రుద్ర తాండవ ఆంతర్యం
కాస్మిక్ డాన్స్ అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం లోని ఆంతర్యం తెలుసుకొందాం .రుద్రతాండవం గతిశీలక ,స్థిరమైన శక్తి ప్రవాహమే .అందులో అయిదు శాశ్వత శక్తులు అంటే సృష్టి ,స్థితి ,లయం ,మాయ ,విముక్తి ఉంటాయి .శివుడు చేసే రుద్రతాండవం లయానికి సంబంధించింది .అందులో అగ్ని కీలలు మెరుపులు ఉరుములతో విశ్వమంతా వ్యాపించి ,సూర్యుని చంద్రుని గ్రహగోళాలను కూడా చెదరగొట్టి వ్రేలాడే శిరోజాలతో, నుదుట విభూతితో ,త్రిశూలం ,మద్దెల తో ఎడమకాలు పైకెత్తి ,అజ్ఞాన రాక్షసునిపై ,సమతౌల్యంతో నిలబడి ,చేతుల,కాళ్ళపై సర్పాలు ఆడుతూ,అల్లినట్లున్న జటాజూటం అహంకారానికి ప్రతీకగా శివుడు తాండవ నృత్యం చేస్తాడు.కుడి చేతిపైభాగం లో డమరుకం స్త్రీ పురుష కీలక సూత్రానికి భాష్యంగా ,క్రిందిభాగం అభయ ప్రదానంగా ఉంటుంది .చేతిలోని లేక శిరసుపై కపాలం మృత్యువుపై విజయానికి సంకేతం .జటాజూటం లోని గంగ పవిత్ర జలానికి సంకేతం .శివుని త్రినేత్రం నిత్యజాగృతికి ,విజ్ఞానానికి సంకేతం .అంతమాత్రమేకాదు అదుపుతప్పి ప్రకృతి విలయానికి పాల్పడే వారిని దహించే అగ్నికూడా .
శివతాండవం లో ఉధృత స్థితి గురించి పైన తెలుసుకున్నాం .ఇప్పుడు లాస్యం అనే సున్నితమైన నాట్యం గురించి తెలుసుకొందాం .దీనినే ఆనంద తాండవం అంటారు .తాండవం లో సర్వం లయం చెందగానే లాస్యం లేక ఆనంద తాండవం లో సృష్టి జరుగుతుంది .ఈ రెండు రూపాలశివ తాండవం మనకు చిదంబరం నటరాజ దేవాలయం లో కనిపిస్తుంది .చిత్ అనేది అంబరం అంటే ఆకాశం గా ఉన్నదే చిదంబరం .అంటే మనసు లేక బుద్ధి ఆకాశంగా కలది అన్నమాట .అనగా ఇది హృదయం లోని చైతన్య కేంద్రం కు ప్రతీక .
శివుడు లేక బ్రహ్మం విశ్వ చైతన్యానికి ప్రతీక. శివుని శరీరమంతా ప్రాకుతూ ఉండే సర్పాలు మానవ శరీరం లోని నాడీ సముదాయాలే .కుండలిని శక్తి కేంద్రాలే . ప్రతిమానవునిలో ఉండేవే .ఈ కుండలిని మేలుకొల్పటం అంటే ఏడు శక్తి చక్రాలను ఉద్దీపనం చేయటమే . సాత్విక రాజస తామస గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఈ విశ్వం లో ప్రాణి రూపాలనుసృష్టిస్తాయి అని భగవద్గీతలో చెప్పబడింది .దైవీ తత్త్వం తొమ్మిదిభాగాలుగా విభజింపబడుతుంది .కాని అందులో ఎనిమిది అంటే భూమి నీరు అగ్ని వాయువు ఈధర్ ,బుద్ధి అహంకారం లను మాత్రమే మనం అవగతం చేసుకోగలుగుతున్నాం .తొమ్మిదో దైవీ శక్తి మాత్రం సృష్టి విచిత్రం లో శాశ్వతంగా కప్పి వేయబడింది .
1972లో Fritjof Capra అనే రచయిత తన ‘The Tao of Physics’పుస్తకం లో వేదవిజ్ఞానాన్నీ , ఆధునిక శాస్త్రాన్ని తులనాత్మకం గా పరిశీలించి భారత దేశం లో చెప్పబడిన శాస్త్రీయ విజ్ఞానం అంతా ప్రతీకాత్మకమైనదన్నాడు .’’ప్రతి ఉపపరమాణువు (సబ్ అటామిక్ పార్టికల్ )శక్తి నాట్యం చేస్తుంది ,తానే శక్తి నాట్యమౌతు౦దికూడా .సృష్టి కార్యంలో ఇది సృష్టి లయల స్థిర నిరంతరశాశ్వత ప్రవాహ విధానం .కనుక ఆధునిక భౌతిక శాస్త్ర వేత్తలకు శివ తాండవం ఉపపరమాణువు నాట్యమే .
2004లో జెనీవాలో జరిగిన ‘’యూరోపియన్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్ ‘’లో రెండు మీటర్ల నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించారు .తాండవ నాట్యం చేసే ఈ శివుని విగ్రహం సృష్టి లయాల వలయానికి ప్రతీక గానేకాక ,సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క గతిశక్తికి సంకేతం అనీ ,ఇదే విశ్వ సృష్టికి ఆధారమని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ భావిస్తున్నారు .జై నటరాజ జైజై నటరాజ .
ఆధారం –‘’విస్పరింగ్ మైండ్ ‘’రచయిత కే.పి. శశిధరన్ వ్యాసం .
మహాశివరాత్రి శుభాకాంక్షలతో