యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -18
జరత్కార గోత్రుడు ,రుతభాగుని కొడుకు ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని ‘’గ్రహాలెన్ని ?అతి గ్రహాలెన్ని ‘’?అని అడిగాడు .గ్రహాలూ అతిగ్రహాలు ఎనిమిదేసి అన్నాడు మహర్షి .వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు ‘’’ఘ్రాణ ఇంద్రియమే గ్రహం .దానికి సంబంధించిన గంధమే అతి గ్రహం .లోకం నిశ్వాస వాయువు చేత తీసుకోబడి వాసన అనుభవిస్తుంది .వాగింద్రియమే గ్రహం .అది వ్యక్తం చేసేదే అతి గ్రహం .వాగింద్రియగ్రహం వ్యక్తం చేసేఅతిగ్రహం తో వ్యాప్తి చెందుతుంది .నాలుక గ్రహం దానికి చెందిన రసం అతిగ్రహం .నాలుక రసం చేత వ్యాపిస్తుంది .కన్ను గ్రహం రూపం అతి గ్రహం .చెవి గ్రహం వినికిడి అతిగ్రహం .మనసు గ్రహం. కాలం అతిగ్రహం .హస్తద్వయం గ్రహం .కర్మ అతిగ్రహం .చర్మం గ్రహం .స్పర్శ అతిగ్రహం .ఈ ఇంద్రియాలవలననే సుఖ దుఖాలు కలుగుతాయి ‘’అని స్పష్టంగా చెప్పాడు .
‘’మృత్యువు కు అన్నీ ఆహరం కదా ఆ మృత్యువు ఏ దేవతకు అన్నం అవుతోంది ?’’అనిఅడగగా మహర్షి ‘’అగ్నియే మృత్యువు .అది ఉదకాలకు అన్నం అవుతోంది.పరబ్రహ్మ వేత్త అయిన పురుషుడు మృత్యువును జయిస్తాడు ‘’అని చెప్పి మళ్ళీ దానికేది మృత్యువు అనే ప్రశ్న పరంపరరాకుండా కట్ చేసి ఉపాయంగా బ్రహ్మానికి మృత్యువు లేదు అని ఖండితంగా చెప్పి ఆరకమైన ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టించాడు .ఆర్తభాగుడు మళ్ళీ ‘’బ్రహ్మవేత్త అయిన పురుషుడు మృతి చెందితే అతడి ప్రాణాలు లేచిపోతాయా పోవా ?’’అని అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పురుషుని ప్రాణాలు ఇక్కడే పరమాత్మలో లీనమవుతాయి .అతడు నిద్రిస్తాడు .బాహ్యవాయువు చేత పూరి౦పబడి ,మరణం పొంది పడుకొని ఉంటాడు .అంటే సంసార బంధ విముక్తుడు ఎక్కడికీ పోడనీ లోకమంతా వ్యాపించి ఉంటాడని భావం ‘’అన్నాడు . ‘’ బ్రహ్మ వేత్త ఐన పురుషుడు మరణిస్తే అతడిని విడువకుండా ఉండేది ఏది ?’’.ఆర్తభాగుని ప్రశ్న .యాజ్ఞవల్క్యుని సమాధానం –‘’అతడిని విడువకుండా ఉండేది పేరు .నామాలు అనంతం విశ్వేదేవులూ అనంతమే .అంటే గొప్పవారు మృతి చెందినా వారి పేరు ప్రఖ్యాతులు నిలిచే ఉంటాయని భావం .బ్రహ్మవేత్త కాని వాడు మరణిస్తే ?అనే ప్రశ్నకు మహర్షి ‘’అజ్ఞాని మళ్ళీ మళ్ళీ పుట్టటానికి కొందరు స్వభావమని కొందరు యాదృచ్చికమని ,కర్మ, దైవం అని అంటారు .దీన్ని జనసమూహం లో నిరూపించటం కుదరదు .’’అన్నాడు .ఇద్దరూకలిసి ఒక ఏకాంత ప్రదేశం లో చర్చించారు .చివరికి అజ్ఞాని అయిన పురుషుడు దేహేన్ద్రి యాదులు పొందుతాడని నిశ్చయించారు .దేహాంతర ప్రాప్తికి కర్మమే ముఖ్యకారణమని తేల్చారు .చివరగా యాజ్ఞవల్క్యుడు పుణ్య కర్మలతో పుణ్యం పొందినవాడు బ్రహ్మణాది జన్మలను ,పాపకర్మలతో పాపాత్ముడైనవాడు కుక్క పంది మొదలైన జన్మాలు పొందుతాడు ‘’అని చెప్పగానే ఆర్తభాగుడు ఇక ప్రశ్నించలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు