గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం

గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’’సాహితీ దినోత్సవం ‘’లో  లో నేను మాట్లాడాలని  తయారు చేసుకొన్నప్రసంగం

28-2-19 గురువారం ఉదయం గుడ్లవల్లేరు A.A.N.M.And V.V.R.S.R. ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 31వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘’సాహితీ దినోత్సవం  ‘’లో ముఖ్య అతిధిగా ఆహ్వాని౦పబడి నేను మాట్లాడదామనుకొన్న ప్రసంగం  -పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల సాగుదల, ‘’మైకాసురుని ‘’ భీభత్సం,  షామియానాల క్రింద ఏర్పాటు చేయబడిన సభ కావటం తో పైన ఉరుముతూ చినుకుతూన్న ఆకాశం  తో, సింహభాగం కాలం హరించుకు పోగా ,నాకు మిగిలిన ‘’పావుగంట’’ లో నాలుగు ముక్కలు మాట్లాడాను.కాని దీనికి ప్రిపరేషన్ బాగా చేసుకొని సిద్ధపడ్డాను .నాకూ వాళ్ళకూ దక్కింది అదే .ఆ కాసేపట్లోనే ఆప్రాంతపు 172 ఏళ్ళ క్రిందటి మహాకవి బహుశా ఈతరం పెద్దవారికికూడా  గుర్తు ఉండని శ్రీ దాసు శ్రీరాముల గారి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశాను .ఇప్పుడు మీకు నాప్రసంగ౦ వివరాలు తెలియ జేస్తున్నాను .సాహితీ ప్రియులుగా మనమందరం  గ్రహించాల్సిన విషయాలివి . –

   ‘’మహాకవి శ్రీ దాసు శ్రీరాములు గారు 8-4-1846 న కృష్ణాజిల్లా కూరాడ గ్రామంలో శ్రీ దాసు  కన్నయ్య శ్రీమతి కామమ్మ దంపతులకు జన్మించారు .ఆయన వాగ్గేయకారులు ,ప్రతిభకల ఉపాధ్యాయులు ,ప్రముఖ న్యాయవాది ,సంఘ సంస్కర్త ,పత్రికా నిర్వాహకుడు ,ధర్మ శాస్త్ర ,జ్యోతిశ్శాస్త్ర ,నాట్యశాస్త్ర విద్వాంసుడు ,ఆయుర్వేద శాస్త్ర పరిశోధకుడు .సంఘ సంస్కర్తలు వీరేశలింగం ,గురజాడ లకు సమకాలీనుడు .దాసుగారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు పొంగిపోయిన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి ‘’శ్రీరాములుగారు మనకు దక్కిన రెండవ శ్రీనాథుడు ‘’అంటే ,శ్రీ విశ్వనాథ ‘’ఆయన లోకానుభావం బహు దొడ్డది ‘’అనగా ,శ్రీ విశ్వనాథ వెంకటేశ్వర్లు ‘’ఎ వర్సటైల్ జీనియస్ ‘’అని అంటే ‘’అద్యతన ఆంధ్రవాజ్మయ నిర్మాత ‘’అని శ్రీ నిడదవోలు వెంకటరావు ,’’అభినవ భాసుడు ‘’అని డా .శ్రీ జి.వి సుబ్రహ్మణ్యం  ,’’రామ నీ సమాన మెవరు ‘’అన్న కీర్తనకు అన్నివిధాలా పాత్రుడు ‘’అని శ్రీ దాసు వామన రావు గార్ల చే  ప్రశంసలు పొందిన ప్రతిభా మూర్తి .

  కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం ‘’అల్లూరు ‘’అగ్రహారీకులైన దాసువారు తండ్రి వద్ద ,శ్రీ అడవి సుబ్బారాయుడు గార్లవద్ద ప్రాధమిక విద్య నేర్చారు . బాల మేధావి అయిన శ్రీరాములుగారు 12వ ఏటనే ‘’సోమలింగేశ్వర శతకం ‘’ను ప్రౌఢం గా రచించిన సాహసమూర్తి .13వ ఏట శ్రీమతి జానకమ్మగారిని శ్రీరాములు గారు పరిణయమాడి ఆదర్శ ‘’జానకీ రాములయ్యారు ‘’.14వ ఏట ‘’సాత్రాజితీ విజయం ‘’అనే యక్షగానం రాసిన సంగీత సాహిత్య శిరోమణి .సంస్కృత వ్యాకరణం నేర్వాలనే కోరిక విపరీతమై ,ఇంట్లో చెప్పకుండా ఆగిరిపల్లి వెళ్లి సంస్కృత పాఠశాలలో చేరి,  సంస్కృత వ్యాకరణం నేర్చారు .వారు అందుకొన్న స్కాలర్షిప్ ఆరోజుల్లో అర్ధరూపాయిమాత్రమే .

