శివ -వేంకట కవులు
వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు .
బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు
కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు గ్రామానికి చెందినవారు బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు .నియోగి బ్రాహ్మణులు .సా౦ఖ్యాయనస గోత్రీకులు .ఆంద్ర మత్చ్య పురాణం ,బిల్వనాథీయం ,సాత్రాజితీయం మొదలైన ఉద్గ్రంథాలు 25రచించిన పండితకవి .
మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులుగారు
కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగలూరు వాస్తవ్యులు మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులుగారు. మధ్వబ్రాహ్మణులు .విశ్వామిత్ర సగోత్రీకులు .శ్రీ రామాయణోద్భూత ఉత్తరకాండ ,శుద్ధాంధ్ర భీమసేన విజయం మొదలైన పంచ వింశతి గ్రంథ కర్తలు .16ఏళ్ళ వయసులోనే ‘’అష్టావధానం ‘’చేసిన సాహస మేధావి కవి .అంగలూరులో స్వంత ఖర్చులతో,అనేక కస్ట నష్టాలను భరించి ‘’ బాలికా పాఠశాల’’ స్థాపించి ,నిర్వహించి, సర్వతోముఖాభి వృద్ధి చేసిన మహోదారులు ,స్వార్ధ త్యాగి .
సాంబశివరావు గారు , అప్పారాగారు చిరకాల మిత్రులు .సమవయస్కులుకూడా .యాభై ఏళ్ళ వయసు వారు .సహజ పా౦డిత్యులు .ఉభయభాషా కోవిదులు . తమమిత్రత్వాన్ని కాపాడుకోన్నట్లే తమ పేర్లకూ మిత్రత్వం చేకూరుస్తూ ‘’శివ వెంకట కవులు ‘’అనే మిశ్రమ నామం తో 1912నుండి కనక దుర్గా స్తోత్ర రత్నమాల ,బ్రహ్మపత్రాభ్యుదయం ,జగన్నాథీయంమొదలైన ఆరు గ్రంథాలు రచించారు .వడాలిలో ఉన్న జగన్నాథదేవాలయం పాలకులు ఈ జంటకవులకు ‘’ప్రబంథ కవి పంచానన ‘’బిరుదునిచ్చి గౌరవించి సత్కరించారు .
ఈ విషయాలన్నీ ‘’పామర్రు కారోనేషన్’’ కమిటీ మెంబర్ శ్రీ బొమ్మారెడ్డి నాగి రెడ్డి 15-5-1914న ‘’పామఱ్ఱు( స్తూప )జయధ్వజ చరిత్ర ‘’పుస్తకం పీఠికలో తెలియ జేశారు .
ఈ జంటకవుల కవిత్వాన్నికొద్దిగా ఆస్వాదిద్దాం
1-‘’శ్రీ విద్యోత సమస్త లోకపటలీ సృష్టి స్థితి క్షేపణ-ప్రావీణ్యోల్ల సదాత్మక శక్తి మహిమోపన్యస్తసర్వేశ్వర
త్వావిర్భూత దయామయా కృతితియుతుం డై,సర్వగుండౌమహా –దేవుండీయుత జార్జి భూమి పతికిన్ దీర్ఘాయు రారోగ్యముల్ ‘’
2-భూషణమై పామర్తికి –శేషుడు ధర మోచి ,యుల్లసిలునంతకు సం
తోషమున జార్జికారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’
3-పరమోత్సాహంము తోడ హైందవ జన ప్రాంచన్మనోభీస్టముల్-చరితార్ధంబు లొనర్ప,బంచమ మహా జార్జి ప్రభుం డంచితా
దరుడై,ఢిల్లి మహాభి షేక పదవిన్ దాల్పంగ,దన్మంగళా-కరమౌ పుణ్య దినంబు శాశ్వతముగా గన్ దెల్పబామర్తిలో
