కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత
కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ లింగం ఉండేవి .కొలనులో నీరు ఎప్పుడూ ‘’ఏనుగు లోతు’’ ఉండేది .శివలింగం కొలను నీటికి పైన దర్శనమిస్తూ ఉండేది .లింగం పాదం ఎంతలోతులో ఉందొ ఎవరికీ అంతు పట్టేదికాదు .ఈ శివ లింగాన్నిఎప్పుడో నాగులు ప్రతిస్టించాయనీ ,నిత్యాభి షేకానికి ఒకనదిని కూడా అక్కడ కల్పించాయని ,నాగులు తెచ్చిన నదికనుక ‘’నాగులేరు ‘’అనే పేరొచ్చిందని పూర్వులు చెప్పుకొనేవారు .ఆవరణం లేని ఆ శివలింగం మహా ప్రభావ సంపన్నంగా ఉండేది .దివ్యులు వచ్చి అర్చించి వెళ్ళేవారు .ఆశివ లింగం శిరసుపై ఒకపద్మం వికసించి దివ్య పరిమళాలను వెదజల్లేది.ఆ కొలను గట్టున అనేక శాఖలతో విస్తరించిన వట (మర్రి )వృక్షం ఉండేది .ఆ వటవృక్షం తొర్రలో మహా నాగం ఒకటి నివసించేది .అది రోజూ చెట్టుదిగి ఆమహా శివ లింగాన్ని చుట్టుకొని నాగాభరణంగా భాసించేది .
చాలా ఏళ్ళు గడిచాక ఆ చెరువు కొంత పూడిపోయి ,చిన్న గ్రామం ఏర్పడింది .తర్వాత ఎశం లో మహమ్మదీయ ప్రభుత్వమేర్పడి ,హిందూ దేవాలయ ధ్వంసం చేసి ,విగ్రహాల పీఠభాగం నిక్షిప్తమై ఉన్న ఉన్న అమూల్య సంపదను దోచుకోవటం ప్రారంభమైంది .అలాంటి సంక్షోభ కాలం లో ఒకమహమ్మదీయ సైన్యం ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి శివలింగ వైభవానికి ఆశ్చర్యపోయి ,ఆ శివలింగ మూలాన్ని ధ్వంసం చేస్తే అన్నతమైన ధన కనక వస్తురాసి లభిస్తుందని ఆశపడి ,తటాకం లోకి చేరి చాలాలోతుగా ఉన్న నీటిలో ఉన్న లింగాన్ని పీకటానికి విశ్వ ప్రయత్నం చేశారు .మానవ సాధ్యం కాదని అర్ధమై ఒక ఏనుగును దింపి ప్రయత్నించారు.అది తామర తూడు ఆశతో లింగం పైఉన్న తామర పువ్వును పెకలించింది .దాని మూరెడు పొడవున్న తూడు బయటికి వచ్చింది .అప్పుడు శివలింగం శిరసుపై రంధ్రం ఏర్పడి రక్తం కారటం మొదలు పెట్టింది .కొలను నీరంతా రక్త ప్రవాహమైంది .ఈ హఠాత్సంఘటనకు తురక సైన్యం భయపడి ,ప్రయత్నాన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించింది .ఇప్పటికీ ఆ శివలింగం శిరోభాగం లో మూరెడు లోతు గుంట కనిపిస్తుంది .ప్రతి రోజూ శివలింగ౦పై ఉన్న గుంటను శుభ్రంగా కడిగి, వస్త్రం జొనిపి ,తుడిచి శుభ్రం చేస్తారు .లేకపోతె రక్తపు వాసన వస్తుంది .
గ్రామస్తులకు ఈ విశేష శివలింగం పై అశేషభక్తి ఏర్పడి నిత్యపూజలుచేయటం ప్రారంభించారు .క్రమ౦గా కొలను పూడిపోయి గ్రామం వృద్ధి చెందింది .గ్రామస్తులు ఆ మహా మహిమాన్విత శివ లింగానికి ప్రాకారం ,ఆలయం కట్టించి ‘’సోమేశ్వర స్వామి ‘’గా అర్చిస్తూ నిత్యోత్సవాలు నిర్వహించారు .కొలను గట్టున ఉన్న వటవృక్షం అంటే మర్రి చెట్టు ఇప్పుడు లేదు .చాలాకాలం మర్రి చెట్టు, అందులో పాము ఉండటం యదార్ధం కనుక ఆగ్రామానికి ‘’పాము మర్రి ‘’అనే పేరొచ్చింది .కొంతకాలానికి ‘’పామ్మర్రి ‘’గా మారి ,చివరికి’’ పామర్రు ‘’అయింది .
‘’పాము వసియించు మఱ్ఱికి –గ్రామము కుఱగటనుగలుగ గా గాంచి, జన
స్తోమమ్ము ‘’పాము మఱ్ఱన’’-‘’బామఱ్ఱ’’ని యదియ పిదప వాడుక పడియెన్’’
పామర్రు క్రమాభి వృద్ధి పొంది ,చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా మారి ,1910లో గుడివాడ , తాలూకాలో పామర్రు డివిజన్ అయింది .ఈ డివిజన్ లో 65 గ్రామాలు ఉండేవి .ఈ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ కార్యాలయం పామర్రులో ఉంది .1-1-1910న డిప్యూటీ తాసిల్దార్ గా శ్రీ నండూరి రామ చంద్రరావు పంతులుగారు ఉద్యోగం లో చేరి ,సుపరిపాలనతో ప్రజామన్నన పొందారు .తర్వాత శ్రీ మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారు డిప్యూటీ తాసిల్దారయ్యారు .అదే సమయం లో భారత దేశాన్ని పాలించే అయిదవ జార్జి చక్రవర్తి కి ఢిల్లీ లో పట్టాభి షేక మహోత్సవం జరిగింది .దేశమంతా ఆ పట్టాభి షేకాన్ని ఘనంగా నిర్వహించారు .