  గుడివాడలో ఇంగ్లిష్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా    ఉద్యోగం ప్రారంభించి ,ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూనే స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకొన్న సమర్ధులు .తర్వాత కౌతవరం లో ఉపాధ్యాయుడుగా పని చేశారు .దీనికి దగ్గరలోనే ఉన్న డోకిపర్రు గ్రామస్తులు దాసుగారి వద్దకు తమ గ్రామం లో పిల్లలు చదువుకోవటానికి బడి లేదని చెబితే స్వంతఖర్చులతో హైస్కూల్ ఏర్పాటు చేసి ,అక్కడే టీచర్ గా పని చేశారు .స్వయంగా చదివి ఇంగ్లీష్ పరీక్షలు ,ప్లీడరీ పరీక్షలు రాసి పాసయ్యారు .1878లో డోకిపర్రు వదిలి బందరులో న్యాయవాది గా ఉండటానికి వెడుతుంటే శ్రీరాములుగారు తమ గ్రామానికి చేసిన అమూల్య సేవలకు  కృతజ్ఞతగా గ్రామ స్తులు బంగారు పూలతో పాద పూజ ,శిరస్సుపై పూజ చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకొన్నారు .అంతే కాదు పూలపల్లకీ లో శ్రీరాములుగారిని గౌరవంగా ఆశీనులను చేసి గ్రామపెద్దలు ఆపల్లకీని మోసి ఊరేగించి చరిత్ర సృష్టించారు .ఇంతటి ఘనమైన వీడ్కోలు   మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి  రాధాకృష్ణన్ గారికి ఆయన విద్యార్ధులు  చేశారని మనం చదువుకొన్నాం .

  1878లో బందరులో ప్లీడరీ గా ప్రాక్టీసు మొదలు పెట్టారు  .అయిదేళ్ళ తర్వాత  1883లో బందరు వదిలి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో స్థిరపడి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ గా 1907వరకు 24ఏళ్ళు పేరు పొందారు .ఏలూరులోని దాసు గారి సువిశాలమైన స్వగృహం ఆతర్వాత ‘’గాంధీ ఆంధ్రరాష్ట్ర జాతీయ విద్యాలయం ‘’అయింది .ఆకాలంలోనే ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుశ్రీ బసవరాల రామబ్రహ్మం గారిని  మేనేజిమెంట్ అక్రమంగా తొలగించేస్తే ,ఆయనవచ్చి శ్రీరాములుగారితో మొరపెట్టుకోగా ,వెంటనే ‘’హిందూ పేట్రియాటిక్ స్కూల్ ‘’ను స్వయంగా స్థాపించి ఆ మా స్టారినే హెడ్ మాస్టర్ ను చేసిన ఉదార శీలి కార్య నిర్వహణ దక్షులు శ్రీరాములుగారు .సమాజ అభి వృద్ధికి స్త్రీలు దోహదపడాలని వా౦ఛి౦చారు .అందుకే స్త్రీ విద్యా, స్త్రీ స్వాతంత్ర్యం లపై అనేక చోట్ల ప్రసంగించి చైతన్య పరచారు .దీనిప్రభావం వలన పల్లెలలో కూడా బాలికా పాఠశాలలేర్పడ్డాయి .