స్థిరమౌ స్తంభము నాటి ,మాకు గరమర్ధిన్ మేలుగాంచి తీ-వురు తేజో నిధివై మహామ్మదుహుమాయూన్ సాయెబు గ్రామణీ’’
4-‘’అసమాన రాజభక్తి సమేతులై ప్రజా సామాన్యమునకు రాజన్యభక్తి –స్థిరముగ నెలకొల్పి పరమోపకారంబు గావించు శ్లాఘ్య సంకల్పమొప్ప
బ్రతి సమంబును ,రాజ పట్టాభి షేకమహోత్సవ స్మరణ ప్రయోగ సరణి –నతి బీదలగువారి కన్న వస్త్రములిచ్చి తత్సుకృతంబు భూధవునకంచి
తాయురారోగ్య ములొసంగు నట్లు వేడి –కొనెడు సత్కార్య శూరులై మనెడు నట్టి
సాదు’’పామర్తి కారోనేషన్’’సమాజ –సభికులను బ్రోవు గావుత జక్రధరుడు ‘’
ఈ కమిటీ రెండవ సంవత్సరోత్సవం 12-12-1912న అప్పటి తాసిల్దారు శ్రీ తాయి సుబ్బారావు నాయుడు గారి యాజమాన్యం కింద జరుపబడింది .నిధి వసూలు చేసి హుమాయూన్ గారిలాగానే పేదలకుమృష్టాన్నభోజనం పెట్టించి నూతనవస్త్రాలిచ్చారు .12-12-1913న మూడవ వార్షికోత్సవం డిప్యూటీ తాసిల్దార్ శ్రీ వక్కలంక లక్ష్మీ నరసింహారావు పంతులుగారు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా మన జంటకవులు మంచి పద్యాలవి౦దు కూర్చారు –‘’కరుణన్ బీదల కన్నవస్త్ర ములొసంగన్ ,నీ మహోత్సాహ ని-ర్భరతన్ గన్గొని లేమి లేమి యగుచున్ వైధాత్ర సంకల్పమున్
జరితార్ధం బొనరించు నీదగు క్రియా చాతుర్యమార్యాళిప-ల్మరు వర్ణి౦చు ను వక్కలంక కులాజాలక్ష్మి నృసి౦హాన్వయా ‘’
రూపకం –బ్యాండు మెట్టు
‘’జార్జి చక్రవర్తికిన్ –జనని మేరి రాణికిన్ –ఊర్జిత జయమంగళంబు –లొసగు నీశు డెప్పుడున్
తనదు ప్రజల సాటిగా –దలచి మనల సూటిగా –ఘనుడు జార్జి చక్రవర్తి –కాచుచుండు గావుతన్ ‘’
చివరి కందపద్యం –‘’శివ వే౦కటీయ కృతియై –చవులిడు పామఱ్ఱు స్తంభ చారిత్రంబీ
భువి నార వితారకమై –కవి హృదయాహ్లాద కరముగా విలసిల్లున్ ‘’
శివ, వేంకట కవులు రాసి ప్రచురించిన గ్రంథాలు
1-శ్రీ రామాయణోద్భు దోత్తరకాండం 2-జగన్నాదీయం అనే వడాలి మాహాత్మ్యం 3-శుద్ధాంధ్ర మేఘ సందేశం 4-ఆంధ్రీకృత మేఘ సందేశం 5-చంద్రిక –నవలాప్రబంధం 6-బాలాశతకం 7-సీతారామ శతకం 8-రామ శతకం 9-ఆది కేశవ శతకం 10-శ్రుత శైల హనుమత్సతకం 11-బ్రహ్మ పత్రాభ్యుదయం అనే పొగాకు మహిమ 12-గంగిరెద్దు –హాస్యరచన 13-స్త్రీ విద్యా సార సంగ్రహం-వచనం 14-దొంగసామి చరిత్ర –యదార్ధకథ 15-శ్రీకృష్ణ మానస పూజ-సంస్కృతం 16-హరిహర స్తోత్ర తారావళి –సంస్కృతం 17-కనకదుర్గా స్తోత్ర రత్నమాల-సంస్కృతం 18-అంగలూరు విలేజి భూగోళం 19-పామర్రు జయధ్వజ చరిత్ర 20-బాలతొడవు (అమూల్యం )21-నేత్రావధాన చంద్రిక
ఇవన్నీ- శివ వే౦క టీయ గ్రంథాలయం-అంగలూరు –కృష్ణా జిల్లా లో దొరుకుతాయని ప్రకటించారు జంటకవులు .
రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-19-ఉయ్యూరు
–