యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8
ఇందులోని 7వ భాగాన్ని 25-9-18న రాశాను . యాజ్ఞ వల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం బహిష్కరించటం ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం ,దానిపై శాకల్యునితో వచ్చిన ఋషులు తమలో తాము చాలా సేపు వితర్కి౦చు కొని యాజ్ఞ వల్క్యుని పక్షాన నిలవటం ఇప్పటి వరకూ జరిగిన కథ.ఇక తర్వాత ఏమి జరిగిందో తెలుసుకొందాం .
అందులో చూడభాగుడు ‘’ఐతే ఆయనతో కలిసి ఉండాల్సి౦దేనా ?ఆయనకు శాపం ఉందని కల్పించితే ఏమౌతుంది ?’’అని ప్రశ్నించాడు .దానికి ఋషులు ‘’అది తుచ్చ మైన పని అవుతుంది .ఆ శాపం శ్రుతి రూపమైనదా,స్మృతి రూపమైనదా లేక పురాణ రూపమైందా?అని ఆయన శిష్యులు మనల్ని ప్రశ్నిస్తే మనదగ్గర సమాధానం లేక దిక్కులు చూడాల్సి వస్తుంది .వాళ్ళ చెవిన ఈ మాట పడితే మన నోళ్ళు మూయి౦చేవారు .అప్పుడు మేము అంగీకరించవలసి వచ్చేదికదా.అయినా అద్దం చేతిలో నే ఉంటె దిక్కులు చూడటం దేనికి ?ఆయన్నే ప్రశ్నించి విషయం సాకల్యంగా తెలుసుకొందాం ‘’అన్నారు .
రుషులంతా యాజ్న వల్క్యుని చేరి ‘’ఆశన ,అనశన వ్రతం గురించిమాట్లాడుకొందాం ‘’అనగా ‘’సానయసుడాషా హ్లూడుడు’’ అనశనుడై వ్రతం చేయాలి .కారణం దేవతలు మానవ హృదయాన్ని గ్రహించగల నేర్పరులు .అనశన వ్రతం ఆచరించే వాడు తమను యజి౦పగలడని వాడి ఇంటికి వస్తారు .అప్పుడు వాడి ఇల్లు ‘’ఉపవసధం ‘’అవుతుంది .కనుక ఇంటికి అతిధులుగా వచ్చిన దేవతలకు పెట్టకుండా భోజనం చేయటం పాపమే అవుతుంది .కనుక వాడు రాత్రి భుజి౦పకూడదు .’’అన్నాడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’అది సరికాదు .భోజనం చేయకపోతే పితృ కార్యం చేసే అర్హత కలవాడౌతాడు .తింటే ఉపవాసమున్న దేవతలకు పెట్టకుండా తిన్నవాడౌతాడు .కనుక దీవతలకు నివేది౦చాల్సిన పని లేకుండా తినదగిన పదార్ధాలు తింటే దోషం రాదు .అంటే వృక్షాల ఫలాలు తింటే ఏ దోషం అంటదు .పితరులను యజించేటప్పుడు ఫలాలూ తినరాదు .’’అన్నాడు .వార్ష్ణు డు,బర్కువు ‘’మినపరొట్టె (గారెలు )వండి తినచ్చు ‘’అన్నారు .మహర్షి ‘’తినకూడదు మినప రొట్టెలో కలిపే బియ్యం పిండి మూడు నాలుగు యామాలలో అధికమౌతుంది కనుక తిల ,మాషాదులతో (గారెలు )కలిసిన వ్రీహి (బియ్యం పిండి )అసలు తినకూడదు .అలాతింటే వాడు ఇచ్చే హవిస్సులు దేవతలు గ్రహించరు ‘’అన్నాడు .
