గౌతమీ మాహాత్మ్యం -46
61- ఆపస్తంభ తీర్ధం
స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు .అగస్త్యుడు ‘’సర్వ వేదాలు ఎవరిని కీర్తిస్తాయో ,జన్మమృత్యువులు లేనివాదడేవరో అతడే ‘’పరుడు ‘’అంటే పరబ్రహ్మ .ఆతడే సృష్టి స్థితి లయాలకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం పొందుతాడు .వీరికి ఆకృతిలో మాత్రమె భేదం .ముగ్గురూ ఒక్కరే .అలాంటి పరబ్రహ్మనే పూజించాలి ‘’అన్నాడు .తనకు సరిగా అవగాహన కాలేదని పూర్తిగా వివరించమని ఆపస్తంభుడు కోరాడు .దీనికి అగస్త్యముని ‘’త్రిమూర్తులలో తేడా లేకపోయినా ఆనంద స్వరూపుడైన శివుని వలననే సర్వ సిద్ధి కలుగుతుంది కనుక శివధ్యానం అన్నిటికీ ఉత్తమం .గంగా తీరం లో ఆయనకోసం తపస్సు చేస్తే అన్నీ సిద్ధిస్తాయి ‘’అన్నాడు .
తన అనుమానాన్ని తీర్చిన అగస్తునికి ఆపస్తంభుడు కృతజ్ఞత చెప్పి గంగా తీరం చేరి పవిత్ర స్నానం చేరి శివధ్యానం లో మునిగిపోయి –
‘’కాస్టేషు వహ్నిః కుసుమేషు గంధో-బీజేషు వృక్షాది దృషత్సుహేమః –భూతేషు సర్వేషు తదాస్తి యావైః-తమ్ సోమనాథం శరణం వ్రజామి —‘’నిత్యం శరణ్యం సకలస్య పూజ్యో –నిత్యం ప్రియో యః శరణాగతస్య –నిత్యం శివో యః సకలస్య రూపం –సోమేశ్వరం తమ్ శ రణం వ్రజామి –‘’మొదలైన స్తోత్రాలతో సంతృప్తి పరచాడు .శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .ఆపస్తంభుడు ‘’ఈ తీర్ధం లో స్నానం చేసి శివధ్యానం చేసే వారి అభీస్టాలన్నీ పొందేట్లు వరం ప్రసాదించు శివా ‘’అని వేడుకొన్నాడు .అప్పటినుంచి అనాది అజ్ఞాన రూప అంధకార సమూహాన్ని నిర్మూలించటం లో సమర్ధమైన ఆపస్తంభ తీర్ధంగా ఇది విరాజిల్లింది అని బ్రహ్మ నారడుడికి తెలియ జేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-19-ఉయ్యూరు