యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -19
లహ్యుని పుత్రుడు భుజ్యుడు ‘’మేము అధ్యయనం కోసం వ్రతం చేస్తూ ,మద్ర దేశం లో కసి గోత్రజుడు పతంజలి ఇంటికి వెళ్లాం .అతని కూతురు అమానుష గాంధర్వ గ్రహా ష్టయైఉంటుడగా అతడిని ఎవరు అని అడిగితె తాను ఆంగీరస గోత్రజు డైన సుధన్వుడను అని చెప్పాడు .అతడి గురించి తెలుసుకోవాలని ‘’పరీక్షిత్ కొడుకులు ఏ లోకం లో ఉన్నారు ?అని అడగగా అతడు వారెక్కడ ఉన్నదీ సవిస్తరంగా వివరించాడు .యాజ్ఞావల్క్యా పారీక్షితులు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పగలవా ?’’అని అడిగాడు .’’వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన వారు పోయే లోకానికి పోయారని మీకు ఆగంధర్వుడు చెప్పలేదు కదా ?’’అని ఎదురు ప్రశ్నవేశాడు యాజ్ఞవల్క్యుడు .’’అశ్వమేధం చేసేవారు ఎక్కడికి పోతారు ?’’భుజ్యుని ప్రశ్నకు మహర్షి ‘’ప్రాణుల కర్మఫలం అనుభవించే స్థానం ,విరాట్ పురుషుని శరీరం లోకాలోక పర్వతం చేత చుట్టుకో బడి ముప్ఫై రెండు దేవ రధాహ్మ్యముల పరిమితి కలిగి ఉంటుంది .దీనికి రెండింతల పరిధి తో భూమి చుట్టుకొని ఉంటుంది .వీటిని చీల్చుకొని అశ్వమేధ యాగం చేసినవారు పోతారు ‘’అని చెప్పగా ‘’ఆ రంధ్రం పరిమాణం యెంత ?’’అని ప్రశ్నించగా ‘’క్షురకుని కత్తివాయి యెంత పరిమాణం ఉంటుందో అంత సూక్ష్మ పరిమాణం ‘’అన్నాడు .ఈ మార్గం ద్వారా పరమేశ్వరుడు పరీక్షిత్ కొడుకులు భీమ సేన ,ఉగ్రసేన ,శ్రుత సేన లను పక్షి రూపం లో మోసుకు పోయి ,లోపలా బయటా సమష్టి వ్యష్టి రూపం లో ఉన్న వాయువుకు అప్పగించాడు .వాయువు వారిని తనస్వరూపంగా మార్చుకొని అండకపాలం మధ్యలో ఉన్నఅతి సూక్ష్మ మార్గం నుంచి ,దాని బయట ఉండే లోకాలకు తీసుకు తీసుకు వెళ్ళాడు .ఇదంతా మీకు గంధర్వుడు చెప్పి వాయువును ప్రశంసించాడు కదా .ఆ వాయువు వ్యష్టి ,సమష్టి రూపం అని తెలుసుకొన్నవాడు పునర్జన్మ రహితుడు అవుతాడు ‘’అనగానే భుజ్యుడు మళ్ళీ ప్రశ్నించలేదు . ఉపనిషత్తులలో వాయువు అద్భుత గుణ శక్తి,చాలక శక్తి కలదని వర్ణించబడింది .ఇది సాధారణగాలి కాదు .భూమి ,సూర్యాదులు ఏ శక్తివలన చలిస్తున్నారో అలాంటి చాలక శక్తికల వాయువు .దీనిలోనే ముక్త జీవులందరూ సంచరిస్తారు .ఈ వాయువే ఆ జీవిని నిజ స్థానానికి పంపుతుంది .ఇది లేకుండా క్షణం కూడా ఉండలేము .అదే జీవనం .అదే అశ్వమేధం చేసినవారు సంచరించే స్థానం .
జక్రుని పుత్రుడు ఉషస్తుడు’’కొమ్ములను బట్టి ఆవు అని చెప్పవచ్చు .శబ్దాలతో ప్రత్యగాత్మను ఎలా చెప్పగలవు ?’’ అని అడుగగా ‘’దేహే౦ద్రియాలతో ఉన్న ఆత్మసర్వా౦తరమైనది ‘’అనగా ‘’సర్వానికి లోపల ఉండే ఆత్మ ఏది ?’’అని ప్రశ్నించగా మహర్షి ‘’నాశికతో ప్రాణవ్యాపారం ,ఉదానం తో ఉదాన వ్యాపారం ,ఏది చేస్తుందో అదే లోపలుండే విజ్ఞానమయమైన ఆత్మ స్వరూపం .అంటే దేహం ఇద్రియాదులకు విలక్షణమైన విజ్ఞానమే ఆత్మ చేత అధి స్టింపబడి ప్రాణమున్న మనుష్యాదులచేత రధం మొదలైన వాటికి చలనం కలిగినట్లు కలిగిస్తుంది .దేహెంద్రియాది సముదాయం కంటే ఆత్మ వేరైన విజ్ఞానం కలిగి ఉంటుంది .ఈ ఆత్మనే సమీపం ,ప్రత్యక్షం ,బ్రహ్మము ,సర్వా౦తరము ,ప్రత్యగాత్మ అనే విశేషాలతో ఉంటుంది .ఇదే సర్వా౦తర మైన ఆత్మ స్వరూపం ‘’అని చెప్పాడు .
సమాధానం స్పష్టంగా లేదని మరింత వివరించమని కోరగా ‘’ఆవు గుర్రాలను చూసినట్లు ఆత్మను చూడలేవు ,వినలేవు తలపలేవు .బుద్ధితో తెలుసుకోలేవు .ఆత్మకానిది ప్రతిదీ నశి౦చేదే .ఆత్మకంటే వేరైనా కారణ శరీరాన్ని కరణాత్మక లింగం అంటారు’’అనగానే నోరు మెదపలేదు ప్రాశ్నికుడు .
కుషీతుని కొడుకు కహోళుడు ‘’సన్నిహితం ,ప్రత్యక్షం ,సర్వాంతరం అయిన ఆత్మఏదో స్పష్టంగా చెప్పండి ?’’అని అడిగాడు .’’ఆత్మస్వరూపం సర్వా౦తర మైనది ‘’అన్నాడు .’’దాని స్వరూపం ఏది ?’’అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’భోజనం ,ప్రాణం పై ఇచ్చ ,శోక మోహ ముదిమి మృత్యు వులను అతిక్రమింఛి ఆత్మ స్వరూపం తెలిసి పుత్ర విత్త ,లోకాలపై కోరికలేక భిక్షాటనం చేస్తున్నారు .బ్రాహ్మణుడు గురువు ,ఆగమాలు పాండిత్యం లతో ఆత్మజ్ఞానం పొందిబాల్యం తో అంటే ఆత్మ విజ్ఞాన బలం తో ఉండగోరి ముని అవుతాడు .మౌనం, అమౌనం లగురించి బాగా తెలుసుకొని బ్రాహ్మణుడు అవుతాడు అంటే సర్వం బ్రహ్మ స్వరూపమే అనే జ్ఞాని అవుతాడు ‘’అని ఆత్మజ్ఞాన విషయం కూలకషంగా వివరించగా కహోళుడు మారు మాట్లాడలేదు .మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సింది –ఆత్మకంటే వేరైనది నశిస్తుంది .కనుక సర్వం వదిలి ఆత్మ చింతన చేస్తే ముక్తి లభిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-19-ఉయ్యూరు