శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి
కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడాలి గ్రామంలో శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో నిర్మాణంచేసి స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి, గ్రామానికి వ్యాధాళి గా నామకరణం చేసినట్లు చరిత్ర ఆధారంగా చెప్పుచున్నారు. అప్పటి నుండి ఈ క్షేత్రం చిన్న పూరీ గా ప్రసిద్ధి చెంది భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. అప్పటి ఆలయం శిథిలావస్థకు చేరుకొనడంతో, 2011 లో ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించి, 2009, మార్చి-5వ తేదీనాడు నూతన ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు వైశాఖ బహుళ విదియ వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించెదరు. త్రయోదశినాడు ఉదయం స్వామివారిని పెళ్ళికుమారునిగా చేసెదరు. చతుర్దశినాడు సాయంత్రం ఎదురుకోలు ఉత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించెదరు. వైఆఖ పౌర్ణమి నాడు రాత్రి ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం, పాడ్యమినాడు చక్రస్నానం, పూర్ణాహుతి, విదియనాడు పవళింపుసేవ, విశేష పూజలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-19- ఉయ్యూరు

—