పామర్రు లోనూ అత్యుత్సాహంగా రాజుగారి పట్టాభి షేక మహోత్సవం జరపాలని భావించి ప్రజలు స్వచ్చందంగా చందాలు వేసుకొని 5 వేల రూపాయల నిధి ప్రోగు చేసి ,బీదలకు అన్నదానం ఏర్పాటు చేసి ,ఆ మహోత్సవానికి జ్ఞాపక చిహ్నంగా పామర్రులో ‘’జయ స్తంభం ‘’నిర్మించారు .ఈ జయ స్తంభం బందరు-హైదరాబాద్ రోడ్డులో ,పుల్లేరు కాలువ వంతెన ప్రక్కన నిర్మించారు .పద్నాలుగున్నర అడుగుల ఎత్తులో ,ఆరడుగుల లోతున ఏర్పాటు చేశారు .స్తంభం మధ్యలో నాలుగు పలకలు ,దానికి పైన కిందా ఎనిమిది పలకలుగా ఉండేట్లు నిర్మించారు .మధ్యలో ఉన్న తూర్పు వైపు పలకపై ‘’శ్రీ శ్రీ పంచమ జార్జి చక్రవర్తి .మేరీ చక్రవర్తినీ గార్లకు ఢిల్లీలో 12-12-1911న పట్టాభి షేక మహోత్సవము జరిగినదని జ్ఞాపకార్ధ మీ స్తంభం ప్రతిస్తించబడి,14-12-1911తేదీన కృష్ణా కలెక్టర్ హెచ్ ఎల్ బ్రైడ్ వుడ్ దొరవలన ప్రసిద్ధ పర్చబడినది ‘’అనే అర్ధం వచ్చేట్లు ఇంగ్లీష్ లో చెక్కించారు .
In commomoration of The Imperial Coronation on 12-12-19 11At Delhi
Of The Most Gracious Majesties KING=EMPEROR GEORGE V And QUEEN=EMPRESS MARY.
Un weiled on 14-12-1911By H.L. BRAID WOOD Esq.-Collector Krishna
‘’భూషణమైన మైన పామర్తికి –శేషుడు ధర మోచి యుల్లసిలు నంతకు ,సం
తోషమునజార్జి కారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’
ఇలాంటి శాశ్వత నిర్మాణ జయస్తంభం ఈ తాలూకాలోనే మొట్టమొదటిది .దీని నిర్మాణ బాధ్యత అంతా మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది ఖర్చులు పోను మిగిలిన ధనాన్ని బాంక్ లో వేసి నిర్మాణకమిటీకి అప్పగించారు .
నాకు ఇన్నేళ్ళుగా పామర్రు లోని ఈ జయస్తంభం గురించికాని శివాలయ విశేషం గురించికాని పామర్రు అనే పేరు ఎలావచ్చిందనికాని తెలియని లేదు . అగ్రిగోల్డ్ వారు భక్తి సుధ మేగజైన్ తీస్తున్నప్పుడు దాని ఇంఛార్జిగా ఉన్న శర్మగారు నన్ను పామర్రు శివాలయానికో ప్రత్యేకత ఉందని దాన్ని గురించి తెలుసుకొని ఆర్టికల్ రాయమని పదే పదే చెప్పేవారు . నాకు తీరికా ఓపికా లేక అప్రయత్నం చేయలేదు .పామర్రు లో మూడు సార్లు సైన్స్ మాస్టర్ గా ,అద్దాడలో ఏడేళ్లు హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు పామర్రు వాస్తవ్యులు,తెలుగుపండిట్ స్వర్గీయ శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు కాని లెక్కలమేస్తారు హెడ్ ఆస్టార్ అయినా స్వర్గీయ శ్రీ గుండ్రం వెంకటేశ్వరరావు గారు కానీ పై విషయాలగురించి నాతో ఎప్పుడూ ముచ్చటించనే లేదు . ఇలా పామర్రు చరిత్ర నాకు అజ్ఞాతం గానే ఉండి పోయింది ఇంతకాలం గా .
మనవి-నాలుగు రోజులక్రితం మా అబ్బాయి శర్మ పై జంటకవుల పుస్తకం మెయిల్ లో పంపాడు అది చదివి ఆశ్చర్యపోయి రాసిన వ్యాసం ఇది .దీని తర్వాత ఆ జంటకవుల చరిత్ర సూక్ష్మ0గా రాస్తాను . నెట్ లో వెదికితే ఆ స్తంభం చరిత్ర ,ఫోటో కూడా కనపడలేదు .నాకూ ఎప్పుడూ అక్కడ కనిపించలేదు లేక నా దృష్టి దానిపై పడక పోయి ఉండచ్చు కూడా -. దుర్గాప్రసాద్
సశేషం
ఆధారం –శివ- వేంకట కవులు అనే జంటకవులైన ‘’ప్రబంధ పంచానన ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అడవి సాంబశివ రావు పంతులు ,మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులు గార్లు రచించిన ‘’పామఱ్ఱు (స్తూప )జయధ్వజ చరిత్ర ‘’
రేపు రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-19-ఉయ్యూరు
—
పామఱ్ఱు (స్తూప) జయధ్వజ చరిత్ర పుస్తకం నాకు కావాలి..
Click to access 2015.385427.Pamarru-Stupa.pdf
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81