యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17
మేనల్లుడిపై మాటల విషం కక్కుతూ శాకల్యుడు అక్కడి రుషిగణంతో ‘’తానొక్కడే విద్వాంసుడను అనే గర్వతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు .ఇప్పుడు జనకమహా రాజుఆహ్వాన పై కురు పాంచ దేశాలను౦ డి ఎందరెందరో వేదవిదులు వచ్చారు. వారి ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం ‘’అన్నాడు ఒక రోజు మహారాజు వెయ్యి ఆవులను అక్కడ నిలిపి ,ఒక్కో ఆవుకొమ్ముకు ‘’పదేసి పాదాల బంగారం ‘’కట్టించి నిలబెట్టించి ‘’మీలో బ్రహ్మిస్టు డైనవాడు ఈ గోసహశ్రాన్ని హాయిగా ఇంటికి తోలుకుపోవచ్చు ‘’అని ప్రకటించాడు .ఎవరికివారు వితర్కి౦చు కొని తమ అర్హతను బేరీజు వేసుకొని తమకు అంత ‘’దృశ్యం ‘’లేదని గ్రహించి వాటినితోలుకు పోవటానికి సాహసించి ముందుకు రాలేదు .
అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తనదగ్గర సామవేదం చదువుతున్న ‘’సోమ్యుని తో ‘’ఆవులను మన ఇంటికి తోలుకు వెళ్ళు ‘’అని పురమాయించగా ,అతడు తోలుకు పోతుంటే సభ్యులు గుంజాటన పడుతూ ప్రశ్నించే ధైర్యం లేక కకావికలయ్యారు .అప్పుడు యాగానికి హోత అయిన అశ్వలాయనుడు ‘’యజ్ఞం లో బ్రహ్మ అనే ఋత్విజుడు దక్షిణం లో బ్రహ్మాసనంపై కూర్చుని ఎందరు దేవతలచేత యజ్ఞాన్ని కాపాడుతున్నాడు ?’’అని ప్రశ్నించగా యాజ్నవల్క్యుడు ‘’ ఒక్క దేవతతో ‘’అని చెప్పగా, ఆదేవత ఎవరు అని అడిగితె ‘’మనస్సు ఆ దేవత .మనస్సు అనంతమైనది దేవతలూ అన౦తమైనవారు .బ్రహ్మ ,ఋత్విజుడు మనస్సు లో విశ్వే దేవ దృష్టితో ధ్యానించటం చేత అనంతమైన లోకాన్నే జయిస్తున్నారు ‘’అన్నాడు .
అశ్వలాయనుడు ‘’ఈయజ్ఞ౦లొ ఉద్గాత ఎన్ని స్తోత్రియాలను స్తుతిస్తున్నాడు ?’’అనగా ‘’మూడు ‘’అని చెప్పగా అవేమిటి అంటే పురోను వాక్యాదులు ‘’అనగా అవి కర్తలో ఎలా ఉన్నాయని అడిగితె ‘’అధ్యాత్మం లో ప్రాణమే పురోను వాక్యం .అపానమే యాజ్య ,వ్యానమే శన్య ‘’అనగా పురోను వాక్యాలతో కర్త దేన్ని జయిస్తాడని ప్రశ్నించగా ‘’పురోను వాక్యాలతో భూలోకాన్నీ ,ఆజ్య చేత అంతరిక్షాన్నీ ,శన్య చే భూలోకాన్నీ జయిస్తాడు ‘’అంటూ తడబాటు లేకుండా యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు చెప్పాడు .ఇక ప్రశ్నించటానికి ఏమీ లేక అశ్వలాయనుడు మాటాడకుండా ఉండి పోయాడు .
అశ్వల బ్రాహ్మణాశయం
జనులు అజ్ఞానం తో యజ్ఞ కామ్య కర్మలమీదే ఆసక్తి కలిగి ఉన్నారు .ఈ యజ్ఞాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అన్వయించి చెపుతాడో చూద్దామనుకొని అశ్వలాయనుడు ఆ విషయమై ప్రశ్నించాడు .మహర్షి ఆధ్యాత్మ యజ్ఞమే యజ్ఞం .ద్రవ్యమయ యజ్ఞం యజ్ఞం కాదు అని నిరూపించి చెప్పాడు .యజ్ఞ సాదృశ్యం వలన ద్రవ్యాలతో చేసే యజ్ఞం లో హోత అధ్వర్యుడు,ఉద్గాత ,బ్రహ్మ అనే నలుగురు ఋత్విజులేకాక యజమాని అయిదవ వాడుగా ఉంటాడు .వాక్కు చక్షువు కర్ణం మనస్సు నాలుగూ నలుగురు ఋత్విజులు .అవి పవిత్రం అయితే వాటి అధిదైవతాలైన అగ్ని ఆదిత్యుడు ,వాయువు చంద్రుడు అనే పేర్లతో పిలువబడుతారు .అప్పుడు యజమాని అయిన ఆత్మకు మోక్షం కలగటానికి అభ్యంతరం ఉండదు .అప్పుడే పురుషుడు జ్ఞాని అనిపించుకొంటాడు .మృత్యువు మొదలైనవి జ్ఞానిని బంధించలేవు .దేవ ,పితృ మనుష్యులు ఈ శరీరం లోని భాగాలే .శిరస్సు దేవలోకం .మధ్య శరీరం పితృ లోకం .కటికి కిందిభాగం మనుష్యలోకం .దిట్టమైన బ్రహ్మవలననే యజ్ఞం సాంగం అయినట్లుగా ,మనసు వివిధ విషయాలపైకి పోనీయకుండా నిలిపితేనే ఆత్మ అనే యజమాని కి మోక్షం లభిస్తుంది ‘’అని తగిన సంతృప్తికరమైన సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు .
సశేషం
మహాశివరాత్రి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-19-ఉయ్యూరు
.