గౌతమీ మాహాత్మ్యం -44
59-తపో వనాది తీర్ధం
గోదావరి దక్షిణ తీరం లో నందినీ సంగమస్థానాన్ని తపోవన తీర్ధం ,సిద్దేశ్వర తీర్ధం శార్దూల తీర్ధం అంటారు .పూర్వం దేవతల హవ్యాన్ని ధరించే అగ్ని హోతగా ఉండేవాడు.అతనిభార్య దక్షుని కూతురు స్వాహాదేవి .సంతానం కోసం తీవ్ర తపస్సు చేస్తే భర్త సంతోషించి త్వరలోనే కొడుకులు పుడతారని చెప్పగా తపస్సు చాలించింది .తారకా సురుడు లోకాన్ని గగ్గోలు పరుస్తున్నాడు. శివపార్వతులకు చాలాకాలం ఏకాంతం లో గడుపుతున్నారు .సంతానం కలగలేదు .దేవతలు కార్యసిద్ధికోసం అగ్ని దగ్గరకొచ్చి మహేశ్వరుడికి తారకాసురిని చేష్టలు తెలియ జేయమన్నారు .శివ మిధునం ఏకాంతం లో ఉండగా వారికి ఇబ్బందికలిగితే శివుడి మూడోకన్నుకు ఆహుతి కావాల్సిందే అన్నాడు .దేవతలు తారకుడే భయంకరుడైతే ఇక అసలు భయం దేనికి?మారు రూపం లో వెళ్లి దేవకార్యం తెలియ జేయమన్నారు .
అగ్ని శుక రూపం లో వెళ్లి ,లోపలి వెళ్ళే సాహసం లేక కిటికీదగ్గరే ఆగిపోయాడు .శివుడు చూసి పార్వతితో నవ్వుతూ ‘’దేవతాకార్యం కోసం అగ్ని చిలుక రూపం లో వచ్చాడు చూడు ‘’అన్నాడు .పార్వతి సిగ్గుపడింది .అగ్నిని పిలిచి శివుడు తనకు అన్ని విషయాలు తెలుసునని అధిక మొత్తం లోతన రేతస్సును అగ్ని ముఖం లో వేశాడు .ఆ భారం భరించలేక ,గంగా తీరం చేరి అందులో కొంతభాగాన్ని కృత్తికలలో ఉంచాడు .దీనివల్ల పుట్టినవాడు కార్తికేయుడు అయ్యాడు .మిగిలిన దాన్ని రెండుభాగాలు చేసి సంతానార్ది ఐన తనభార్య స్వాహా కుఇచ్చాడు శివ తేజం వలన ఆమెకు సువర్ణుడు అనే బాలుడు, సువర్ణ అనే బాలిక కవలలుగా జన్మించారు .అగ్ని దేవుడు తనకూతురు సువర్ణ ను ప్రజ్ఞావంతుడైన ధర్ముడు అనే వాడికిచ్చి పెళ్లి చేశాడు సువర్ణుడికి సంకల్ప అనే కన్యతో వివాహం చేశాడు .ఈ కొడుకు వీర్య సమ్మిశ్ర దోషం వలన కామరూపం తో కనిపించిన స్త్రీనల్లా అనుభవించేవాడు .పతివ్రతల దగ్గరకు కూడా వారి భర్తల రూపాలలో వెళ్లి స్వేచ్చగా రతి క్రియ చేసేవాడు . సువర్ణ కూ ఈ లక్షణాలే వచ్చి కనిపించినవాడినల్లా కామించి రమించేది . వీరిద్దరి చేష్టలకు దేవతలు క్రోధం పొంది ఇద్దర్నీ వ్యభిచారులవ్వమని శపించారు . ,
కొడుకు కూతురుకు కలిగిన శాపం తెలిసి తండ్రి అగ్ని బాధపడి బ్రహ్మకు నివేదించాడు .బ్రహ్మ అగ్నిని గౌతమీ తీరం చేరి శివుని పూజించమన్నాడు .గౌతమీ స్నానం చేసి అగ్ని శివుని –‘’విశ్వస్య జగతో ధాతా,విశ్వ మూర్తి ర్నిరంజనః-ఆదికర్తా స్వయంభూ శ్చత౦నమామి జగత్పతిం ‘’-‘’యోగ్నిర్భూత్వా సంహారతి స్రస్తా వై జలరూపతః –సూర్య రూపేణయః పాతిత౦ నమామి చ త్రయంబకం ‘’అని స్తుతించాడు .శివుడు ప్రత్యక్షమై తే ‘’నీ తేజస్సు నాలో ఉంచావు .దానివలన నాకు కొడుకు కూతురుపుట్టి వ్యభిచారం తో దేవతలా శాపం పొందారు .వారికి శాపవిముక్తి కలిగించు ‘’అని వేడాడు .
శివుడు లింగ రూప లో ప్రత్యక్షమై అగ్ని కోరిక తీర్చాడు .సువర్ణ భర్త ధర్మువుతో ఆన౦ద౦ గానూ సువర్ణుడు భార్య సంకల్ప తో సుఖంగా ఉన్నారు .ధర్ముడిని శార్దూలుడు అనే రాక్షసరాజు జయించి సువర్ణ ను పాతాళానికి తీసుకువెడితే ,మామా అల్లుడు విష్ణువును ప్రార్ధిస్తే ,హరి శార్దూలుని శిరస్సు చక్రాయుధం తో ఖండించి సువర్ణ ను శంకరుడికి అప్పగించాడు చక్రం కడగబడిన చోటు చక్రతీర్ధ౦ శార్దూల తీర్ధమైంది .విష్ణువు సువర్ణ ను శంకరుని దగ్గరకు తీసుకు వెళ్ళిన చోటు శంకర ,వైష్ణవ తీర్ధమయింది .కూతురు లభించిన సంతోషం తో అగ్ని కార్చిన ఆన౦దాశ్రువులు పారి ఆనంద నది ,నందిని అయింది .నందినీ గంగా సంగమం లో శివుడుంటాడు.సువర్ణ కూడా ఉంటుంది ఆమెయే దాక్షాయణి శివా ఆనేయ ,అంబిక జగదాధారా ,కాత్యాయని ,ఈశ్వరి మంగళప్రద అనే పేర్లతో పిలువబడ్డది .ఉత్తర తటం లో 14వేలు ,దక్షిణ తీరం లో 16వేలు తీర్దాలేర్పడ్డాయి .వీటిలో చేసిన ఏపని అయినా సకల పుణ్యప్రదం ముక్తిదాయకం అని బ్రహ్మ నారదునికి ఉవాచ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-19-ఉయ్యూరు