యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16
మహారాజు కోరికకు మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’సార్వభౌమా !లోకం లో ఒకరిని మించినవారొకరుంటారు అన్ని విధాలా అధికుడైనవాడినే గురువుగా చేసుకొని బ్రహ్మ విద్య నేర్వాలి. కురు ,పాంచాల దేశాలలో ఎందరో అలాంటి మహానుభావులున్నారు .వారిని పిలిపించి ఎంచుకొంటే గొప్ప గురువు లభించకపోడు ‘’అనగా ‘’లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్యగురువులెవరు ‘’?అనగా ‘’ఏదైనా నిండు సభలోనే తేలాలి ‘’అన్నాడు మహర్షి .అలా అయితే అందరూ వచ్చే మార్గం తెలియజేయమని అడుగగా ‘’సార్వ భౌముడు చేయాల్సిన బహు దక్షిణ యాగం చేయి .చక్రవర్తి తలపెట్టి యాగం చేస్తుంటే అందరూ తమంతకు తామే వస్తారు ‘’అన్నాడు .సరే అన్నాడు జనకుడు .
యాగ సంభారమంతా సిద్ధం చేసుకొని మంత్రి మిత్రయుని కురు,పా౦చాల దేశాలలోని విప్రులనందర్నీ సగౌరవంగా ఆహ్వానించామని చెప్పాడు ,.అలాగే ఆహ్వానించాడు మంత్రి .మైత్రేయుని కుమార్తె బుద్దిమతి అయిన మైత్రేయి ఉంది .ఆమె పెదతల్లి గార్గి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి బ్రహ్మవాదిని ని చేసింది . బ్రహ్మ వేత్తలంతా సమావేశమయ్యారు .అందులో అశ్వలాయనుడు ‘’మా అందరిలో నువ్వే బ్రహ్మ వేత్తవా ?’’అని అడిగాడు దానికి యాజ్ఞవల్క్యుడు ‘’నేను బ్రహ్మ వేత్తనుకాను . హౌత్రార్ధం గోవులు కావాలనే వచ్చివాటిని తోలుకుపోతున్నాను .అంతేకాని బ్రహ్మిస్టఅనుకొనినికాదు అన్నట్లుగా చెప్పగా ఆశ్వలాయనునికి ధైర్యం వచ్చి వాదానికి దిగాడు .
అశ్వలాయనుడు ‘’యాజ్ఞావల్క్యా !యజ్ఞం అంతా మృత్యువుతో వ్యాప్తి చెందింది .యజమాని దాని వ్యాప్తిని ఎలా అధిగమిస్తాడు ?’’అని ప్రశ్నించాడు .మహర్షి ‘’యజమాని వాక్కే హోత .,అగ్నికూడా .అగ్నినే హోతగా భావించి కర్మ సాధనాలన్నీ హోతాగ్నులకు అది దేవత అయిన అగ్ని రూపం తో చూడటమే అతి ముక్తి ‘’అన్నాడు .అశ్వలాయనుడు ‘’యజమాని అహోరాత్ర వ్యాప్తిని ఎలా అదిగమించగలడుడు?’’అనగా ‘’అధ్వర్యుడు అనే నేత్ర రూపుడైన సూర్యుని మృత్యువు అతిక్రమిస్తాడు కనుక ఆదిత్యుడే ముక్తి అతిముక్తీ కూడా.ఆధ్వర్య ఆదిత్యుల నిద్దర్నీ ఆదిత్యునిగా చూడటమే మృత్యువును అతిక్రమించటం .అధ్వర్యుడు అంటే యజుర్వేదం బాగా తెలిసిన ఋత్విజుడు ‘’అన్నాడు .అశ్వలాయనుడు ‘’అంతా శుక్ల కృష్ణ పక్షాలచేత స్వాధీనమై ఉన్నాయికదా ,దాని వ్యాప్తిని ఎలా అతిక్రమించాలి ?’’అన్న ప్రశ్నకు మహర్షి ‘’యజమాని అయిన ఉద్గాత ,ఋత్విజుడు వాయు రూప ప్రాణం చేత మృత్యువును అతిక్రమించి ప్రకాశిస్తారు .యజమాని ప్రాణమే ఉద్గాత .అదే వాయువు .అదేఉద్గాత .అదే ముక్తి అదే అతిముక్తి ‘’అన్నాడు .
‘’ ఆకాశానికి ఆధారం లేదుకదా ,యజమాని దేని నాధారంగా స్వర్గాన్ని అతిక్రమిస్తాడు ‘’అడిగాడు అశ్వలాయనుడు .’’బ్రహ్మ ఋత్విజుడు ,మనసు అయిన చంద్రుని చేత స్వర్గాన్ని అతిక్రమించి ముక్తుడౌతాడు .యజమాని మనస్సు బ్రహ్మ అనే ఋత్విక్కు .ఆ మనస్సు చంద్రుడు .ఆ చంద్రుడే బ్రాహ్మణే ఋత్విజుడు అతడేముక్తి అతిముక్తి ‘’అన్నాడు .’’ఇప్పు’’డీ యజ్ఞం లో హోత ఎన్ని రుగ్మంత్రాలతో హోత్రం చేస్తాడు ?’’అనగా ‘’మూడిటితో’’అనగా అవేవో చెప్పమంటే ‘’మొదటిది పురోను వాక్యం అంటే యాగం కంటే ముందు చెప్పే రుగ్వేదమంత్రాలు.రెండోది యాజ్య అంటే యాగం లో ప్రయోగం కోసం చెప్పేఋగ్వేద మంత్రాలు ,మూడవది శన్య అంటే యాగం లో శస్త్రం కోసం చెప్పే మంత్రాలు’’అని బదులిచ్చాడు.ఈ మూడిటితో దేన్ని జయిస్తాడు అనిఅడుగాగా సకల ప్రాణి సముదాయాన్నీ జయిస్తాడు ‘’అనగా ‘’ఇప్పుడీ యాగం లో ఎన్ని హుతులను వ్రేలుస్తారు ‘’అని ప్రశ్నిస్తే ‘’మూడు అనగా అవేమిటి అంటే ‘’బాగాప్రకాశించే సమిధాహుతులు ,బాగా శబ్దం చేసే మాంసం మొదలైనవి ,భూమికి౦దికి పోయే పయస్సు సోమాహుతులు ‘’అన్నాడు .వీటితో దేన్ని జయిస్తాడు అనే ప్రశ్నకు ‘’మొదటి ఆహుతులతో దేవలోకాన్నీ ,రెండవదానితో పితృలోకాన్నీ ,మూడవదానితో మనుష్య లోకాన్నీ జయిస్తాడు ‘’అని చక్కని సమాధానాలు చెప్పాడు .ఇంతలో కురుపా౦చా ల దేశాలలోని బ్రాహ్మణ్య గణ౦ యాగం ఆహ్వానం తో గుంపులు గుంపులుగా యాగ శాలకు చేరుకొనగా ,యాజ్ఞావల్క్యుని మేనమామ శాకల్యుడు,ఆయన ముఠావాళ్ళు యాజ్ఞవల్క్యుని ఎలాగైనా ఓడించి పరాభవించాలని అత్యుత్సాహం తో చేరారు .తరవాత ఏమి జరిగిందో తర్వాత తెలియ జేస్తాను .
సశేషం
రేపు మహా శివరాత్రి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు
.
.
.
.
—
—
—
గబ్బిట దుర్గా ప్రసాద్