యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24
వివాహం సంతానం
గార్గి తన అన్న మిత్రుని తో కూతురు మైత్రేయి వివాహ విషయం కదిలించింది .యుక్తవయసు వచ్చి౦ది కనుక వివాహం చేయాలని ఆమె మనసులో మాట కనుక్కోమని సోదరికి చెప్పాడు .ఆమె అడిగింది .దానికి మైత్రేయి ‘’బిడ్డల అభిప్రాయం తలి దండ్రులకు తెలిసే ఉంటుంది ‘’అన్నది .గార్గి ‘’మాకు తెలిసినా నీ నోటి లోనుంచి ఆ మంచి మాట వినటం మాకు సంతోషం కదా ‘’అంది .అప్పుడు మైత్రేయి తాను యాజ్ఞవల్క్యమహర్షి వాదన విన్నాక అయన బ్రహ్మ వేత్త అని అందరూ నిర్దారించారుకనుక ఆయననే పెళ్లి చేసుకొంటే ఉచితంగా ఉంటుందని పిస్తోందని అన్నది .మిత్రుడు ‘’యాజ్ఞవల్క్యుడు ఇప్పటికే కాత్యాయని ని వివాహమాడి అన్యోన్యంగా కాపురం చేస్తున్నాడు .అలాంటివాడు మళ్ళీ మన అమ్మాయిని పెళ్లి చేసుకొంటాడా ?’’అని సందేహించాడు .దీనికి గార్గి పూర్వం జరిగిన ఒక విషయం గుర్తు చేసింది .ఒకసారి యాజ్ఞవల్క్యుడు తపస్సు చేసుకొంటుంటే పెద్ద పులి ఆయనపై దూక బోతుంటే మిత్రుడు తన సహచరుల చేత దాన్ని చంపించగా మహర్షి అతడిని పొగిడిన విషయం ఇది వరకే తానూ చెప్పిన అసంగతి గుర్తు చేసి ,ఇప్పుడు మనపిల్లను పెళ్లి చేసుకోమని అడిగితె కాదనడు అని ధైర్యం చెప్పింది .అతడు ‘’అలాంటి మహర్షిని ఏ క్రూర మృగం హాని చేయలేదు .నాకు ఆయనను కాపాడే అవకాశమిచ్చాడు అంతే .ఇదొక గొప్ప విషయం కాదు ఆయనకు చెప్పటానికి .కానీ నాప్రయత్నం నేను చేస్తాను ‘’అన్నాడు .
వెంటనే యాజ్ఞావల్క్యుని చేరి,తానొక కోరికతో వచ్చానని దాన్ని తీర్చమని విన్నవించాడు .’’మీ కోరిక తెలిస్తేనే కదా నేను ఆలోచించి చెప్పగలను ‘’అన్నాడు .’’నాకుమార్తె మైత్రేయి నా సోదరి గార్గి పెంపకం లో పెరిగి జ్ఞానురాలై జనక సభలో మీ చర్చ చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని సంకల్పించి మాకు తెలియజేసింది ‘’అన్నాడు .ఆయన ‘’ఈ శరీరం ఒక వనితకు ఇదివరకే ఇచ్చేశాను .ఇప్పుడు దానిపై నా పెత్తనం లేదు ‘’అన్నాడు .’’మహాత్మా !కాత్యాయిని దేవి అనుమతిస్తే మీకు అభ్యంతరం లేదని మీ మాటలవలన అర్ధమయింది ‘’అనగా ‘’అవును ఆమెయే తన సొత్తును ఇతరులకిచ్చే అధికారం కలిగి ఉంది ‘’అన్నాడు. సంతోషించి సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు .
జరిగిన విషయం గార్గి మొదలగు వారితో చెప్పి ,మైత్రేయిని వెంటబెట్టుకొని యాజ్ఞవల్క్య గృహానికి వెళ్లి కాత్యాయానికి కూడా విషయమంతా నివేదించాడు .మైత్రేయిపై గల వాత్సల్యం తో తాను తప్పక వారిద్దరి వివాహానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేసింది .ఒకరోజు కాత్యాయని భర్తతో ‘’స్వామీ !నా కోరిక ఒకటి మీరు తప్పక తీర్చాలి ‘’అన్నది .అదేమిటో చెప్పమన్నాడు .’’నా చెలికత్తె మైత్రేయి ఎప్పుడూ నా దగ్గర ఉండేట్లు మీరామెను పెళ్లి చేసుకోవాలి ‘’అని చెప్పింది .ఆయన ‘’పిచ్చిదానిలాగా ఉన్నావు .నీ భర్తను వేరొకరికిస్తావా ?’’అన్నాడు .’’మేము వేరుకాదు .ఒక్కరమే .నా శరీరానికి నేను సుఖం చే కూర్చుకో కూడదా ?’’అని అడిగింది .’’ఐతే నీకోరిక తీరుస్తాను ‘’అనగా ఆ సంతోష వార్త వెంటనే గార్గికి తెలియ జేసింది కాత్యాయని .మిత్రుడు పెళ్లి ఏర్పాట్లు చేసి ఒక శుభ ముహూర్తం లో మైత్రేయీ యాజ్ఞవల్క్య వివాహం ఘనం గా జరిపించాడు.జనక రాజు మహర్షులు వివాహానికి విచ్చేసి పరమానంద భరితులయ్యారు .యాజ్ఞావల్క్యుని బ్రహ్మ విద్యా వ్యాప్తికి అన్నివిధాలా సహకరించే సహధర్మ చారిణి మైత్రేయి అని అందరూ మెచ్చుకున్నారు ..
యాజ్ఞవల్క్య ,మైత్రేయి తరచుగా బ్రహ్మవాదం లో కాలం గడిపారు .కాత్యాయినీ యాజ్నవల్క్యులకు చంద్ర కాంతుడు ,మహా మేఘుడు ,విజయుడు అనేముగ్గురు లోక ప్రసిద్ధులైన కుమారులు జన్మించారు అని శేషధర్మం ,సంశయ తిమిర దివాకరం లలో ఉన్నది –యాజ్ఞవల్క్య సుతా రాజన్ త్రయో వై లోక విశ్రుతాః-చంద్ర కాంత మహా మేఘ విజయా బ్రాహ్మణోత్తమాః ‘’(శేష ధర్మం )
‘’మైత్రేయీ అనపత్యా ,కాత్యాయన్యాశ్చచంద్రకాంత –మహా మేఘ ,విజయ నామా స్త్రయః పుత్రా అభూవత్ ‘’(సంశయ తిమిర దివాకరం )
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-19-ఉయ్యూరు