  వీరేశలింగం గారి లాగానే వితంతువుల పట్ల కూడా సానుభూతి ఉండేది .వితంతు పునర్వివాహాన్ని సమర్ధిస్తూ ప్రచారం చేశారు .అంతే కాదు వితంతువుల కు శిరోముండనం చేయించటం పై తీవ్ర అభ్యంతరం చెప్పారు .దీనికోసం ‘’రండాముండన ఖండం ‘’అనే అద్భుతమైన వ్యాసం రాసి ,కనువిప్పు కల్గించారు .బాల్య వివాహాలపై కూడా శ్రీరాములు గారు విరుచుకు పడ్డారు .ఇలా సంఘ సంస్కణోద్యమ౦ లో కూడా తనదైన ప్రత్యేక పాత్ర పోషించారు .  వాగ్గేయ కారులుగా దాసువారి ప్రతిభను చూద్దాం .ఉయ్యూరుదగ్గర ,కృష్ణా నదీ తీరం లో ఉన్న తొట్లవల్లూరు సంస్థాన రాజధాని  తోట్లవల్లూరు లోని శ్రీ వేణు గోపాల స్వామి కి అంకితమిస్తూ ‘’కృతులు ,పదాలు ,జావళీలు ‘’రాసి వాగ్గేయకారుల సరసన స్థానం సంపాదించుకొన్నారు శ్రీరాములుగారు ‘’అభినయ దర్పణం ‘’అనే నాట్య శాస్త్ర గ్రంథం రాసి నాట్యం లో తనకున్న ప్రావీణ్యతను తెలియజేశారు .ఏలూరులో స్వయంగా ‘’సంగీత పాఠశాల ‘’స్థాపించి,సమర్ధులైన శ్రీ నల్లాన్ చక్రవర్తుల తిరు వేంగడా చారి  గారిని ప్రధానోపాధ్యాయులను చేశారు .ఎందరో విద్యార్ధులు ఇక్కడ సంగీతం అభ్యసించి గొప్పవారయ్యారు .ఎంతోమంది  సంగీత విద్వాంసులను పోషించారు .శ్రీఆదిభట్ల నారాయణ దాసు, శ్రీ  చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వంటి ఉద్దండులను ఆ పాఠ శాలకు ఆహ్వానించి ,విద్యార్ధులకు ప్రబోధాత్మకమైన ప్రసంగాలు చేయించి సత్కరించారు .

   శ్రీరాములుగారు అనేక ప్రక్రియలలో 30దాకా రచనలు చేశారు .వారి శతకాలలో మయూర మహాకవి సంస్కృతంలో రాసిన ‘’సూర్యశతక౦ ను  అనువదించిన  ‘’సూర్యశతకం ‘’,తెలుగు నాడు’’ఉన్నాయి .అచ్చ తెలుగు శతకం ‘’చక్కట్ల దండ ‘’రాశారు .చక్కట్లు అంటే సామాజిక నీతులు అని అర్ధం .దండ అంటే హారం, మాల .ఇందులో సమాజం లోని ఎన్నో అంశాలపై ఘాటైన  విమర్శ చేసి నీతులు బోధించారు .హాస్యం మేళవించి  పసందు చేశారు .సంస్కృత’’ దేవీభాగవత౦ ‘’ను మృదు  మధురమయిన  తెలుగు భాషలోకి అనువదించి దేవీ భక్తుడనిపించారు ‘’వైశ్య ధర్మ ప్రదీపిక ‘’’’విగ్రహారాధన ‘’రాశారు .’’తారామణి’’ అనే ధర్మ శాస్త్ర గ్రంథం రచించారు .ఆయుర్వేద వైద్య విధానం లో తమకున్న మక్కువను ప్రదర్శిస్తూ ,పరిశోధనాత్మకమైన రచన ‘’   భ్రు౦గ రాజ మహిమ ‘’రాశారు .  

  శ్రీరాములుగారు తాను  చిన్నతనం గడిపిన అల్లూరు అగ్రహారం గురించి దేవీ భాగవతం కృతి మొదట్లో ‘’నా బాల్యంబు న నాకు నానావిధ సౌఖ్యంబులకు నాట పట్టై,నన్నలరించిన ‘’అల్లూరు ‘’అగ్రహారంబునభి వర్ణించెద’’అనే భాగాన్ని ఒక ఖండ కావ్యంగా రాశారు .’’గ్రామ ప్రకృతినే వర్ణనగా  రాస్తే దాన్ని ‘’పాస్టోరల్ పోయెట్రి ‘’అంటారని , ఇంగ్లీష్ లో స్పెన్సర్ ,మాధ్యూ ఆర్నోల్డ్ ,మిల్టన్ వంటి కవులు ఇలాంటి కవిత్వం రాశారని దాసుగారిపై ఆప్రభావం ఉందని అందుకే అంతగొప్పగా తమ అగ్రహారం అల్లూరును వర్ణించారు ‘’అని శ్రీరాములుగారి రచనలపై పరిశోధన చేసి ‘’మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు –సమీక్ష ‘’అనే పరిశోధన గ్రంథం రచించి పిహెచ్ డి అందుకొన్న ఆయన మనవరాలు శ్రీమతి వెలగపూడి వైదేహి తెలియ జేశారు.

