గౌతమీ మాహాత్మ్యం -39
54-రామ తీర్ధం -1
భ్రూణ హత్యా పాతక౦ నుండి విముక్తి చేసే రామ తీర్ధం గురించి నలువ నారదునికి తెలియజేశాడు .ఇక్ష్వాకు వంశరాజు దశరధమహారాజు శౌర్య బల వంతుడు వివేకి .అతని రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి .వసిస్ట మహర్షి వంశపారంపర్య పురోహితుడు .ప్రజలను కన్నతండ్రిలాగా ధర్మ రక్షణగా పాలించాడు .కానీ దేవదానవులకు తరచుగా యుద్ధాలు జరిగేవి .విజయం ఇద్దరివైపు దోబూచులాడేది .ఒక సారి దేవతలతో బ్రహ్మ యుద్ధం మానమని బోధించాడు .ఆయన మాట వినకుండా మళ్ళీ దైత్యులతో భీకర యుద్ధం చేశారు .తర్వాత దేవతలు రాక్షసులు విష్ణు మూర్తిని, శివునిచేరి యుద్ధ విషయం చెప్పారు .ఆ ఇద్దరూ దేవదానవులు ముందుగా తపస్సులో బలవంతులైనతర్వాత యుద్ధం చేయమని చెప్పారు .
దేవాసురులు తపస్సు ప్రారంభించారు .కాని మనసులో ద్వేషాగ్ని రగులుతూనే ఉంది .తపస్సు మానేసి మళ్ళీ ఘోరంగా యుద్ధం చేశారు .దేవతలు అపజయం పాలయ్యారు.అప్పుడు ఆకాశవాణి ‘’ఎవరి పక్షాన దశరధ మహారాజు ఉంటాడో వారికే విజయం కలుగుతుంది ‘’అని చెప్పింది .వాయుదేవుడు ము౦దుగా దశరధుని దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెవిలో వేసి ఆయనను తమపక్షాన ఉండమని వేడుకొన్నాడు .సరేనని ఒప్పుకొన్నాడు .వాయువు వెళ్ళగానే రాక్షసులు కూడా వచ్చి తమపక్షాన నిలిచి విజయం అందించమని వేడుకొన్నారు .
దశరధుడు రాక్షసులతో అంతకు ముందే వాయువు వచ్చి తన సాయం దేవతలకు కావాలని కోరగా సరే అని ప్రతిజ్ఞ చేశానని చెప్పాడు .ఇచ్చిన మాట ప్రకారం స్వర్గానికి వెళ్లి దేవతలా తరఫున నిలిచి ,రాక్షసులతో యుద్ధం చేశాడు .ఆ యుద్ధం లో నముచి సోదరులైన రాక్షసులు ఆయన రధ చక్ర సీలను తీక్ష్ణ బాణాలతో విరగ్గొట్టారు .యుద్ధ తీవ్రతత లో ఉన్న రాజు దీన్ని గమనించలేదు. కాని ఆయనతో యుద్ధానికి వచ్చిన రాణి కైక గమనించి ,రధ గమనం ఆగకుండా చేయటానికి తన వ్రేలు సీలగా పెట్టింది ..దశరధుడు భీకర సంగ్రామం చేసి దైత్యులను ఓడించి సురలకు విజయం చేకూర్చి పెట్టాడు .తమకు చేసిన సాయానికి మిక్కిలి సంతసించి దేవతలు ఆయనకు అనేక వరాలు ప్రసాదించారు .విజయం తో అయోధ్యకు తిరిగి వస్తున్న రాజు కైక చేసిన సాహసాన్ని , త్యాగాన్నివిస్మయంతో మెచ్చుకొని మూడు వరాలు ఇస్తానని వాగ్దానం చేశాడు .ఆమె’’ మీవరాలు మీదగ్గరే ఉండనివ్వండి ‘’ అని వినయం గా చెప్పింది .అనేక ధనకనక వస్తు వాహనాలతో ఆమెకు సంతోషం కలిగించాడు .
ఒకసారి దశరధుడు వేటకు వెళ్లి ,పల్లపు ప్రాంతాలలో దాక్కొని నీళ్ళు తాగే మృగాలను వేటాడాడు .అదే సమయం లో అక్కడున్న గ్రుడ్డి వాడు చెవిటి వాడు అతి వృద్ధుడు వైశ్రవణుడు ,భార్య తమ ఒక్కగానొక్క కొడుకుతో దాహంగా ఉంది నీళ్ళు తెచ్చిపెట్టమని అడిగారు .తలిదండ్రులపై అత్యంత భక్తీ శ్రద్ధలతో సేవిస్తున్న ఆకొడుకు వారిద్దరినీ చెట్టుకొమ్మ మీదకు జాగ్రత్తగా ఎక్కించి ,నీళ్ళు తీసుకు రావటానికి వెళ్ళాడు .నీటి మడుగులో కలశం ముంచి నీరు తీసుకొంటుండగా వచ్చిన శబ్దం యేనుగుది అనుకోని రాజు నిశిత బాణాలు వేశాడు .వనగజాలు సంహార యోగ్యాలుకావని తెలిసినా ఆపని చేశాడు విధి వక్రించి .ఆ కుర్రాడు గాయం తో ‘’సద్బ్రాహ్మణుడైన నన్ను అనవసరంగా నా దోషం ఏమీ లేకుండా గాయపరచినవారేవ్వరు ‘’అన్నాడు బాధతో .రాజు నిస్చేస్టుడై ఆ శబ్దం వచ్చిన చోటుకు వెళ్లి చూసి ,పశ్చాత్తాపం తో కూలిపోయాడు .నెమ్మదిగా తేరుకొని అతని గురించి వివరాలు అడిగి తెలుసుకొని ,ఆతడు కోరినట్లుగా కలశం లోని మంచి నీటిని తీసుకొని అతని తలిదంద్రులదగ్గరకు వచ్చాడు .ఆ కుర్రాడి ప్రాణం పోయింది ..
