యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13
అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి చెప్పమని జనకుడు అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా ,దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు .సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు .జనకుడు ‘’ఆ ఇద్దరిలో ఒకరు అచేతనం గా ఎందుకు ఉంటారు .మరొకరు చేతనకల్గి క్షేత్రజ్ఞుడు అని ఎలా పిలువబడుతాడు ?వివరించు ‘’అనగా మహర్షి ‘’జపాకుసుమం దగ్గరున్న స్పటికం దాని రంగులు పొందినట్లు గుణాలు పొంది గుణవంతుడు అవుతాడు .ఆ పుష్పం దగ్గర లేకపోతె శుద్ధ స్పటికంగా నిర్గుణుడై నిజ స్వభావం తో ఉంటాడు .అవ్యక్త ప్రకృతికి ఏమీ తెలియదు .స్వాభావికంగా పురుషుడికే అన్నీ తెలుసు .అజ్ఞానం చేత పురుషుడు మళ్ళీ మళ్ళీ గుణాలతో కలిసిఉంటాడు .కనుక నిజ స్వరూపం తెలియక ముక్తిపొండలేడు .ప్రకృతి యొక్క కర్తృత్వం కలవాడై ప్రకృతి ధర్మ కలవాడౌతాడు .గుణాలను ప్రసవి౦చేవాడుకనుక ప్రసవ ధర్ముడు అనీ ,ప్రళయం కలిగించేవాడు కనుక ప్రళయ ధర్ముడు అనీ అంటారు .అన్నిటికీ తానె సాక్షి తనకంటే వేరేది లేనందువలన ,తానె ప్రకృతి అనుకోవటం వలన ఆధ్యాత్మ విదులు అతడిని అద్వయుడు నిత్యుడు అంటారు .కారణ రూపం చేత అవ్యక్తుడు ఆస్థిరుడు కార్య రూపం లో వ్యక్తుడు .సాంఖ్యులు మోక్షానికి జ్ఞానాన్నీ, భూతదయను అవలంబిస్తారు .వారు వారు ప్రకృతికి ఏకత్వం ,పురుషుడికి నానాత్వం చెపుతారు అంటే ప్రకృతి ఒక్కటే కాని పురుషుడు అనేకం అని వాళ్ళభావం .కాని ప్రకృతికంటే పురుషుడు వేరే .ప్రకృతి అధ్రువం అయినా ద్రువమైన దాని లాగా కనిపిస్తుంది .దీన్ని వివరంగా వివరిస్తాను .’’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-19-ఉయ్యూరు