  శ్రీరాములుగారి కవిత్వ సౌందర్యం కొంత చూద్దాం .సూర్య శతకం లో ఒక పద్యం –

‘’ముల్లోకమ్ముల జ్ఞానదీపములు  తమ్ముల్ జిమ్ము నూత్నారుణో-త్ఫుల్ల శ్రీలకు నంగ రక్షకములున్ ,పూర్వాద్రి దాతుద్రవా –

భ్యుర్లాసమ్ముల తోడు నీడ లును ,వేల్పుం దంతి సింధూర దీ-వ్యల్లీలా కృతులైన భాను ,రుచులైశ్వర్యమ్ము మీకిచ్చుతన్ ‘’.

  పెళ్ళిలో మగపెళ్ళివారు ‘’సదస్యం ‘’నిర్వహిస్తున్నారు .అది అతి బాల్యవివాహం .పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లను చూసి అక్కడి సంప్రదాయ శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు చెవులు కొరుక్కుంటూ బుగ్గలు నొక్కు కొంటూ మాట్లాడుకోవటం ను అక్షర రమ్యం  చేశారు ‘’షభాష’’ లో –‘’అస్సే ,చూస్సిషి వషే,నోసే చెవుడషే,అష్లాగషే,ఏమిషే ,-విస్సావఝలవారి ‘’బుర్రి నష’’,యా విస్సాయి కిస్సారుషే’’ ఇందులో హాస్యం వ్యంగ్యం ఎత్తిపొడుపు ,బాల్యవివాహ నిరసన త్రివేణీ సంగమమై శ్రీరాములుగారి కవిత్వం లో ప్రవహించింది  .

మరో పరభాషా ప్రయోగం –‘’గూస్సు ,నాన్సేన్సు యూ గో అవే ,ఖబడ్దార్ ,బాత్ నఖో ,కౌన్ పకడా –మొద్దొక పల్లె కు మున్సఫీ చేయుచు గాడ్దె కొడుకు పన్ను కట్టమనగా ‘’ .

  ఇలా ఎంతో వైవిధ్యమైన రచనలు చేసిన మహాకవి దాసు శ్రీరాములుగారు 16-5-1908న 62ఏళ్ళ వయసులోనే ‘’దివిజకవి వరుల గుండియల్ దిగ్గురనగ’’అన్నట్లు శ్రీనాధ మహా కవి సార్వభౌముడిలాగా  అమరపురికి అరిగారు .

  హైదరాబాద్ లోని వారి మునిమనవలు శ్రీ దాసు అచ్యుతరావు సోదరులు ‘’మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి ‘’ఏర్పాటు చేసి ,ముత్తాతగారి అరుదైన గ్రంథాలను వెలువరించారు .ఫిబ్రవరి 6వ తేదీ శ్రీ దాసు అచ్యుతరావు గారు నాకు ఫోన్ చేసి ,పరిచయం చేసుకొని ,శ్రీరాములుగారి పుస్తకాలు 6 సెట్లు నాకు పంపుతామని చెప్పి వెంటనే కొరియర్ లో పంపారు .వారి కోరికపై ఒకటి ఉయ్యూరు లైబ్రరీకి ,మరొకటి అమరవాణి హైస్కూల్ లైబ్రరీకి ,ఇంకొకటి సాహితీ ప్రియులు శ్రీ కట్టు కోలు సుబ్బారెడ్డిగారికి అందించి ,ఒక్క పుస్తకం మాత్రం గుడ్లవల్లేరు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లైబ్రరీకి ప్రిన్సిపాల్ శ్రీ మూర్తి  గారి రిద్వారా నిన్న వేదికపై అందజేశాను .

  శ్రీ దాసు శ్రీరాములుగారిపై ఈ వ్యాసానికి ఆధారం ఆ గ్రంథాలే . శ్రీ అచ్యుతరావు గారికి ధన్యవాదాలు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు  .

.

image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.