ఋషులు అగ్రాయణ ఇష్టి గురించి మాట్లాడుదామన్నారు .కహోళ కౌషీతకి’’ఓషధుల రసం భూమ్యాకాశాలకు చెందినవే .కనుక ఈ రసాన్ని దేవతలకిచ్చి ఆగ్రయణత్వం చేత భోజనం చేయచ్చు’’అన్నాడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’ఆగ్రయణం చేయటం గురించి ఒక ఆఖ్యాయిక ఉంది .ఒకప్పుడు ఆధిక్యం కోసం దేవ రాక్షస యుద్ధం జరిగింది. రాక్షసులు మనుషులకు మృగాలకు ఆహారమైన ఓషధులను విషతుల్యం చేస్తే తిండి లేక మాడిపోతారు .అప్పుడు దేవతలకు మించిన వాళ్ళమౌతాము అనుకొని అలాగే చేశారు .పశువులు మానవులు ఆహారం లేక కుంగి కృశించారు .అప్పుడు దేవతలు యజ్ఞ౦ చేసి రాక్షసకృత్యాన్ని తొలగించారు .అప్పుడే ఋషులు కూడా యజ్ఞం చేశారు .ఆయజ్ఞ౦ ఎవరిది ఔతుందని దేవతలు తగూలాడి పందెం వేసుకొని పరిగెత్తారు .చివరికి గెలుపు అగ్ని ఇంద్రులదే అయింది . కనుక ఆగ్రయణం ఇంద్రాగ్ని సంబంధమైనది .వారికి ద్వాదశ కపాలము పురోడాశం ఇవ్వాలి .ఆగ్రయణ ఇష్టి చేతనే దేవతలు రాక్షస కృత్యాలను మాన్పగాలిగారు .దీనికి పూర్వం దర్శ పూర్ణ మాసలు చేయకపోయి ఉంటె ,వాటిని చేశాకే ఆగ్రయణ౦ చేయాలి .కుదరకపోతే ’’జాతుస్ట్రాశ్యౌదనం ‘’(అంటే నలుగురు బ్రాహ్మణులు భుజించటానికి తగిన వంట ) వండి బ్రాహ్మణులకు పెట్టాలి .దీనికి కారణం ఉంది .దేవతలు మనుష్య దేవతలని ,దేవతలని రెండు రకాలు .వేదాదులుచదివి చదివించే బ్రాహ్మణులు మనుష్య దేవులు . అగ్ని మొదలైనవారు దేవతలు .’’అని వివరించాడు .
కొందరు ఋషులు అధ్వర్యుడే యాజ్యాన్ని చూడాలి అంటే మరికొందరు ఋషులు యజమానే చూడాలి అన్నారు .దీనికి ‘’యజమాని అధ్వర్యుడుగా ఎందుకు ఉండరాదు ?గొప్ప వరాలు పొందాలనుకొనే యజమాని మంత్రాలను ఎందుకు చదువకూడదు ?.అధ్వర్యుడు ఏది కోరితే అది యజమానికోసమే అవుతుంది అందుకని అధ్వర్యుడికి శ్రద్ధ కలుగకపోవచ్చు .కనుక యజమాని అధ్వర్యుడై చూడాలి ‘’అన్నాడు యాజ్ఞ్య వల్క్యుడు .
ఋషులు ‘’అంతర్వేది లో హవిస్సు ఉంచితే దేవులను, దేవ భార్యలను విడదీసి నట్లు ఔతుంది . వారికి యజమానిపై ప్రీతి ఉండదు .కనుక అంతర్వేదిలో హవిస్సు ఉంచరాదు’’అన్నారు .దీనికి సమాధానంగా యాజ్ఞవల్క్యుడు ‘’యజమాని భార్య తన విధి తానూ చేయాలి .అంతర్వేదిలో హవిస్సు ఉంచినంత మాత్రాన తనభార్య అన్య పురుషునితో కలిసింది అనే మాట ఎవరూ ఆదరించరు.ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు వదిలిపెట్టి యజ్ఞమే వేది గా ,యజ్ఞమే యాజ్యంగా భావించి యజ్ఞాన్ని చేస్తున్నాను అంటూ అంతర్వేది లో హవిస్సు ఉంచాలి ‘’అన్నాడు
.ప్రవీణుడైన యాజ్ఞికుడు అయిన౦దువలననే ఋషులు చాలామంది ఉన్నా వ్యాసుడు బ్రహ్మిష్టి ఐన యాజ్ఞావల్క్యుడి నే ధర్మరాజు చేసే రాజసూయయాగానికి అధ్వర్యుడిగా నియమించాడు .ఆయనే చేసిన అశ్వమేధ యాగం లో అశ్వం వెంట అర్జునునితో పాటు యజ్ఞ కర్మ కుశలుడైన యాజ్ఞవల్క్య శిష్యుని శాంత్యర్ధం పంపబడ్డాడు .జనకమహారాజు తండ్రి చేసిన యాగం లో కూడా వేద దక్షిణకోసం యాజ్ఞవల్క్యుడు మేనమామ వైశంపాయనునితో తగాదా పడి దేవలుని సమక్షం లో సగం దక్షిణ పొందాడని మహాభారతం లో ఉన్నది . జనమేజయుడు దర్శ పూర్ణిమాసేస్టి చేయ సంకల్పి౦చి బ్రాహ్మణులను చేయించమంటే వారంతా తిరస్కరించారు .అప్పుడు యాజ్ఞవల్క్యడు నిలబడి చేయి౦చా డని మత్స్య పురాణం లో ఉన్నది .కనుక యాజ్ఞవల్క్య మహర్షి ఉత్తమోత్తమ ఆధ్వర్యుడు అని మనకు తెలుస్తోంది.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-19-ఉయ్యూరు .
.
.
—
—
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com