కొడుకు యెంత సేపటికీ రానందున వృద్ధ దంపతులు ఎదురు చూస్తూ దుఖిస్తున్నారు .రాజు నీళ్ళు అందించాడు .వచ్చింది తమ కుమారుడు కాదని గ్రహించి అతడేవ్వరో చెప్పమన్నారు .విషయమంతా వివరించగా తమ కొడుకు దగ్గరకు తీసుకు వెళ్ళమని కోరగా తీసుకు వెళ్ళాడు .కొడుకు శవం పై పడి విపరీతంగా దుఃఖించి ,దశ రదునికి కూడా వార్ధక్యం లో పుత్ర వియోగం కలిగి ఆబాధతో మరణిస్తాడని శాపం పెట్టి ,చనిపోయారు .
రాజు దుఖభారం తో అయోధ్యకు వెళ్లి వసిష్ట మహర్షికి సర్వం నివేదించాడు .ఆయన ఆలోచించి అశ్వమేధ యాగం చేయమని చెప్పాడు. గాలవ ,జాబాలి ,వామదేవ, కశ్యపాది మునిశ్రేస్టుల సాయంతో అశ్వమేధ యాగం చేశాడు .యాగం సమాప్తమవుతున్న సమయం లో ఆశరీరవాణి రాజుకు పుత్రులు కలుగుతారని, జ్యేష్ట పుత్రుని పుణ్య ప్రభావం తో రాజు నిష్పాపుడు అవుతాడని ప్రకటించింది .దశరధుని రాణులు కౌసల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కైకకు భరతుడు పుత్రులుగా జన్మించారు .ఈనలుగురుకుమారులు విద్యా వినయ సంపన్నులైనారు .ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన యాగ రక్షణకు రాముని పంపమని రాజునుకోరగా ,కుదరదనగా వసిస్టుడు నచ్చ చెప్పగా రామ లక్ష్మణులను పంపాడు .వారిద్దరికీ మహర్షి మహేశ్వర సంబంధమహా విద్య ,ధనుర్విద్య మొదలైన శస్త్రాస్త్ర విద్యనూ ,లౌకిక విద్య ,రధ గజ తురగ గదాది విద్యలనన్నిటినీ ప్రయోగ ఉపసంహారాలతో సహా ఉపదేశించాడు .తాపసుల రక్షణార్ధం రాముడు తాటక రాక్షసిని చంపాడు .అహల్య శాప విమోచనం చేశాడు .యాజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వచ్చిన రాక్షసులను సంహరించారు సోదరులు .విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసి ముని ప్రశంసలు పొందారు .
విశ్వామిత్ర మహర్షి శిష్యులను మిధిలకు తీసుకు వెళ్లగా సీతా స్వయం వరం లోరాముడు శివ చాపం ఎక్కుపెట్టగాఅది విరిగి పోయింది దశరధాదులను సగౌరవ౦గా ఆహ్వాని౦చి కూతురు సీతను రామునికిచ్చి వివాహం చేశాడు మిగిలిన సోదరులకు తన తమ్ముల కూతుర్లనిచ్చి వైభవంగా వివాహం జరిపించారు .రాజు రామునికి పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకోనాలని భావించగా కైక దాసీ మంధర రాజు పూర్వమిచ్చిన వరాలు జ్ఞాపకం చేయగా ఆమె రామ వనవాసం కోరగా తట్టుకోలేక పోయాడు .తండ్రికిచ్చిన మాటనిలబెట్టుకోవటానికి రాముడు సీతతో లక్ష్మణుడితో వనవాసానికి వెళ్ళాడు .రాజు రామ వియోగంతో చనిపోయాడు భరతుడు వచ్చి బాధపడ్డాడు . ,
దాశరధ మహారాజును యమభటులు యమలోకానికి తీసుకు వెళ్లి అనేక నరకాలలో అనేక శిక్షలు వేశారు –శరీరాన్ని వండారు ,ముక్కలుగా కోశారు ,ముద్ద చేశారు,ఎండగట్టారు .పాములతోకాటు వేయించారు ,దాహం ఇవ్వకుండా బాధించారు .రాముడు చిత్రకూటం చేరి మూడేళ్ళు ఉండి,దండకారణ్యం ప్రవేశించి ,అక్కడ మునులను బాధపెడుతూ యజ్ఞయాగాదులను పాడు చేస్తున్న రాక్ష సమూహాలను మునులకోరికపై సంహరించాడు .అక్కడి నుండి గంగా తీరం చేరుకొన్నాడు భార్యా సోదరు లతో .రాముడు గౌతమీ తీరం చేరాడని తెలుసుకొన్న యముడు దశరధునికి నరకం నుండి విముక్తి కలిగించమని ,గౌతమీ నదికి అయిదు యోజనాల పర్యంతం రాముడున్నంత వరకు అతని తండ్రికి నరకబాధ ఉండరాదని ఆదేశించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-19-ఉయ్యూరు