గౌతమీ మాహాత్మ్యం -50
67-విష్ణు తీర్ధం
ముద్గాలమహర్షి కుమారుడు మౌద్గల్య మహర్షి ఒకభార్య జాబాలి. మరొక ఆమె భాగీరధి .ప్రతిరోజూ గౌతమీతీరం లో శమీ పుష్పాలు ,కుశలు తో విష్ణుపూజ చేసేవాడు .ఆయన ఆహ్వానం అందుకొని గరుత్మంతుని ఎక్కి అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవాడు .విష్ణువు మౌద్గల్యునికి అనేక చిత్రకథలు చెప్పేవాడు .మధ్యాహ్నం కాగానే ముని అలసిపోయినట్లు భావించి ఆశ్రమానికి వెళ్ళమని తనూ వెళ్ళిపోయేవాడు వెన్నుడు .తనకు వచ్చిన డబ్బును విష్ణు పాదార్పితం చేసి భార్యకిచ్చేవాడు .ఆమె పతికి ఆశ్రమవాసులకు అతిధి అభ్యాగతుల భోజనాలకు దాన్ని వినియోగించేది .అందరి భోజనాలైనతర్వాత ఆమె భోజనం చేసేది. రాత్రివేళ మౌద్గల్యుడు భార్యకు తనకు విష్ణువు చెప్పిన కథలన్నీ వినిపించేవాడు .
ఒక రోజు ఏకాంతం లో భర్తతో భార్య జాబాల ‘’నిత్యం విష్ణువు మీదగ్గరకు వస్తున్నాడు కానీ మనకస్టాలు తీరటం లేదు కారణం అడగండి ‘’అన్నది .ఒక రోజు ధైర్యం చేసి విష్ణువుతో ‘’స్మరణ మాత్రం చేత అన్నీ ఇచ్చే నువ్వు ,రోజూ నాకు కనిపిస్తున్నా నా విపత్తు తొలగక పోవటానికి కారణమేమిటి ?’’అని అడిగాడు .దానికి విష్ణువు ‘’ఎవరైనా కర్మఫలం అనుభవించాల్సిందే .విత్తును బట్టి ఫలమొస్తుంది .గోదావరి ప్రక్కనే ఉంటున్నా నువ్వు గంగ పూజ చేయటం లేదు .భక్తితోనే ముక్తి వస్తుంది ‘’అనగా ముని భక్తితో ముక్తికలిగితే తనకు ముక్తి కావాలని చెప్పాడు .
విష్ణువు ‘’నన్ను స్మరిస్తూ యాచకుడికి ఇచ్చింది అక్షయమౌతుంది ‘’అని చెప్పి గరుత్మంతుని ధాన్యపు గింజలు తెమ్మనగా ఆతడు వెళ్లి తేగా వాటిని విష్ణువు చేతిలో దానం చేశాడు .అతన్ని ఇంటికి వెళ్ళమనిచేప్పాడు .ఆశ్రమం చేరగానే ధనకనక వస్తువాహనాలు అతని దృష్టిలో పడి అదంతా దానఫలం విష్ణు కటాక్షం గంగ అనుగ్రహం గా భావించాడు .చాలా కాలం తలిదండ్రులతో భార్యాపిల్లలతో ఐశ్వర్యం అనుభవిస్తూ విష్ణు పూజ క్రమం తప్పక చేస్తూ ముక్తినిపొందాడు .ఇదే మౌద్గల్య లేక విష్ణు తీర్ధం గా ప్రసిద్ధమైందని నారదునికి బ్రహ్మ ఉవాచ . .
68-లక్ష్మీ తీర్ధం
సిరి సంపదలు పెంచేది లక్ష్మీ తీర్ధం .పూర్వం లక్ష్మీ దేవికి దరిద్రదేవతకు వివాదం వచ్చి ,విరోధం పెరిగి ఇద్దరూ భూలోకం చేరారు .ఈ ఇద్దరు ఎవరికివారే తనదే ఆధిక్యం అని పోటీ పడుతున్నారు .నేనే ము౦దు పుట్టానని దారిద్ర దేవత అంటే, నేను లేకపోతె ప్రాణులు జీవించలేరని లక్ష్మీ దేవి అన్నది .దరిద్రదేవత ‘’ముల్లోకాలు నా అధీనం లో ఉన్నాయి .నేనున్నచోట కామక్రోధాలు భయం ఈర్శ్యా ఈర్ష్యాదులు ఉండవు ‘’అన్నది. లక్ష్మీ దేవి ‘’అందరికి గౌరవం కలిగించేది నేనే .నిర్ధనుడు లోకంలో చులకన అవుతాడు .దేహి అనే మాటద్వారా బుద్ధి సంపద వినయం శాంతి కీర్తి అనే అయిదుగురు దేవతలు నిష్క్రమిస్తారు .యాచనలేని వాడి గుణం గౌరవి౦పబడుతుంది.ఉత్తముడు సర్వలోక పూజ్యుడు అనిపించుకొంటాడు.కనుక నేనే అధికురాలను ‘’అన్నది .దీనికి దరిద్రదేవత ‘’నువ్వు ఎక్కడపడితే అక్కడ వాలిపోతావు ఉచ్చనీచాలు పాటించవు .వినాశం చేసేవారికి వత్తాసు పలుకుతావు ‘’అని దెప్పగా ,తగాదా తీరక ఇద్దరూ బ్రహ్మ దగ్గర ఫిర్యాదు చేశారు .
ఇద్దరి వాదనలు విన్న బ్రహ్మ ‘’నాకంటే పురాతనమైనది భూమి .దానికంటే నీరు ప్రాచీనం ఇలాంటి తగాదాలు స్త్రీలలోనే వస్తాయి .నీటికంటే బ్రహ్మకమండలం లోని గంగాజలం ప్రాచీనమైనది .ఆ గోదావరి నది అన్ని కోరికలు తీరుస్తుంది ,సందేహ నివృత్తి చేస్తుంది’’అన్నాడు .భూమి జలం లతోకలిసి వారిద్దరూ గంగా తీరం చేరి తమ అభియోగాలను వినిపించగా గౌతమీనది ‘’సృష్టిలో శ్రేష్టమైన ప్రతిదీ లక్ష్మీ దేవికే చెందుతుంది .ఆమె లేకపోతె ఏమీ ఉండదు .అలాంటి లక్ష్మీ దేవితో కలహించటం అవివేకం ‘’అని దరిద్రదేవతను తరిమేసింది .అప్పటినుంచి గంగ దరిద్రానికి శత్రువు అయింది .గౌతమిని సేవి౦చి పూజించకపోతే అలక్ష్మీ ఆవహించి బాధిస్తుంది .పూజిస్తే దరిద్రం తొలగించి సంపదలతోపాటు ముక్తినీ ఇస్తుంది .అదే లక్ష్మీ తీర్ధం అని బ్రహ్మనారడుడికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-3-19-ఉయ్యూరు
.
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com