మార్గ శిర మాస తానముల్ మార్గ మిచ్చు –శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’
ఈపద్యం శ్రీనాధుని భీమఖండం లోని ‘’చంద్ర బింబానన -,చంద్ర రేఖా మౌళి, నీలకుంతల ఫాల, నీల గళుడు ‘’పద్యాన్ని స్ఫురణకు తెచ్చింది .
ఈ పాశురాలలో ‘’ శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’మకుటం ‘’మకుటాయమానం’’గా ఉన్నది .పద్యాలు జలపాత సౌరుతో మానసిక విందు కూర్చింది .పూర్వం మన మగువలు చదివే ‘’ఆధ్యాత్మ రామాయణ కీర్తన ‘’ల తన్మయత్వం కలిగిస్తుంది.అలా పాడుకోవటానికి అనువుగా కూడా ఉన్నది . .అవును .తనువూ మనసు భగవంకితమైనప్పుడు వచ్చే శబ్దం ,అర్ధం అత్యంత ఉన్నతంగా నే ఉంటాయి .
ఇలా శివ- కేశవుల అభేదాన్ని భక్తిభావ బంధురంగా రెండు రకాల పాశుర పద్యాలలో నిబద్ద౦ చేసి తమ కలం కత్తికి రెండు వైపులా సునిశిత ’’ ధార’’ ఉందని నిరూపించారు శ్రీమతి సీతారామమ్మగారు .అభిన౦దనలు .
గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు